అభిప్రాయం: భారతదేశంలో రాజకీయ నాయకుల ప్రేమలు, పెళ్ళిళ్ళు, వివాహేతర సంబంధాలపై ఎవ్వరూ బహిరంగంగా మాట్లాడరు. ఎందుకు?

  • రేహాన్ ఫజల్
  • బీబీసీ ప్రతినిధి

వ్యక్తిగత జీవితంలో గోప్యతకు సంబంధించిన విషయానికి వస్తే అందులో భారత రాజకీయ నేతలను మించిన వారు ఎవరూ లేకపోవచ్చు.

అంటే, వారి మధ్య ఒక అలిఖిత ఒప్పందం లాంటిది ఉంటుంది. వారి మధ్య ఎంత రాజకీయ శత్రుత్వం అయినా ఉండచ్చు. కానీ ఒకరి ప్రేమ ఘటనలు, వివాహేతర సంబంధాలు, ఇతర మహిళలతో వ్యవహారాలను ఇంకొకరు బయటపెట్టడం ఉండదు.

ఒకటీ అరా వదిలేస్తే భారతదేశంలోని రాజకీయ నాయకులు ఈ ఒప్పందాన్ని చాలావరకూ నిలబెట్టుకుంటూనే వచ్చారు. అందుకే బహుశా ప్రతి ఒక్కరూ అద్దాల మేడల్లో ఉంటూ వస్తున్నారు.

కానీ సీనియర్ విలేకరి అజయ్ సింగ్ దీని వెనుక వేరే కారణం ఉందని భావిస్తున్నారు.

"అద్దాల మేడలు విదేశాల్లో కూడా ఉంటాయి. కానీ, అక్కడ రాళ్లు విసురుతుంటారు. కానీ, ఇక్కడ ఒక పాలకుడికి ఒక గతం ఉంటే, వారికి కొన్ని హక్కులు ఉన్నాయిలే అనుకుని మనం వాటి గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు" అని అంటారు.

"ఇటాలియన్‌లో 'ఓమార్టా' అనే ఒక పదం ఉంది దానికి 'నేరస్థుల రహస్య ఒప్పందం' అని అర్థం. అంటే, 'మేం మీ గురించి చెప్పం, మీరు కూడా మా గురించి ఏం చెప్పకూడదు' అనుకుంటారు. భారత రాజకీయాల్లో కూడా కొన్ని ఓమార్టా లాంటివి ఉన్నాయి. కొన్ని విషయాల్లో అవి చాలా గుట్టుగా ఉంటాయి. కానీ, ఇలాంటి విషయాల గురించి గుట్టుమట్లు ఉండకూడదు" అంటారు అజయ్ సింగ్

గాంధీ బ్రహ్మచర్యం ప్రయోగాలు

మీడియా, రాజకీయ నేతల మధ్య కూడా ఈ వ్యక్తిగత జీవితం గురించి ఒకలాంటి సామాజిక ఒప్పందాలు ఉన్నట్టు కనిపిస్తాయి. ఒక దశకు చేరుకోగానే బహిరంగ చర్చలు, డిబేట్లలో కూడా అవి ఉండవు.

అవినీతి, మోసం, బంధుప్రీతి లాంటి అంశాల గురించి మీడియా లేదా ప్రజలు చాలా గట్టిగానే మాట్లాడతారు. కానీ వ్యక్తిగత జీవితంలో 'స్కాండల్స్' అని చెప్పేవాటిని ఎవరూ పెద్దగా పట్టించుకోవడం ఉండదు.

టైమ్స్ ఆఫ్ ఇండియా మాజీ ఎడిటర్ ఇందర్ మల్హోత్రా బీబీసీతో ఈ విషయం గురించి మాట్లాడారు. "ప్రపంచమంతా ప్రతి విషయం బహిరంగం అయిపోయింది. సోషల్ మీడియా కూడా ఉంది. నేతల వ్యక్తిగత జీవితం గురించి మాత్రం పత్రికల్లో అస్సలు ముద్రించరు. రేడియో, టెలివిజన్లు ప్రభుత్వానివే కదా" అన్నారు.

"ఇప్పుడు పండిట్ నెహ్రూ విషయమే తీసుకోండి. ఆయనకు లేడీ మౌంట్‌బాటెన్‌తో లింకు ఉందనే విషయంపై దేశమంతా చర్చ జరిగేది. తర్వాత శారదా మాత అని ఉండేవారు. ఆమె గురించి కూడా చెప్పుకునేవారు. జీవించి ఉన్నప్పుడు, చనిపోయిన తర్వాత ఆమెపై పుస్తకాలు కూడా వచ్చాయి."

"అంతకు ముందు గాంధీ గురించి కూడా ఎలాంటి వార్తలూ ముద్రించేవారు కాదు. ఆయన అనుచరుడు ఒక పుస్తకం రాశారు. అందులో ఆయన తన బ్రహ్మచర్యంపై ప్రయోగాలు చేస్తున్నప్పుడు రెండు వైపులా యువతులను పడుకోబెట్టుకునేవారని చెప్పారు."

"60వ దశకంలో గాంధీ సెక్స్, బ్రహ్మచర్య ప్రయోగాలపై నిర్మల్ కుమార్ బోస్ పుస్తకం వచ్చే వరకూ దీని గురించి బహుశా జనాలకు ఎవరికీ తెలీదు. అంతకు ముందు అసలు ఈ విషయం గురించి రాయాలనే ఊహ కూడా వచ్చేది కాదు" అన్నారు ఇంద్రజిత్ మల్హోత్రా.

ఇటీవల మృతిచెందిన కుల్దీప్ నయ్యర్ నెహ్రూ-ఎడ్వినా అంటే లేడీ మౌంట్‌బాటెన్‌తో ఆయన సంబంధాల గురించి బీబీసీకి ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు. ఆయన బ్రిటన్‌లో భారత హైకమిషనర్‌గా ఉన్నప్పుడు ఎయిర్ ఇండియా పైలెట్ ద్వారా నెహ్రూ రోజూ ఎడ్వినాకు లేఖలు పంపేవారట.

ఎడ్వినా ఆ లేఖలకు జవాబు ఇచ్చేవారు. హైకమిషన్ ఉద్యోగి ఒకరు వాటిని ఎయిర్ ఇండియా విమానం వరకూ చేర్చేవారు.

నయ్యర్ ఒకసారి ఎడ్వినా మనవడు లార్డ్ రామ్సేను "మీ అమ్మమ్మకు, నెహ్రూకు మధ్య ప్రేమ ఉందా" అని అడిగేశారు. దానికి రామ్సే "వారి మధ్య ఆధ్యాత్మిక ప్రేమ" ఉండేదని జవాబిచ్చారు.

ఆ తర్వాత నయ్యర్ ఆయన్ను ఇబ్బంది పెట్టలేదు. నెహ్రూ ఎడ్వినాకు రాసిన లేఖలను ముద్రించినప్పటికీ, ఎడ్వినా నెహ్రూకు రాసిన లేఖల గురించి ఎవరికీ ఏ విషయం తెలీలేదు.

కుల్‌దీప్ నయ్యర్ ఒకసారి ఇందిరాగాంధీని ఆ లేఖలు చూడడానికి అనుమతి అడిగారు. కానీ ఆమె దానికి స్పష్టంగా నిరాకరించారు.

నెహ్రూ పద్మజా నాయుడు ప్రేమ

ఎడ్వినానే కాదు, సరోజినీ నాయుడు కూతురు పద్మజా నాయుడు అంటే కూడా నెహ్రూ మనసులో సాఫ్ట్ కార్నర్ ఉండేది. ఇందిరా గాంధీ జీవిత చరిత్ర రాసిన కేథరిన్ ఫ్రాంక్ "నెహ్రూ, పద్మజ మధ్య ప్రేమ ఏళ్లపాటు నడిచిందని విజయలక్ష్మీ పండిట్ నాకు చెప్పారని" అందులో రాశారు.

కూతురు ఇందిర మనసు నొప్పించడం ఇష్టం లేకే, నెహ్రూ ఆమెను పెళ్లి చేసుకోలేదని చెప్పారు. ఆయన జీవిత చరిత్ర "నెహ్రూ సెలెక్టెడ్ వర్క్స్‌"లో పద్మజాకు రాసిన ప్రేమ లేఖలు ముద్రించినందుకు దానిని రాసిన ఎస్.గోపాల్‌పై ఇందిరా గాంధీ కోప్పడ్డారని కూడా చెబుతారు.

1937లో నెహ్రూ పద్మజాకు రాసిన లేఖలో "నీకు 19 ఏళ్లు (అప్పుడు ఆమె వయసు 37 ఏళ్లు)... నాకు 100, అంతకంటే ఎక్కువే ఉన్నాయి. నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో, నాకు ఎప్పటికైనా తెలుస్తుందంటావా" అన్నారు.

ఒకసారి నెహ్రూ మలయా నుంచి పద్మజాకు లేఖ రాశారు. అందులో "నేను నీ గురించి తెలుసుకోవాలని చచ్చిపోతున్నా, నిన్ను చూడాలని, నిన్ను నా కౌగిలిలోకి తీసుకోవాలని, నీ కళ్లలోకి చూడాలని తపించిపోతున్నా" అని రాశారు ( సెలక్టెడ్ వర్క్స్ ఆఫ్ నెహ్రూ, సర్వేపల్లి గోపాల్, పేజీ 694 )

ఇందిరా, ఫిరోజ్ మధ్య కలహాలు

ఇందర్ మల్హోత్రా బీబీసీతో... "ఫిరోజ్ గాంధీ నాకు చాలా సన్నిహిత మిత్రుడు. ఆయన అప్పుడప్పుడూ దాని గురించి ప్రస్తావించేవారు. ఆయన దగ్గరకు వచ్చే మహిళలకు కూడా నేను తెలుసు. ఫిరోజ్‌కు హమ్మీ అనే ఒక అందమైన మహిళతో స్నేహం ఉండేది. ఆమె తండ్రి ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రిగా ఉండేవారు" అని చెప్పారు.

"నెహ్రూను చూసుకోవడానికి ఇందిరా పిల్లలను తీసుకుని దిల్లీలో ప్రధానమంత్రి నివాసానికి రాగానే, ఆక్కడ ఫిరోజ్ రొమాన్స్ మొదలైంది" అన్నారు.

హమ్మీ గురించి ఇందిరాగాంధీ జీవితాంతం బాధపడ్డారు.

దాని గురించి చెప్పిన ఇందర్ మల్హోత్రా "ఫిరోజ్ గాంధీ అప్పటికే మరణించారు. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నారు. ఎమర్జెన్సీ ముందు హమ్మీ ప్రధానమంత్రి కార్యాలయంలో ఏదో ఒక అర్జీ ఇవ్వడానికి వచ్చారు. ఆమె ప్రధానమంత్రి కార్యాలయం నుంచి బయటికి వెళ్తుంటే, అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు దేవకాంత్ బరువా ఆఫీసులోకి వస్తున్నారు. అప్పుడు ఇందిరాగాంధీ బరువాతో బయట ఒక మహిళ కనిపిస్తోందే.. ఆమె కోసం ఫిరోజ్ నన్ను జీవితాంతం బాధపెట్టాడు అన్నారు" అని చెప్పారు.

రాజీవ్-సోనియా ప్రేమ కథ

రాజీవ్ గాంధీ, సోనియా ప్రేమ వ్యవహారం గురించి కూడా జాతీయ మీడియాలో చాలా తక్కువ చర్చే జరిగింది. సోనియాగాంధీ జీవితచరిత్ర రాసిన రషీద్ కిద్వాయ్, అందులో ఆ విషయం గురించి చాలా వివరంగా రాశారు.

కిద్వాయ్ బీబీసీతో... "సోనియాగాంధీకి మొదట్లో రాజీవ్ గాంధీ జవహర్ లాల్ నెహ్రూ మనవడనే విషయమే తెలీదు. ఇద్దరూ మొదటిసారి కేంబ్రిడ్జ్‌లోని ఒక గ్రీకు రెస్టారెంట్‌ 'వర్సిటీ'లో కలిశారు. ఆమె తన స్నేహితుడితో కలిసి అక్కడ కూచుంటే, రాజీవ్ గాంధీ కూడా తన స్నేహితులతో అక్కడికి వచ్చారు" అని చెప్పారు.

"రాజీవ్ గాంధీ తనవైపు చూశారని, తొలిచూపులోనే ఆయనతో ప్రేమలో పడిపోయానని సోనియా స్వయంగా నాతో అన్నారు. తర్వాత రాజీవ్ గాంధీ ఆమెకు ఒక కవిత రాసి పంపించారు. సోనియాకు అది బాగా నచ్చింది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి తిరగడం మొదలైంది. కానీ ఇందిరాగాంధీ ఒకసారి బ్రిటన్ వచ్చినపుడు, ఆమె ఫొటో పేపర్లలో చూసి తనకు చాలా భయమేసిందని సోనియా చెప్పారు" అన్నారు కిద్వాయి.

"ఒకసారి ఇందిరాగాంధీని కలవడానికి వెళ్లిన సోనియా, ధైర్యం లేక సగం దారిలో నుంచే వెనక్కు వచ్చేశారు. ఆమె మొదటిసారి ఇందిరాగాంధీని కలిసినప్పుడు ఫ్రెంచ్‌లో మాట్లాడారు. ఎందుకంటే ఇందిరకు ఫ్రెంచ్ కూడా వచ్చు. సోనియాకు ఇంగ్లీషు అంత బాగా వచ్చేది కాదు. తర్వాత సోనియా రాజీవ్‌ను పెళ్లి చేసుకుంటోందని ఆమె తండ్రికి తెలీగానే ఆయన దాన్ని వ్యతిరేకించారు" అని కిద్వాయ్ చెప్పారు.

"రాజీవ్ గాంధీ సోనియాను పెళ్లి చేసుకుంటానని తండ్రికి చెప్పినపుడు, మీ ఇద్దరి ప్రేమ ఎంత గట్టిదో చూడాలని, ఒక ఏడాది ఒకరికొకరు కలవకుండా ఉండండి అని ఆయన ఆమెకు చెప్పారు. ఒక ఏడాది తర్వాత సోనియా పెళ్లి ప్రస్తావన తెచ్చినా ఆయన దానికి ఒప్పుకోలేదు. చివరికి ఆయన వాళ్ల పెళ్లికి కూడా రాలేదు" అంటారు కిద్వాయ్

సంజయ్, రుఖ్సానా సుల్తానా

రాజీవ్ తమ్ముడు సంజయ్ గాంధీ పేరు కూడా చాలా మంది మహిళలతో వినిపించేది. వారిలో రుఖ్సానా సుల్తానా ఒకరు.

ఆమె గురించి రషీద్ కిద్వాయ్ చెప్పారు. "రుఖ్సానా సుల్తానా అంత పెద్ద పబ్లిక్ ఫిగరేం కాదు. కానీ ఆమెను సంజయ్ గాంధీ పైకి తీసుకొచ్చారు. ఆమె లైఫ్ స్టైల్ చూస్తే, రుఖ్సానా అప్పట్లోనే మేకప్ చేసుకుని, హైహీల్స్ వేసుకుని బయట తిరిగేవారు. ఆమెది చాలా డామినేటింగ్ క్యారెక్టర్" అన్నారు.

"ఆమె సంజయ్ గాంధీపై పెత్తనం చూపించేదని కాంగ్రెస్ పార్టీలో చెప్పుకునేవారు. అది ఎలాంటి పెత్తనం అంటే దానికి ఏ బంధం పేరూ పెట్టలేం. సంజయ్‌ చాలా మంది అమ్మాయిలతో కలిసి తిరిగేవారు. ఆయన మేనకా గాంధీని పెళ్లి చేసుకుంటున్నారని తెలీగానే, అలా చేశారా.. అని చాలా మంది ఆశ్చర్యపోయారు. చాలా మంది అమ్మాయిలకైతే మనసు ముక్కలైపోయింది" అన్నారు కిద్వాయ్.

రాజ్ కుమారీ కౌల్‌తో వాజ్‌పేయి జీవనం

మాజీ ప్రధానమంత్రి వాజ్‌పేయి కుటుంబం గురించి లోలోపలే కాస్త చర్చించుకున్నా, దానివల్ల ఆయన ప్రజాదరణలో ఏమాత్రం తేడా రాలేదు. వాజ్‌పేయి కాలేజీ రోజుల్లో స్నేహితురాలు అయిన రాజ్‌కుమారీ కౌల్‌ను పెళ్లి చేసుకోలేదు. కానీ ఆమెకు పెళ్లైన తర్వాత వాళ్ల ఇంట్లోనే ఉన్నారు.

సావీ పత్రికకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో శ్రీమతి కౌల్ "ఈ బంధం గురించి ఏదైనా వివరణ ఇవ్వాలని నేను, అటల్ బిహారీ వాజ్‌పేయి ఎప్పుడూ అనుకోలేదు" అన్నారు.

శ్రీమతి కౌల్ మరణించిన తర్వాత, ఆమె గురించి ఎవరికీ పెద్దగా తెలీకపోవడంతో జాతీయ మీడియా కూడా ఆమె ఎవరనేదానిపై చర్చించలేదు. రాజ్‌కుమారీ కౌల్ స్నేహితురాలు తలత్ జమీర్‌తో బీబీసీ కౌల్ గురించి మాట్లాడింది.

"ఆమె చాలా అందమైన కశ్మీరీ మహిళ. లావుగా ఉండేవారు. చాలా తీయగా మాట్లాడేవారు. ఆమె ఉర్దూ చాలా చక్కగా మాట్లాడుతారు. నేను ఎప్పుడు ప్రధాన మంత్రి నివాసానికి వచ్చినా ఆమెను అందరూ మాతాజీ అని పిలవడం కనిపించేది. అటల్ జీ కోసం చేసే వంట బాధ్యతంతా ఆమే చూసుకునేవారు. వంటవాళ్లు వచ్చి ఈరోజు ఏం చేయమంటారు అని ఆమెను అడుగుతుండేవాళ్లు" అని తలత్ చెప్పారు.

"ఆమెకు టీవీ చూడడం చాలా ఇష్టం. సీరియళ్ల గురించి మేం డిస్కస్ చేసేవాళ్లం. ప్రముఖ గీత రచయిత జావేద్ అఖ్తర్ పుట్టినపుడు చూడ్డానికి తాను ఆస్పత్రికి కూడా వెళ్లానని ఆమె నాతో అన్నారు. గ్వాలియర్ కాలేజీలో జావేద్ తండ్రి జానిసార్ అఖ్తర్ దగ్గర ఆమె చదువుకున్నారు. ఆమె జావేద్‌ అఖ్తర్‌తో ఎప్పుడూ టచ్‌లో ఉండేవారు" అన్నారు తలత్.

ఫొటో క్యాప్షన్,

జార్జ్ ఫెర్నాండెజ్, జయా జైట్లీ

ఫెర్నాండెజ్, జయా జైట్లీ స్నేహం

రాజకీయ సంబంధాల్లో మాజీ రక్షణ మంత్రి జార్జ్ ఫెర్నాండెజ్, జయా జైట్లీ బంధం గురించి కూడా చాలా చెప్పుకునేవారు. భార్య లీలా కబీర్‌తో ఆయనతో విడిపోయినప్పుడు ఈ విషయానికి బలం చేకూరింది.

మీకు జార్జ్‌తో ఎలా స్నేహం అయ్యిందని నేను జయా జైట్లీనే అడిగాను. దానికి ఆమె "1979లో జనతా ప్రభుత్వం పడిపోయిన తర్వాత జార్జ్ ఒంటరి అయిపోయారు. మొరార్జీ దేశాయ్‌కి మద్దతు ఇచ్చిన తర్వాత, జార్జ్ అదే రోజు ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారని ఆయన సమాజ్ వాదీ స్నేహితులు భావించేవారు."

"ఆయన భార్య ఆరోగ్యం సరిగా ఉండేది కాదు. ఆమె చాలా సార్లు విదేశాలకు వెళ్తుండేవారు. నా భర్త వారితో పనిచేసేవారు. దాంతో మేం వాళ్ల ఇంటికి వస్తూపోతూ ఉండేవాళ్లం."

"జార్జ్ చాలాసార్లు పర్యటనలకు బయట వెళ్తుండేవారు. దాంతో ఆయన తన పిల్లలను నా దగ్గర వదిలి వెళ్లేవారు. జార్జ్ వ్యక్తిగత జీవితంలో ఆయన కోసం అంతగా పనిచేసేవారు అప్పట్లో ఎవరూ లేరు. దాంతో ఆయన నా కుటుంబానికి దగ్గరయ్యారు" అని జయా చెప్పారు.

ములాయం రెండో పెళ్లి

ములాయం సింగ్ యాదవ్ రెండో పెళ్లి గురించి కూడా ప్రజలకు చాలా ఆలస్యంగా తెలిసింది. అధిక ఆదాయం కేసులో ములాయం సింగ్ సుప్రీంకోర్టులో ఒక అఫిడవిట్ దాఖలు చేసినప్పుడు ఈ విషయం బయటపడింది.

దీనిపై మాట్లాడిన అజయ్ సింగ్ "మేం లక్నోలో పనిచేస్తున్నప్పుడు, మాకు ఆ విషయం గురించి తెలిసింది. ఆయనకు ఆమె భార్య అయితే కాదు, కానీ భార్యలాగే ఉండేవారు. ఆయన ఆమె ఇంటికి వెళ్తూ ఉండేవారు. కానీ దాని గురించి పేపర్లలో రాయడంగానీ, మాట్లాడుకోవడం గానీ ఎప్పుడూ జరగలేదు" అని చెప్పారు.

ఫొటో క్యాప్షన్,

బీబీసీ స్డూడియోలో కులదీప్ నయ్యర్‌తో రేహాన్ ఫజల్

పెరిగే వయసులో ప్రేమ బంధాలు

ఈ కాలంలో కూడా చాలా ఉల్లాసంగా జీవితాన్ని గడిపే వారు డజనుకు పైనే ఉన్నారు అని రషీద్ కిద్వాయ్ అంటారు. "విద్యాచరణ్ శుక్లా గురించి చర్చించుకునేవారు. చంద్రశేఖర్ బంధాల గురించి మాట్లాడుకునేవారు. నారాయణ్ దత్ తివారీ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా పనిచేస్తున్నప్పుడు హైదరాబాద్‌లోని రాజ్‌ భవన్‌లో దొరికిపోయారు. ఆయనపై పెటర్నిటీ కేసు కూడా వేశారు. జనం వాటి గురించి వ్యంగ్యంగా మాట్లాడుకునేవారు. లోహియా ప్రేమ గురించి కూడా చర్చలు నడిచాయి" అన్నారు.

వారితోపాటు మరికొంతమంది వ్యవహారాల గురించి కూడా ఆయన ప్రస్తావించారు. "ఇంద్రజిత్ గుప్తాది ఒక ప్రత్యేకమైన సూఫియానా రకం ప్రేమ. ఆయన 62 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్నారు. ఆర్కే ధవన్ కూడా 74 ఏళ్ల వయసులో తన పెళ్లి గురించి బహిరంగంగా అంగీకరించారు" అని చెప్పారు.

మన సమాజంలో సర్వ సాధారణమైన పెళ్లి, ప్రేమ, వ్యవహారాలు, వివాహేతర సంబంధాలకు రాజకీయాలు అతీతం కాదు. రాజకీయాల్లో ఉండే రంగుల కోణాలను మనం అండర్ ప్లే చేస్తాం అంతే...

ఇవికూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)