లబ్.. డబ్బు: షేర్ మార్కెట్లు ఎందుకిలా పడిపోతున్నాయి?

  • 15 సెప్టెంబర్ 2018
లబ్ డబ్బు

భారతదేశంలో గ్రాస్ డొమెస్టిక్ ప్రాడక్ట్ (జీడీపీ).. అంటే జాతీయోత్పత్తి వృద్ధి రేటు 8.2 శాతంగా ఉంది. గడచిన రెండేళ్లలో ఇది అత్యధికం. అయితే షేర్ మార్కెట్లకు మాత్రం ఈ వార్త పెద్దగా రుచించినట్టు లేదు. ఇన్వెస్టర్లంతా షేర్లను కొనడానికి బదులు అమ్మెయ్యడానికే ఆత్రుతపడుతున్నారు. ఇంతకూ షేర్ మార్కెట్లు ఎందుకిలా పడిపోతున్నాయి? కారణాలు, పెట్రోలు, రూపాయి విలువ పతనం, వాణిజ్య యుద్ధం.

ఇవ్వాళ్టి లబ్ డబ్బులో షేర్ మార్కెట్లకు స్పీడ్ బ్రేకర్లుగా పని చేస్తున్న కారణాల గురించి తెల్సుకుందాం...

రూపాయి విలువ నానాటికి తీసికట్టు నామంబొట్టు చందంలా మారిపోయింది. పతనంలో కొత్త రికార్డులు నమోదు చేస్తోంది. ఫలితంగా, భారతదేశ కరెంట్ అకౌంట్ లోటు, అంటే క్యాడ్.. జీడీపీలో 2.5 నుంచి 2.8 శాతం వరకు ఉండే అవకాశం ఉంది. చమురు ధరలు పెరుగుతూ ఉండటమే దీనికి కారణం.

ద్రవ్య మైదానంలో రూపాయికీ, డాలర్‌కూ మధ్య జరుగుతున్న డిష్షుం, డిష్షుంలో రూపాయి వెనుకబడుతోంది. డాలర్‌ చేతిలో దెబ్బలు తింటున్న కరెన్సీల్లో రూపాయి ఒక్కటే లేదు. టర్కీ, ఈజిప్ట్, అర్జెంటీనా, ఇండోనేషియా దేశాలను కూడా కరెంట్ అకౌంట్ లోటు సమస్య భూతంలా పట్టి పీడిస్తోంది.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: ఈ సందేహాలన్నింటి మధ్య ఒక శుభ వార్త కూడా ఉంది

చమురు ధరలు భగ భగ...

చమురు మంటలు రూపాయినీ, బాండ్లనూ భారీగా దెబ్బతీశాయి. భారత్ తనకు అవసరమయ్యే చమురులో దాదాపు 70 శాతం దిగుమతి చేసుకుంటుంది. ఇందుకోసం అది దాదాపు చెల్లింపులన్నీ డాలర్లలోనే చేస్తుందనేది స్పష్టమే. ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌లపై సబ్సిడీలను రద్దు చేసింది. దాంతో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎడతెగకుండా పెరిగిపోతున్నాయి. ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోవడంతో సరకుల రవాణా ప్రియమైపోయింది. దాంతో నిత్యావసర వస్తువుల ధరలు మండిపోవడం ఖాయం.

ప్రభుత్వంపై చెల్లింపుల భారం పెరిగిపోతోందనే వార్తల మధ్య మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతింది. మార్చి చివరి నాటికి ప్రభుత్వంపై చెల్లింపుల భారం 77.89 లక్షల కోట్లు ఉండగా, జూన్ చివరి నాటికి అది పెరిగి 79.8 లక్షల కోట్లకు చేరుకుంది.

భారత షేర్ మార్కెట్లలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు, అంటే ఎఫ్ఐఐల పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ట్రేడ్ వార్ తర్వాత ఏర్పడ్డ పరిస్థితుల్లో అభివృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థలపై వారు నమ్మకం కోల్పోతున్నారు. చైనా, జపాన్, తైవాన్‌లకు చెందిన ఎఫ్ఐఐలు గత కొద్ది నెలల్లో తమ వాటాల్ని విపరీతంగా అమ్మేసుకొని, వచ్చిన లాభాల్ని మూటగట్టేసుకొని తమ ఇళ్లకు వెళ్లిపోయారు. అమెరికాలో వడ్డీ రేట్లు పెరగడంతో భారత్ నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఎఫ్ఐఐలు తమ డబ్బులు తీసేసుకున్నారు.

కంపెనీలకు పెరిగిన ఆదాయాలు, లాభాలు

మార్కెట్లు ప్రియమయ్యాయి. రిటర్న్స్‌ విషయానికొస్తే భారత మార్కెట్లకు ప్రపంచంలోని అత్యుత్తమ మార్కెట్లలో ఒకటిగా పేరుందనేది నిస్సందేహం. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు సెన్సెక్స్ 11 శాతం కన్నా ఎక్కువ, నిఫ్టీ దాదాపు 9 శాతం రాబడిని అందించాయి. అయితే, ఇప్పుడు భారత మార్కెట్లు పెట్టుబడి మదుపు చేయడానికి బాగా ప్రియంగా మారిపోయాయేమో అన్న అనుమానాలు ఇన్వెస్టర్లను పీడిస్తున్నాయి.

ఈ సందేహాలన్నింటి మధ్య ఒక శుభ వార్త కూడా...

- ఈ యేడాది మొదటి త్రైమాసికం, అంటే ఏప్రిల్-జూన్ మధ్య కంపెనీల ఆదాయాలూ, లాభాలూ పెరిగాయి.

- కంపెనీల సగటు వృద్ధి 22 శాతం ఉందని క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ నివేదిక చెబుతోంది.

- రుతుపవనాల తీరుతెన్నులను బట్టి చూస్తే, రాబోయే ఫలితాలు కూడా మెరుగ్గానే ఉండొచ్చని ఆశిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)