వాత్స్యాయన కామసూత్రాలు: సెక్స్‌ సమయంలో మీ భాగస్వామిని ఎలా ఆకట్టుకోవాలో మీకు తెలుసా?

  • రేహాన్ ఫజల్
  • బీబీసీ ప్రతినిధి
ఖజురహో శిల్పం ముద్దు ఎందుకు పెట్టుకోవాలి? ముద్దు ఎలా పెట్టుకోవాలి? How to Kiss Why should we Kiss

ఫొటో సోర్స్, iStock

కామసూత్ర లాంటి గ్రంథంతో, ఖజురహో, దిల్వారా, అజంతా, ఎల్లోరా శిల్పాలతో ప్రేమ భాషను ప్రపంచానికి పంచిన దేశంలో భారతీయులు మాత్రం ప్రేమగా మాట్లాడడం, తమ భాగస్వామిని ఆకట్టుకునే కళను మర్చిపోతున్నారు.

సెక్స్‌ అంటే "పది సెకన్లే ఉండే ఒక ఓవర్ రేటెడ్ అనుభూతి"గా ఇంగ్లీష్ రచయిత సైమన్ రేవెన్ వర్ణించారు. "ప్రాచీన భారతదేశానికి సంబంధించిన శృంగార సాహిత్యం అనువదించే ధైర్యం ఎవరు చేయగలరు?’’ అని ప్రశ్నించారు.

నేను అదే ప్రశ్నను "ద ఆర్ట్స్ ఆఫ్ సెడక్షన్" పుస్తకం రాసిన డాక్టర్ సీమా ఆనంద్‌ను అడిగాను. "సైమన్ రేవెన్ వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తారా" అన్నాను.

దానికి ఆమె "అస్సలు ఒప్పుకోను, నా ఉద్దేశం ప్రకారం సెక్స్ గురించి మన ఆలోచన మారింది. ఎన్నో శతాబ్దాల నుంచీ మనకు ఇది పనికిరానిదని నేర్పిస్తూ వచ్చారు. సెక్స్ చెడ్డదని, అది చేయడం పాపం అని చెప్పారు. కానీ ఎవరూ దానితో లభించే ఆనందం గురించి మాట్లాడరు. క్రీస్తు శకం 325లో కాథలిక్ చర్చి తన నియమ నిబంధనల్లో ‘శరీరం పనికిరాని ఒక వస్తువు. శారీరక సుఖం చెడ్డది. దాన్ని పొందాలనే కోరిక రావడమే పాపం’ అని చెప్పింది’’ అని సీమా ఆనంద్ అన్నారు.

"సెక్స్ ఒకే ఒక ఉద్దేశం సంతానం పొందడానికి మాత్రమే అని అందులో చెప్పారు. దాదాపు అదే సమయంలో భారతదేశంలో వాత్స్యాయనుడు గంగాతీరంలో కూర్చుని కామసూత్ర రాస్తున్నారు. లైంగిక ఆనందం ఆరోగ్యానికి చాలా మంచిదని, దానిని ఎక్కువ పొందడం ఎలా అనేది చెబుతూ వచ్చారు" అన్నారు సీమ.

"పశ్చిమ, తూర్పు ఆలోచనల మధ్య ఇప్పుడు కూడా దాని గురించి ఇంత భిన్నాభిప్రాయాలు ఉండడం నమ్మలేకపోతున్నా. 'అనంగ్ రంగ్' గ్రంథం అనువదించిన డాక్టర్ ఎలెక్స్ కంఫర్ట్ ఒక విషయం చెప్పారు. సైమన్ రేవెన్ లాంటి వారి ఆలోచనలను అడ్డుకోవాలంటే ఆకట్టుకునే కళ గురించి ప్రజలకు మరింత బాగా వివరించడం అవసరం అన్నారు".

వీడియో క్యాప్షన్,

వీడియో: ముద్దు పెట్టడం ఎప్పుడు, ఎందుకు మొదలుపెట్టారు?

పురుషుడు అగ్ని అయితే స్త్రీ నీళ్లు

ప్రేమికుల్లోని స్త్రీ, పురుషుల మధ్య చాలా తేడా ఉంటుందని చెబుతారు. వారి లైంగితక అంటే సెక్సువాలిటీ మూలాల్లో భూమి, ఆకాశం అంత తేడా ఉంటుంది.

"వాత్స్యాయనుడు పురుషుడి కోరికలను అగ్నిలా వర్ణించారు. అవి తన జననాంగం నుంచి పుట్టి మస్కిష్తం వైపు వెళ్తాయి. అగ్నిలా ఎంత వేగంగా రాజుకుంటాయో, అంతే సులభంగా చల్లారిపోతాయి. కానీ స్త్రీ కోరికలు దానికి భిన్నంగా నీళ్లలా ఉంటాయి. అవి ఆమె తల నుంచి ప్రారంభమై కింది వైపు వస్తాయి. వాటిని తట్టిలేపేందుకు ఆమెకు పురుషుల కంటే ఎక్కువ సమయం పడుతుంది. అవి ఒకసారి మొదలైతే, వాటిని చల్లార్చడానికి కూడా చాలా సమయం పడుతుంది అని చెప్పారు" అంటారు సీమా ఆనంద్.

"స్త్రీ, పురుషులు ఉన్నచోట అలాగే ఉండిపోతే, వారి కోరికల కలయిక ఎప్పటికీ సాధ్యం కాదు. అందుకే పురుషులు మహిళలను ఆకట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడే పురుషుడు ఆమె నరనరాల్లో ఉత్తేజం తీసుకురాగలడు. పుస్తకంలో ఈ విషయం గురించి రాయడం వెనుక నా ఉద్దేశం కూడా అదే. ఆకట్టుకోవడం అనే కళ ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలి" అని సీమా ఆనంద్ చెప్పారు.

సెక్స్ గురించి చాలా పరిశోధనలు చేసిన భారతదేశ ప్రముఖ సెక్సాలజిస్టుల్లో ఒకరైన డాక్టర్ ప్రకాశ్ కొఠారీ.. స్త్రీ, పురుషుల ప్రేమలో తేడాలను మరోలా చెబుతారు.

"పురుషుడు సెక్స్ కోసం ప్రేమను అందిస్తాడు. అదే సమయంలో సెక్స్ అందించే స్త్రీ ఆ ప్రేమను పొందే ప్రయత్నం చేస్తుంది. భారతదేశం విషయంలో ఇది నూటికి నూరుపాళ్లూ నిజం" అన్నారు.

ఫొటో క్యాప్షన్,

'ద ఆర్ట్స్ ఆఫ్ సెడక్షన్' పుస్తక రచయిత్రి డాక్టర్ సీమా ఆనంద్‌తో రేహాన్ ఫజల్

సెక్స్‌లో సువాసనకు ప్రాధాన్యం

స్త్రీ, పురుషుల సంబంధాల్లో శరీరంపై సువాసనలకు చాలా ప్రాధాన్యం ఉంది. ఒక స్త్రీ పురుషుడిని ఆకర్షించాలంటే, ఆమె తన కురులను సవరిస్తూ వెళ్తుంది. తన వెనక ఒక ప్రత్యేకమైన సుగంధాన్ని వదులుతుంది.

"నాకు వట్టివేళ్ల వాసన అంటే ఇష్టం. అది వేడెక్కిన నేలపై తొలకరి జల్లులు పడితే వచ్చే మట్టి వాసనలా ఉంటుంది. స్త్రీలు తెల్లవారుజామునే ఆ వట్టివేళ్ల నూనెను కాస్త తలకు రాసుకుని, తడి జుట్టును అల్లుకునేవారు. మెడకు మల్లి లేదా సంపంగి పూల అత్తరు రాసేవారు. కుచాలను కుంకుమ పువ్వు, లవంగ తైలంతో మాలిష్ చేసుకునేవారు" అని సీమా చెబుతారు.

"వాటితో సువాసన రావడమే కాదు, చర్మం రంగులో కూడా ఒక మెరుపు వస్తుంది. ఆ అత్తరు ఒక్కో శరీరానికి ఒక్కో సువాసనను అందిస్తుంది. ఇది చాలా ఆసక్తికరమైన విషయం" అని చెప్పారు.

సీమా ఆనంద్ ఒక సలహా కూడా ఇస్తారు. మహిళలు తమ హ్యాండ్‌బాగ్‌లో కూడా పెర్‌ఫ్యూమ్ స్ప్రే చేసుకోవాలని చెబుతారు. అలా దాన్ని ఎప్పుడు తెరిచినా, అందులోంచి వచ్చే సువాసన మంచి అనుభూతి ఇస్తుందని, మూడ్‌ కూడా సరిచేస్తుందని అంటారు.

"మనం మన బూట్లు లేదా చెప్పుల లోపల కూడా అత్తరు స్ప్రే చేసుకోవాలి. ఎందుకంటే పాదాల లోపల కూడా చాలా ఇంద్రియాలు ఉంటాయి. వాటిపై అది ప్రత్యేక ప్రభావం చూపిస్తుంది" అన్నారు.

ఫొటో సోర్స్, SEEMA ANAND

చిరుగొడవలతో ఉత్తేజం

సీమా మరో ఆసక్తికరమైన విషయం కూడా చెప్పారు. స్త్రీ, పురుష సంబంధాలు తాజాగా, ఉత్తేజం కలిగించేలా ఉండాలంటే వారి మధ్య అప్పుడప్పుడూ గొడవలు రావడం కూడా అవసరమే అంటారు.

"స్త్రీ, పురుషుల మధ్య బంధం గాఢంగా, ఒకరిమీద ఒకరికి బలనైన నమ్మకం ఏర్పడినప్పుడే ఈ గొడవలు సఫలం అవుతాయని వాత్స్యాయనుడు చెబుతారు. కానీ ఇద్దరి మధ్యా మొదటి నుంచే అభిప్రాయ బేధాలు ఉంటే ఆ గొడవలు మరింత ప్రమాదంగా మారుతాయి. వాటికి ఎలాంటి పరిష్కారం ఉండదు."

"ఈ జగడం ఎప్పుడూ పురుషుల నుంచే మొదలవుతుంది. మహిళ విసిగిపోయి అరుస్తుంది. తన నగలు తీసి విసిరేస్తుంది. వస్తువులు విరగ్గొడుతుంది. వాటిని పురుషుడిపై విసిరికొడుతుంది. కానీ ఈ గొడవలో ఒక నియమం ఉంటుంది. అది ఎంత పెద్దదైనా, ఆమె తన ఇంటి బయట అడుగుపెట్టదు. కామసూత్రలో దానికి కారణం కూడా చెప్పారు."

"అందులో మొదటిది పురుషుడు ఆ ఆగ్రహాన్ని చల్లార్చడానికి ఆమె వెనకపడకపోతే, అది స్త్రీని అవమానించినట్టే అవుతుంది. ఇంకొకటి పురుషుడు స్త్రీ కాళ్లపై పడి ఆమెను క్షమాపణ కోరితే ఆ గొడవ సద్దుమణుగుతుంది. ఎందుకంటే ఆ పని అతడు ఇంటి బయట చేయలేడు" అని సీమా అంటారు.

ఫొటో సోర్స్, Thinkstock

సైగలతో ప్రేమ రహస్యాలు

కామసూత్రను చదివితే, ప్రణయ నివేదనలో ఒక రహస్య భాష కూడా ఉందనే విషయం అర్థమవుతుంది. మాటలతోనే కాదు, ప్రేమను చాలా రకాలుగా వ్యక్తం చేయచ్చు.

"జీవితంలో ఎంత విజయవంతం అయినా, ఎంత డబ్బున్నా, విద్వాంసులైనా, ప్రేమలో ఉన్న రహస్య భాష తెలీకపోతే మీరు ఎందుకూ పనికిరారనే లెక్క. అది రాకుంటే, మీ ప్రియురాలు మీ నుంచి ఏం కోరుకుంటోంది అనేది మీరు ఎప్పటికీ తెలుసుకోలేరని కామసూత్రలో చెప్పారు" అన్నారు సీమా ఆనంద్.

"ప్రాచీన కాలంలో ఈ కళ చాలా ప్రాచుర్యం పొందింది. మీరు మీ పార్ట్‌నర్‌తో ఒక్క మాట కూడా మాట్లాడకుండానే సమాచారం పంపించవచ్చు. ఉదాహరణకు మీరు బాగా రద్దీలో ఉన్నారు. అప్పుడే, మీ ప్రియురాలు ఎక్కడో దూరంగా కనిపించింది. అప్పుడు మీరు మీ చెవి పైభాగాన్ని చేత్తో తాకారంటే. ఆమెను 'మీరెలా ఉన్నారు' అని అడిగనట్టు అర్థం".

"మీ ప్రియురాలు తన చెవి కింది భాగాన్ని పట్టుకుని మీవైపు చూస్తే, మిమ్మల్ని చూసి ఆమె చాలా సంతోషపడిందని అర్థం. ప్రేమికుడు తన ఒక చేతిని గుండెపై పెట్టి, మరో చేతిని తలపై పెట్టుకుంటే, నీ గురించి ఆలోచించి నా బుర్ర పాడైపోతోందని, మనం ఎప్పుడు కలుసుకుంటామని అర్థం".

"ఇలా ఇద్దరి మధ్యా రహస్య సంభాషణ నడుస్తూనే ఉంటుంది".

ఫొటో సోర్స్, Getty Images

తెలివిగా మాట్లాడడం కూడా అవసరమే

స్త్రీ, పురుషుల శరీరాల్లో వారిని ఉత్తేజపరిచే ఎన్నో ఎరోటిక్ నెర్వ్స్ ఉంటాయి. కానీ వాటన్నిటికంటే ఎక్కువగా వారి మస్కిష్తం లేదా మేధో సామర్థ్యం ఇద్దరిలో ఉత్తేజం తీసుకొస్తుంది.

"ఈమధ్య మనం 'సెపియోసెక్సువల్' అనే మాటను చాలా ఎక్కువగా వింటున్నాం. అంటే కొంతమంది స్త్రీలు అందంగా మాట్లాడితే మాత్రమే ఉత్తేజం పొందుతారు. సుమారు 2 వేల సంవత్సరాల ముందే వాత్స్యాయనుడు ఆకర్షించే 64 కళల గురించి చెప్పారు. వీటిలో 12 మస్కిష్తానికి సంబంధించినవే" అంటారు సీమ.

"ప్రేమికులు పదబంధాలు ఆడాలని వాత్స్యాయనుడు చెప్పారు. వారికి విదేశీ భాష కూడా వచ్చుండాలని అన్నారు. ప్రేమికులు ఒకరితో ఒకరు తెలివిగా మాట్లాడుకోలేకపోతే, ప్రేమ ఆటలో వెనకబడిపోతారని, వారి మధ్య ఆకర్షణ కూడా మెల్లమెల్లగా తగ్గిపోతుందని అన్నారు".

10 క్షణాల సుదీర్ఘ చుంబనం

సీమా ఆనంద్ తన పుస్తకంలో ఒక అధ్యాయం మొత్తం చుంబన(ముద్దు) కళ గురించే రాశారు. ముద్దు పెట్టుకోవడంలో ముఖంలోని 34, శరీరంలోని 112 కండరాలు భాగం అవుతాయన్నారు.

"మీరు రోజూ ఏది చేసినా, చేయకున్నా.. ఒక్క పని చేయండి. మీ పార్ట్‌నర్‌కు రోజులో ఒక్కసారైనా కనీసం పది సెకన్ల పాటు వదలకుండా ఒక్క ముద్దు పెట్టండి. నేను చేసిన పరిశోధనల్లో ఒక మామూలు ముద్దు ఎక్కువగా 3 సెకన్లే ఉంటుందని తెలిసింది. మూడు సెకన్ల తర్వాత అందరూ 'ఇక చాల్లే, ఎక్కువైపోయింది' అనుకుంటున్నారు" అన్నారు సీమా ఆనంద్.

"పది సెకన్లు అంటే చాలా సుదీర్ఘ సమయం. దాని ప్రభావం వల్ల ప్రియురాలికి అది ఎప్పుడూ గుర్తుండిపోతుంది. వారికి మీ జీవితంలో ఎంత ప్రత్యేక స్థానం ఉందనేది మీరిచ్చే ఆ ముద్దు చెబుతుంది. ఒక మంచి ముద్దు ప్రభావం మీ ఆరోగ్యంపై కూడా ఉంటుంది. ముద్దుతో తలనొప్పి, రక్తపోటు లాంటి ఆరోగ్య సమస్యలు కూడా దూరమైనట్టు గమనించారు".

ఫొటో సోర్స్, Getty Images

పాదాలతో ప్రేమించే కళ

స్త్రీ, పురుషుల శారీరక సంబంధాల్లో పాదాలు కూడా చాలా కీలక పాత్ర ఉంటుంది. ఇది చాలా తక్కువమందికి తెలుసు. ఆకర్షించే కళలో పాదాలు చాలా ప్రత్యేకం. అందుకే మహిళలు ముఖం కంటే ఎక్కువగా తమ పాదాలపై దృష్టి పెట్టడం చాలా అవసరం అంటారు సీమా.

"మన నర్వ్ ఎండిగ్స్ అన్నీ పాదాల్లోకి వెళ్లి ముగుస్తాయి. శరీరంలోని చాలా సున్నితమైన అంగాలు కూడా పాదాలే. ఈమధ్య మనం మన పాదాలను హైహీల్స్‌లో ఇరికించేస్తున్నాం. మీరు ఎవర్నైనా మీ పాదాలతో ఆకర్షించాలంటే కూర్చుని, మీ చెప్పులు తీయండి, పాదాలను అటూఇటూ తిప్పండి. వాటిని చూపించండి. శరీరంలోని అందమైన భాగాల్లో మన పాదాలూ ఉన్నాయి."

"చాలా మంది ముఖానికి చాలా మేకప్ వేసుకుంటారు. చేతులకు మెనిక్యూర్ చేయించుకుంటారు. కానీ పాదాలను మాత్రం పట్టించుకోరు. మడమలు పగిలిపోయినా చూసుకోరు. పాదాలను ఎప్పుడూ అందంగా ఉంచుకోడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మీ శరీరంలోని సెక్సీ అవయవాలు అవే" అంటారు సీమ.

ఫొటో సోర్స్, Getty Images

సెక్స్‌-ఆహారం లింకు

శ‌ృంగారానికి, తినడానికి కూడా ఒక ప్రత్యేక బంధం ఉంది. మీరు ఏం తింటున్నారు, ఎప్పుడు తింటున్నారు, ఎంత తింటున్నారు, ఎలా తింటున్నారు అన్నవాటికీ ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. వాటి ప్రభావం ఎంతోకొంత ఉంటుంది.

‘‘మీరు సెక్స్ ముందు భోజనం చేస్తే, మన స్పందనలు మెల్లగా ఉంటాయి. మీ శరీరంలోని మొత్తం శక్తి ఆహారాన్ని జీర్ణం చేసుకోడానికే సరిపోతుంది. ఇక సెక్స్ కోసం శక్తి, ఆసక్తి ఉండదు’’ అంటారు సీమ.

‘‘ఎప్పుడూ సెక్స్ తర్వాతే భోంచేయాలి. మంచి భోజనం తినాలి. ఆ సమయంలో ప్రియురాలు తన ప్రియుడికి చాలా ప్రేమగా తినిపించాలని వాత్స్యాయనుడు చెబుతారు. వారు ప్రతి పదార్థాన్ని రుచిచూస్తారు. దానిని తన ప్రియురాలి నోటికి అందిస్తాడు. ‘మేం డేట్‌పై వెళ్తున్నాం, ఏదైనా మంచి రెస్టారెంట్‌లో తింటాంలే’ అనే మాట మనం తరచూ అంటుంటాం.

కానీ భోజనం ఎంత రుచిగా ఉన్నా, వారు ఎంత బాగా మాట్లాడుకున్నా, ఎంత ఫ్లర్టింగ్ చేసినా, ప్రేమికులకు శ‌ృంగార ఆలోచనలు దరిచేరవు. ఎందుకంటే అలా తిన్న తర్వాత వారి శరీర సామర్థ్యంపై భోజనం ప్రభావం కచ్చితంగా ఉంటుంది. అందుకే శృంగారానికి ముందు కాకుండా.. అది ముగిసిన తర్వాతే భోజనం చేయాలి’’ అని సీమా తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)