తెలంగాణలోని కొండగట్టు వద్ద రోడ్డు ప్రమాదంలో 58 మంది మృతి: గడువు తీరిన డొక్కు బస్సు‌ను నడిపారా?

  • 11 సెప్టెంబర్ 2018
బస్సు ప్రమాదం Image copyright credit .. facebook/Kalvakuntla Kavitha

తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా కొండగట్టు ఘాట్ రోడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

కొండగట్టు మీదుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు లోయలో పడిపోవడంతో 58 మంది దుర్మరణం పాలైనట్లు జగిత్యాల కలెక్టరు శరత్ చెప్పారు.

మృతి చెందిన వారిలో నలుగురు చిన్నారులు, 30 మంది మహిళలు, 23 మంది పురుషులు ఉన్నట్లు వెల్లడించారు.

60 మంది సామర్థ్యమున్న ఈ బస్సులో 100 మంది ప్రయాణికులున్నట్లు చెప్పారు.

ప్రమాదంలో గాయపడిన 43 మందిని జగిత్యాల, కరీంనగర్‌ ప్రభుత్వాసుపత్రులకు తరలించారు.

జగిత్యాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్ ఆధ్యాత్మిక క్షేత్రమైన కొండగట్టు మీదుగా వస్తుండగా అదుపు తప్పడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.

బస్సులో ఉన్నవారంతా యాత్రికులు కారని, ఆ మార్గంలో వివిధ గ్రామాలకు చెందిన వారు అందులో ప్రయాణిస్తున్నారని స్థానికులు తెలిపారు.

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి సహాయ చర్యలు చేపట్టారు.

బస్సులో ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉండడం.. లోయలోకి జారడంతో అందులో ఉన్నవారంతా ఒకరిపై ఒకరు పడి ప్రమాద తీవ్రత మరింత పెరిగిందని స్థానికులు తెలిపారు.

క్షతగాత్రుల ఆర్తనాదాలు, బాధితుల బంధువుల రోదనతో ఘటనా స్థలం, జగిత్యాల ఆసుపత్రి వేదనాభరితంగా మారాయి.

కొండగట్టు రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.

ఆర్టీసీ తరపున రూ.3 లక్షల చొప్పున సాయం చేస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి తెలిపారు.

ప్రమాదం జరిగిందిలా..

కొండగట్టు ఆలయ మార్గంలో ఉన్న దుకాణదారు ఒకరు 'బీబీసీ తెలుగు'కు ప్రమాదం ఎలా జరిగిందో వివరించారు.

ఈ బస్సు కొడిమ్యాల మండలం శనివారంపేట నుంచి జగిత్యాలకు వెళ్తోందని.. కొండగట్టు పైనుంచి వస్తున్న బస్సు ప్రధాన రహదారికి చేరుకోవడానికి కొద్ది దూరంలో ఘాట్‌రోడ్డులోని చివరి మలుపు వద్ద ప్రమాదానికి గురైందని తెలిపారు.

ఉదయం సుమారు 11 గంటల సమయంలో బస్సు వేగంగా వస్తూ రోడ్డు పక్కనున్న రెయిలింగ్‌ను ఢీకొని లోయలోకి జారిపోయిందని తెలిపారు. బహుశా బ్రేకు విఫలం కావడం వల్ల ప్రమాదం జరిగి ఉండొచ్చని అన్నారు.

కాగా ఈ బస్సు శనివారంపేట నుంచి నాచుపల్లి, దొంగలమర్రి మీదుగా వెళ్లాల్సి ఉందని.. కానీ, 5 కిలోమీటర్ల దూరం తగ్గుతుండడంతో జేఎన్టీయూ మీదుగా కొండగట్టు వచ్చి అక్కడి నుంచి ఘాట్ రోడ్డులో దిగి జగిత్యాల వెళ్తున్నారని స్థానికులు చెబుతున్నారు.

ఈ బస్సును ఎందుకు స్క్రాప్ చేయలేదు

తెలంగాణ రోడ్డు భద్రత ప్రాధికార సంస్థ డీజీపీ కృష్ణ ప్రసాద్ చెబుతున్న వివరాల మేరకు.. తెలంగాణ ఆర్టీసీ అంతర్గత ఆదేశాల మేరకు 14 లక్షల కిలోమీటర్ల దూరం తిరిగిన బస్సును స్క్రాప్ చేస్తారు. అంటే ఇక ఆ బస్సు మళ్లీ రోడ్డుపైకి రాదు.

కానీ ఈ బస్సు దాదాపు 15 లక్షల కిలోమీటర్లు తిరిగినా ఇంకా కొనసాగుతోంది.

బీబీసీ తెలుగుకు లభించిన అధికారిక సమాచారం ప్రకారం.. ఈ బస్సు ఇప్పటి వరకూ 14.95 లక్షల కిలోమీటర్లు తిరిగింది.

AP28Z2319 నంబరున్న ఈ బస్సు 2007 నుంచి తిరుగుతోంది. దీనికి వచ్చే నెల అంటే అక్టోబరు 3న ఫిట్‌నెస్ చెక్ చేయాల్సి ఉంది.

గత ప్రమాదాలు..

1.7 కిలోమీటర్ల మేర ఉన్న కొండగట్టు ఘాట్‌రోడ్డులో గతంలోనూ పలుమార్లు ప్రమాదాలు జరిగాయి.

ఈ ప్రమాదానికి ముందు కూడా ఈ మార్గంలో 60 మందికి పైగా వేర్వేరు ఘటనల్లో మరణించినట్లు స్థానికులు చెబుతున్నారు.

2012 ఫిబ్రవరిలో ఇక్కడ నిజామాబాద్ జిల్లా ధర్మారం మండలం నుంచి లారీలో వస్తున్న భక్తులు ఘాట్ రోడ్డు దిగుతుండగా బోల్తా పడి 12 మంది మరణించారు.

2006లో ట్రాక్టర్‌లో వస్తున్న భక్తులు ఇదే ప్రదేశంలో ప్రమాదం జరిగి 8 మంది మరణించారు.

2012 ప్రమాదం తరువాత రోడ్డు విస్తరణ చేయాలని, వాలు తగ్గించాలన్న ప్రతిపాదనలు వచ్చినా కార్యరూపం దాల్చలేదని స్థానికులు చెబుతున్నారు.

తెలంగాణలో గత ఏడాది 7,200 మంది రోడ్డు ప్రమాదాలకు బలి..

తెలంగాణ రాష్ట్రంలో 2017లో రోడ్డు ప్రమాదాల కారణంగానే 7,200 మంది ప్రాణాలు కోల్పోయారు. 2016లో 7,219 మంది.. 2015లో 7,110 మంది రోడ్డు ప్రమాదాలకు బలయ్యారు.

దేశవ్యాప్తంగా చూసుకుంటే 2017లో 1,51,000 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించినట్లు జాతీయ నేర నమోదు సంస్థ లెక్కలు చెబుతున్నాయి. ఇందులో 80.3 శాతం ప్రమాదాలకు డ్రైవర్ల తప్పిదాలే కారణమని ఈ సంస్థ వెల్లడించింది.

2016లో 4,89,400 రోడ్డు ప్రమాదాలు జరగ్గా 1,50,785 మంది దుర్మరణం పాలయ్యారు. 2015లో 5,01,423 రహదారి ప్రమాదాలు జరగ్గా 1,39,671 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఏ రాష్ట్రంలో ఎంత శాతం

2016లో దేశవ్యాప్తంగా రహదారి ప్రమాదాల్లో 1,50,785 మంది మరణించగా అందులో ఉత్తర్‌ప్రదేశ్‌లో అత్యధికంగా 12.8 శాతం మరణాలు నమోదయ్యాయి. తమిళనాడు, మహారాష్ట్ర వరుసగా 11.4 శాతం, 8.6 శాతంతో ఆ తరువాత స్థానాల్లో ఉన్నాయి. తెలంగాణ 4.8 శాతం మరణాలతో తొమ్మిదో స్థానంలో, 5.7 శాతంతో ఆంధ్రప్రదేశ్ దేశంలో ఏడో స్థానంలో ఉన్నాయి.

తెలంగాణలో బస్సు ప్రమాదాలు

2016లో తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 1207 బస్ ప్రమాదాలు జరగ్గా.. 347 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ఏడాది అత్యధికంగా తమిళనాడు 7,037 బస్ ప్రమాదాలు జరిగి 2,141 మంది దుర్మరణం పాలయ్యారు.

తెలంగాణ రాష్ట్రంలో 2016లో వాహనాల బ్రేకులు విఫలం కావడం వల్ల 1008, పరిమితికి మించి ప్రయాణిస్తున్న వాహనాలు ప్రమదానికి గురై 1890 మంది మరణించారు.

అయితే, రోడ్డు ప్రమాదాల్లో మరణాల రేటు గత నాలుగేళ్లుగా తగ్గుతూ వస్తోందని రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ తెలంగాణ గణాంకాలు చెబుతున్నాయి.

2017లో తెలంగాణలో సగటున ప్రతి 1000 రోడ్డు ప్రమాదాల్లో 294 మంది మరణించగా అంతకుముందు ఏడాది(2016)లో ప్రతి వెయ్యి రహదారి ప్రమాదాల్లో 314 మంది మరణించారు. 2015లో ప్రతి వెయ్యి ప్రమాదాల్లో 335 మంది, 2014లో 344 మంది మరణించారు.

2014, 2015లో జాతీయ సగటు ప్రతి వెయ్యి రోడ్డు ప్రమాదాలకు 285, 314 మరణాలుగా ఉంది.

Image copyright Telangana Police
చిత్రం శీర్షిక మృతుల వివరాలు
Image copyright Telangana Police
చిత్రం శీర్షిక మృతుల వివరాలు

ఫిట్‌నెస్ లేని బస్సులు నడపడం వల్లే..

కొండగట్టు ప్రమాదం నేపథ్యంలో 'ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ రోడ్ సేఫ్టీ' చీఫ్ వినోద్ కె.కనుమల 'బీబీసీ తెలుగు'తో మాట్లాడారు.

ఆర్టీసీలో పనిచేసే సీనియర్ డ్రైవర్లు చాలామందితో తాను మాట్లాడానని.. 80 శాతం బస్సులకు ఫిట్‌నెస్ లేదని, అలాంటివి తాము నడపాల్సివస్తోందని వారు తనతో చెప్పారని ఆయన అన్నారు.

''ప్రతి స్థాయిలో అవినీతి పెరిగిపోవడమే ఈ దుస్థితికి కారణం. రోడ్డు రవాణా కార్యాలయానికి ఫిట్‌నెస్ ధ్రువపత్రాల కోసం వాహనాలను తెచ్చేటప్పుడు అందులో ఏమేం మార్పులు చేయాలో అధికారులు సూచిస్తుంటారు. కానీ, తప్పనిసరి రిపేర్లు, మార్పులు కూడా చేయించకుండానే ఆ వాహనాలు రోడ్లపైకి రావడం ఎన్నోసార్లు చూశాను'' అని వినోద్ తెలిపారు.

డ్రైవర్లకు ప్రతి ఆరు నెలలకోసారి అంతర్గతంగా శిక్షణ ఇచ్చేలా రవాణా సంస్థలో మార్గదర్శకాలున్నాయని, కానీ, ఇవేమీ అమలు కావడం లేదని వినోద్ అన్నారు.

Image copyright TSRTC

బస్సును నడిపింది ఉత్తమ డ్రైవర్

ఈ ప్రమాదానికి గురైన బస్సును నడిపిన డ్రైవర్ శ్రీనివాస్ ఈ ఏడాది ఆగస్టు 15న ఉత్తమ డ్రైవర్ అవార్డు అందుకున్నారు.

ఈ ప్రమాదంలో ఆయన కూడా ప్రాణాలు కోల్పోయారు.

ఘటనా స్థలం నుంచి బీబీసీ తెలుగు ప్రతినిధి దీప్తి బత్తిని అందించిన ఎఫ్‌బీ లైవ్‌ను కింద చూడొచ్చు.

ఇవి కూడా చదవండి(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)