హైదరాబాద్: లుంబినీ పార్క్, గోకుల్ చాట్ జంట పేలుళ్ల కేసులో ఇద్దరికి మరణశిక్ష. ఒకరికి జీవిత ఖైదు

హైదరాబాద్ జంట పేలుళ్లు

హైదరాబాద్ జంట పేలుళ్ల కేసులో దోషులకు రెండవ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు చర్లపల్లి జైలులో ఏర్పాటు చేసిన ప్రత్యేక న్యాయస్థానం సోమవారం శిక్షలు ప్రకటించింది. ఈ నెల నాలుగున దోషులుగా నిర్ధరించిన అనిక్ షఫిఖ్ సయ్యద్, మొహమ్మద్ అక్బర్ ఇస్మాయిల్ చౌదరిలకు మరణ శిక్ష విధించింది.

మరో దోషి తారిఖ్ అంజుమ్‌కు జీవిత ఖైదు విధించింది.

2007 ఆగస్టు 25న లుంబినీ పార్క్‌, గోకుల్ చాట్‌లలో సంభవించిన ఈ పేలుళ్లలో 42 మంది చనిపోయారు. 300 మంది గాయపడ్డారు. ఈ పేలుళ్లు ఇండియన్‌ ముజాహిదీన్‌ సంస్థ పనేనని పోలీసులు లోగడ ప్రకటించారు.

ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక కోర్టు ఈ నెల 4న తీర్పు వెలువరించింది. మొదటి ముద్దాయి అనిక్ షఫిఖ్ సయ్యద్, రెండో ముద్దాయి మొహమ్మద్ అక్బర్ ఇస్మాయిల్ చౌదరిలను, ఇతర దోషులకు ఆశ్రయం కల్పించినందుకు ఐదో నిందితుడైన తారిఖ్ అంజుమ్‌ను దోషులుగా ప్రకటించింది. ఇంకో ఇద్దరు నిందితులు ఫారూఖ్ షర్ఫుద్దీన్, మొహమ్మద్ సాదిక్ ఇష్రత్ షేక్‌ లపై నేరాలను నిరూపించే సాక్ష్యాధారాలు లేవని తేల్చింది.

చర్లపల్లి జైలులో ప్రత్యేక న్యాయస్థానం సోమవారం శిక్షలు ఖరారుచేస్తూ తీర్పు వెలువరించిన అనంతరం ఎన్ఐఏ తరపున వాదనలు వినిపించిన ప్రత్యేక న్యాయవాది సురేందర్ మీడియాతో మాట్లాడారు. ‘‘నిందితులు మౌనంగా ఉన్నారు, తీర్పు విన్నాక దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. బాంబులు పెట్టడానికి తాము బాధ్యులు కాదని, అసలు తాము హైదరాబాద్ రాలేదని, పోలీసులు తమను ఈ కేసులో ఇరికించారని గతంలో చెప్పిన విషయాలే మళ్లీ చెప్పారు. కానీ, కోర్టు మాత్రం వారు దోషులని నిర్థరించింది. మరో ముగ్గురు నిందితులు.. రిజాయ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్, అమీర్ రెజాలు పరారీలో ఉన్నారు. వారు దొరికినప్పుడు కోర్టు మరలా వారిపై విచారణ జరుపుతుంది’’ అన్నారు.

‘ఇండియన్ ముజాహిదీన్ అని నిరూపించలేకపోయారు’

నిందితుల తరపు న్యాయవాది గురుమూర్తి మాట్లాడుతూ.. ‘‘ఈ తీర్పుపై హైకోర్టును ఆశ్రయిస్తాం. అమాయకులకు శిక్షలు పడ్డాయి. అసలు కుట్రదారులు వేరే ఉన్నారు. నిందితులు ఇండియన్ ముజాహిద్దీన్ తరపున పనిచేస్తున్నారని నిరూపించటంలో పోలీసులు విఫలమయ్యారు. అందుకే చట్ట వ్యతిరేక చర్యల నియంత్రణ చట్టం సెక్షన్ 20 కింద నిందితులను కోర్టు శిక్షించలేదు. ఈ చట్టంలోని సెక్షన్ 16, ఐపీసీ సెక్షన్ 302ల ప్రకారమే కోర్టు శిక్షలు విధిస్తున్నట్లు ప్రకటించింది’’ అని చెప్పారు.

ఫొటో క్యాప్షన్,

బాంబు పేలుడు మృతుల కుటుంబ సభ్యులు

ఆ రోజు ఏం జరిగింది?

ఆగస్టు 25, 2007 రాత్రి 7.45 నిమిషాలు..

ట్యాంక్‌బండ్‌లోని లుంబినీపార్క్‌లో హైదరాబాద్ చరిత్ర, విశిష్టతలను వివరిస్తూ లేజర్ షో సాగుతోంది. ఎక్కడి నుంచో వచ్చిన ప్రేక్షకులంతా భాగ్యనగరం గొప్పతనాన్ని ఆసక్తిగా చూస్తున్నారు. కొన్ని క్షణాలకు వారున్న చోట పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 9 మంది చనిపోయారు.

ఈ ఘటన నుంచి తేరుకునేలోపే మరికొన్ని నిమిషాల్లోనే కోఠీలోని గోకుల్ చాట్‌లో పేలుడు జరగడంతో 33 మంది చనిపోయారు.

వెంటనే అప్రమత్తమైన పోలీసులు నగరంలోని రద్దీ ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. మరో 19 బాంబులను గుర్తించి పేలకుండా నిర్వీర్యం చేశారు.

286 మంది సాక్షులు

జంట పేలుళ్లకు సంబంధించి ఏడుగురి పేర్లతో కూడిన 1,125 పేజీలతో మూడు అభియోగపత్రాలను పోలీసులు దాఖలు చేశారు.

కేసులో 286 మందిని సాక్షులుగా పేర్కొన్నారు. హైదరాబాద్ మక్కా మసీదు పేలుళ్ల తరువాత పోలీసుల కాల్పులకు ప్రతిగా నిందితులు పేలుళ్లు జరిపినట్టు విచారణలో తేలింది.

టిఫిన్‌ బాక్సుల్లో బాంబులను ఉంచి వాటికి టైమర్లను అమర్చి పేలుళ్లు జరిపినట్టు దర్యాప్తు అధికారులు చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)