గర్భస్థ పిండానికి జీవించే హక్కు లేదా?

  • 11 సెప్టెంబర్ 2018
పిండానికి జీవించే హక్కుందా? Image copyright Thinkstock

అబార్షన్ చేయించుకోవడం కోసం ఒక అత్యాచార బాధితురాలు వేసిన పిటిషన్‌ను మంబయి హైకోర్టు తోసిపుచ్చింది.

బాధితురాలి వయసు 18 ఏళ్లు, ఆమె గర్భంలో పెరుగుతున్న పిండం వయసు ప్రస్తుతం 27 వారాలు. అబార్షన్ చేసి దానిని తీసేయడం వల్ల తల్లి ప్రాణాలు ప్రమాదంలో పడవచ్చని డాక్టర్లు చెబుతున్నారు.

ఇలాంటి కేసుల్లో గర్భస్థ పిండం హక్కులను కూడా సమీక్షించాల్సి ఉంటుందని న్యాయస్థానం పేర్కొంది.

భారత రాజ్యాంగంలోని సెక్షన్ 21 ప్రకారం ఏదైనా ఒక చట్టాన్ని ఉల్లంఘించనంత వరకూ ఏ వ్యక్తికైనా స్వేచ్ఛగా జీవించే హక్కు ఉంటుంది.

అయితే, గర్భస్థ పిండానికి కూడా వ్యక్తి హోదాను ఇవ్వవచ్చా అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా దీనిపై ఏకాభిప్రాయం లేదు. భారతీయ శిక్షాస్మృతి అంటే ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ)లో రెండు దశాబ్దాల క్రితం వరకూ పిండం గురించి ఎలాంటి నిర్వచనం లేదు.

Image copyright Spl

గర్భస్థ పిండం అంటే ఏంటి?

1994లో గర్భంలో పెరుగుతున్న పిండం గురించి లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం చట్టవిరుద్ధం అని చెప్పే పీసీపీఎన్‌డీటీ చట్టం తీసుకొచ్చారు. పిండం గురించి మొదటిసారి అప్పుడే నిర్వచించారు.

ఒక మహిళ గర్భంలో పెరుగుతున్న ఏంబ్రియోను 8 నెలల తర్వాత, అంటే 57వ రోజు నుంచి బిడ్డ జన్మించేవరకూ చట్ట ప్రకారం 'ఫీటస్' అంటే 'పిండం'గా భావిస్తారు.

ఆడ పిల్లల కంటే మగ పిల్లలే కావాలనే కోరిక ఎక్కువ కావడంతో గర్భంలో ఉన్న పిండానికి లింగ నిర్ధారణ పరీక్షలు, గర్భస్రావం లాంటివి చేయిస్తున్నారు.

అంతర్జాతీయ మెడికల్ మేగజీన్ లాన్సెట్ పరిశోధన ప్రకారం, లింగ నిర్ధారణ పరీక్షల్లో పుట్టబోయేది ఆడపిల్ల అని తెలియడంతో 1980 నుంచి 2010 మధ్య భారతదేశంలో కోటి మందికి పైగా గర్భస్రావం చేయించుకున్నారు.

అలాంటి భ్రూణ హత్యలను ఆపాలనే ఉద్దేశంతో కొత్తగా తీసుకొచ్చిన పీసీపీఎన్‌డీటీ యాక్ట్ ప్రకారం లింగ నిర్ధారణ పరీక్షలు చేయిస్తే డాక్టరుకు, ఆ కుటుంబ సభ్యులకు మూడేళ్ల శిక్ష, జరిమానా విధిస్తారు.పిండం జీవితంపై నిర్ణయం తీసుకునే హక్కు ఎవరిది?

ఆడ పిల్లలంటే ఇష్టం లేకపోవడంతోపాటు వేరే కారణాల వల్ల కూడా గర్భస్రావాలు జరగచ్చు. ఉదాహరణకు అత్యాచారం వల్ల గర్భం వచ్చిన మహిళ లేదా గర్భనిరోధకాలు పనిచేయకపోవడంతో గర్భం దాల్చిన మహిళ ఆ బిడ్డ వద్దనుకున్నప్పుడు అలా చేయించుకోవచ్చు.

కానీ, కొన్ని దశాబ్దాల క్రితం భారతదేశంలో గర్భస్రావం పూర్తిగా చట్టవిరుద్ధంగా జరిగేది. కేవలం ఒకే ఒక కారణంతో, అంటే బిడ్డకు జన్మనివ్వడం వల్ల తల్లి ప్రాణాలకు ఏదైనా ప్రమాదం ఉన్నప్పుడు మాత్రమే దానికి అనుమతించేవారు.

అందుకే, 1971లో గర్భస్రావం కోసం 'ది మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్' అంటే ఎంటీపీ అనే కొత్త చట్టం పాస్ చేశారు. ఇందులో గర్భధారణ తర్వాత 20 వారాల వరకూ గర్భస్రావం చేయించుకోడానికి చట్టం అనుమతిస్తుంది.

ఇందులో, బిడ్డ పుట్టడం వల్ల తల్లికి శారీరక లేదా మానసిక హాని ఉంటే, పుట్టబోయే బిడ్డకు మానసిక, శారీరక వైకల్యం ఏర్పడే అవకాశం ఉంటేనే గర్భస్రావానికి అనుమతి లభిస్తుందని షరతు విధించారు.

గర్భస్థ పిండం జీవితం గురించి తీసుకునే ఈ నిర్ణయంలో తల్లిదండ్రులు తమ అభిప్రాయం చెప్పచ్చు, గర్భస్రావానికి అంగీకరించవచ్చు. కానీ, దీనిపై ఆఖరి నిర్ణయం మాత్రం డాక్టరుదే అవుతుంది.

12 వారాల ముందు గర్భస్రావం చేయాలనే నిర్ణయం ఒక రిజిస్టర్డ్ డాక్టర్ తీసుసుకుంటే సరిపోతుంది. కానీ పిండం వయసు 12 నుంచి 20 వారాల మధ్యలో ఉంటే దాని జీవితం గురించి ఇద్దరు రిజిస్టర్డ్ డాక్టర్లు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

Image copyright Spl
చిత్రం శీర్షిక 14 వారాల పిండం

భ్రూణ హత్యకు శిక్ష

ఎంటీపీ యాక్ట్ షరతులకు విరుద్ధంగా ఒక మహిళ తన పిండాన్ని తీయించుకున్నా, లేదా ఆమెకు గర్భస్రావం చేయించినా అది కూడా నేరం అవుతుంది. ఆ నేరానికి ఆ మహిళకు మూడేళ్ల శిక్ష, జరిమానా విధించవచ్చు.

గర్భిణికి సమాచారం ఇవ్వకుండా ఆమెకు గర్భస్రావం చేయిస్తే వారికి జీవితఖైదు కూడా విధించవచ్చు.

గర్భస్రావం చేయాలనే ఉద్దేశంతో మహిళను చంపడం, లేదా బిడ్డను పుట్టక ముందే లేదా పుట్టగానే చంపాలనే ఉద్దేశంతో ఏదైనా చేసినా వారికి పదేళ్ల శిక్ష పడవచ్చు.

ఒక వ్యక్తి కారణంగా గర్భిణి చనిపోయినా లేదా గర్భంలో పెరుగుతున్న పిండం మరణించేలా ఆమె గాయపడినా దానిని 'కల్పబుల్ హోమిసైడ్' లేదా 'ఉద్దేశపూర్వకం కాని హత్య'గా భావిస్తారు. దీనికి కూడా పదేళ్ల శిక్ష విధించవచ్చు.

ఇవికూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)