అమృత కన్నీటి కథ : ‘‘నన్ను గదిలో బంధించే వారు... ప్రణయ్‌ని మరచిపోవాలని రోజూ కొట్టేవారు’’

  • 18 సెప్టెంబర్ 2018
అమృత

''ఆ రోజు ఆలస్యంగా నిద్ర లేచాను. నడుము నొప్పిగా ఉంది. ప్రణయ్‌ని పిలిచాను. 'కన్నా వస్తున్నా' అన్న ప్రణయ్ పిలుపు ఇంకా నా మదిలో వినిపిస్తూనే ఉంది. నేను బ్రేక్‌ఫాస్ట్ చేశాను. హాస్పిటల్‌కి ఆలస్యం అవుతుందని ప్రణయ్ ఏమీ తినలేదు'' ఉబికివస్తున్న బాధను దిగమింగుకుని చెప్తోంది అమృత.

అమృతను ఆస్పత్రికి తీసుకెళ్లి వస్తుండగా, ఆ ఆస్పత్రి బయటే ప్రణయ్‌ని కిరాతకంగా నరికి చంపి నాలుగు రోజులయింది. కళ్ల ముందే భర్తను చంపేస్తుంటే గుండెలవిసేలా రోదించింది అమృత. ‘నా ప్రణయ్‌ని చంపేశారు’ అంటూ ఇంకా రోదిస్తూనే ఉంది. చాలా బలహీనంగా కనిపిస్తోంది. కానీ, ధైర్యంగా కనిపించే ప్రయత్నం చేస్తోంది.

ఆవేదన.. ఆక్రోశం.. ఆగ్రహం.. ఆమె కళ్లలో కలగలిసిపోయాయి. ప్రణయ్‌తో తన చిన్ననాటి స్నేహం గురించి.. ఆనాటి తీపి గుర్తుల గురించి చెప్తున్నపుడు.. కన్నీళ్లు ఉప్పొంగినా వాటిని కళ్లను దాటి రానివ్వలేదు.

Image copyright Amrutha Pranay/Facebook

‘‘నన్ను తల్లిలా చూసుకున్నాడు. నా కోసం వంట చేసేవాడు.. తినిపించేవాడు. నా జీవితంలో ఒక భాగమైపోయాడు.’’ తన భర్త ప్రణయ్ గురించి అమృత చెప్పిన మాటలివి.

పెరుమాళ్ల ప్రణయ్ వయసు 24 సంవత్సరాలు. అమృత వర్షిణి వయసు 21 సంవత్సరాలు. ఇద్దరిదీ చిన్ననాటి స్నేహ బంధం. అది ప్రేమ బంధమైంది.

కానీ.. నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో.. వారిద్దరి కులాలు వేర్వేరు స్థాయిల్లో ఉన్నాయి. అబ్బాయిది ‘కింది’ కులం. అమ్మాయిది ‘అగ్ర’ కులం. వారి ప్రేమను అమ్మాయి తండ్రి కాదన్నాడు. ఈ ప్రేమికులు ‘పెద్దల’ను ఎదిరించారు. కులాన్ని ధిక్కరించారు. పెళ్లితో ఒకటయ్యారు. ఆగ్రహించిన ‘పెద్దలు’ అబ్బాయిని చంపించేశారు.

‘‘చిన్ననాటి నేస్తాన్ని పెళ్లాడటానికి మించిన ఆనందం మరొకటి ఉండదు. జీవితాంతం కలిసుండటానికే పుట్టాం’’ అంటూ.. ప్రణయ్, తన చిన్ననాటి ఫొటోలను ఫేస్‌బుక్‌లో పెట్టి ఇంగ్లిష్‌లో ఈ వాక్యం రాసింది అమృత.

ఫోన్ చూసుకుంటూ, తన గదిలోకి ఎవరు వస్తున్నారు? ఎవరు వెళ్తున్నారు? అని చూస్తూ గాభరాగా కనిపిస్తోందామె. ప్రణయ్‌ని ఎలా కలిశారన్న ప్రశ్న అడిగినప్పుడు మాత్రం ఆమె ముఖంలో నవ్వు వికసించింది.

‘‘మా స్కూల్లో ఒక ఏడాది సీనియర్. నేను 9వ తరగతిలో ఉన్నపుడు.. ప్రణయ్ 10వ తరగతిలో ఉన్నాడు. అప్పుడే మా ప్రేమ మొదలైంది. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. ఫోన్లో చాలా సేపు మాట్లాడుకునే వాళ్లం’’ అని చెప్పింది.

‘‘ఈ పాపాయి మా ప్రేమకు గుర్తు’’ అంటూ తన చేతితో పొట్టపై మృదువుగా తడుముతూ చెప్పింది. ‘‘నా బిడ్డ నాకు దక్కింది. ఈ బిడ్డ ప్రణయ్ లాగే నన్ను తనకి దగ్గరగా ఉంచుతుంది’’ అంది.

Image copyright amrutha.pranay.3/facebook

ఒకరినొకరం చూసుకోవడానికి పారిపోవాల్సి వచ్చేది...

అమృత ప్రణయ్‌లది ఎప్పుడూ సుఖాంతమైన కథ కాదు. పెళ్లికి ముందు వారు ఎన్నో బెదిరింపులు ఎదుర్కొన్నారు. దెబ్బలు తిన్నారు.

‘‘ఇది చాలా చిన్న పట్టణం. మా తల్లితండ్రులకు మా ప్రేమ గురించి తెలిసిపోవడంతో ఇకపై నేను ప్రణయ్‌ని కలవకూడదని హెచ్చరించారు. కానీ అది నన్ను ఆపలేకపోయింది. నేను అతని కులం, ఆర్థిక స్తోమత చూడలేదు. మేం ఒకర్నొకరు ఇష్టపడ్డాం.. ఒకర్నొకరు బాగా అర్థం చేసుకున్నాం. అదే మాకు ముఖ్యం’’ అని చెప్పింది అమృత.

ఆమె ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలో ఉండగా 2016 ఏప్రిల్లో మొదటిసారి పెళ్లి చేసుకున్నారు. దీంతో అమృతను ఆమె తల్లితండ్రులు ఇంట్లో నిర్బంధించారు.

‘‘మా బాబాయ్ ప్రణయ్‌ని బెదిరించాడు. నన్ను డంబెల్స్‌తో కొట్టాడు.. ఇదంతా నా కన్న తల్లి, మరో 20 మంది కుటుంబ సభ్యులు, చుట్టాల మధ్య జరిగింది. నా తరఫున నుంచోడానికి ఎవరూ ముందుకు రాలేదు. నన్ను గదిలో బంధించారు. ప్రణయ్ వేరే కులం వ్యక్తి.. అందునా ఎస్‌సీ కావడంతో నేను ప్రణయ్‌ని మర్చిపోవాలన్నారు’’ అని వివరించింది.

‘‘నా చిన్నప్పుడు కూడా మా అమ్మ ఇతర కులాల వారితో ఫ్రెండ్షిప్ చేయనిచ్చేది కాదు. నన్ను గదిలో బంధించినప్పుడు నాకు రోజూ పచ్చడి అన్నం పెట్టేవాళ్లు. మా బాబాయ్ ప్రణయ్‌ని మర్చిపోవాలంటూ నన్ను కొట్టేవాడు. నా చదువు మాన్పించేశారు. నాకు ప్రణయ్‌తో మాట్లాడే అవకాశం లేకపోయింది. నన్ను నడిపించింది ప్రణయ్ మీద ఉన్న ప్రేమే’’ అంటూ ధృఢంగా చెప్పింది అమృత.

2018 జనవరి 30న అమృత ప్రణయ్‌లకి పెళ్ళయ్యే వరకూ ఆమె ప్రణయ్‌ని చూడలేదు.

‘‘నాకు ఆరోగ్య సమస్యలుండేవి. నేను ఆసుపత్రిలో డాక్టర్లు లేదా అక్కడి స్టాఫ్ ఫోన్లు తీసుకుని ప్రణయ్‌తో మాట్లాడేదాన్ని. ఆ కొన్ని క్షణాలే మమ్మల్ని నడిపించాయి. మొత్తానికి మేము ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకోవాలనుకున్నాం. అక్కడైతే పెళ్లికి చట్టబద్ధమైన పత్రాలుంటాయని. అంతకుముందు గుళ్లో జరిగిన మా పెళ్లికి ఎటువంటి పత్రాలూ లేకపోవడంతో మా తల్లితండ్రులు నన్ను బంధించగలిగారు. కానీ ఈసారి మేం మా పెళ్లి కోసం పోరాడాలనుకున్నాం’’ అంది అమృత.

ప్రణయ్ కుటుంబానికి ఈ పెళ్లి గురించి తెలియదు. పెళ్లైన వెంటనే వారు హైదరాబాద్ వెళ్లారు. అక్కడైతే సురక్షితంగా ఉండొచ్చనుకున్నారు.

‘‘మేం హైదరాబాద్‌లో నెలన్నర ఉన్నాం. కానీ మా గురించి ఎంక్వైరీ చేయడానికి మా నాన్న గూండాలను పంపాడు. దీంతో మేం కుటుంబానికి దగ్గరగా ఉండడం సురక్షితం అని భావించి మిర్యాలగూడ వచ్చేసి ప్రణయ్ వాళ్ల ఇంట్లో ఉన్నాం. మేం పెద్ద చదువులకు విదేశాలకు వెళ్లాలనుకున్నాం. కానీ ఈలోపే నేను గర్భవతినయ్యా. అది మాకు ఎంతో సంతోషకరమైన విషయం. బిడ్డ పుట్టేంత వరకూ ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాం. బిడ్డ పుట్టాక చదువుల కోసం కెనడా వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాం’’ అని అమృత చెప్పింది.

ఆ రోజు జరిగిన సంఘటనలను గుర్తుచేసుకుంటూ.. ‘‘ఆ రోజు ఆలస్యంగా నిద్ర లేచాను. నడుము నొప్పిగా ఉంది. ప్రణయ్‌ని పిలిచాను. ‘కన్నా వస్తున్నా’ అన్న ప్రణయ్ పిలుపు ఇంకా నా మదిలో వినిపిస్తూనే ఉంది. నేను బ్రేక్‌ఫాస్ట్ చేశాను. హాస్పిటల్‌కి ఆలస్యం అవుతుందని ప్రణయ్ ఏమీ తినలేదు’’ ఉబికివస్తున్న బాధను దిగమింగుకుని చెప్తోంది అమృత.

‘‘డాక్టర్ దగ్గర ఉన్నపుడే మా నాన్న డాక్టర్‌కి ఫోన్ చేశారు. అబార్షన్ గురించి ఏం నిర్ణయం తీసుకుందని ఆడినట్లు అక్కడే కూర్చున్న మాకు అర్ధం అయ్యింది. ఇంకా రాలేదని డాక్టర్ ఫోన్ పెట్టేశారు. ఈ లోపు నా ఫోన్‌కి మా నాన్న ఫోన్ చేశారు. నేను ఫోన్ ఎత్తలేదు. మేం హాస్పిటల్ బయటకు వచ్చాం. నేను ఎదో చెప్తున్నా.. కానీ ప్రణయ్ సమాధానం ఇవ్వలేదని తిరిగి చూసేటప్పటికి.. ఒక వ్యక్తి ప్రణయ్ మీద కత్తితో దాడి చేస్తున్నాడు. మా అత్తగారు ఆ వ్యక్తిని తోసేశారు. నేను హాస్పిటల్ లోపలికి పరుగెత్తాను.

కాసేపటి తరువాత నాకు అనుమానం వచ్చి మా నాన్నకి ఫోన్ చేసి ‘ప్రణయ్‌ని ఎవరో చంపే ప్రయత్నం చేశార’ని చెప్పాను. కానీ అయన మాత్రం నాకెందుకు ఫోన్ చేశావ్ అన్నారు" అని వివరించింది అమృత. అయితే, తన తండ్రిని అనుమానించటానికి కారణం ఉందని చెప్పింది.

‘‘కొద్ది రోజుల కిందట మా నాన్నకి ఒక చిన్న ఆపరేషన్ అయ్యింది. నాన్నని కలవాలని మా అమ్మ బలవంతం చేశారు. కానీ వెళ్ళటం ఇష్టం లేక.. నేను, ప్రణయ్ బెంగళూరు వెళ్తున్నామని అబద్ధం చెప్పాను. ఆ మరుసటి రోజు ఉదయాన్నే ఒక వ్యక్తి ప్రణయ్ వాళ్ల ఇంటికి వచ్చి ‘బయట ఉన్న కారు అద్దెకి ఇస్తారా?‘ అని అడిగాడు. ఆ వ్యక్తి హిందీలో ఆరా తీశాడు. ఆ రోజు మా మామగారు సమాధానం చెప్పి పంపించారు. హాస్పిటల్ బయట ప్రణయ్‌ని చంపింది కూడా ఆ వ్యక్తే. అందుకే నాకు వెంటనే అనుమానం వచ్చింది. మా అమ్మ కూడా నాకు రోజూ ఫోన్ చేసి మాట్లాడేది. తెలిసో తెలియకో మా సమాచారం మా నాన్నకి చెప్పేది. నాకు జరిగిన అన్యాయానికి మా కుటుంబమే కారణం’’ అంది అమృత.

‘జై భీం’.. ‘ప్రణయ్ అమర్ రహే’ అనే నినాదాలు వారి ఇంటి బయట వినిపిస్తున్నాయి. దళిత బహుజన సంఘాలు, మహిళా సంఘాల వారు తమ సంఘీభావం తెలిపేందుకు ప్రణయ్ ఇంటికి వస్తున్నారు. తనకు మద్దతు అందుతున్నందుకు సంతోషంగా ఉంది అంటోంది అమృత.

తను అప్పుడే ‘జస్టిస్ ఫర్ ప్రణయ్’ అనే ఒక పేజీని ఫేస్‌బుక్‌లో క్రియేట్ చేసింది.

‘‘ప్రణయ్ అంటుండేవాడు... ప్రేమించుకున్న వారికి కులం అన్నది అడ్డు గోడ కాకూడదని. మేం కులం పేరుతో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. నేను న్యాయం కోసం పోరాడతాను. ప్రణయ్ విగ్రహం ఏర్పాటు చేయాలి. దానికి కావాల్సిన ఏర్పాట్లు చేయటమే తక్షణ కర్తవ్యం’’ అని అమృత తన నిర్ణయాన్ని దృఢంగా వ్యక్తంచేసింది.

చిత్రం శీర్షిక ప్రణయ్ తల్లిదండ్రులైన తన అత్తమామలకు, తన బిడ్డకు కూడా ప్రమాదం ఉందని అమృత ఆందోళన వ్యక్తంచేస్తోంది

ప్రణయ్ తల్లి హేమలత, తండ్రి బాలస్వామి, తమ్ముడు అజయ్ గుండె పగిలిన బాధలో ఉన్నారు. అజయ్ మాత్రం అమృతకు కావాల్సిన సపర్యలు చేస్తున్నాడు. వదినని ఒంటరిగా ఒక్క క్షణం కూడా వదలకుండా ఆమె అవసరాలు చూసుకుంటున్నాడు. ‘‘అజయ్ ఇప్పుడు నా తమ్ముడు. ఇది నా ఇల్లు. నా పుట్టబోయే బిడ్డ ఇక్కడికే వస్తుంది’’ అంటూ పక్కనే ఉన్న తన అత్త హేమలతను ఓదారుస్తూ చెప్పింది అమృత.

కులరహిత సమాజం కోసం పోరాటం కొనసాగిస్తానంటున్న అమృత.. తన భవిష్యత్తు గురించి మాత్రం కాస్త భయంగా ఉందని అంటోంది.

‘‘నా బిడ్డకు కానీ, నా అత్త మామలకు కానీ ఏమైనా హాని తలపెడతారేమో అన్న అనుమానం ఇంకా ఉంది’’ అని ఆందోళన వ్యక్తంచేసింది. కానీ తన ఆర్థిక స్వతంత్రత.. పుట్టబోయే బిడ్డ ఆలనా పాలనా ఎలా అన్నది మాత్రం ఒక ప్రశ్నే. అత్తగారు మామగారు సొంత కూతురులా చూసుకుంటామంటున్నా.. డిగ్రీ కూడా పూర్తి చేయలేకపోయిన అమృత భవిష్యత్తు ఏమిటన్నది కాలమే చెప్తుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)