నిజాం మ్యూజియంలో బంగారు టిఫిన్ బాక్సును ఎలా దొంగిలించారంటే..

  • బళ్ల సతీశ్
  • బీబీసీ ప్రతినిధి
నిజాం వస్తువులు

నిజాం మ్యూజియం నుంచి నిజాం టిఫిన్ బాక్సును ఎత్తుకెళ్లిన దొంగలు దొరికారు. బంగారపు బాక్సును దొంగిలించినా దాన్ని వారు ఎవరికీ అమ్మలేకపోవడంతో పోయిన సొత్తు మొత్తం రికవరీ అయింది.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..

హైదరాబాద్‌లోని రాజేంద్ర నగర్‌కి చెందిన 23 ఏళ్ళ మహమ్మద్ గౌస్ పాషా, 24 ఏళ్ల మహమ్మద్ ముబీన్‌లు బంధువులు, చిన్నప్పటి నుంచీ స్నేహితులు. ఉర్దూ మీడియంలో ఒకరు ఏడో తరగతి, ఒకరు రెండో తరగతి వరకూ చదివి తరువాత బడి మానేశారు. ప్రస్తుతం గౌస్ సెంట్రింగ్ పని, ముబీన్ వెల్డింగ్ పని చేస్తున్నారు.

గౌస్ పై ఇప్పటికే 15 ఇళ్ల దొంగతనాల కేసులున్నాయి. జైలు నుంచి బెయిల్ మీద 2018 జూలైలోనే విడుదలయ్యాడు. ముబీన్ పనికోసం సౌదీ వెళ్లి అక్కడ ఒక పాకిస్తానీని కొట్టిన కేసులో రెండున్నరేళ్లు జైలులో ఉండి వచ్చాడు.

సౌదీ నుంచి వచ్చిన తరువాత ముబీన్ నిజాం మ్యూజియం చూశాడు. అక్కడి బంగారపు టిఫిన్ బాక్సు, కప్పు సాసర్, స్పూన్, బంగారపు ఖురాన్ పెట్టెలు చూసి ముగ్ధుడయ్యాడు.

వాటి విలువ కోట్ల రూపాయలు ఉంటుందనీ, తనకు విదేశాల్లో ఉన్న సంబంధాల దృష్ట్యా వాటిని సులువుగా అమ్మేయవచ్చునని భావించాడు. తన ఆలోచనను గౌస్‌కి చెప్పాడు.

ముందుగా ఇద్దరూ మ్యూజియంకి వెళ్లి అన్నీ పరిశీలించారు.

ఫొటో సోర్స్, Hyderabad police

ఎక్కడెక్కడ సీసీ కెమెరాలున్నాయో చూసుకున్నారు. దొంగతనానికి కావల్సిన వస్తువుల గురించి మాట్లాడుకున్నారు. తాము వెళ్లాల్సిన వెంటిలేటర్ పై బాణం గుర్తు పెట్టుకున్నారు.

దొంగతనం రోజు మూడు వేర్వేరు సైజుల స్క్రూ డ్రైవర్లు, కట్టింగ్ ప్లైర్, నెయిల్ పుల్లర్, పది హాక్ సా బ్లేడ్లు, తాడు తీసుకుని వెళ్లారు.

తాడు నుంచి జారిపోకుండా 30 ముళ్ళు వేశారు. వేలిముద్రలు పడకుండా గ్లౌజులు, ముఖాలు కనిపించకుండా మాస్కులు ధరించారు. సీసీటీవీ కెమెరాలు లేని దారిలో లోపలికి వెళ్దామనుకుని కుదరకపోవడంతో, ముబీన్ బండిపై మాతాకి కిడ్కీ వైపు నుంచి వచ్చారు. అది సీసీటీవీలో రికార్డయింది.

మ్యూజియంను ఆనుకుని ఉండే ఒక ఇంటిపై నుంచి మ్యూజియం పైకప్పు మీదికి వచ్చారు. వాళ్లు అంతకు ముందే పెట్టుకున్న బాణం గుర్తులతో సులువుగా దొంగతనం జరిగిన చోటుకు చేరుకున్నారు.

తమతో తీసుకెళ్లిన వస్తువులతో వెంటిలేటర్‌ను తొలగించారు. ముబీన్ సన్నగా ఉండడంతో అతను లోపలికి వెళ్లాడు. తాడు ఒక కొసను పిట్ట గోడకి కట్టి మరో కొసను ముబీన్ నడుము కట్టి, ముబీన్ వెంటిలేటర్ నుంచి లోపలికి వెళ్లగానే తాడును మెల్లి మెల్లిగా ఒదిలాడు గౌస్.

వెంటిలేటర్ పక్కనే ఉన్న సీసీటీవీ కెమెరాను కూడా ధ్వంసం చేశారు. తరువాత ముబీన్ వస్తువులను సంచిలో వేసుకుని అదే తాడుతో పైకెక్కాడు. బయటి నుంచి గౌస్ లాగాడు. బయటకు వచ్చాక వచ్చిన దారిలోనే వెళ్లిపోయారు.

ఫొటో క్యాప్షన్,

దొంగలు ఎత్తుకుపోయిన బంగారు టిఫిన్ డబ్బా

పోలీసుల సీసీ కెమెరాల నుంచి తప్పించుకోవడం కోసం వారు మెయిన్ రోడ్డులో నుంచి కాకుండా చిన్న చిన్న గల్లీల్లో ప్రయాణించి చివరకు హైదరాబాద్ శివార్లలో ముంబై హైవేపై ఉండే సంగారెడ్డి జిల్లా పరిధిలోని ముత్తంగి గ్రామానికి చేరుకున్నారు. అక్కడ వాళ్లు ఔటర్ రింగు రోడ్డు నుంచి సర్వీసు రోడ్డుకు మారి హైదరాబాద్ వైపు వచ్చారు.

పోలీసుల భయంతో రాజేంద్ర నగర్ డైరీ ఫామ్ ప్రాంతంలో ఒక గోతిని తవ్వి మొత్తం సొత్తు అక్కడ పాతి పెట్టారు. తరువాత వచ్చిన రూట్లోనే జహీరాబాద్ వెళ్లారు. అక్కడ బండి పాడైపోవడంతో దగ్గర్లోని బస్టాండ్‌లో బండి పెట్టేసి, మెల్లిగా ముంబయి చేరుకున్నారు. అక్కడ కొందరిని కలిశారు.

ముబీన్ విదేశాల్లో ఉన్న వాళ్లతో కూడా సంప్రదించాడు. కానీ ఎవరూ వాటిని కొనడానికి ముందుకు రాలేదు. చివరకు 10వ తేదీన హైదరాబాద్ తిరిగి వచ్చేశారు. 11వ తేదీన హైదరాబాద్ దక్షిణ మండలం టాస్క్ ఫోర్స్ పోలీసులు, మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ సిబ్బంది కలసి హైదరాబాద్ శివార్లలోని హిమాయత్ సాగర్ దగ్గర్లోని గుట్టల్లో వారిని పట్టుకున్నారు. దొంగతనం చేసిన మొత్తం సొత్తు రికవరీ చేశారు.

పోలీసులు స్వాధీనం చేసుకున్న వస్తువులు

1950 గ్రాముల బరువున్న, వజ్రాలు, పగడాలు పొదిగిన మూడు అరల బంగారు టిఫిన్ బాక్సు

172 గ్రాముల బరువున్న విలువైన రాళ్లు పొదిగిన బంగారపు కప్పు, సాసర్

14 గ్రాముల బరువున్న బంగారపు స్పూన్

(పోలీసు ప్రెస్ మీట్ మినహా ఇతర ఫొటోలు.. నిజాం మునిమనుమడు నవాబ్ నజఫ్ అలీ ఖాన్)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)