పెట్రోల్ ధరలు, రూపాయి పతనంపై మోదీ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు?

  • 11 సెప్టెంబర్ 2018
పెట్రో ధరలు, భారత్ బంద్ Image copyright Getty Images

ఒకవైపు ప్రతిపక్షాలన్నీ ఏకమై పెరుగుతున్న పెట్రో ధరలకు వ్యతిరేకంగా దేశాన్ని స్తంభింపచేశాయి. మరోవైపు, ఆర్థికవేత్తలు ఇది ప్రారంభం మాత్రమే అంటున్నారు.

గత ఏడాదితో పోలిస్తే పెట్రోల్ ధర సగటున 25 శాతం, డీజిల్ ధర 13 శాతం పెరిగాయి.

ఈ ఏడాది డాలర్‌తో పోలిస్తే మన రూపాయి విలువ సుమారు 13 శాతం పతనమైంది.

దీనికి కారణం - అమెరికా ఆర్థిక వ్యవస్థ గాడిలో పడడంతో, అనేక విదేశీ మదుపరులు ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థల నుంచి తప్పుకోవడం ప్రారంభించారు. అంతేకాకుండా అమెరికా, చైనాల మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధం కూడా ఈ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టడానికి ప్రేరేపించలేకపోయింది.

Image copyright Getty Images

భారతదేశ విదేశీ మారకద్రవ్యపు నిల్వలు ఈ ఏడాది ఏప్రిల్- జూన్ మధ్య కాలంలోనే సుమారు రూ. 80 వేల కోట్ల మేర తగ్గిపోయాయి.

రూపాయి పతనాన్ని అడ్డుకోవడానికి భారత రిజర్వ్ బ్యాంక్ అమెరికా డాలర్లను విదేశీ ద్రవ్యాల మార్కెట్లలో విక్రయించడానికి ప్రయత్నించింది. కానీ, తన వద్ద రూ. 29 లక్షల కోట్ల విదేశీ మారకద్రవ్య నిల్వలు ఉన్న రిజర్వ్ బ్యాంక్ 'కరెన్సీ చేతివాటం' చూపిస్తోందన్న అపవాదు తెచ్చుకోవడానికి ఇష్టపడడం లేదు. అలాంటి పని చేసినందుకే చైనా తీవ్రమైన విమర్శలకు గురైంది.

రూపాయి బలహీనపడడంతో, నిత్యావసరాలైన ముడి చమురు వంటి వాటి ధరలు మరింత పెరుగుతున్నాయి.

Image copyright Getty Images

కేవలం ప్రపంచ ఆర్థిక పరిణామాలనే తప్పు పట్టాలా?

భారత్ ముడి చమురు అవసరాలు దాదాపు 80 శాతం దిగుమతుల ద్వారానే తీరుతున్నాయి. భౌగోళిక ఉద్రిక్తతలు, ఓపీఈసీ (ఒపెక్) క్రూడాయిల్ ఉత్పత్తిలో కోత విధించడం కారణంగా, క్రూడాయిల్ ధరలపై వత్తిడి పెరుగుతోంది. 2014, 2015లో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పడిపోయాయి. అయితే, అంతర్జాతీయంగా వాటి ధరలు తక్కువగా ఉన్న సమయంలో కూడా మన దేశంలో మాత్రం వాటి ధర ఎక్కువగానే ఉంది. దీనికి కారణం ప్రభుత్వ విధానం.

విలువ ఆధారిత పన్ను (వ్యాట్), ఎక్సైజ్ డ్యూటీ కలిపి పెట్రోల్ ధరలో సుమారు 45 శాతంగా ఉండగా, డీజిల్ ధరలో అవి 36 శాతంగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా వాటిపై రాష్ట్రాలు విధించే పన్ను వేర్వేరుగా ఉంది. అందుకే ముంబయిలో పెట్రోల్ ధర దిల్లీతో పోలిస్తే ఎక్కువ.

ఇటీవల రాజస్థాన్‌ లాంటి రాష్ట్రాలు ప్రభుత్వ ఆదాయం తగ్గుతుందని తెలిసినప్పటికీ ఇంధనంపై పన్నును 4 శాతం మేర తగ్గించాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పెట్రోల్, డీజిల్ ధరలపై 2 రూపాయలు తగ్గించింది. కానీ ఇతర రాష్ట్రాలు మాత్రం దీనిపై అంత సుముఖంగా లేవు.

Image copyright Getty Images

ఇది మీ ఇంటి బడ్జెట్‌పై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది?

డీజిల్ ధర పెరిగితే అది కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలపై ప్రభావం చూపుతుంది. దీని కారణంగా ద్రవ్యోల్బణం పెరుగుతుంది.

దీని కారణంగా సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లను మరింత కఠినతరం చేస్తుంది. అదే జరిగితే మీరు కేవలం ఇంధనం, కూరగాయలపైనే కాకుండా ఇంటి రుణాలు, వాహనాల రుణాలపై కూడా ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది.

Image copyright Getty Images

'మోడీనామిక్స్' రాజకీయాలు

2013 సెప్టెంబర్‌లో రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే రూ.67 వద్ద ఉండింది. అప్పుడు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ అధికారంలో ఉంది.

నాడు గుజరాత్ సీఎంగా ఉన్న నరేంద్ర మోదీ, ''ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థ గురించి కానీ, పతనం అవుతున్న రూపాయి గురించి కానీ పట్టించుకోకపోవడంపై జనం చాలా అసంతృప్తితో ఉన్నారు. ప్రభుత్వం కేవలం తన అధికారం కోసమే తాపత్రయపడుతోంది'' అన్నారు.

కానీ, ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంది. ఆసక్తికరంగా ఆ పార్టీకి చెందిన మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఇప్పుడు పెరుగుతున్న పెట్రో ధరలకు కారణం అంతర్జాతీయ మార్కెట్లే అన్నారు. కానీ రూపాయి పతనంపై మాత్రం ఆయన నోరు విప్పలేదు.

''ప్రజలకు ఆర్థికంగా కొంత ఇబ్బంది ఉన్నా, ప్రజలు ఈ బంద్‌కు మద్దతు ఇవ్వడం లేదు. ఇది కాంగ్రెస్, మిగతా విపక్షాలకు కంటగింపుగా ఉంది'' అని ఆయన ఒక పార్టీ కార్యక్రమంలో అన్నారు.

ఏదేమైనా ఒకటి మాత్రం స్పష్టం- 2019 సాధారణ ఎన్నికల్లో 'మోడీనామిక్స్' విపక్షాలకు ఒక ప్రధాన అస్త్రంగా మారనుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)