అభిప్రాయం: అమిత్ షా బీజేపీలో అందరికంటే బలమైన నాయకుడా?

  • 13 సెప్టెంబర్ 2018
అమిత్ షా Image copyright Getty Images

మరో 50ఏళ్ల దాకా దేశాన్ని భారతీయ జనతా పార్టీయే పరిపాలిస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. అలాంటి వ్యాఖ్యలు చేసే సాహసం, దూకుడు అమిత్ షా కు మాత్రమే సొంతమని భాజపా నేతలు, విపక్షాలతో పాటు భాజపా మాజీ నేతలు కూడా ఒప్పుకుంటారు.

1980లో భారతీయ జనతా పార్టీ తొలి అధ్యక్షుడిగా ఎన్నికైన వాజ్‌పేయీ నుంచి ఆ తరువాతి 10 మంది అధ్యక్షుల వరకు అందరినీ నేను కలిశాను. పనితీరులో వాళ్లందరితో పోలిస్తే అమిత్‌ షా చాలా భిన్నం.

1998 వరకు పద్దెనిమిదేళ్ల పాటు వాజ్‌పేయీ, ఎల్‌కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషీలే విడతల వారీగా పార్టీ అధ్యక్ష బాధ్యతలు చూసుకున్నారు.

తొలిసారి ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఆరెస్సెస్ మద్దతుతో కుషాభావు ఠాకరే, జన్ కృష్ణమూర్తి, బంగారు లక్ష్మణ్ లాంటి ఆరెస్సెస్ నేతలు పార్టీ అధ్యక్ష పీఠమెక్కారు. దిగ్గజాలు అధికారం చేపట్టి రాజకీయ వ్యవహరాలు చూసుకుంటే, వీళ్లు ఆరెస్సెస్‌కు పార్టీకి మధ్య వారధిలా పనిచేస్తారనే ఉద్దేశంతో ఈ నేతలకు అధ్యక్ష పదవి అప్పగించారు.

నితిన్ గడ్కరీ, రాజ్‌నాథ్‌ సింగ్ లాంటి నేతలు మాత్రం అటు పార్టీ అధ్యక్ష పదవితో పాటు పాలనలోనూ క్రియాశీలకంగా పాలుపంచుకున్నారు. రాజ్‌నాథ్‌ సింగ్ ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగానూ పనిచేశారు. వీళ్లిదరికీ కూడా ఆరెస్సెస్ మద్దతు ఉంది.

Image copyright EPA

కానీ అమిత్ షా వీరికి భిన్నం. అటు ప్రధానమంత్రి నిర్ణయాలను అమలు చేస్తూనే ఇటు సొంత నిర్ణయాలనూ తీసుకుంటారు. మోదీ-అమిత్ షా ద్వయం కారణంగా ఎక్కువ లాభపడింది ఆరెస్సెస్సే. అందుకే ఆరెస్సెస్ కూడా అమిత్ షా నిర్ణయాలకు చాలా విలువిస్తుంది.

భాజపాకు చెందిన ఇద్దరు ప్రముఖ నేతలు వాజ్‌పేయీ, అడ్వాణీలు కూడా తాము అధికారంలో ఉన్న రోజుల్లో ఆరెస్సెస్‌తో కొన్ని విషయాల్లో బహిరంగంగానే విభేదించారు. కానీ, ఇప్పుడు ఎవరైనా నేతలు అసంతృప్తితో ఉన్నా దాన్ని బాహాటంగా బయటపెట్టే పరిస్థితి లేదు. దాదాపు నేతలంతా అమిత్ షాకు భయపడటంతో పాటు పార్టీ మొత్తం ఆయన ఆదేశాలకు అనుగుణంగానే ప్రస్తుతం పనిచేస్తోంది.

వాజ్‌పేయీ, అడ్వాణీల హయాంలో కార్యకర్తలకు వాళ్లపట్ల అమితమైన గౌరవం కనిపించేదే కానీ ఎవరిలోనూ భయం ఉండేది కాదు.

అమిత్ షాను అత్యంత శక్తిమంతమైన భాజపా అధ్యక్షుడిగా భావించొచ్చని ఆ పార్టీకి చెందిన ప్రముఖ నేత ఒకరు వ్యాఖ్యానించారు. ప్రధాని తరువాత పార్టీలో ఆయనను నంబర్ 2 అనుకోవచ్చు. ప్రణాళికలు రచించడంతో పాటు ఎన్నికల ప్రచారంలోనూ ఆయన కీలకపాత్ర పోషిస్తారు.

Image copyright Getty Images

అమిత్ షా నిర్వహించే భారీ ర్యాలీలను గమనిస్తే తనను తాను కేవలం ప్రణాళికలకే పరిమితం చేసుకోకుండా ప్రజా క్షేత్రంలోకీ అడుగుపెడతారని అర్థమవుతుంది. అనేక విషయాల్లో మోదీ ఆయన పైన ఆధారపడటం అమిత్ షా బలం. వీళ్లద్దరి అదృష్టం ఒకరితో ఒకరికి ముడిపడి ఉంది. ఒకరు లేకుండా మరొకరి ప్రయాణం ముందుకు సాగదని కూడా చెప్పొచ్చు.

భాజపా చరిత్రలోనే తొలిసారిగా శక్తి కేంద్రం అధ్యక్షుడి చేతిలో ఉంది. ఆయన్ను సవాలు చేసే మరో శక్తి పార్టీలో లేదు. అమిత్ షా ప్రతి క్షణం పనిచేస్తూనే కనిపిస్తారు. విపక్షాలను ఎలా ఎదుర్కోవాలో కూడా ఆయనకు బాగా తెలుసు.

మిత్రపక్షాలకు అవసరమైనప్పుడు ఆర్థిక సహాయం చేయడం అమిత్‌ షా నైజం. రాజకీయ విస్తరణలు, కార్యకర్తల కోసం ఖర్చు చేయడానికీ డబ్బుకు కొదవలేదు. ఇలాంటి ‘ఆర్థిక రాజకీయాలను’ భాజపాలోకి తీసుకొచ్చిన ఘనత అమిత్‌ షాకే ఇవ్వాలి.

అమిత్ షాతో విరోధం పెంచుకుంటే ఇన్‌కం ట్యాక్స్‌, ఈడీ అధికారులతో దమ్కీ ఇప్పిస్తారని విపక్షాలు ఆరోపిస్తాయి.

Image copyright EPA

ఎంత శక్తిమంతమైన వ్యక్తి అయినా ఒక్కోసారి విఫలమవుతారని, అలాంటి సమయంలో డబ్బు, అధికారం ఆదుకోవని కర్ణాటక పరిస్థితి చూస్తే అర్థమవుతుంది. అక్కడ భాజపాకు ఎక్కువ సీట్లు వచ్చినప్పటికీ కాంగ్రెస్, జేడీఎస్‌లు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.

దేశంలో ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం స్థిమితంగా లేదు. మోదీ ప్రభుత్వ వాగ్దానాలు పూర్తిగా నెరవేరలేదు. ఈ నేపథ్యంలో 2019 ఎన్నికల తరువాత కూడా ‘మోదీ ప్రయోగాలు’ కొనసాగేలా చేయడం అమిత్ షా ముందున్న అతిపెద్ద సవాలు.

చిన్న పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులను బరిలో దించి విపక్షాల ఓట్లను చీల్చడం అమిత్ షాకు బాగా తెలుసు. 2014లో ఆ ప్రణాళికను అమలు చేసి విజయం సాధించారు. 31శాతం ఓట్లే వచ్చినా మెజారిటీ సాధించి భాజపాను అధికార పీఠం ఎక్కించారు.

(ఈ వ్యాసంలోవి రచయిత వ్యక్తిగత అభిప్రాయాలు)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)