అప్పుడే ప్రధానమంత్రి కార్యాలయాన్ని హెచ్చరించానన్న రఘురామ్ రాజన్: ప్రెస్ రివ్యూ

  • 12 సెప్టెంబర్ 2018
రఘురామ్ రాజన్, ఆర్బీఐ Image copyright Getty Images

బడా మోసాలపై గతంలోనే ప్రధానమంత్రి కార్యాలయానికి నివేదన అందజేశానని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ పేర్కొన్నట్లు నమస్తే తెలంగాణ ఒక కథనాన్ని ప్రచురించింది.

తాను గవర్నర్‌గా ఉన్నప్పుడు ఓ ఫ్రాడ్ మానిటరింగ్ సెల్‌ను ఆర్బీఐ ఏర్పాటు చేసిందని రాజన్ తెలిపారు. దర్యాప్తు సంస్థలకు మోసాల గురించిన సమాచారాన్ని ముందుగానే తెలిపేలా ఇది ఏర్పాటైంది. తానూ పీఎంవోకు ఓ హై-ప్రొఫైల్ ఫ్రాడ్ లిస్టును పంపించానని, కనీసం ఒకరిద్దరిపైనైనా కేసు పెట్టి అరెస్టు చేయాలని కోరినట్లు రాజన్ తెలిపారు. కానీ అలా జరిగినట్లు లేదని, దానివల్ల మోసాలు మరింత పెచ్చు మీరాయని రాజన్ పేర్కొన్నారు.

అలాగే రుణాల మంజూరులో బ్యాంకర్ల నిర్ణయమే అంతిమం కాదంటూ పరోక్షంగా ప్రభుత్వ జోక్యాన్ని ఎండగట్టారు. రుణాలు, ఇతరత్రా అంశాల్లో ప్రభుత్వ పెద్దల జోక్యం కూడా తగ్గాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

బ్యాంకులు గత జీడీపీని దృష్టిలో పెట్టుకుని విద్యుత్‌సహా అన్ని మౌలిక రంగ ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున రుణాలు ఇచ్చుకుంటూపోయాయని, ఇప్పుడు మొండి బకాయిల్లో అవే అగ్రస్థానంలో ఉన్నాయని గుర్తుచేశారు. బ్యాంకర్ల వైఫల్యం, నెమ్మదించిన కేంద్ర ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలే నిరర్థక ఆస్తులకు కారణమని రాజన్ వ్యాఖ్యానించినట్లు నమస్తే తెలంగాణ తెలిపింది.Image copyright Getty Images

వరుస డ్యూటీలే కారణమా?

కొండగట్టులో జరిగిన రోడ్డు ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ డి.శ్రీనివాస్‌తో మూడు రోజుల నుంచి వరసగా డ్యూటీ చేయిస్తున్నట్లు తోటి సిబ్బంది చెబుతున్నారని ఆంధ్రజ్యోతి కథనం పేర్కొంది.

ఇటీవలే ఆగస్టు 15న ఉత్తమ డ్రైవర్‌ అవార్డును కూడా అందుకున్న కరీంనగర్‌కు చెందిన డి.శ్రీనివాస్‌ 1998లో ఆర్డీసీలో డ్రైవర్‌గా చేరారు. కొండగట్టు ప్రమాదంలో మృతి చెందిన ఆయన.. ఇటీవల కాలంలో తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారుల ఒత్తిళ్లు ఎక్కువయ్యాయని, సెలవులు ఇవ్వడం లేదని తోటి సిబ్బంది ఆరోపిస్తున్నారు.

అయితే ప్రమాదానికి డ్రైవర్‌ నిర్లక్ష్యమే కారణమన్న వాదనలూ వినిపిస్తున్నాయి. శ్రీనివాస్‌ గతంలో రెండుసార్లు ప్రమాదాలకు కారణమైనట్లు తెలిసింది.

మంథని డిపోలో పని చేస్తున్న సమయంలో కారును ఢీకొనడంతో ముగ్గురు మృత్యువాత పడ్డారు. దీంతో ఆయన్ను మెట్‌పల్లి డిపోకు బదిలీ చేశారు. 2014లో మల్లాపూర్‌ రూట్‌లో బస్సు నడుపుతుండగా ప్రమాదం జరిగి, ఇద్దరు మృత్యువాత పడ్డారు. అక్కడి నుంచి ఆయన్ను జగిత్యాలకు బదిలీ చేశారని ఆంధ్రజ్యోతి తెలిపింది.

Image copyright Facebook/Chintamaneni Prabhakar

మళ్లీ రెచ్చిపోయారు

ఏపీ ప్రభుత్వ విప్, దెందులూరు శాసనసభ్యుడు చింతమనేని మళ్లీ రెచ్చిపోయాడని విశాలాంధ్ర కథనం పేర్కొంది.

ఎప్పుడూ ఎవరో ఒకరి మీద దౌర్జన్యం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న ఆయన తాజాగా ఒక దళితుడిపై దౌర్జన్యం చేశారు. కులం పేరుతో దూషిస్తూ, దళితుడిని కాళ్లతో తన్నడమే కాకుండా, తన గన్‌మెన్లతో విచక్షణారహితంగా కొట్టించారు.

ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ గోడౌన్‌లో ఒక గొడవకు సంబంధించి హమాలీల మేస్త్రీ రాచీటి జాన్‌ను చింతమనేని అందరి ముందూ కులం పేరుతో దూషించి తీవ్రంగా కొట్టారు. ముగ్గురు గన్‌మెన్‌లు కూడా జాన్‌పై దాడికి పాల్పడ్డారు. నా మాటే ధిక్కరిస్తావా అంటూ ఎమ్మెల్యే జాన్‌పై చేయి చేసుకున్నారు.

గతంలో చింతమనేని వనజాక్షిపై, ఆ తర్వాత పోలీసు, అటవీ శాఖ అధికారులపై దౌర్జన్యకాండ చేశారని విశాలాంధ్ర పేర్కొంది.

'మహాకూటమి' ఏర్పాటుకు లైన్‌క్లియర్‌

తెలంగాణలో 'మహాకూటమి' ఏర్పాటుకు లైన్‌క్లియర్‌ అయినట్లు సాక్షి కథనం పేర్కొంది.

రాష్ట్ర ప్రజల విశాల ప్రయోజనాల దృష్ట్యా కలసి పనిచేయాలని మంగళవారం పార్క్‌ హయత్‌ హోటల్‌లో జరిగిన సమావేశంలో కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ నిర్ణయించాయి.

టీఆర్‌ఎస్‌ను గద్దె దింపడానికి ఉమ్మడిగా ముందుకెళ్లాలని.. కలసి వచ్చే అన్ని పార్టీలు, ప్రజా సంఘాలతో చర్చలు జరిపి కూటమిలో చేర్చుకోవాలని నిర్ణయించారు.

రాష్ట్రంలో నియంత పాలన సాగుతోందని, అన్ని వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకుని కేసీఆర్‌ సాగిస్తున్న అరాచక పాలన నుంచి ప్రజలకు విముక్తి కల్పించాలంటే భావసారూప్యం ఉన్న పార్టీలూ కలసి పని చేయాలని నేతలు అభిప్రాయపడ్డారు. కేసీఆర్‌ పాలన అన్ని వర్గాల్లో అసంతృప్తిని మిగిల్చిందని, ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా అబద్ధాలతో అరాచక పాలన సాగించారని మండిపడ్డారు.

అన్ని పార్టీలు, ప్రజాసంఘాలతో చర్చలు పూర్తయి విశాల వేదిక ఏర్పాటయిన తర్వాతే సీట్ల పంపకాలపై దృష్టి సారించాలని నిర్ణయించారు.

మూడు పార్టీల నేతల సమావేశంలో భాగంగా మహాకూటమిలోకి వచ్చే పార్టీల మధ్య పొత్తు కుదుర్చుకోవాల్సిన ప్రాతిపదికలపై చర్చించారు. భేషజాలకు పోకుండా సమన్వయంతో ముందుకెళ్లాలని నిర్ణయించినట్లు సాక్షి తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)