ఈ గణేశుడు... చేపలకు స్నేహితుడు

  • 14 సెప్టెంబర్ 2018
గణపతి విగ్రహం Image copyright Getty Images

ప్రతి సంవత్సరం వినాయక చవితి సందర్భంగా పర్యావరణ హిత గణపతి విగ్రహాల ప్రస్తావన వస్తుంది.

ముంబయికి చెందిన ‘స్ప్రౌట్’ అనే సంస్థ ఏటా వినాయక చవితి సమయంలో ప్రత్యేకమైన గణపతి బొమ్మలను తయారు చేస్తోంది. చేపల ఆహారాన్ని ఆ బొమ్మల్లో పెడుతోంది. బొమ్మను నిమజ్జనం చేశాక, చేపలు వాటిలోని ఆహారాన్ని తింటాయన్నది వారి ఆలోచన.

ఈ బొమ్మల తయారీలో ఆరేళ్లుగా ఔత్సాహికులకు శిక్షణ కూడా ఇస్తోంది.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: 'ఫిష్ ఫ్రెండ్లీ' గణపతిని ఎలా తయారు చేస్తారో చూడండి

‘కొన్నేళ్ల క్రితం గణపతి బొమ్మల తయారీకి సహజమైన రంగుల్ని వాడాం. కానీ, అవి కూడా సముద్ర జీవులకు నష్టం కలిగిస్తాయని గుర్తించాం. అందుకే చేపల కోసం ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నాం.

చాలామంది చేపల కోసం అక్వేరియంలో ఆహారం జల్లుతుంటారు. అలాంటి ఆహారాన్నే గణపతి బొమ్మలో పెడితే చేపలు వాటిని తింటాయని భావించాం. ఆ ఆలోచనతోనే ఈ గణపతి బొమ్మల తయారీ ప్రారంభించాం’ అని వివరిస్తారు స్ప్రౌట్ సంస్థ డైరెక్టర్ ఆనంద్ పెందార్కర్.

‘మొదట అచ్చులో మట్టి ముద్దను పెడతాం. దాన్ని బయటకు తీసే సమయంలో గణపతి రూపం ఏర్పడుతుంది. ఆ బొమ్మ కింది భాగంలో కొంత మట్టిని తొలగిస్తాం. ఆ తరువాత బొమ్మకు తుది మెరుగులు దిద్ది 8-10రోజుల పాటు ఎండ పెడతాం. తరువాత శాండ్ పేపర్‌తో పాలిష్ చేస్తాం.

మొదట తెల్లటి కోటింగ్ వేసి, పసుపు, కుంకుమ, ముల్తానీ మట్టి లాంటి సహజరంగుల్ని అద్దుతాం. రంగులు ఎండిపోయాక బొమ్మ లోపల చేపల ఆహారం పెట్టి కాగితంతో సీలు వేస్తాం. బొమ్మను నిమజ్జనం చేసే సమయంలో ఆ కాగితాన్ని తొలగించాలి. బొమ్మ కరిగే కొద్దీ బయటకు వచ్చే ఆహారాన్ని చేపలు తింటాయి’ అని ఆయన తెలిపారు.

ఆ బొమ్మల్ని ఎలా తయారు చేస్తారో పై వీడియోలో చూడొచ్చు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)