ఆరెస్సెస్ డ్రెస్ కోడ్ మారింది... మరి ఆలోచనలు?

  • 18 సెప్టెంబర్ 2018
Image copyright Getty Images

గతంలో నాగ్‌పూర్‌లో జరిగిన సమావేశానికి మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ఆహ్వానించడం ద్వారా ఆరెస్సెస్ ఒక ప్రయోగం చేసింది.

ఇప్పుడు అదే ఆరెస్సెస్ మోహన్ భాగవత్ లెక్చర్ సిరీస్ ద్వారా దేశంలో అత్యంత శక్తివంతమైన సంస్థగా తన శక్తిని ప్రదర్శిస్తోంది. మూడు రోజుల ఈ లెక్చర్ సిరీస్ సోమవారం దిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ప్రారంభమైంది.

'భారతదేశ భవిష్యత్తు: ఆరెస్సెస్ దృష్టికోణం' అన్న ఈ లెక్చర్ సిరీస్ వెనుక చాలా అజెండాలు ఉన్నాయి.

భావజాలపరంగా తాము దేశంలో ప్రముఖస్థానాన్ని ఆక్రమిస్తున్నామని స్పష్టంగా తెలియజేయడం, బీజేపీ రాజకీయాలు, విధివిధానాలపై కూడా తమకు పట్టు ఉందని తెలియజెప్పడమే ఈ ప్రసంగాల వెనుక ఉద్దేశమని కొందరు సంఘ్ ప్రముఖులు చెబుతున్నారు.

Image copyright Getty Images

సంఘ్‌వి 'విడదీసే' విధానాలు అనే ఆరోపించే వారికి సమాధానంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, ఇతర ప్రముఖ నేతలను ఈ లెక్చర్ సిరీస్‌కు ఆహ్వానించి.. విమర్శలను తిప్పికొట్టింది.

తాము పరువునష్టం దావా వేసిన రాహుల్ గాంధీకి కూడా ఆహ్వానం పంపడం ద్వారా చాలా తెలివిగా పావులు కదిపిన ఆరెస్సెస్, తమ ప్రత్యర్థులపై పైచేయి సాధించింది.

రాహుల్ గాంధీ తాను ఎలా ప్రేమతో విద్వేషాన్ని జయించడానికి ప్రయత్నిస్తున్నారో చెబుతుంటారు. ఆ ప్రేమ గురు అవతారంలో ఆయన పార్లెమెంట్‌లో ప్రధాని మోదీని కౌగిలించుకునేంత వరకు వెళ్లారు.

అందువల్ల ఆరెస్సెస్.. రాహుల్ గాంధీ తాను చెప్పే దానిని ఆచరించి చూపాలని, వచ్చి భాగవత్ ప్రసంగాలను వినాలని సవాలు చేసింది.

అయితే ఈ ఆహ్వానంపై కాంగ్రెస్ నోరు విప్పలేదు. రాహుల్ గాంధీని కూడా మాట్లాడమని ఆహ్వానించి ఉంటే ఆయన వెళ్లి ఉండేవారని, కానీ తాను వ్యతిరేకించే భావజాలం గురించి వినడం ఎందుకనే రాహుల్ వెళ్లలేదని ఆ పార్టీలో కొంతమంది వివరణ ఇస్తున్నారు. కానీ అదంత సమర్థనీయం కాదు.

అఖిలేష్ యాదవ్ కొంత తెలివిగా - తనకు ఆరెస్సెస్ గురించి చాలా తక్కువగా తెలుసునని తప్పించుకున్నారు. తనకు తెలిసిందంతా సర్దార్ పటేల్ ఆరెస్సెస్‌ను నిషేధించారని మాత్రమే అని, అందుకే తాను దానికి దూరంగా ఉండదల్చుకున్నానని తెలిపారు.

అందువల్ల సంఘ్ తన ప్రత్యర్థుల హృదయాలను గెల్చుకోలేకపోయినా, పతాకశీర్షికలను మాత్రం ఆక్రమించగలిగింది.

Image copyright Getty Images

నిజానికి ప్రణబ్ ముఖర్జీని నాగ్‌పూర్‌కు ఆహ్వానించడం, ఆయన దానిని మన్నించడమే ఆరెస్సెస్ విజయం. దానికి కౌంటర్‌గా కాంగ్రెస్ స్వయానా ఆయన కూతురు శర్మిష్ట ముఖర్జీనే రంగంలోకి దింపి ఆరెస్సెస్ ఆహ్వానాన్ని మన్నించినందుకు తన తండ్రిని విమర్శించడం ద్వారా కొంత నష్టనివారణ చర్యలు చేపట్టింది.

ఆరెస్సెస్ సహకారాన్ని మోదీ, అమిత్ షాలు అంత తేలిగ్గా తీసుకోవద్దన్నది ఆరెస్సెస్ సందేశం. భాగవత్ గతంలో అమిత్ షా 'కాంగ్రెస్ ముక్త భారత్' అని ఇచ్చిన పిలుపును బహిరంగంగానే తప్పుబట్టారు. ఆరెస్సెస్ ఆయన పిలుపుతో ఏకీభవించదని స్పష్టం చేశారు.

డాక్టర్ మురళీ మనోహర్ జోషిని రాష్ట్రపతిగా చేయాలన్న తమ విన్నపాన్ని కూడా మోదీ మన్నించనందుకు ఆరెస్సెస్ ఆయనపై గుర్రుగా ఉంది. ఎన్నడూ ప్రచారక్‌గా కూడా లేని కోవింద్‌ను రాష్ట్రపతిని చేయడం సంఘ్ సీనియర్లకు నచ్చలేదు.

Image copyright Getty Images

నిజానికి ఇటీవల ఆరెస్సెస్ పూర్తిగా మారిపోయింది. ఆ సంస్థ డ్రెస్ కోడ్ ఖాకీ నిక్కర్ల నుంచి ప్యాంట్లకు మారింది. మరి దృక్పథం?

సంఘ్‌లోని ఒక ప్రముఖుడు, ''భారతదేశాన్ని తమ మాతృభూమిగా అంగీకరించేవారంతా మన వాళ్లే అని భాగవత్ మళ్లీ మళ్లీ చెబుతారు. మేం హింసకు వ్యతిరేకం అని స్పష్టంగా చెబుతున్నాం'' అన్నారు

అయితే ఇటీవల మోహన్ భాగవత్ చికాగోలో జరిగిన వీహెచ్‌పీ సమావేశంలో 'కుక్కలు సింహాన్ని చూసి అరుస్తున్నాయి' అని పేర్కొనడం మాత్రం వివాదాస్పదమైంది.

Image copyright Getty Images

ఆరెస్సెస్‌లో అలంకారప్రాయమైన మార్పులు అయితే వచ్చాయి కానీ 'హిందూ సమాజం' ఏకం కావాలన్న ఆరెస్సెస్ పిలుపు, హిందూ సంరక్షణ తదితర వాదనలు దానిపై ఇంకా చాలా మందికి సందేహాలను కలిగిస్తూనే ఉన్నాయి.

ప్రస్తుతం కేంద్రంతో పాటు 22 రాష్ట్రాలూ ఆరెస్సెస్ రాజకీయ విభాగం అయిన బీజేపీ పాలన కింద ఉన్నాయి. మెజారిటీ ప్రజల మనోభావాల పేరిట ఇన్నాళ్లూ ఆరెస్సెస్ చేసిన ప్రచార వ్యూహం ఫలించింది.

మొదటి నుంచి ఆరెస్సెస్‌తో సంబంధాలు కలిగిన ఒక బీజేపీ నేత, ''మైనారిటీలను బుజ్జగించే విధానాలను చేపడుతున్నాయని హిందువులు భావించకుండా చూసుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు అన్ని పార్టీల మీద ఉంది. మేం సాధించిన అతి పెద్ద విజయం అదే. మేం దేశాన్ని మార్చగలిగాం. ఇప్పడు మనది హిందు ప్రధాన దేశం'' అన్నారు.

ఇదే భవిష్యత్ ప్రశ్న. భారతదేశం అంబేద్కర్ కలగన్న రాజ్యాంగబద్ధమైన రిపబ్లిక్‌గా ఉంటుందా లేక హిందూ ప్రధాన దేశంగానా?

ఆరెస్సెస్ భావజాలం ఇప్పుడు దేశంలో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించిందా లేదా అన్న విషయాన్ని 2019 ఎన్నికలు నిర్ణయించబోతున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)