అభిప్రాయం: 2019 ఎన్నికల దిశగా బీజేపీ కుల సమీకరణలు ఎలా ఉండబోతున్నాయి?

  • 15 సెప్టెంబర్ 2018
బీజేపీ సోషల్ ఇంజినీరింగ్ Image copyright Getty Images

భారతీయ జనతా పార్టీ తనకు ప్రధాన బలమైన అగ్ర కులాలతోపాటూ వెనుకబడిన కులాలను కూడా సమీకరిస్తోంది. ఎస్సీ, ఎస్టీల్లో ఒక వర్గాన్ని తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది. బీజేపీ సోషల్ ఇంజినీరింగ్-2.0 ఇదే కాబోతోంది.

ఇప్పుడు ఒక విషయం దాదాపు స్పష్టమైంది. ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే ఎన్నికలు తన పదవీకాలానికి రెఫరెండం కావాలని కోరుకోవడం లేదు. అందుకే 2014 ఎన్నికల మ్యానిఫెస్టోలో ఉన్న హామీల గురించి, అవి ఏమయ్యాయనే విషయం గురించి బీజేపీ చర్చించడం లేదు..

2014లో బీజేపీ మ్యానిఫెస్టోలో, ఆ పార్టీ ప్రచారంలో నరేంద్ర మోదీ హామీలు ఈసారీ ప్రతిపక్షాలకు ప్రచారాంశాలుగా మారాయి. అధిక ధరలు, ఉపాధి, అభివృద్ధి అంశాల గురించి బీజేపీ ఇప్పుడు పెద్దగా చెప్పడం లేదు. ఆ పార్టీ ఇప్పుడు 2024లో తన లక్ష్యాల గురించే మాట్లాడుతోంది.

Image copyright Getty Images

ఓబీసీని బ్యాలెన్స్ చేసే ప్రయత్నం

నరేంద్ర మోదీ తన పదవీకాలం ఆఖరి ఏడాదిలో రాజకీయాలు చేస్తానని అన్నారు. ఆ ఆఖరి ఏడాది మే నుంచే ప్రారంభమైంది.

అంటే, ఆయన చెప్పినదాని ప్రకారం గత నాలుగు నెలలుగా ఆయన ఏది చేసినా, దానిని ఎన్నికల దృష్టితోనే చూడాల్సి ఉంటుంది.

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం సామాజిక కోణంలో ఎన్నో చర్యలు తీసుకుంటోంది. వాటిని కాస్త పరిశీలనగా గమనిస్తే, బీజేపీ 2019 వ్యూహం ఏంటో తెలుసుకోవడం సులభం అవుతుంది.

ప్రస్తుతం, లేదంటే కాస్త ముందు బీజేపీ చేసిన భారీ ప్రకటనలు, లేదా ఆ పార్టీ తీసుకున్న కీలక చర్యల్లో మూడు ఓబీసీని లక్ష్యంగా చేసుకునే జరిగాయి.

వాటిలో మొదటిది ఓబీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా ఇవ్వడం. రెండోది ఓబీసీలను రెండు లేదా అంతకంటే ఎక్కువ భాగాలుగా విభజించడం, దానికోసం నియమించిన రోహిణి కమిషన్ పదవీకాలం నవంబర్ వరకూ పొడిగించడం. ఇక మూడోది 2021 జనాభా లెక్కల్లో ఓబీసీలను కూడా లెక్కించడం.

Image copyright Getty Images

ఎస్సీ-ఎస్టీ యాక్ట్ బలహీనం చేసిన ప్రభుత్వం

ఎస్సీ-ఎస్టీ యాక్ట్‌ లక్ష్యంగా కేంద్రం రెండు చర్యలు చేపట్టింది. వీటిలో ఒకటి ఎస్సీ-ఎస్టీ చట్టాన్ని దాని అసలు రూపంలో పునరుద్ధరించడం, దీన్ని మార్చాలనే సుప్రీంకోర్టు నిర్ణయాన్ని పనికిరాకుండా చేయడం. ఇక రెండవది ప్రమోషన్లలో రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో నడుస్తున్న ఎస్సీ-ఎస్టీ కేసులపై వాదించడం.

ఇక్కడ గమనిస్తే, ఎస్సీ-ఎస్టీ యాక్ట్‌ను అసలు రూపంలో పునరుద్ధరించడం మినహా మిగతా నాలుగు నిర్ణయాలను బీజేపీ తమ పాలనలో మొదటి సంవత్సరాల్లోనే చేసి ఉండవచ్చు. కానీ ఈ నిర్ణయాలు ఎప్పుడు తీసుకోవాలో ప్రభుత్వం ఒక టైం ఎంచుకుంది. తమ పాలనలో నాలుగో ఏడాది వీటిని చేయాలని అభిప్రాయపడింది.

ఎస్సీ-ఎస్టీ యాక్ట్ కేసును ఇక్కడిదాకా తెచ్చింది కూడా ప్రభుత్వమే. లేదంటే 1989 నుంచి నడుస్తున్న ఈ యాక్ట్ గురించి ఇంత హంగామా ఎప్పుడూ జరగలేదు. ఈ యాక్ట్‌కు సంబంధించిన ఒక కేసులో సుప్రీంకోర్టు కేంద్రం ఉద్దేశం తెలుసుకోవాలనుకున్నప్పుడు ప్రభుత్వం తరఫున కోర్టుకు హాజరైన వకీల్ అడిషనల్ సొలిసిటర్ జనరల్ మనిందర్ సింగ్ ఈ యాక్ట్ ను బలహీన పరచడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేశారు.

యాక్ట్ దుర్వినియోగం అవుతోందని, ఎవరికి వ్యతిరేకంగా ఇది దుర్వినియోగం అవుతోందో వారికి అండగా నిలిచేందుకు ప్రభుత్వం ఏదీ చేయలేదని, వారికి ముందస్తు బెయిల్ ఇవ్వవచ్చని ప్రభుత్వం భావించింది. దీని ఆధారంగానే సుప్రీంకోర్టు తన తీర్పు వెలువరించింది.

ఈ తీర్పుకు వ్యతిరేకంగా ఏప్రిల్ 2న భారత్ బంద్ జరగడంతో ప్రభుత్వం లెక్కలు ఫెయిల్ అయ్యాయి. ఆ తీర్పును తటస్థంగా ఉంచడం తప్ప ప్రభుత్వం దగ్గర వేరే అవకాశం లేకుండా పోయింది.

Image copyright Getty Images

ప్రమోషన్లలో రిజర్వేషన్ అవకాశాలు తక్కువ

ప్రమోషన్లలో రిజర్వేషన్ల గురించి కేంద్ర ప్రభుత్వం మాట్లాడుతూనే ఉంటుంది. కానీ బీజేపీ తమ ఐదేళ్ల అధికారంలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు, అధికారులు ఎవరికీ రిజర్వేషన్ ఆధారంగా ప్రమోషన్ రాకుండా చూసుకుంటుంది.

అయినా ఎన్నికలు అనుకున్నట్టు జరిగితే, వచ్చే ఏడాది మార్చికి దగ్గర్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుంది. అంటే, మరో ఆరు నెలల్లో ప్రమోషన్లలో రిజర్వేషన్లపై ఎస్సీ-ఎస్టీలకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చి, ప్రభుత్వం దానిని అమలు చేసే అవకాశాలు చాలా తక్కువే.

అయినా అంత మాత్రాన ఎస్సీ-ఎస్టీల ఆగ్రహం చల్లార్చగలమని బీజేపీ అసలు అనుకోవడం లేదు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి క్షేత్రస్థాయిలో దళితులు, ఆదివాసీల ఆగ్రహం ఎన్నోరకాలుగా బయటపడుతూ వచ్చింది.

రోహిత్ వేముల నుంచి ఉనా, డెల్టా మేఘ్వాల్ నుంచి సహరాన్ పూర్ వరకూ ఈ ఆగ్రహం వీధుల్లో కనిపించింది. ఆదివాసీల పత్థల్ గడీ ఉద్యమంపై పోలీసులు కఠినంగా వ్యవహరించడంపై కూడా ఆగ్రహం వెల్లువెత్తింది. దళితులు-ఆదివాసీలు తమపై అంత కోపంగా ఉండడాన్ని, వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాలు వారి నుంచి అభ్యర్థిని నిలబెట్టాలని బీజేపీ ఎప్పటికీ కోరుకోదు.

Image copyright Getty Images

ఎస్సీ-ఎస్టీలను నిర్లక్ష్యం చేస్తే కష్టమేనా?

ముస్లింలు బీజేపీ వ్యతిరేకవాదాన్ని అమలు చేసినంతకాలం ఆ పార్టీకి ఎలాంటి సమస్యా రాదు. అక్కడ లెక్కలు బీజేపీ వైపే ఉంటాయి. కానీ ఏదైనా సామాజిక శక్తి బీజేపీకి వ్యతిరేకంగా గళమెత్తితే, అది ఆ పార్టీకి చాలా సమస్యలు తెచ్చిపెడుతుంది.

దేశంలో 25.2 శాతం మంది ఎస్సీ-ఎస్టీ ఓటర్లు ఉన్నారు. ముస్లింల తర్వాత ఈ సముదాయాల్లో కూడా బీజేపీపై ఆగ్రహం తలెత్తితే, భ్రమలు తొలిగిపోతే ఆ పార్టీ ప్రమాదంలో పడిపోతుంది. అందుకే ఎస్సీ-ఎస్టీలు పూర్తిగా కాకపోయినా, వారిలోని ఒక పెద్ద భాగం తమ వెంట ఉంచుకోడానికి, బీజేపీ చివరి వరకూ ప్రయత్నిస్తుంది.

కానీ, అది బీజేపీ కోరిక. అలా జరగాలనేం లేదు. ఒకవేళ, అదే నిజమైతే, బీజేపీ ఎలాంటి వ్యూహం అనుసరిస్తుంది.

దానికోసం బీజేపీ ఒక కొత్త రకం సోషల్ ఇంజినీరింగ్‌ వ్యూహం అమలు చేసే పనిలో ఉంది.

దాని గురించి చెప్పుకునే ముందు, అసలు సోషల్ ఇంజినీరింగ్ అంటే ఏంటి? బీజేపీ దానిపై ఎలా పనిచేసింది? తెలుసుకోవడం చాలా అవసరం. సోషల్ ఇంజినీరింగ్ అంటే, అది నిజానికి రాజకీయ శాస్త్రంలో ఉపయోగించి ఒక మాట. దీని ద్వారా ప్రభుత్వం లేదా మీడియా లేదా సమాజాలు ప్రజల ఆలోచనలు, లేదా సామాజిక ప్రవర్తనను భారీ స్థాయిలో మార్చేందుకు ప్రయత్నిస్తాయి.

Image copyright SHANTI BHUSHAN
చిత్రం శీర్షిక రామ్‌లీలా మైదానంలో జయప్రకాశ్ నారాయణ్ ర్యాలీ

బీజేపీని ఈ స్థాయికి చేర్చిన 'సోషల్ ఇంజినీరింగ్'

కానీ, భారతదేశంలో ఈ సోషల్ ఇంజినీరింగ్‌ వ్యూహాన్ని బీజేపీ ప్రస్తుత జనరల్ సెక్రటరీ గోవిందాచార్య పార్టీ కార్యకర్తలను పెంచడానికి, కొత్త సామాజిక వర్గాల మద్దతు కూడగట్టడానికి 80వ, 90వ దశకాల్లోనే అమలు చేశారు.

బీజేపీ ఇప్పుడు ఈ స్థాయికి చేరుకోడానికి, ఇంత పెద్ద పార్టీ కావడం వెనుక ఆ సోషల్ ఇంజినీరింగ్ సాయం చాలా ఉంది.

జన్‌సంఘ్ లేదా బీజేపీ చాలాకాలం నుంచీ భారతదేశ రాజకీయాల్లో ఉంది. దీన్ని ప్రధానంగా ఉత్తర భారత బ్రాహ్మణులు, వైశ్యుల పార్టీగా భావించేవారు. అయితే వేరే ఏ పార్టీ వెంట ఉండని కొన్ని సామాజిక వర్గాలు కూడా బీజేపీతో ఉండేవి.

కానీ జన్‌సంఘ్ కోర్‌లో బ్రాహ్మణులు, వైశ్యులే ఉండేవారు. ఆ సమయంలో బ్రాహ్మణులకు తమది అనుకునేలా కాంగ్రెస్ పార్టీ ఉండేది. దాంతో బీజేపీలో సామాజిక సంతులనం చాలా తక్కువుండేది. ఆ పార్టీలో ఉండే వైశ్యుల్లో దేశ విభజన తర్వాత పాకిస్తాన్ నుంచి వచ్చిన వారే ఉండేవారు.

1977 వరకూ భారతదేశ రాజకీయాల్లో కాంగ్రెస్, కమ్యూనిస్ట్ సమాజ్ వాదీ తర్వాత జన్ సంఘ్ నాలుగో స్థానంలో ఉండేది. లోహియా కాంగ్రెసేతర వాదం ఆ పార్టీ జాతీయరాజకీయాల్లోకి అడుగు పెట్టేలా చేసింది. జయప్రకాశ్ ఉద్యమంతో ఆయన తన బలం మరింత పెంచుకున్నారు.

జన్ సంఘ్ 1977లో కేంద్ర ప్రభుత్వంలో కూడా భాగమైంది. కానీ దాని స్థితి అంతంతమాత్రంగానే ఉండేది. అప్పుడే జన్ సంఘ్ బ్రాహ్మణ-వైశ్యుల పార్టీ అనే తన ట్యాగ్ తొలగించుకుంది. జనతా పార్టీలో విలీనం అయిన జన్ సంఘ్ దాని నుంచి విడిపోయినప్పుడు బీజేపీగా ఆవిర్భవించింది. 1984 ఎన్నికల్లో కాంగ్రెస్ జోరులో బీజేపీ కేవలం రెండు లోక్ సభ సీట్లే గెలుచుకోగలిగింది.

Image copyright Getty Images

రాజకీయాల్లో బీజేపీ ఎలా ఎదిగింది?

1986 తర్వాత ప్రారంభమైన రామమందిరం ఉద్యమంతో బీజేపీకి రాజకీయంగా ఒక పెద్ద ఊపు వచ్చింది. అదే సమయంలో బీజేపీ తన పాత ఇమేజ్‌ను దాటుకుని ముందుకెళ్లింది, ముఖ్యంగా వివిధ ప్రాంతాల్లో బ్రాహ్మణేతర, వైశ్యేతర నేతృత్వాలను ప్రేరేపించడం మొదలు పెట్టింది.

సరిగ్గా అదే సమయంలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కొక్కరుగా నేతలు ఆవిర్భవించారు. ఉత్తర్ ప్రదేశ్‌లో కల్యాణ్ సింగ్, ఓం ప్రకాష్ సింగ్, వినయ్ కతియార్ తెరపైకి వస్తే, మధ్యప్రదేశ్‌లో శివరాజ్ సింగ్ చౌహాన్, ఉమాభారతి, బాబూలాల్ గౌర్ కనిపించారు. బీహార్‌లో సుశీల్ మోదీ, హుకుమ్ దేవ్, నారాయణ్ యాదవ్, జార్ఖండ్‌లో బాబూలాల్ మరాండీ, అర్జున్ ముండా పార్టీ నాయకులయ్యారు.

స్వయంగా మోదీ కూడా అదే సమయంలో వెలుగులోకి వచ్చారు. గుజరాత్‌లో కేశూభాయ్ పటేల్ బీజేపీ నాయకుడైతే, రాజస్థాన్‌లో వసుంధరా రాజే పార్టీని నేతృత్వం వహించారు. ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో సామాజిక వర్గాలకు చెందిన నాయకులను వెలుగులోకి తీసుకొచ్చిన ఆ వ్యూహాన్నే సోషల్ ఇంజనీరింగ్ అంటారు.

2019లో బీజేపీ సోషల్ ఇంజినీరింగ్ ఎలా ఉంటుంది అనేదే ఇప్పుడు ప్రశ్న?

దీని గురించి ఒక అంచనా వేయడానికి వాస్తవాల పేరిట ఇటీవల బీజేపీ ప్రభుత్వం చేపట్టిన చర్యలనే తీసుకుందాం. బీజేపీ 2019లో ఓబీసీని తమ వైపు తిప్పుకోడానికి పూర్తి ప్రయత్నాలు చేస్తుందనేది మాత్రం స్పష్టం అవుతోంది.

ఓబీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా ఇచ్చిన బీజేపీ, ఏళ్లనుంచీ ఉన్న ఆ డిమాండును పూర్తి చేసింది. ఇది లాంఛనమే. దీనివల్ల ఓబీసీకి ఎలాంటి ప్రయోజనం అనేది ఉండదు. కానీ ఓబీసీలు దీనిని ఒక ఎమోషనల్ అంశంగా భావిస్తూ వచ్చారు.

అదే విధంగా జనాభాలెక్కల్లో ఎస్సీ-ఎస్టీ లాంటి మిగతా కులాలను లెక్కించి వారికి సంబందించిన గణాంకాలు కూడా సేకరించాలని ఓబీసీలు చాలా కాలం నుంచీ డిమాండ్ చేస్తున్నారు. కానీ బీజేపీ అన్ని కులాల గణనకు ఒప్పుకోకుండా, ఈ డిమాండును పరోక్షంగా పూర్తి చేయడానికి ఓబీసీలను లెక్కించే విషయం గురించి మాట్లాడుతోంది.

Image copyright Getty Images

మరో కొత్త మహాభారతం మొదలవుతుందా?

బీజేపీ వేయబోతున్న మూడో అడుగు, రెండు వైపులా పదునైన కత్తి లాంటిది. ఓబీసీల లెక్కలు రాకముందే, ఓబీసీల విభజనకు బీజేపీ ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీ నవంబర్లో తన రిపోర్ట్ ఇస్తే, దేశంలో కులాలపై కొత్త మహాభారతం ప్రారంభమవుతుంది.

ఓబీసీ రిపోర్ట్‌లో కొన్ని కులాలు అభివృద్ధి చెందాయని వాటిని ఒక చిన్న గ్రూప్‌గా చేయవచ్చు. అప్పుడు ఆ కులాలు అలా ఎందుకు చేశారో ఆధారాలు ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని కోరచ్చు. కానీ కేంద్రం దగ్గర అవి ఉండవు. అలాంటప్పుడు వెనుకబడ్డ కొన్ని ప్రభావవంతమైన కులాలకు బీజేపీపై ఆగ్రహం కలగవచ్చు. కానీ అదే సమయంలో అత్యంత వెనుకబడ్డ కులాలకు ప్రభుత్వం చర్యలు కచ్చితంగా నచ్చుతాయి.

ఇదే విధంగా, బీజేపీ దేశవ్యాప్తంగా వెనుకబడ్డ కులాలతో కలవడానికి ప్రయత్నిస్తోంది. ఆ కులాల నేతలకు ప్రత్యేకంగా కింది స్థాయి సంస్థల్లో చోటు కల్పిస్తూ వస్తోంది.

ఓబీసీని విభజించడం కోసం నియమించిన వేసిన రోహిణి కమిషన్‌కు ఎన్నికలకు ముందే రిపోర్ట్ ఇవ్వాలని బీజేపీ చెబితే, దాని సిఫారసులను అమలు చేస్తూ ఓబీసీలను కేంద్ర స్థాయిలో విభజిస్తారు. అంటే దానర్థం. అగ్ర కులాల ఓటు బ్యాంకుపై ధీమాగా ఉన్న బీజేపీ, వారితోపాటు అత్యంత వెనుకబడిన కులాలను కూడా కలిపి సమీకరణలు సిద్ధం చేస్తుంది. అటు ఎస్సీ-ఎస్టీలోని ఒక పెద్ద వర్గాన్ని కూడా తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తుంది. బీజేపీ కొత్త సోషల్ ఇంజినీరింగ్ ఇదే.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)