సెప్టెంబర్ 17: ‘నాకు లొంగిపోవటం మినహా దారి లేదు’ - నిజాం సైన్యాధికారి

సెప్టెంబర్ 17: ‘నాకు లొంగిపోవటం మినహా దారి లేదు’ - నిజాం సైన్యాధికారి

అప్పటికి హైదరాబాద్ సంస్థానం ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ పాలనలో ఉంది. సొంత కరెన్సీ, సొంత రైల్వే, సొంత సైన్యం ఉన్న హైదరాబాద్‌ను స్వతంత్ర రాజ్యంగా ఉంచాలని నిజాం ప్రయత్నించారు. భారత్‌లో విలీనానికి గడువు కావాలని, అప్పటివరకు స్వతంత్రంగా ఉంటామని ప్రతిపాదించారు. అందుకు పటేల్ అంగీకరించలేదు.

''పటేల్ ఆదేశాలతో మేజర్‌ జనరల్‌ జేఎన్ చౌధురి నేతృత్వంలో ఆపరేషన్ పోలో 1948 సెప్టెంబర్ 13న మొదలై అదే నెల 18వ తేదీ సాయంత్రానికి పూర్తయింది.

హైదరాబాద్‌ సంస్థానాన్ని రెండు వైపుల నుంచి ముట్టడించి స్వాధీనం చేసుకున్నారు. షోలాపూర్-హైదరాబాద్‌ మార్గంలో ప్రధాన బలగాలు రాగా.. విజయవాడ-హైదరాబాద్ మార్గంలో మరికొన్ని బలగాలు హైదరాబాద్‌పై పోలీసు చర్య చేపట్టాయి.

మొదటి రెండు రోజులు నిజాం సైన్యం నుంచి ప్రతిఘటన ఎదురైనా ఆ తరువాత ఏమీ చేయలేకపోయారు. సైన్యానికి పెద్దగా నష్టమేమీ కలగలేదు. రజాకార్లు మాత్రం 800 మందికిపైగా చనిపోయారు. రజాకార్లు చేసిన హత్యలు, లూటీలు, మానభంగాలతో పోల్చితే ఈ ప్రాణనష్టం చెప్పుకోదగ్గదేమీ కాదు'' అని వీపీ మెనన్ తన పుస్తకంలో రాశారు.

కొన్ని వారాలపాటు సాగుతుందని భారత ప్రభుత్వం భావించిన పోరాటం అనూహ్యంగా కొద్దిరోజులకే ముగిసింది. సెప్టెంబరు 17 సాయంత్రం నిజాం సైన్యం భారత్‌ సైన్యానికి లొంగిపోయింది.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)