ఆనందం కోసం 'సెక్స్'ను ఆశ్రయించకుండా మహిళలు నిగ్రహం పాటించాలని గాంధీ ఎందుకన్నారు?

  • సౌతిక్ బిశ్వాస్
  • బీబీసీ ప్రతినిధి
మను, అభాలతో గాంధీజీ
ఫొటో క్యాప్షన్,

మను, అభాలతో గాంధీజీ

సత్యంతో ప్రయోగాలు చేసిన గాంధీకి సెక్స్‌ విషయంలోనూ తనవైన నిశ్చితాభిప్రాయాలు ఉన్నాయి. ఆయన పదమూడేళ్లకే పెళ్లి చేసుకున్నారు. నలుగురు పిల్లలు పుట్టిన తరువాత 38 ఏళ్ల వయసులోనే బ్రహ్మచర్యం స్వీకరించారు. తాను లైంగిక వాంఛను జయించానో లేదో తెలుసుకోవడానికి తనకు తాను పరీక్షలు పెట్టుకున్నారు.

గాంధీజీకి కృత్రిమ గర్భనిరోధక విధానాల పట్ల అభ్యంతరాలు ఉండేవి. ఆ కాలంలో ప్రగతిశీల ఆలోచనలనే కలిగి ఉన్నప్పటికీ కృత్రిమ గర్భనిరోధక పద్ధతులను మాత్రం ఆయన ఆమోదించలేదు.

అదేసమయంలో ఆయన మహిళా సాధికారితకు ఆనాడే బాటలు వేశారు. ఆయన చేపట్టే ఉద్యమాల్లో మహిళలను భాగస్వాములను చేసేవారు.

ఫొటో క్యాప్షన్,

మార్గరెట్ సాంగెర్

అమెరికాకు చెందిన కుటుంబ నియంత్రణ కార్యకర్త మార్గరెట్ సాంగెర్ 1935 డిసెంబర్‌లో భారత్ వచ్చారు. భారత్‌లో 18 నగరాల పర్యటనకు వచ్చిన ఆమె మహాత్మా గాంధీనీ కలిశారు. ఆ సందర్భంగా ఆమె గాంధీతో అనేక అంశాలపై లోతైన సంభాషణలు జరిపారు.

మహారాష్ట్రలోని గాంధీ ఆశ్రమంలో వారిద్దరూ భేటీ అయ్యారు. ఆ సందర్భంగా వారిద్దరూ మాట్లాడుకున్న పలు అంశాలను చరిత్రకారుడు రామచంద్ర గుహ తాను సరికొత్తగా ఆవిష్కరించిన జాతిపిత జీవిత చరిత్రలో పొందుపరిచారు.

మునుపెన్నడూ ఎవరూ ప్రస్తావించని 60 విభిన్న ఆధారాల ప్రాతిపదికగా లిఖించిన ఈ 1,129 పేజీల పుస్తకం ప్రపంచంలోని అత్యంత గొప్ప అహింసావాది అయిన గాంధీ జీవితంలోని బహుముఖ కోణాలను పాఠకుల ముందుంచింది.

1915లో దక్షిణాఫ్రికా నుంచి వచ్చినప్పటి నుంచి 1948లో హత్యకు గురైనంత వరకు ఆయన జీవితాన్ని ఈ పుస్తకం ఆవిష్కరించింది.

మహిళల హక్కులు, సెక్స్, బ్రహ్మచర్యంపై గాంధీ అభిప్రాయాలనూ ఈ జీవిత కథలో స్పృశించారు.

మార్గరెట్‌తో గాంధీ సంభాషణలను ఆశ్రమంలోని గాంధీ సహాయకుడు మహదేవ్ దేశాయ్ కొంచెం కూడా పొల్లు పోకుండా అక్షరబద్ధం చేయగా వాటికి గుహ తన పుస్తకంలో స్థానం కల్పించారు.

పిల్లలను కనడానికే సెక్స్

''మహిళలు స్వేచ్ఛ పొందాలని మార్గరెట్, మహాత్మా గాంధీ ఇద్దరూ ఏకాభిప్రాయం వ్యక్తంచేశారు. అంతేకాదు, మహిళలు తమ లక్ష్యాన్ని తామే నిర్ణయించుకోవాలని కూడా అభిప్రాయపడ్డారు'' అని రామచంద్ర గుహ తన పుస్తకంలో రాశారు.

కానీ, వారిద్దరి మధ్య అంతలోనే అభిప్రాయ భేదాలు తలెత్తాయట.

1916లో న్యూయార్క్‌లో మొట్టమొదటి కుటుంబ నియంత్రణ కేంద్రాన్ని ప్రారంభించిన మార్గరెట్.. గర్భనిరోధక పద్ధతులే మహిళలకు స్వేచ్ఛను కల్పిస్తాయని అభిప్రాయపడగా, గాంధీ ఆమెతో విభేదించారు. మహిళలు తమ భర్తలను అదుపులో ఉంచగలగాలని, అలాగే పురుషులు కూడా తమ పశువాంఛను తగ్గించుకోవాలని అభిప్రాయపడ్డారు.

అంతేకాదు, శృంగారం అసలు ఉద్దేశం పునరుత్పత్తి మాత్రమేనని గాంధీ మార్గరెట్‌తో చెప్పారు.

దీనికి మార్గరెట్, ''ఆడవాళ్లకీ మగవాళ్లతో సమానంగా శృంగార భావనలుంటాయి. భర్తలు వాంఛించినట్లే భార్యలూ సంగమాన్ని కోరుకునే సందర్భాలుంటాయి'' అని కుండబద్ధలు కొట్టారట.

''ప్రేమలో ఉన్న ఒక జంట, కలిసి ఆనందంగా జీవిస్తున్న ఒక జంట రెండేళ్లలో కేవలం ఒక్కసారే శృంగారంలో పాల్గొనేలా నియంత్రించుకోగలరని అనుకుంటున్నారా? అలా అయితే, సంతానాన్ని కనాలని అనుకున్నప్పుడు మాత్రమే వారి మధ్య శారీరక బంధం ఉంటుందా?'' అని ఆమె ప్రశ్నించారు.

ఇలాంటి సమయంలోనే గర్భనిరోధక పద్ధతుల అవసరం కనిపిస్తుందని మార్గరెట్ చెప్పుకొస్తారు ఆ సంభాషణల్లో. గర్భనిరోధక సాధనాలు ఉపయోగిస్తే అవసరం లేనప్పుడు గర్భం ధరించకుండా చూసుకోవచ్చని, అప్పుడు మహిళలకు వారి శరీరంపై వారికి నియంత్రణ ఉంటుందని మార్గరెట్ వాదించగా.. గాంధీ మాత్రం తన అభిప్రాయానికే కట్టుబడి ఉన్నారట.

‘మా బంధం ఆధ్యాత్మికం’

సెక్స్ అనేది ప్రగాఢ లైంగిక వాంఛ అని చెబుతూనే గాంధీ తన భార్య కస్తూర్బాతో వైవాహిక జీవితం గురించీ చెప్పుకొస్తారు. శారీరక సుఖాలను తాను త్యజించిన తరువాత తమ ఇద్దరి మధ్య బంధం ఆధ్యాత్మికంగా మారిపోయిందని గాంధీ అంటారు.

గాంధీకి 13 ఏళ్ల వయసులో వివాహమైంది. నలుగురు పిల్లలను కన్నాక 38 ఏళ్ల వయసులో ఆయన బ్రహ్మచర్యం పాటించాలని నిర్ణయించుకున్నారు. జైన సన్యాసి రాయ్‌చంద్ భాయి, రష్యా రచయిత లియో టాల్‌స్టాయ్‌ల స్ఫూర్తితో గాంధీ ఈ నిర్ణయం తీసుకున్నారు. టాల్‌స్టాయ్ కూడా సగం జీవితం పూర్తయ్యాక బ్రహ్మచర్యం పాటించడం మొదలుపెట్టారు.

గాంధీ తన ఆత్మకథలో ఒక చోట, తన తండ్రి మరణించిన సమయంలోనూ భార్యతో శృంగారంలో పాల్గొన్నట్లు ఆలోచనలు రావడంపై పశ్చాత్తాప పడినట్లు రాసుకొస్తారు.

మార్గరెట్‌తో సంభాషణలు ముగిసిన తరువాత గాంధీ కాస్త మెత్తబడతారు.

పురుషుల స్వచ్ఛందంగా కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకోవడంపై తనకెలాంటి అభ్యంతరాలు లేవని గాంధీ చెబుతారు. అయితే... గర్భనిరోధక పద్ధతులు పాటించేకంటే రుతు చక్రం ఆధారంగా సురక్షిత సమయంలో దంపతులు శృంగారంలో పాల్గొంటే సరిపోతుంది కదా అన్నది గాంధీ అభిప్రాయం.

మొత్తానికి గాంధీ అభిప్రాయాలతో ఏకీభవించకుండానే మార్గరెట్ ఆ ఆశ్రమం నుంచి వెళ్తుంది.

అంతేకాదు, ఆమె ప్రచార కార్యక్రమానికి గాంధీ మద్దతు పలకకపోవడంపై అసంతృప్తికి లోనవుతుంది.

అయితే.. ఇలా కృత్రిమ గర్భనిరోధక పద్ధతులకు వ్యతిరేకంగా బాహాటంగా మాట్లాడడం గాంధీకి అదే తొలిసారి కాదు. 1934లో ఒక భారతీయ మహిళా హక్కుల కార్యకర్త స్వీయనియంత్రణ తరువాత కృత్రిమ గర్భనిరోధక పద్ధతులే మంచివా అని ప్రశ్నించినప్పుడు ఆయన.. ''భర్తలను నియంత్రించడమెలాగో భార్యలు నేర్చుకోవాలి. పాశ్చాత్యుల్లా కృత్రిమ గర్భనిరోధక పద్ధతులను ఆశ్రయిస్తే భయంకరమైన ఫలితాలు తప్పవు. ఆడామగా సెక్స్ కోసమే బతకడం ప్రారంభిస్తారు'' అని సమాధానమిచ్చారు.

రామచంద్ర గుహ తాజాగా రాసిన గాంధీ జీవిత చరిత్ర 'గాంధీ: ది ఇయర్స్ దట్ చేంజ్డ్ ది వరల్డ్, 1914-1948' పుస్తకంలోనూ సెక్స్ పట్ల గాంధీ అభిప్రాయాలను ప్రస్తావించారు.

‘వాంఛను జయించగలిగానా లేదా?’

భారత్‌కు స్వాతంత్ర్యం రావడానికి కొద్ది నెలల ముందు బెంగాల్‌లోని దక్షిణ నొయాఖాళీ జిల్లాలో హిందూ-ముస్లిం అల్లర్లు తలెత్తిన సమయంలో గాంధీ ఒక వివాదాస్పద ప్రయోగం చేశారు. తన మనమరాలు, దైవారాధకురాలు అయిన మను గాంధీని తనతో కలిసి మంచంపై పడుకోమని కోరుతారు.

''అప్పట్లో గాంధీ లైంగికవాంఛను జయించానో లేదో తెలుసుకోవడానికి స్వయంగా ఈ పరీక్ష పెట్టుకున్నారు'' అని గుహ తన పుస్తకంలో రాశారు.

కానీ, ఆయన జీవితకథ ప్రకారం.. ''మత హింస పెరిగిపోవడానికి, తాను బ్రహ్మచారిగా విఫలం కావడానికి సంబంధం ఉంది'' అని గాంధీ అనుకునేవారట. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించే సమయంలో హిందూ, ముస్లింల మధ్య ఘర్షణలు జరగడంతో నిత్యం మతసామరస్యాన్ని ప్రబోధించే ఆయన ఆందోళన చెందారు.

''తనలోని లోపాలే ఇలాంటి పరిణామాలకు దారితీశాయని గాంధీ ఒక అభిప్రాయానికి వచ్చారు' అని గుహ తన పుస్తకంలో రాశారు.

గాంధీ తన సహచరులకు తాను చేస్తున్న ప్రయోగం గురించి చెప్పినప్పుడు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆ ప్రయోగం అతని ప్రతిష్ఠను దెబ్బతీస్తుందని, అలాంటి ప్రయోగాలను మానుకోమని వారంతా సూచించారట. ఒక సహచరుడైతే ఆయన ప్రయోగాలను నిరసిస్తూ ఆయనతో పనిచేయడం మానేశారట.

అప్పటికి నలభై ఏళ్లుగా బ్రహ్మచర్యం పాటిస్తున్న గాంధీ ''తన 'అవిచ్ఛిన్న భారత్' కల నాశనమవుతుంటే చూడలేక సమాజంలోని లోపాలకు ఆ సమాజాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్న తనలోని లోపాలే కారణమని ఆపాదించుకున్నారు.

గాంధీని అమితంగా ఆరాధించే ఆయన సన్నిహితుడొకరు అనంతర కాలంలో.. గాంధీ స్వీయ క్రమశిక్షణ కోసం అత్యంత కఠిన నియమాలు పాటించేవారని ఓ పుస్తకంలో రాశారు.

చరిత్రకారుడు ప్యాట్రిక్ ఫ్రెంచ్ కూడా.. గాంధీ సంప్రదాయేతర భావాల్లో కొన్నింటికి హిందూ తత్వశాస్త్ర మూలాలున్నప్పటికీ ఆరోగ్యం, ఆహారం, సామాజిక జీవనం విషయంలో విక్టోరియన్ కాలానికి చెందినవారిలా అనిపిస్తారని అభిప్రాయపడ్డారు.

అలాగే.. మహిళల విషయంలో గాంధీ వైఖరి కూడా సంక్లిష్టంగా, వివాదాస్పదంగా ఉండేది.

పురుషుడిని ఆకర్షించేలా మహిళలు తయారుకావడాన్ని గాంధీ ఇష్టపడేవారు కాదు. మహిళలు ఆధునిక దుస్తులు ధరించడం, ఆధునిక హెయిర్‌స్టైల్స్‌లో కనిపించడాన్ని కూడా ఆయన ఇష్టపడేవారు కాదని గుహ తన పుస్తకంలో రాశారు.

అదేసమయంలో గాంధీ ముస్లిం మహిళలు బురఖా ధరించడంపై, ''అది వారి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. వారికి పీల్చుకోవడానికి సరిపడా గాలి దొరకదు, ముఖంపై వెలుగు పడదు'' అని తన అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు.

మహిళా సాధికారతకు మార్గదర్శి

మహిళలు పురుషులతో సమానమని గాంధీ నమ్మేవారు. వారు తమ హక్కులను పొందాలని కోరుకునేవారు.

దక్షిణాఫ్రికాలో గాంధీ చేపట్టిన రాజకీయ, సామాజిక ఉద్యమాల్లో మహిళలు పాల్గొన్నారు. పాశ్చాత్య దేశాల్లో మహిళా నేతలు వేళ్ల మీద లెక్కపెట్టే సంఖ్యలో మాత్రమే ఉన్న సమయంలో గాంధీజి కాంగ్రెస్ పార్టీకి సరోజినీ నాయుడిని నాయకురాలిగా చేశారు. మద్యం దుకాణాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేయాలని మహిళలకు ఆయన పిలుపునిచ్చారు. ఆయన చేపట్టిన ఉప్పు సత్యాగ్రహంలోనూ లెక్కలేనంత మంది మహిళలు పాల్గొన్నారు.

ప్రస్తుత కాలం ప్రకారం చూసుకుంటే గాంధీని సంప్రదాయవాది అనాలి.. ఆయన కాలంలో మాత్రం నిస్సందేహంగా అవి ప్రగతిశీల భావాలే.

గాంధీ చూపిన దారి... 1947లో భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలోనే దేశంలో ఒక మహిళా గవర్నర్, ఒక కేంద్ర మంత్రిని నియమించేలా చేసింది. లక్షలాది మంది శరణార్థులకు పునరావాసం కల్పించే పనిని శక్తిమంతమైన మహిళల బృందానికి అప్పగించారు. అమెరికాలోని విశ్వవిద్యాలయాలు మహిళా అధ్యక్షులను నియమించడానికి దశాబ్దాల ముందే భారత్‌లో ఒక ప్రముఖ విశ్వవిద్యాలయానికి వైస్ చాన్సలర్‌గా మహిళను నియమించారు.

1940, 1950 ప్రాంతాల్లోనే భారత్‌లో మహిళలు ప్రజాజీవితంలో ప్రముఖంగా ఉండేవారు. సత్యంతో ఆయన అసాధారణ ప్రయోగాలను పక్కన పెడితే మహిళా సాధికారితను గాంధీజీ సాధించిన గొప్ప విజయాల్లో ఒకటిగా చెప్పుకోక తప్పదు అని రామచంద్ర గుహ తన పుస్తకంలో ముక్తాయించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)