చింతలవలస: డోలీలో గర్భిణి.. అడవిలో ప్రసవం.. రాయితో బొడ్డుతాడు కోత

  • 12 సెప్టెంబర్ 2018
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: ఇంకా ఎన్నాళ్లు మాకు ఈ కష్టాలు?

"మా ఊరికి రోడ్డు లేదు. రోగులను, గర్భిణులను ఆస్పత్రికి తీసుకెళ్లాలంటే 6 కిలోమీటర్ల దూరం భుజాలపై మోసుకెళ్లాల్సిందే. మేం ఇన్ని ఇబ్బందులు పడుతున్నా మా సమస్యను ఎవరూ పట్టించుకోవడంలేదు. మా జీవితాలను బాగు చేసే రోడ్డు కోసం ఎదురుచూస్తున్నాం. ఈ వీడియో చూసైనా అధికారులు స్పందించి మా సమస్యను పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం"

కొద్దిరోజులుగా వాట్సాప్‌లో వైరల్‌గా మారిన వీడియోలో ఉత్తరాంధ్రకు చెందిన ఓ గిరిజన యువకుడి ఆవేదన ఇది.

అత్యవసరంగా ఆసుపత్రికి వెళ్లాల్సిన ప్రతిసారీ ప్రాణాలపై ఆశలొదులుకుని కొండలు గుట్టలు దాటుతున్న అడవి బిడ్డల అరణ్య రోదన ఇది.

ఈ వీడియో చిత్రీకరించిన యువకుడిది విజయనగరం జిల్లా సాలూరు మండలంలోని కొదమ పంచాయతీ యం.చింతలవలస అనే గిరిజన గ్రామం.

కొండల్లో ఉన్న ఈ గ్రామానికి రోడ్డు లేదు. ఇక్కడ ఎవరికైనా జబ్బు చేసినా, పురిటి నొప్పులతో బాధపడుతున్నా వారిని ఆస్పత్రికి తీసుకెళ్లాలంటే ఆరేడు కిలోమీటర్ల దూరం డోలీలో మోసుకెళ్లడం తప్ప మరోదారి లేదు.

తాజాగా సెప్టెంబర్ 4న ఈ ఊరికి చెందిన ఒక గర్భిణిని అలానే తీసుకెళ్లారు. కానీ 3 కిలోమీటర్ల దూరం వెళ్లగానే దారిలోనే ఆమె ప్రసవించారు. దాంతో ఏం చేయాలో తెలియని స్థితిలో ఆమెను తిరిగి వాళ్ల గ్రామానికే తీసుకెళ్లారు.

ఆమె కాన్పు సమయంలో దూరం నుంచి ఓ యువకుడు వీడియో తీశాడు. రోడ్డు లేకపోవడంతో గ్రామస్తులు ఎలాంటి కష్టాలు పడుతున్నారో ఈ వీడియోలో వివరించాడు. ఆసుపత్రికి తీసుకెళ్తుండగానే ప్రసవించడంతో వారి వద్ద కాన్పు చేయడానికి అవసరమైన సామగ్రి కూడా లేదు. దీంతో అక్కడే దొరికన ఒక పదునైన రాయితో శిశువు బొడ్డుతాడును కోయడం కూడా ఈ వీడియోలో కనిపిస్తుంది.

రోడ్డు లేకపోవడంతో గిరిజన మహిళలు ఎంతటి ప్రమాదకర పరిస్థితుల్లో ప్రసవించాల్సి వస్తోందో ఈ వీడియో కళ్లకు కట్టింది.

Image copyright Suraiah

ఈ వీడియోలో మాట్లాడుతున్న వ్యక్తి 26 ఏళ్ల చోడిపల్లి సూరయ్యగా బీబీసీ న్యూస్ తెలుగు గుర్తించింది. యం. చింతలవలస గ్రామానికి చెందిన ఆయన ఇంటర్మీడియట్ చదువుకుని సొంతూరిలోనే పోడు వ్యవసాయం చేసుకుంటున్నారు.

ఊరికి రోడ్డులేక తాము పడుతున్న ఇబ్బందుల గురించి అనేకసార్లు అధికారులకు మొరపెట్టుకున్నామని ఆయన బీబీసీతో చెప్పారు.

"మా గ్రామంలో ఎవరు అనారోగ్యం పాలైనా డోలీలో మోసుకొని తీసుకెళ్లాల్సిందే. కొన్నిసార్లు గర్భిణులు దారిలోనే చనిపోతుంటారు. అప్పుడప్పుడు పసిపిల్లలు ఆస్పత్రికి వెళ్లేలోపే ప్రాణాలు కోల్పోతుంటారు" అని చెప్పారు సూరయ్య.

చిత్రం శీర్షిక వీడియో తీసిన యువకుడు సూరయ్య

ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా సమస్య పరిష్కారం కాకపోవడంతో తమ కష్టాలను రికార్డు చేసి సోషల్ మీడియాలో పెట్టి అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని అనుకున్నామని సూరయ్య తెలిపారు.

"సెప్టెంబర్ 4న పురిటి నొప్పులతో బాధపడుతున్న ముతాయమ్మను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు మేము ఎలాంటి దారిలో వెళ్లాల్సి ఉంటుందో, రోడ్డు లేకపోవడం వల్ల మేం ఎన్ని కష్టాలు పడుతున్నామో అందరికీ తెలియజెప్పాలని అనుకున్నాం. అందుకోసం మా ప్రయాణం ప్రారంభం అయినప్పటి నుంచి వీడియో చిత్రీకరించాం. అయితే మార్గం మధ్యలోనే కాన్పు అవుతుంది అని అనుకోలేదు" అని సూరయ్య చెప్పారు.

ఇదే గ్రామానికి చెందిన రాజు ఈ వీడియో రికార్డు చేయడానికి సూరయ్యకు సహాయం చేశారు.

తమ గ్రామానికి రోడ్డు వేయాలని విజ్ఞప్తి చేస్తూ అధికారులకు తాను లేఖ రాసినా వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదని రాజు తెలిపారు. "మేము ఇక్కడ కొండలపై బతుకుతాము. ఇక్కడ చుట్టుపక్కల మరికొన్ని గ్రామాలకు కూడా రోడ్లు లేవు. రోడ్డు వేస్తే కొండ మీదనుంచి కిందకి దిగటానికి పట్టే సమయం తగ్గుతుంది. మాకు కష్టాలు దూరమవుతాయి. నేను రాసిన లేఖకు అధికారుల నుంచి ఇంకా ఎటువంటి స్పందన రాలేదు" అని రాజు అన్నారు.

చిత్రం శీర్షిక యం.చింతవలస గ్రామం

మార్గం మధ్యలో గిరిజన మహిళ ప్రసవించిన ఘటనపై జిల్లా అధికారులను బీబీసీ న్యూస్ తెలుగు సంప్రదించింది. ప్రస్తుతం తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని, శిశువుకు టీకాలు ఇచ్చినట్టు వారు తెలిపారు.

"ఆ మహిళ ప్రసవం గురించి తెలియగానే ఆ కొండపైకి ఏఎన్ఎంని పంపించాం. పాపకు అవసరమైన టీకాలు ఇచ్చారు. తల్లి ఆరోగ్య పరిస్థితిని పరీక్షించారు. శిశువు 3 కిలోల బరువు ఉంది. ఆరోగ్యంగా ఉంది" అని విజయనగరం జిల్లా వైద్య ఆరోగ్య ఉప అధికారి రవి కుమార్ రెడ్డి చెప్పారు.

కొండ మీద ఉన్న ఈ గ్రామానికి రోడ్డు లేకపోవడం వల్ల రోగులను ఇక్కడి నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలోని కొండ మొదలు వరకూ మోసుకెళ్తారు. అక్కడ ఓ బైక్ అంబులెన్స్ ఉంటుంది. అక్కడికి 17 కిలోమీటర్ల దూరంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది.

చిత్రం శీర్షిక ఆ మహిళను ఈ మార్గంలోంచే తీసుకెళ్లారు.

ఈ ప్రాంతంలో రోడ్డు నిర్మాణానికి ఐదుసార్లు టెండర్లు పిలిచినట్టు జిల్లా వైద్య శాఖ అధికారి కొర్రా విజయలక్ష్మి తెలిపారు. "అక్కడ రోడ్డు కోసం ఐటీడీఏ ఐదుసార్లు టెండర్లు పిలిచింది. అది మారుమూల ప్రాంతం కావడంతో గుత్తేదార్లు ముందుకు రావడం లేదు. మేం చేయగలిగిందంతా చేశాం" అన్నారు విజయలక్ష్మి.

ఇదే ఏడాది జులైలో యం. చింతలవలసకు సమీపంలోని సిరివర గ్రామానికి చెందిన గిరిజన మహిళ తామరకొండ జిందామని తన బిడ్డని కోల్పోయారు.

అయిదో నెలలో నొప్పులు రావటంతో ఆమెకు గర్భస్రావమైంది. ఆమెను హాస్పిటల్‌కి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలోనే గర్భస్రావం కావటంతో శిశువు బతకలేదు.

తన బిడ్డకి కూడా అలాగే జరుగుతుందేమో అని భయపడ్డానని ముతాయమ్మ భర్త చోడిపల్లి జుంబి చెప్పారు.

బీబీసీ తెలుగుతో ఆయన మాట్లాడుతూ "నా భార్యకి ఉదయం నొప్పులు మొదలైనాయి. మేము వెంటనే డోలీలో ఆమెను కూర్చోబెట్టి కిందకి బయలుదేరాం. దారి మొత్తం భయపడుతూనే ఉన్నా. కొంతదూరం వెళ్లగానే కాన్పు అనగానే నాకు ఇంకా భయమేసింది. కానీ అపాయం ఏమీ జరగలేదు. ఆ రోజు నా భార్య చాలా ఇబ్బంది పడింది" అని జుంబి గుర్తుచేసుకున్నారు.

కాగా సిరివర ఘటనను జాతీయ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా తీసుకుని ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

చిత్రం శీర్షిక ప్రసవించిన మహిళ భర్త జుంబి

ఇక్కడి కొండ ప్రాంతాల్లోని పది శాతం ఆవాసాలకు రోడ్డు సౌకర్యం లేదని విజయనగరం జిల్లా అధికారులు బీబీసీకి తెలిపారు.

రోడ్లు లేకపోవడం వల్ల అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రికి వెళ్లడం కష్టమవుతున్నందున గర్భిణులను ప్రసవానికి రెండు నెలల ముందే కొండ మీద నుంచి కిందకు తీసుకురావాలని అనుకుంటున్నట్టు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి లక్ష్మీషా వెల్లడించారు.

"గర్భిణులను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు దగ్గరగా ఉంచాలనుకుంటున్నాం. అలా చేస్తే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడవచ్చు. ప్రస్తుతం 50- 60 మహిళలకు సరిపడా స్థలం కోసం చూస్తున్నాం" అని చెప్పారు రవికుమార్ రెడ్డి.

ఈ గ్రామానికి రూ.5.5 కోట్ల బడ్జెట్‌తో రోడ్డు మంజూరైనట్టు ఐటీడీఏ అధికారి లక్ష్మీషా తెలిపారు. "9.8 కి.మీ. రోడ్డు మంజూరైంది. కానీ మేం ఐదుసార్లు టెండర్ పిలవాల్సి వచ్చింది. టెండర్లు వేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు" అని లక్ష్మీషా చెప్పారు.

కొండ ప్రాంతం కావడం, కఠిన పరిస్థితుల మధ్య పనిచేయాల్సి రావడంతో పెద్దగా లాభాలు రావనీ, అందుకే కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని ఆయన అన్నారు.

"తక్కువ లాభాలుండడం వల్లే కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని అనుకుంటున్నాం. కొండ ప్రాంతాల్లోని గ్రామాలను కలిపే మరో ఐదు రోడ్లు ఇలాంటివే పెండింగ్‌లో ఉన్నాయి" అని లక్ష్మీషా తెలిపారు.

ఈ టెండర్‌ని ఎంపిక పద్ధతిలో (సెలక్షన్ బేసిస్)లో కేటాయించే విధంగా లేదా గ్రామీణ ఉపాధి పథకానికి అనుసంధానించే విధంగా అనుమతివ్వాలని కోరుతూ త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్టు తెలిపారు. ఈ రోడ్డు నిర్మాణాన్ని అత్యంత ప్రాధాన్యాంశంగా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతామన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం