ప్రెస్ రివ్యూ: 'నాలుగు రాష్ట్రాలతో పాటే తెలంగాణకు ఎన్నికలు'

  • 11 సెప్టెంబర్ 2018
ఓటరు గుర్తింపు కార్డు Image copyright Getty Images

నాలుగు రాష్ట్రాలతోనే తెలంగాణకు కూడా ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని, ఈసీ వర్గాలు చెప్పినట్టు 'ఈనాడు' ఒక కథనం ప్రచురించింది. ఖాళీ అయిన శాసనసభలన్నింటికీ కలిపి ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం ఆనవాయితీ అని, ఈ సారీ అదే పంథా అంటుందని ఎన్నికల సంఘం వర్గాలు తెలిపాయని చెప్పింది.

మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, మిజోరాం, ఛత్తీస్‌గఢ్‌లతో పాటే తెలంగాణ శాసనసభకూ ఎన్నికలు జరగడానికి 'అత్యధిక అవకాశాలు' ఉన్నట్లు ఎన్నికల సంఘం (ఈసీ) వర్గాలు పేర్కొన్నాయి. వీటిని ముందుకుగానీ, వెనక్కుగానీ జరిపే అవకాశం పెద్దగా ఉండబోదని వ్యాఖ్యానించాయి. దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న శాసనసభలన్నింటికి ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందనీ, ఈసారీ అదే పంథా కొనసాగవచ్చని ఈసీ అధికారులు చెప్పారని ఈనాడు తెలిపింది.

వాస్తవానికి ఇప్పుడు ఎన్నికలు జరగబోయే అసెంబ్లీల్లో రాజస్థాన్‌కు జనవరి 20తో, మధ్యప్రదేశ్‌కు జనవరి 7తో, ఛత్తీస్‌గఢ్‌కు జనవరి 5తో కాలపరిమితి ముగుస్తుంది. డిసెంబరు 15తో గడువు ముగిసే మిజోరాంతోపాటే వాటికీ ఎన్నికలు నిర్వహించి ఒకేసారి కొత్త శాసనసభలను ఏర్పాటు చేయడానికి అవకాశం కల్పించవచ్చునని వారు ఉదహరించారు. రాజస్థాన్‌, మిజోరాం శాసనసభల కాలపరిమితి మధ్య 35 రోజుల తేడా ఉన్నా... ఫలితాల ప్రభావం ఒకదానిపై మరొకటి లేకుండా చూడాలన్న ఉద్దేశంతోనే వాటికి ఒకేసారి ఎన్నికల నిర్వహణ, ఫలితాల వెల్లడి ఉంటాయన్నారు. 2017లో గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు వేర్వేరుగా షెడ్యూల్‌ విడుదల చేసినప్పటికీ.. ఫలితాలను మాత్రం ఒకేరోజు విడుదల చేసినట్లు గుర్తుచేశారు. తెలంగాణ శాసనసభ ఎన్నికల నిర్వహణకు ఆరునెలల సమయం ఉందన్న ఉద్దేశంతో చివరివరకు సాగదీస్తే, వాటి వెంటనే లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలు వస్తాయని, అందువల్ల తెలంగాణ ఫలితాలు ఆ ఎన్నికలపై ప్రభావంచూపే అవకాశం ఉండొచ్చని విశ్లేషించారు. ఈ పరిణామాల రీత్యా.. సాధ్యమైనంత మేర నాలుగు రాష్ట్రాలతోపాటే తెలంగాణకూ ఎన్నికలు నిర్వహించడానికి అత్యధిక అవకాశాలు ఉన్నట్లు ఈసీ వర్గాలు చెప్పాయిని ఈనాడు కథనంలో రాశారు.

Image copyright JAGGAREDDY/FACEBOOK

నకిలీ పాస్‌పోర్టు కేసులో జగ్గారెడ్డి అరెస్ట్

2004 నాటి నకిలీ పాస్‌పోర్టు కేసులో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని అరెస్ట్ చేసినట్టు 'ఆంధ్రజ్యోతి' కథనం ప్రచురించింది. ఆయనపై మానవ అక్రమ రవాణా చేసినట్టు అభియోగాలున్నట్టు తెలిపింది. పటాన్ చెరులో ఆయన్ను నిర్బంధించినట్టు, నేడు కోర్టులో హాజరు పరచనున్నట్టు తన కథనంలో పేర్కొంది.

సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ మాజీ విప్‌ తూర్పు జయప్రకాశ్‌ రెడ్డి అలియాస్‌ జగ్గారెడ్డిని హైదరాబాద్‌ పోలీసులు సోమవారం రాత్రి అరెస్టు చేశారు. మానవ అక్రమ రవాణా అభియోగాలపై ఆయనను అరెస్టు చేసినట్లు ఉత్తర మండలం డీసీపీ బి.సుమతి 'ఆంధ్రజ్యోతి'కి తెలిపారు. 2004లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నకిలీ డాక్యుమెంట్లను సమర్పించి.. భార్యాపిల్లలుగా పేర్కొంటూ మరో ముగ్గురు వ్యక్తులను అమెరికాకు తీసుకెళ్లినట్లు వివరించారు. ''జగ్గారెడ్డి 2004లో తన అధికారిక లెటర్‌ ప్యాడ్‌పై ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారికి లేఖ రాసినట్టు ఆమె వివరించారని ఆంధ్రజ్యోతి చెప్పింది.

తన భార్య నిర్మల, కూతురు జయలక్ష్మి, కుమారుడు భరత్‌సాయి రెడ్డిలకు వెంటనే పాస్‌పోర్టు ఇవ్వాలని ఆ లేఖలో కోరారు. అమెరికా వీసా తీసుకునేప్పుడు కూడా నకిలీ డాక్యుమెంట్లు సమర్పించారు. వాటి సాయంతో ఇద్దరు మహిళలు, ఒక యువకుడిని ఆయన తనవెంట అమెరికా తీసుకెళ్లారు. కానీ, జగ్గారెడ్డి మాత్రమే భారత్‌కు తిరిగి వచ్చారు'' అని డీసీపీ వివరించినట్టు కథనం తెలిపింది.

నిజానికి, 2004లో జగ్గారెడ్డి కుమారుడు భరత్‌సాయి వయసు నాలుగేళ్లేనని.. పాస్‌పోర్టు కోసం తప్పుడు విద్యార్హత డాక్యుమెంట్లు సమర్పించి, అతడి వయసును 17 సంవత్సరాలుగా పేర్కొన్నారని వెల్లడించారు. అలాగే.. ఆయన కూతురు జయలక్ష్మి 1997లో జన్మించిందని, పాస్‌పోర్టులో మాత్రం 1987గా పేర్కొన్నారని తెలిపారని పోలీసులు చెప్పినట్టు ఆంధ్రజ్యోతి చెబుతోంది.

Image copyright Getty Images

కేంద్రంలో 5 లక్షల ఉద్యోగాలు

కేంద్ర ప్రభుత్వంలో 5 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు'సాక్షి'లో ఒక కథనం ప్రచురించారు. పదేళ్లలో మూడు రెట్లు జీతాల ఖర్చు పెరిగిందని, సిబ్బంది కొరతతో పథకాల అమలుపై ప్రభావం పడుతోందని అందులో వివరించారు.

వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో 5 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని 2016-17 ఆర్థిక సర్వేలో తేలింది. వీటిలో గుమాస్తా, ఆఫీసు అసిస్టెంట్‌ తరహా ఉద్యోగాలే ఎక్కువ ఉన్నాయి. సిబ్బంది కొరత కారణంగా ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి పథకాల అమలు సంతృప్తికరంగా సాగడం లేదని ఏడవ కేంద్ర వేతన సంఘం తన నివేదికలో ఆందోళన వ్యక్తం చేసింది. ఒకవైపు లక్షల ఉద్యోగాలు భర్తీ కాకుండా ఉంటే మరోవైపు ఉన్న సిబ్బంది వేతనాల కోసం ప్రభుత్వం భారీగా సొమ్ము వెచ్చిస్తోంది. 2006-07 నుంచి 2016-17 వరకు అంటే పదేళ్లలో కేంద్ర సిబ్బంది వేతన ఖర్చు మూడు రెట్లు పెరిగిందని ఆర్థిక సర్వే పేర్కొంది.2006-07 సంవత్సరంలో వేతనాల కోసం కేంద్రం దాదాపు 40వేల కోట్లు వెచ్చించగా,2016-17 సంవత్సరానికది రెండు లక్షల కోట్లకు పెరిగింది.ఈ పదేళ్లలో కేంద్ర సిబ్బంది వేతనాలు మూడు సార్లు పెరిగినట్టు సర్వే చెబుతోందని సాక్షి తెలిపింది.

అమెరికాలో ప్రతి లక్ష మంది ప్రజలకు 668 మంది ఉద్యోగులు ఉండగా, మన దేశంలో లక్ష మందికి 139 మంది ఉద్యోగులే ఉన్నారు. కేంద్ర సంస్థల్లో 2006లో 35 లక్షల ఉద్యోగాలు మంజూరు కాగా, 31 లక్షలు మాత్రమే భర్తీ చేయడం జరిగింది. 4లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉండిపోయాయి. అదే 2016 వచ్చే సరికి 36 లక్షల ఉద్యోగాలకు గాను 32 లక్షల ఉద్యోగాలు భర్తీ అయ్యాయి.ఖాళీ పోస్టుల్లో ఎక్కువ గ్రూప్‌సి ఉద్యోగాలే(గుమాస్తా,ఆఫీసు అసిస్టెంట్‌) ఉన్నాయి. 2016-17లో 32 లక్షల గ్రూప్‌ సి ఉద్యోగాలు మంజూరు కాగా28 లక్షల ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేశారు.

మిగతా విభాగాలతో పోలిస్తే శాస్త్ర, సాంకేతిక విభాగంలో సిబ్బంది కొరత 50 శాతానికిపైగా ఉంది. 2014లో ఈ విభాగంలో 37శాతం ఉద్యోగాలు ఖాళీగా ఉండగా2016 నాటికది 55శాతానికి చేరింది. పౌర విమానయాన శాఖలో 49శాతం,కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో 44శాతం ఉద్యోగాలు భర్తీ కావలసి ఉంది. రక్షణ మంత్రిత్వ శాఖలో కూడా 31శాతం ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వంలోని 51 మంత్రిత్వ శాఖల్లో సగటున 25 నుంచి 35 శాతం ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ఆర్థిక సర్వే గణాంకాలు తెలియజేస్తున్నాయని ఈ కథనం వివరించింది.

Image copyright Krishna River Management Board

156 టీఎంసీలు కావాలని కృష్ణా బోర్డుకు ఏపీ లేఖ

కృష్ణాబోర్డుకు భారీ ఇండెంట్ కోరుతూ ఏపీ లేఖ రాసిందని, నవంబర్ నాటికే 156 టీఎంసీలు కావాలంటూ అందులో చెప్పిందని 'నమస్తే తెలంగాణ' ఒక కథనం ప్రచురించింది. తెలంగాణ నీటిపారుదలశాఖ అప్రమత్తమైందని, వాటా లెక్కలు కచ్చితంగా అమలయ్యేలా బోర్డుపై ఒత్తిడి తెచ్చిందని ఈ కథనంలో తెలిపారు.

వాస్తవ వినియోగం ఉన్నదా.. లేక తెలంగాణ 52.50 టీఎంసీల కృష్ణా జలాల విడుదల ఉత్తర్వులు సాధించిందనే అక్కసో తెలియ దు? కానీ ఆంధ్రప్రదేశ్ తనవాటా కృష్ణాజలాల వినియోగంకోసం భారీ ఇండెంట్ కోరుతూ కృష్ణానదీ యాజమాన్య బోర్డుకు లేఖ రాసింది. ఇప్పటివరకు వాడుకున్న జలాలు కాకుండా నవంబర్ వరకు 156 టీఎంసీలు కావాలంటూ బోర్డుకు ఇండెంట్ సమర్పించింది అని పత్రిక తన కథనంలో తెలిపారు.

కృష్ణా బేసిన్‌లో తాజా నీటి సంవత్సరానికిగాను ఆ రాష్ర్టానికి వచ్చేవాటా 210.829 టీఎంసీల్లో 84శాతం నవంబర్ నాటికే వాడుకునేందుకు సిద్ధమైంది. బోర్డు ఈ ఇండెంట్‌కు ఓకే చెపితే ఈ ఏడాది డిసెంబర్ నుంచి వచ్చేఏడాది మే వరకు ఇక ఏపీకి మిగిలేది 55 టీఎంసీలు మాత్రమే. కృష్ణా బేసిన్‌లో కీలకమైన శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్లు ఈసారి నిండాయి. ఈ క్రమంలో చురుకుగా వ్యవహరించాల్సిన కృష్ణానదీ యాజమాన్య బోర్డులో నిర్లిప్తత నెలకొన్నది. 52.50 టీఎంసీలు కావాలంటూ తెలంగాణ నీటిపారుదలశాఖ ఇండెంట్ పెట్టినా ఉత్తర్వులు ఇవ్వకుండా కాలయాపన చేసింది. అదేసమయంలో, నీటికోసం లేఖలు రాయాలంటూ బోర్డు సభ్యకార్యదర్శి పరమేశం ఏపీ జలవనరుల శాఖకు పదేపదే లేఖలు రాసింది. తెలంగాణ అధికారుల ఒత్తిడితో ఇటీవల బోర్డు నీటి విడుదల ఉత్తర్వులు జారీచేయడంతో, ఇన్నాళ్లూ బోర్డు లేఖలను పట్టించుకోని ఏపీ తాజాగా పెద్దఎత్తున స్పందించింది. నవంబర్ వరకు ఏకంగా 156 టీఎంసీలు కావాలంటూ ఇండెంట్ ఇచ్చిందని కథనంలో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)