బ్యాంక్ ఆఫ్ బరోడా: మూడు బ్యాంకుల విలీనంతో సామాన్యుడికి లాభమేంటి?

  • నితిన్ శ్రీవాస్తవ
  • బీబీసీ ప్రతినిధి
బ్యాంక్ ఆఫ్ బరోడా

ఫొటో సోర్స్, Getty Images

బ్యాంకులకు సంబంధించిన ఏ చిన్న విషయమైనా సామాన్యుల జీవితాలతో ముడిపడి ఉంటుంది. కొంతమంది తమ జీవితకాల సంపాదనను బ్యాంకుల్లోనే దాచుకుంటారు. ఇంకొందరు తమ వ్యాపార లావాదేవీల కోసం బ్యాంకులపైనే ఆధారపడతారు. మరీముఖ్యంగా ప్రభుత్వ బ్యాంకులను పేదలు తమ జీవితంలో భాగం చేసుకున్నారు. రుణ మాఫీలు, సంక్షేమ పథకాల లాంటి వాటికి ఆ బ్యాంకు ఖాతాలే ఆధారం.

ప్రభుత్వ రంగానికి చెందిన మూడు బ్యాంకులు... బ్యాంక్ ఆఫ్ బరోడా, విజయా బ్యాంకు, దేనా బ్యాంకులను విలీనం చేసేందుకు కేంద్ర క్యాబినెట్ బుధవారం (2019 జనవరి 2వ తేదీ) నిర్ణయం ప్రకటించింది. ఆ విలీన ప్రక్రియ పూర్తయితే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ తరువాత అదే మూడో అతిపెద్ద బ్యాంకుగా అవతరిస్తుందని ప్రభుత్వం చెబుతోంది.

ఈ విలీనం వల్ల ఎవరికి లాభం చేకూరుతుందనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. బ్యాంక్ ఆఫ్ బరోడా, విజయా బ్యాంకులతో పోలిస్తే దేనా బ్యాంకు చాలా చిన్నది, బలహీనమైంది. అలాంటప్పుడు ఆ రెంటితో ఈ బ్యాంకును కలపడానికి కారణలేంటో తెలియట్లేదని నిపుణులు అంటున్నారు.

విలీన ప్రక్రియ ముగిశాక ఏర్పడే కొత్త బ్యాంకులో 85వేల మందికి పైగా ఉద్యోగులుంటారు. దేశ, విదేశాల్లో కలిపి దానికి 9,485 శాఖలు ఏర్పడతాయి. మొత్తం ఆ బ్యాంకు వ్యాపార విలువ 14.8లక్షల కోట్ల రూపాయలు దాటుతుంది.

ఫొటో సోర్స్, PTI

‘ఈ విలీనం గురించి నాలుగేళ్ల క్రితం చర్చ మొదలైంది. అప్పటికి ఆ ప్రణాళిక పత్రాలకే పరిమితమైంది. ఇప్పుడే దీని గురించి అధికారిక ప్రకటన వెలువడింది. మూడేళ్ల క్రితం జ్ఞానసంగమ్ పేరుతో పుణెలో ఓ కార్యక్రమం జరిగింది. ఏ బ్యాంకు విలీనమైనా దాని నాణ్యత, సామర్థ్యం, ఉద్యోగుల సంఖ్య, ఆర్థిక పరిస్థితి లాంటి అన్ని అంశాలనూ బేరీజు వేశాకే జరుగుతుందని ప్రభుత్వం ప్రకటించింది’ అని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ ఛైర్మన్ అరుణ్ తివారీ అన్నారు.

ఈ మూడు బ్యాంకుల విలీనం వల్ల లాభాలున్నాయన్నది ఆయన అభిప్రాయం. ‘బ్యాంక్ ఆఫ్ బరోడా పశ్చిమ, ఉత్తర భారతంలో విస్తరించడంతో పాటు విదేశాల్లోనూ దాని శాఖలున్నాయి. అది మిగతా రెండు బ్యాంకులకు సానుకూలంగా మారుతుంది. దక్షిణాదిలో విజయా బ్యాంకుకు బలమైన పునాదులున్నాయి. ఈ పరిణామాలన్నీ బలహీనంగా ఉన్న దేనా బ్యాంకుకు వరంగా మారతాయి’ అని ఆయన చెప్పారు.

ఈ విలీనం వల్ల అటు బ్యాంకు సిబ్బందితో పాటు ఇటు ఖాతాదారులకు కూడా ఎన్నో లాభాలు చేకూరుతాయని ప్రభుత్వం చెబుతోంది. కానీ ఈ కొత్త బ్యాంకు పేరు, తీరు, విధివిధానాల గురించి ఎలాంటి స్పష్టతా రాలేదు.

కానీ 2018 సెప్టెంబర్‌లో ఈ విలీన ప్రకటన వెలువడిన నాటి నుంచి ఆ ప్రభావం స్టాక్ మార్కెట్‌పైన స్పష్టంగా కనిపిస్తోంది. బ్యాంక్ ఆఫ్ బరోడా షేర్ల విలువ 17శాతం మేర పడిపోతే, విజయా బ్యాంకు, దేనా బ్యాంకుల షేర్ల విలువ మాత్రం అమాంతం పెరిగింది.

ఈ పరిణామం ముందే ఊహించిందని నిపుణులు చెబుతున్నారు. ఈ మూడు బ్యాంకుల్లో బ్యాంక్ ఆఫ్ బరోడా చాలా బలమైనది. కాబట్టి, మిగతా రెండు బ్యాంకుల బరువునూ అది కొంత వరకూ మోయాల్సి ఉంటుందని వారు అంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

‘ఈ విలీనం ముందే జరగాల్సింది. అయినా, ఇప్పటికీ మించిపోయిందేం లేదు’, అని బ్యాంక్ ఆఫ్ బరోడా మాజీ జనరల్ మేనేజర్ అన్ రమణి అన్నారు. ‘ఒక దేశంలో అన్ని బ్యాంకులు ఉండటం కూడా సరికాదు. వాటిన్నింటికీ పెట్టుబడులను సమకూర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపైన ఉంటుంది. రెండు బలమైన బ్యాంకులో, లేదా రెండు బలహీన బ్యాంకులో కలవడం వల్ల పెద్దగా ప్రయోజనాలు ఉండవు. కాబట్టి, ప్రస్తుతం జరిగేది సరైన విలీనమే’ అని ఆయన చెప్పారు.

‘విజయా, దేనా బ్యాంకులకు ప్రభుత్వం భారీ మొత్తంలో పెట్టుబడులను సమకూరుస్తోంది. విలీనం తరువాత అది తగ్గిపోతుంది. మరోపక్క బ్యాంక్ ఆఫ్ బరోడా, విజయా బ్యాంకుల నిరర్థక ఆస్తుల కంటే దేనా బ్యాంకుకు ఉన్న నిరర్థక ఆస్తుల శాతమే ఎక్కువ. విలీనం తరువాత ఈ సమస్యకూ పరిష్కారం లభించొచ్చు. ఇది మిగతా బ్యాంకుల విలీనానికి కూడా మార్గం సుగమం చేస్తుంది’ అని అన్ రమణి వివరించారు.

కొన్నాళ్ల క్రితం ఎస్‌బీఐతో దాని అనుబంధ బ్యాంకులను విలీనం చేశాక ఎలాంటి సమస్యలూ తలెత్తలేదని ఆయన అన్నారు.

కొత్త బ్యాంకు పేరును ఇంకా నిర్ణయించకపోయినా, బ్యాంక్ ఆఫ్ బరోడాకు ఉన్న బ్రాండ్ విలువ కారణంగా, విలీనం తరువాత ఏర్పడే బ్యాంకుకు అదే పేరును కొనసాగిస్తారని నిపుణులు భావిస్తున్నారు.

ఈ పరిణామాల గురించి బ్యాంకు ఖాతాదారులు ఏ మాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని యూబీఐ మాజీ ఛైర్మన్ అరుణ్ తివారీ పేర్కొన్నారు.

‘గత 40-50ఏళ్లలో నాలుగైదు బ్యాంకులు, బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనమయ్యాయి. దానివల్ల డిపాజిటర్లు, రుణగ్రహీతల సంఖ్య ఏమాత్రం తగ్గలేదు. ఎలాంటి ఫిర్యాదులూ తలెత్తలేదు’ అని ఆయన తెలిపారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)