ప్రెస్‌రివ్యూ: తెలంగాణలో ఏడాదిలో తగ్గిన 30 లక్షల మంది ఓటర్లు

  • 17 సెప్టెంబర్ 2018
ఎన్నికల కమిషన్ Image copyright www.eci.nic.in

తెలంగాణలో ఏడాదిలో దాదాపు 30 లక్షల మంది ఓటర్లు తగ్గారని 'ఈనాడు' రాసింది. ఎన్నికల కమిషన్ (ఈసీ) విడుదల చేసిన తుది సవరణ జాబితాలను పరిశీలిస్తే ఈ విషయం వెల్లడవుతోందని తెలిపింది.

క్షేత్రస్థాయిలో ఆధార్‌ అనుసంధానం, ఇంటింటి ఓటర్ల తనిఖీ తదితర కార్యక్రమాల తర్వాత వెలువరించిన గణాంకాల్లో స్పష్టమైంది. ఉపాధి కోసం నగరబాట పట్టిన ప్రజలు తిరిగి స్వస్థలాలకు వెళ్లడం, అద్దెకుండేవారు తరచూ ఖాళీ చేయడంతో ఆయా ఓటర్లను తొలగించారు.

ఏడాదిలో ఓటర్ల సంఖ్య ఒక్కసారిగా తగ్గిపోయినా.. ఓట్లు గల్లంతైన ప్రజలు గత 8 నెలలుగా ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. దీంతో ఈ సమయంలో 8 లక్షల మందికి పైగా కొత్త ఓటర్లు చేరడం గమనార్హం.

Image copyright Getty Images

తొలి నుంచి గందరగోళం

ఓటర్ల నమోదు తొలి నుంచి గందరగోళంగా ఉంది. దరఖాస్తు విధానంపై అవగాహన లేకపోవడంతో రాజకీయ నాయకులు తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు. అర్హులైన వారిని ఓటర్లుగా నమోదు చేయించి, అనర్హులను తొలగించాల్సి ఉండగా మార్పుచేర్పులప్పుడు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. సాఫ్ట్‌వేర్‌లోనూ కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.

ఓటరు చిరునామా మారిపోవడం, పేరులోని అక్షరాలు తొలగిపోవడం జరుగుతోంది. అర్హుడైన ఓటరు పేరు.. నివసిస్తున్న ఇంటి చిరునామాలో కాకుండా పక్కవీధిలోని ఇంటి నంబరుపై పేరు కనిపిస్తోంది. ఇంటింటి విచారణకు వెళ్లినపుడు.. పేర్కొన్న చిరునామాలో ఉండటం లేదనే కారణంతో ఓటరు పేరు తొలగిస్తున్నారు. దీంతో నివసించే ఇంటిలో, పొరపాటుగా వచ్చిన చిరునామాలోనూ ఓటు లేకుండా పోతోంది. మరోవైపు పేరులోని అక్షరాలు కూడా మాయమవుతున్నాయి. అపార్టుమెంట్లలో నివసించే వారికి ఇదో పెద్ద సమస్యగా మారింది. అక్షరాలు తొలగిపోవడంతో అసలుపేరు మారిపోవడంతో.. ఆ చిరునామాలో లేరంటూ ఓటర్ల పేర్లు తొలగించాల్సి వచ్చినట్లు తెలిసింది.

అద్దెకుండే ఇంటి నంబరుతో ఓటరుగా నమోదు చేయించుకున్న తర్వాత, ఆ ఇల్లు ఖాళీ చేయడంతో పేరును జాబితాలో తీసేస్తున్నారు. సదరు వ్యక్తి తనకక్కడ ఓటు ఉందనుకొని, మరో చోట నమోదు చేయించుకోకపోతే ఓటు గల్లంతవుతోంది. విభజన తర్వాత పలువురి ఓట్లు రెండు రాష్ట్రాల్లోనూ ఉన్నాయి. ఇటీవల ఆధార్‌ను అనుసంధానం చేయడంతో ఏదేని ఒక నియోజకవర్గానికే పరిమితమవ్వాల్సి వస్తోంది. ఇలాంటి పలు కారణాలతో ఓటర్ల సంఖ్య తగ్గినట్లు అధికారులు చెబుతున్నారు.

రాష్ట్ర విభజన తర్వాత రెండేళ్ల వరకు.. ఉమ్మడిగానే ఓటర్ల సవరణ జాబితాను వెలువరించినా, 2017లో ఏపీ, తెలంగాణలకు వేర్వేరు జాబితాలను ఈసీ ప్రకటించింది. హైదరాబాద్‌తోపాటు పలు నియోజకవర్గాల్లో ప్రత్యేక ఓటర్ల సవరణ కార్యక్రమం చేపట్టింది. ఇంటింటికి వెళ్లి వివరాలు నమోదు చేయడం, ఆధార్‌ అనుసంధానం చేపట్టింది.

2017 జనవరి నాటికి తొలిసారిగా ప్రకటించిన సవరణ జాబితా ప్రకారం దాదాపు 2.83 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. ఆ తర్వాత 2018 జనవరిలో ప్రకటించిన జాబితాతో ఈ సంఖ్య 2.61 కోట్లకు పరిమితమైంది.

Image copyright iStock

ఫీజుల పేరుతో రోగి డిశ్చార్జ్‌ను అడ్డుకోరాదు

ఫీజుల బకాయి పేరుతో ఆస్పత్రి యాజమాన్యాలు రోగి డిశ్చార్జ్‌కు అడ్డుపడినా, మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించేందుకు తిరస్కరించినా అది తీవ్ర నేరం కానుందని ఆంధ్రజ్యోతి ఒక వార్తలో తెలిపింది. ఈ మేరకు రోగుల హక్కులపై అధికార పత్రం తాలూకు ముసాయిదాను జాతీయ మానవహక్కుల కమిషన్(ఎన్‌హెచ్‌ఆర్‌సీ) సిద్ధం చేసింది. ఈ డ్రాఫ్ట్‌ చార్టర్‌ను కేంద్ర ఆరోగ్యశాఖ తన వెబ్‌సైట్‌లో పొందుపర్చింది.

రోగుల హక్కుల పత్రంపై ప్రజల అభిప్రాయాలు, అభ్యంతరాలను స్వీకరించనున్నారు. అనంతరం రోగుల హక్కులపై అధికార పత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అమలు చేయించాలని కేంద్రం భావిస్తోంది.

ఈ డ్రాఫ్ట్‌లోని వివరాల ప్రకారం.. ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లాలనుకున్న రోగిని, సంబంధీకులకు అప్పగించాల్సిన మృతదేహాన్ని ఫీజు బకాయిలు తదితర తప్పుడు పద్ధతుల్లో ఆస్పత్రులు అడ్డుకోకూడదు.

రోగికి అందజేస్తున్న వైద్యసేవలు, చికిత్స వివరాలను కుటుంబీకులు ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలునూ ఈ డ్రాఫ్ట్‌ కల్పించింది. రోగి ఆస్పత్రిలో ఉన్నప్పుడు అతడికి సంబంధించిన కేస్‌ పేపర్లు, ఇండోర్‌ పేషంట్‌ రికార్డులు, ఇన్వెస్టిగేషన్‌ రిపోర్టుల తాలూకు ఒరిజినల్‌ కాపీలను సదరు కుటుంబీకులు కోరిన 24 గంటల్లో ఎలాంటి అదనపు రుసుమూ లేకుండా ఆస్పత్రి యాజమాన్యం అందజేయాల్సి ఉంటుంది.

ఈ రికార్డులు అన్నింటినీ డిశ్చార్జ్‌ అయిన తర్వాత 72 గంటల్లోగా ఇవ్వాల్సి ఉంటుంది.

రోగిగి అందుతున్న వైద్యసేవలు, చికిత్సపై అతడి సంబంధీకులు సెకండ్‌ ఒపీనియన్‌ తీసుకోవాలనుకుంటే వారి నిర్ణయాన్ని ఆస్పత్రి యాజమాన్యాలు విధిగా గౌరవించాలి. ఆ మేరకు వారు కోరితే రోగికి సంబంధించిన సమగ్ర కేస్‌షీట్‌ను సంబంధీకులకు అందజేయాలి.

ఆస్పత్రిపై రోగుల బంధువులు ఎలాంటి ఫిర్యాదు చేసినా 15 రోజుల్లోగా రాతపూర్వకంగా సమాధానం ఇవ్వాలి.

అనంతపురం జిల్లా: ప్రబోధానంద ఆశ్రమం వద్ద ఉద్రిక్తత

గణేశ్‌ నిమజ్జనం సందర్భంగా శనివారం అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలోని చిన్నపొలమడ, పెద్దపొలమడ గ్రామాల్లో తలెత్తిన వివాదం చినికిచినికి గాలివానగా మారిందని 'ఈనాడు' తెలిపింది.

ఆదివారం రోజంతా ఉద్రిక్తతలు కొనసాగాయి. శనివారం పెద్దపొలమడ నుంచి వినాయకుడి విగ్రహాలను చిన్నపొలమడ, ప్రబోధానంద ఆశ్రమం మీదుగా తరలించే క్రమంలో పెద్దపొలమడ గ్రామస్థులకు ప్రబోధానంద శిష్యులకు మధ్య వివాదం చెలరేగింది.

ఈ నేపథ్యంలో, ప్రబోధానంద ఆశ్రమ నిర్వాహకులు, శిష్య బృందం తీరుకు నిరసనగా అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఆదివారం ఆశ్రమం వద్దకు చేరుకున్నారు. ఘటనా స్థలం వద్ద బైఠాయించి నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు.

పెద్దపొలమడ గ్రామస్థులు పెద్దయెత్తున ఆశ్రమాన్ని చుట్టుముట్టి రాళ్లు విసిరారు.

ఆశ్రమ నిర్వాహకుల తీరును నిరసిస్తూ గ్రామానికి చెందిన భాస్కర్‌ అనే వ్యక్తి కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. పోలీసులు అడ్డుకుని బంధువులకు అప్పగించారు.

ఇంతలో ఆశ్రమం లోపలి నుంచి ప్రబోధానంద శిష్యులు ఒక్కసారిగా బయటకు వచ్చి దాడులకు పాల్పడ్డారు. దొరికిన వారిని దొరికినట్లు రాడ్లు, కర్రలతో కొట్టుకుంటూ పరిగెత్తించారు. అక్కడే వదిలి వెళ్లిన వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ క్రమంలో ఎంపీకి ఒక రాయి తగిలింది. ఆయన వాహనం పాక్షికంగా దెబ్బతింది. ప్రబోధానంద శిష్యుల ధాటికి పోలీసులు కూడా తట్టుకోలేక పరుగులు పెట్టారు. ఆదివారం నాలుగు ద్విచక్ర వాహనాలు, ఒక జీపు అగ్నికి ఆహుతయ్యాయి.

ఎంపీ ఆందోళనకు కూర్చున్న టెంట్‌ వద్దకు ప్రబోధానంద శిష్య బృందం దూసుకు రావడంతో.. అప్రమత్తమైన పోలీసులు ఆయన్ను అక్కడ నుంచి హుటాహుటిన తప్పించారు. ఈ సందర్భంగా పోలీసులు స్వల్ప లాఠీఛార్జి చేయడంతోపాటు, బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. శిష్యబృందం ఆశ్రమం లోపలకు వెళ్లి తలుపులు వేసుకుంది.

ఆందోళన సమయంలో సరిగ్గా వ్యవహరించలేనందున వెనక్కి వెళ్లిపోవాలంటూ ఎంపీ తన అంగరక్షకులపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశారు. అయినప్పటికీ వారు దూరం నుంచే ఎంపీకి రక్షణగా ఉన్నారు.

ఆదివారం ఆశ్రమ భక్తుల దాడిలో ఎనిమిది మంది గ్రామస్థులకు గాయాలవగా.. అందరినీ తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురం తీసుకెళ్లారు. మరోవైపు, ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి మధ్యాహ్నం 3.30 గంటల నుంచి తాడిపత్రి పట్టణ పోలీస్‌స్టేషన్‌ ఎదుట తన అనుచరులతో కలిసి బైఠాయించారు. ఆశ్రమాన్ని తరలించే వరకు ఆందోళన విరమించే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. రాత్రి 11 గంటల వరకు ఆందోళన కొనసాగింది.

మరోవైపు, అనంతపురంలో చికిత్స పొందుతున్న పెద్దపొలమడకు చెందిన ఫకీరప్ప మరణించాడు.

ఆశ్రమంలోకి వెళ్లేందుకు ఎస్పీలను సైతం నిర్వాహకులు తొలుత అనుమతించలేదు. చివరగా అనంతపురం ఎస్పీ అశోక్‌కుమార్‌, జేసీ డిల్లీరావులను వేర్వేరుగా లోపలకు అనుమతించారు.

మొత్తం ఘటనపై అనంతపురం జిల్లా కలెక్టర్‌ వీరపాండియన్‌ విచారణకు ఆదేశించారు. సంయుక్త కలెక్టర్‌-2 సుబ్బరాజు, అనంతపురం ఆర్డీవో, తాడిపత్రి డీఎస్పీ నేతృత్వంలో కమిటీని వేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

విదేశీ చదువులకు కరోనా దెబ్బ - బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియాల్లో వర్సిటీలు సంక్షోభంలో పడతాయా?

హాకీ లెజెండ్ బల్బీర్ సింగ్ సీనియర్: 3 ఒలింపిక్స్‌‌లలో 3 స్వర్ణ పతకాలు అందించిన ఆటగాడు

కరోనావైరస్ సెకండ్ వేవ్: ఆసియా దేశాల నుంచి ప్రపంచ దేశాలు ఏం నేర్చుకోవాలి

కరోనావైరస్ విమాన ప్రయాణాలను ఎలా మార్చేస్తుందంటే..

కరోనా ఎఫెక్ట్: కోట్ల మంది మహిళలకు గర్భనిరోధక సాధనాల కొరత.. పెరిగిపోతున్న అవాంఛిత గర్భాలు

‘పొట్టి పిచ్చుక పొట్ట నిండా ప్లాస్టిక్ ముక్కలే’

నిప్పుల కొలిమిలా తెలంగాణ.. జైనద్‌లో 46.3 డిగ్రీల సెల్సియస్‌

వీడియో: కరోనావైరస్‌పై పోరాటానికి సహకరిస్తున్న నాలుగు కాళ్ల హీరో

ఏపీ, బెంగాల్ మినహా మిగతా రాష్ట్రాలకు విమాన సర్వీసులు... ప్రయాణంలో పాటించాల్సిన నిబంధనలేంటంటే