పెట్రోలుపై రూ.2 తగ్గించిన ఆంధ్రప్రదేశ్.. పన్నులు ఏ రాష్ట్రంలో ఎంత? పొరుగు దేశాల్లో ధరలెలా ఉన్నాయి?

  • అరుణ్ శాండిల్య
  • బీబీసీ ప్రతినిధి
పెట్రోలు ధరలు భారత్

ఫొటో సోర్స్, iStock

పెట్రోల్ ధరలు చుక్కలనంటుతున్నాయంటూ కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు దేశవ్యాప్త బంద్‌ చేపట్టాయి. కేంద్రం ఎక్సైజ్‌ సుంకం తగ్గించకపోవడం వల్లే పెట్రో ధరలు దిగిరావడం లేదని ఆరోపిస్తున్నాయి.

కాంగ్రెస్‌ ఈ బంద్‌కు పిలుపునివ్వగా దేశంలోని 21 పార్టీలు మద్దతు తెలిపాయి.

కేంద్రం దిగిరానప్పటికీ పలు రాష్ట్రాలు ముందుకొచ్చి పన్నులు తగ్గిస్తున్నాయి. ఇప్పటికే రాజస్తాన్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై తాము ఇంతవరకు విధిస్తున్న విలువ ఆధారిత పన్ను(వ్యాట్)ను 4 శాతం తగ్గించుకుంది.

తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లీటరుకు రూ.2 ధర తగ్గిస్తూ శాసనసభలో తీర్మానం చేశారు.

ఇంతకీ.. పెట్రో ధరల పెరుగుదలకు కారణమేంటి? అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరుగుతుండడమా? కేంద్రం ఎక్సయిజ్ సుంకాన్ని పెంచుకుంటూ పోవడమా? రాష్ట్రాలు విలువ ఆధారిత పన్ను వడ్డించడమా?

భారత పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వ శాఖకు అనుబంధంగా పనిచేసే 'పెట్రోల్ ప్లానింగ్, అనాలసిస్ సెల్' గణాంకాలు చూస్తే పెట్రో ఉత్పత్తుల ధరల పెరుగుదలకు కారణాలు స్పష్టమవుతున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images

ఈ నాలుగే ప్రధానం

పెట్రోల్, డీజిల్ ధరల్లో ముఖ్యంగా నాలుగు కీలకాంశాలుంటాయి. అవి డీలరు ధర, కేంద్ర ఎక్సైజ్ సుంకం(సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ), డీలర్ కమీషన్, రాష్ట్రాల్లో వ్యాట్ లేదా సేల్ ట్యాక్స్.

డీలర్ ధర: చమురు సంస్థలు డీలర్‌కు సరఫరా చేసే ధర. కంపెనీని బట్టి ఇందులో స్వల్ప తేడాలుంటాయి. అలాగే, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు, రవాణా ఛార్జీలు, డాలర్ మారకం విలువ వంటివన్నీ ఈ ధరను ప్రభావితం చేస్తాయి.

సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ: ఇది కేంద్ర ప్రభుత్వం విధించే పన్ను. డీలర్ ధరపై దీన్ని విధిస్తారు. అయితే.. ఇది శాతం రూపంలో కాకుండా నిర్ణీత మొత్తంగా విధిస్తారు.

డీలర్ కమీషన్: పెట్రోలు/డీజిల్ బంకుల డీలర్లకు చమురు సంస్థలు కొంత కమీషన్ ఇస్తాయి. డీలర్ల ఖర్చులు, లాభాలకు సరిపడేలా ఈ కమీషన్ ఉంటుంది. ఇది వినియోగదారుడిపైనే పడుతుంది.

రాష్ట్రాల్లో వ్యాట్/వర్తక పన్ను: పెట్రోల్, డీజిల్ విక్రయాలపై రాష్ట్రాలు వ్యాట్ లేదా సేల్ ట్యాక్స్ విధిస్తాయి. ఇది ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉంది. రాష్ట్రానికి రాష్ట్రానికీ ఈ పన్ను మారడం వల్లే వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరు ధరలు ఉంటున్నాయి.

పెట్రోలుపై వ్యాట్ మహారాష్ట్రలోని ముంబయిలో అత్యధికంగా 39.54 శాతం ఉంది. మరో 21 రాష్ట్రాల్లో 25 శాతం కంటే ఎక్కువ పన్ను విధిస్తున్నారు.

డీజిల్‌పై అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌లో 28.31 శాతం పన్ను ఉంది. 14 రాష్ట్రాల్లో 20 శాతం కంటే ఎక్కువ వ్యాట్ ఉంది.

చాలా రాష్ట్రాల్లో కేంద్రం విధించే ఎక్సయిజ్ సుంకంతో పోటీ పడుతూ వ్యాట్ భారం వేస్తుండడంతో ఆయా రాష్ట్రాల్లో ధరలకు రెక్కలొస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

పెట్రో ధరల పెరుగుదలను నిరసిస్తూ దిల్లీలో చేపట్టిన కార్యక్రమంలో మాట్లాడుతున్న దిల్లీ పీసీసీ అధ్యక్షుడు అజయ్ మాకెన్

  • రిటైల్ ధర లీటర్ రూ.80.73

ఈ మొత్తంలో.. డీలర్ ధర లీటరుకు రూ.40.45, సెంట్రల్ ఎక్సయిజ్ డ్యూటీ లీటరుపై రూ.19.48, డీలర్ కమీషన్ లీటరుకు రూ.3.64, దిల్లీ రాష్ట్రం విధించిన వ్యాట్ లీటరుపై రూ.17.16.

  • రిటైల్ ధర లీటర్ రూ.72.83

ఈ మొత్తంలో... డీలర్‌కు ఇచ్చే ధర లీటరుకు రూ.44.28, సెంట్రల్ ఎక్సయిజ్ డ్యూటీ లీటరుపై రూ.15.33, డీలర్ కమీషన్ లీటరుకు రూ.2.52, దిల్లీ రాష్ట్రం విధించిన వ్యాట్ లీటరుపై రూ.10.70.

ఫొటో సోర్స్, Getty Images

ఎక్సయిజ్ సుంకం పెట్రోలుపై రెండింతలు.. డీజిలుపై అయిదింతలు

మోదీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి గత ఏడాది అక్టోబరు వరకు పరిశీలిస్తే ఎక్సయిజ్ సుంకం భారీగా పెరిగింది. 2014 ఏప్రిల్‌లో పెట్రోల్‌పై ఎక్సయిజ్ సుంకం లీటరుకు రూ.9.48 గా ఉండగా 2017 అక్టోబరుకు అది 19.48 రూపాయలకు చేరింది. 2016 జనవరిలోనే రూ.21.48కి పెంచినా ఆ తరువాత రూ.2 తగ్గించారు.

ఇక డీజిల్‌పై పెంపు మరింత ఎక్కువ. 2014 ఏప్రిల్‌లో డీజిల్‌పై కేంద్ర ఎక్సయిజ్ సుంకం లీటరుకు రూ.3.58 ఉండగా 2017 అక్టోబర్ నాటికి అది రూ.15.33 ఉంది. 2017 జనవరిలో రూ.17.33 ఉన్నప్పటికీ ఆ తరువాత కేంద్రం రూ.2 తగ్గించడంతో ఆ మేరకు తగ్గింది.

పెట్రోలుపై వ్యాట్ ఏ రాష్ట్రంలో ఎంత?(2018 సెప్టెంబరు 1 నాటికి శాతాల్లో)

మహారాష్ట్ర(ముంబయి, థానె, నవీముంబయిలలో..) : 39.12 శాతం

మహారాష్ట్ర(మిగతా ప్రాంతం) : 38.11, మధ్యప్రదేశ్: 35.78

ఆంధ్రప్రదేశ్: 35.77 శాతం (సెప్టెంబర్ 10, 2018న రూ.2 తగ్గించక మునుపు)

పంజాబ్: 35.12, తెలంగాణ: 33.12, తమిళనాడు: 32.12, అస్సాం: 30.90, కేరళ: 30.37, కర్నాటక: 30.28

దిల్లీ: 27, ఛత్తీస్గఢ్: 26.87, రాజస్థాన్: 26 శాతం(సెప్టెంబరు 9న 4 శాతం తగ్గించారు. అంతకుముందు 30 శాతం ఉంది.)

అరుణాచల్ ప్రదేశ్: 20, బిహార్: 24.71, గోవా: 16.66, గుజరాత్: 25.45, హరియాణా: 26.25, హిమాచల్ ప్రదేశ్: 24.43, జమ్ముకశ్మీర్: 27.36

ఝార్ఖండ్: 25.76, మణిపూర్: 23.67, మేఘాలయ: 22.44, మిజోరం: 18.88, నాగాలాండ్: 23.21, ఒడిశా: 24.62

సిక్కిం: 27.87, త్రిపుర: 23.15, ఉత్తరాఖండ్: 27.15, ఉత్తర ప్రదేశ్: 26.90, వెస్ట్ బెంగాల్: 25.25

కేంద్రపాలిత ప్రాంతాల్లో..

అండమాన్ నికోబార్ దీవులు: 6 శాతం, ఛండీగఢ్: 19.76, దాద్రానగర్ హవేలీ: 20

దామన్ య్యూ: 20, పుదుచ్చేరి: 21.15, లక్షద్వీప్ - సమాచారం అందుబాటులో లేదు.

డీజిల్‌పై వ్యాట్(2018 సెప్టెంబరు 1 నాటికి )

ఇక డీజిల్‌పై వ్యాట్ విషయానికొస్తే దేశంలోనే అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ 28.08 శాతం వ్యాట్ విధిస్తోంది.

తెలంగాణలో 26.01 శాతం వ్యాట్ ఉంది. అత్యల్పంగా అండమాన్ నికోబార్ దీవుల్లో 6 శాతం పన్ను ఉంది.

రాష్ట్రాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే మిజోరాం అత్యంత తక్కువగా 11.44 శాతం పన్ను విధిస్తోంది.

మొత్తం 14 రాష్ట్రాల్లో 20 శాతం కంటే ఎక్కువ పన్ను ఉంది.

ఫొటో సోర్స్, Getty Images

ముడి చమురు ధరలు(బ్యారల్‌కు డాలర్లలో)

ఈ ఆర్థిక సంవత్సరం(2018-19)లో ముడి చమురు ధర ఏప్రిల్‌లో సగటు 69.22 డాలర్లు ఉండగా మేలో 73.83, జూన్‌లో 73.47, ఆగస్ట్‌లో 72.53 డాలర్లు ఉంది.

గత రెండు దశాబ్దాలలో ముడి చమురు ధరలు పరిశీలిస్తే.. 2000-01లో సగటున బ్యారల్ 26.92 డాలర్లు ఉంది. 2001-02లో అత్యల్పంగా 22.55 డాలర్ల వార్షిక సగటు ధర నమోదైంది.

2011-12లో అత్యధికంగా 111.89 డాలర్లు ఉండగా.. గత ఆర్థిక సంవత్సరంలో వార్షిక సగటు ధర 56.43 ఉంది. 2012 మార్చిలో అత్యధికంగా 123.16 డాలర్ల సగటు ధర నమోదైంది.

పొరుగు దేశాల్లో ధరలెలా ఉన్నాయి?

(2018 సెప్టెంబర్ 1 నాటికి.. భారత కరెన్సీ ప్రకారం లీటరు ధర)

పాకిస్తాన్: పెట్రోలు రూ.53.55 - డీజిల్ రూ.61.47 (www.psopk.com ప్రకారం)

బంగ్లాదేశ్: పెట్రోల్ రూ.73.48 - డీజిల్ రూ.55.54 ( www.bpc.gov.bd ప్రకారం )

శ్రీలంక: రూ.63.96 - డీజిల్ రూ.52.05 (www.ceypetco.gov.in ప్రకారం)

నేపాల్: పెట్రోల్ రూ.69.94 - డీజిల్ రూ.59.86 (www.nepaloil.com.np ప్రకారం)

**వంటగ్యాస్, కిరోసిన్ ధరలు మాత్రం భారత్ కంటే పొరుగుదేశాల్లో అధికంగా ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)