ఆయుష్మాన్ భారత్‌‌కు అర్హతలేంటి? ఆరోగ్య శ్రీకి దీనికీ తేడాలేంటి?

 • 23 సెప్టెంబర్ 2018
వైద్యులు Image copyright Getty Images

దేశంలో 10 కోట్లకుపైగా పేద కుటుంబాలకు ఆరోగ్య బీమా కల్పించేందుకు ఉద్దేశించినదని చెబుతున్న 'ఆయుష్మాన్ భారత్- ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన' పథకాన్ని ఇవాళ (సెప్టెంబర్ 23) ఝార్ఖండ్‌లోని రాంచీలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ ఆరోగ్య పథకంగా చెబుతున్న ఆయుష్మాన్ భారత్ కింద దేశంలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న 10.74 కోట్ల కుటుంబాలకు (సుమారు 50 కోట్ల మందికి) ఏటా రూ. 5 లక్షల ఆరోగ్య బీమా సదుపాయాన్ని కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.

దీనికి విధించిన నిబంధనలను చూస్తే ప్రభుత్వం చెబుతున్న అందరికీ కేంద్ర పథకం వర్తిస్తుందా అన్నది ప్రశ్నార్థకం.

ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు ఆ వైద్య ఖర్చులను భరించలేక అనేక కుటుంబాలు వీధిన పడుతున్నాయని, అలాంటి వారికి అండగా నిలిచేందుకే ఈ పథకం ప్రారంభిస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది.

ఈ పథకం అమలు బాధ్యతను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకే అప్పగించింది.

అయితే, తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఆరోగ్య శ్రీ, ఎన్టీఆర్ వైద్య సేవ పథకాలు అమలవుతున్నాయి. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి తర్వాత తెల్ల రేషన్‌ కార్డు కలిగిన పేదలందరికీ ఉచితంగా కార్పొరేట్ వైద్య సదుపాయం అందించే ఆరోగ్య శ్రీ పథకం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభమైంది. మరి ఆ పథకాలకు, ఇప్పుడు కేంద్రం తీసుకొస్తున్న 'ఆయుష్మాన్ భారత్'కి మధ్య ఉన్న తేడా ఏంటి? తెల్లరేషన్ కార్డు ఉన్నవారంతా ఆరోగ్య శ్రీకి అర్హులే. మరి ఆయుష్మాన్ భారత్‌కి?

Image copyright iStock

ఆరోగ్యశ్రీలో రూ.2 లక్షలు, ఆయుష్మాన్ భారత్‌లో రూ.5 లక్షలు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2007‌ ఏప్రిల్ 1న అప్పటి ముఖ్యమంత్రి వై‌ఎస్. రాజశేఖర్ రెడ్డి హయాంలో 'రాజీవ్ ఆరోగ్యశ్రీ' పథకాన్ని ప్రారంభించారు.

రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ ప్రభుత్వం దానిని అదే పేరుతో కొనసాగిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'ఎన్టీఆర్ వైద్య సేవ' అనే పేరుతో అమలు చేస్తోంది.

తెలంగాణలో 949 రకాల చికిత్సలు ఆరోగ్య శ్రీ పథకం కిందకు వస్తాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద 1040 రకాల చికిత్సలను పేర్కొన్నారు.

ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ 'ఆయుష్మాన్ భారత్' కింద 1,350 రకాల చికిత్సలు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఉచితంగా చేయించుకునే వీలుంటుంది. మందులు, వైద్య పరీక్షలు కూడా ఉచితమే.

తెలంగాణలో ఆరోగ్యశ్రీ ద్వారా ఏడాదిలో ఒక కుటుంబం రూ. 200,000 వరకు లబ్ధిపొందే వీలుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఆ పరిమితి 2.5 లక్షలుగా ఉంది. ఆయుష్మాన్‌ భారత్‌లో అది రూ.5 లక్షలు.

తెలుగు రాష్ట్రాల్లో వినికిడి లోపంతో బాధపడే రెండేళ్లలోపు చిన్నారులకు కోక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ కోసం రూ. 6.5 లక్షల వరకు ప్రభుత్వాలే భరిస్తున్నాయి.

Image copyright Getty Images

బైకు ఉన్నా... ఇంట్లో రిఫ్రిజిరేటర్ ఉన్నా అనర్హులే

తెలుగు రాష్ట్రాల్లో తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ ఆరోగ్య శ్రీ లేదా ఎన్టీఆర్ వైద్య సేవ పథకానికి అర్హులే. ఆ రేషన్ కార్డుపై ఫొటోలో ఉన్న సభ్యులందరికీ ఆరోగ్య శ్రీ వర్తిస్తుంది.

అలా ప్రస్తుతం తెలంగాణలో 77.19 లక్షల కుటుంబాలు, ఆంధ్రప్రదేశ్‌లో 1.42 కోట్ల కుటుంబాలు ఈ పథకాల కిందకు వస్తున్నారు.

అయితే, కేంద్ర ప్రభుత్వ పథకానికి లబ్ధిదారుల ఎంపిక తీరు గందరగోళంగా ఉంది. రేషన్ కార్డుల్ని కాకుండా, 2011 నాటి సామాజిక, ఆర్థిక, కుల జనగణన ఆధారంగా ఎంపిక చేస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం ద్విచక్ర వాహనం ఉన్నా... ఇంట్లో రిఫ్రిజిరేటర్ ఉన్నా... ల్యాండ్‌ ఫోన్ ఉన్నా... ఆ కుటుంబానికి ఆయుష్మాన్ భారత్‌ పథకం వర్తించదు.

కుటుంబంలో ఒక్కరు నెలకు రూ.10 వేలకు మించి సంపాదిస్తున్నా ఆ కుటుంబం ఈ పథకం కిందకు రాదు.


బీబీసీ తెలుగు ప్రత్యేక కథనాలు


ఈ కుటుంబాలు 'ఆయుష్మాన్ భారత్‌' పథకం కిందకు రావు:

 • 2/3/4 వీలర్ మోటారు వాహనం, లేదా చేపలు పట్టే బోటు ఉన్న కుటుంబాలు
 • 3/4 వీలర్ వ్యవసాయ యంత్రాలు ఉన్న కుటుంబాలు
 • రూ.50 వేలకు మించి క్రెడిట్ పరిమితి గల కిసాన్ క్రెడిట్ కార్డు కలిగిన కుటుంబాలు
 • కుటుంబ సభ్యుడు ప్రభుత్వ ఉద్యోగి అయితే
 • ప్రభుత్వం వద్ద నమోదైన వ్యవసాయేతర సంస్థ కలిగి ఉన్న కుటుంబాలు
 • కుటుంబంలోని ఎవరైనా ఒక సభ్యుడు నెలకు రూ. 10,000కు పైగా సంపాదిస్తుంటే
 • ఆదాయపన్ను చెల్లిస్తున్న కుటుంబాలు
 • ప్రొఫెషనల్ ట్యాక్స్ చెల్లిస్తున్న కుటుంబాలు
 • మూడు లేదా అంతకంటే ఎక్కువ గదుల పక్కా ఇల్లు కలిగిన కుటుంబాలు
 • రిఫ్రిజిరేటర్ కలిగిన కుటుంబాలు
 • ల్యాండ్‌లైన్ ఫోన్ కలిగిన కుటుంబాలు
 • 2.5 ఎకరాలకు మించి సాగునీటి వసతి కలిగిన వ్యవసాయ భూమి, 1 వ్యవసాయ యంత్రం కలిగిన కుటుంబాలు
 • రెండు కంటే ఎక్కువ పంటలు పండే ఐదెకరాల భూమి కలిగిన కుటుంబాలు
 • కనీసం ఒక పంట పండించే ఏడున్నర ఎకరాల భూమి ఉండి, కనీసం ఒక వ్యవసాయ యంత్రం కలిగిన కుటుంబాలు

ఏదైనా కారణం వల్ల అనర్హుల పేర్లు లబ్ధిదారుల జాబితాలో కనిపిస్తే తొలగించేలా జిల్లా కలెక్టర్లకు, డిప్యూటీ కమిషనర్లకు అనుమతి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది.

Image copyright abnhpm.gov.in

నో చెప్పిన తెలంగాణ

ఆ లెక్కన చూస్తే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఉన్న ఆరోగ్య శ్రీ, ఎన్టీఆర్ వైద్య సేవ పథకాల లబ్ధిదారుల సంఖ్యకు, కేంద్ర ప్రభుత్వ పథకం లబ్ధిదారుల సంఖ్యకు మధ్య వ్యత్యాసం భారీగా ఉంటోంది.

ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్. నర్సింగా రెడ్డి చెప్పిన వివరాల ప్రకారం... "తెలంగాణలో ప్రస్తుతం ఆరోగ్య శ్రీ లబ్ధిదారులు దాదాపు 2.8 కోట్ల మంది(77.19 లక్షల కుటుంబాలు) ఉన్నారు. అందులో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఆయుష్మాన్ భారత్‌కి అర్హత పొందేవారు కేవలం 85 లక్షల మంది మాత్రమే."

"ఈ వ్యత్యాసం కారణంగానే ఆయుష్మాన్ భారత్‌ను కాకుండా, ఆరోగ్య శ్రీ పథకాన్నే కొనసాగించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది" అని డా. నర్సింగారెడ్డి తెలిపారు.

"ఈ పథకాల అమలులో రాజకీయం కూడా ఉంది. ప్రస్తుతం ఆరోగ్య శ్రీ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.700 కోట్లకు పైగా కేటాయిస్తోంది. ఆయుష్మాన్ భారత్ కింద కేంద్రం రాష్ట్రానికి కేవలం సుమారు రూ. 280 కోట్లు మాత్రమే ఇస్తామంటోంది. ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్య శ్రీ పథకంతో కలిపి ఆయుష్మాన్ భారత్‌ను అమలు చేస్తే, ఆరోగ్య శ్రీ పేరు మరుగునపడుతుంది. అంతా మేమే చేస్తున్నామని కేంద్రం చెప్పుకుంటుంది" అని ఆయన వ్యాఖ్యానించారు.

ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఒక్కో చికిత్సకు(ప్యాకేజీ) కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ధరలు చాలా తక్కువగా ఉన్నాయని నర్సింగా రెడ్డి అన్నారు. దాంతో చాలావరకు మెరుగైన సదుపాయాలున్న ఆస్పత్రులు ఈ పథకాన్ని అమలు చేసేందుకు ఆసక్తి చూపకపోవచ్చని డా. నర్సింగారెడ్డి అభిప్రాయపడ్డారు.

ఆంధ్రప్రదేశ్‌లో...

ఆంధ్రప్రదేశ్‌లోనూ పరిస్థితి ఇలాగే ఉంది. ఇప్పటికే ఎన్టీఆర్ వైద్య సేవ పథకం లబ్ధిదారులు 1.42 కోట్ల కుటుంబాలు ఉన్నాయి. అందులో ఆయుష్మాన్ భారత్‌కి అర్హత పొందే కుటుంబాలు కేవలం సుమారు 50 లక్షలు మాత్రమే ఉండనున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.

అందుకే ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు సిబ్బంది తెలిపారు.

తమ అభ్యంతరాలు నివృత్తి చేసేవరకు ఆయుష్మాన్ భారత్‌ను అమలుచేయలేమని దిల్లీ, ఒడిశా, కేరళ, పంజాబ్ రాష్ట్రాలు చెప్పాయి.

Image copyright Thinkstock

కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం, ఆయుష్మాన్ భారత్ పథకానికి అర్హులు

గ్రామీణ ప్రాంతాల్లో:

 • ఆవాసం లేని కుటుంబాలు
 • అనాథలు/ యాచకులు
 • సఫాయి కార్మికుల కుటుంబాలు
 • గిరిజన ఆదివాసీ కుటుంబాలు
 • వెట్టిచాకిరి నుంచి న్యాయపరంగా విముక్తి పొందిన కార్మికులు
 • ఎస్సీ/ ఎస్టీ కుటుంబాలు
 • మట్టి గోడలు, మట్టి కప్పు కలిగిన ఒక గది ఇల్లు ఉన్న కుటుంబాలు
 • 16 నుంచి 59 ఏళ్ల మధ్య వయస్కులు లేని కుటుంబాలు
 • కుటుంబ పెద్దగా మహిళ ఉండి 16 నుంచి 59 ఏళ్ల వయసుగల పురుషులు లేని కుటుంబాలు
 • దివ్యాంగులు
 • భూమి లేని, రోజు కూలీ చేసుకుంటూ జీవించే కుటుంబాలు

పట్టణ ప్రాంతాల్లో అర్హులు:

 • కూలీలు
 • చెత్త ఏరుకునేవారు
 • యాచకులు
 • ఇళ్లల్లో పనిచేసేవారు
 • వీధి వ్యాపారులు/ చర్మకారులు/ వీధుల్లో తిరిగి సరుకులు అమ్మేవారు/ వీధుల్లో ఇతర పనులు చేసుకుంటూ బతికేవారు
 • భవన నిర్మాణ కార్మికులు/ ప్లంబర్/ పెయింటర్/ వెల్డర్/ సెక్యూరిటీ గార్డు
 • స్వీపర్/ పారిశుద్ధ్య కార్మికులు/ తోటమాలీలు
 • హస్తకళలు/ చేతివృత్తులపై ఆధారపడి జీవించేవారు/దర్జీ (టైలర్)
 • ఎలక్ట్రీషియన్/ మెకానిక్/ డ్రైవర్/ కండక్టర్/ హెల్పర్/ రిక్షావాలా
 • దుకాణాల్లో పనిచేసేవారు/ అసిస్టెంట్లు/ వస్తువులను బిగించేవారు/ పనిముట్లను బాగు చేసేవారు
 • వాచ్‌మెన్లు, రజకులు

ఆ షరతులు లేవు

ప్రస్తుతం ఆరోగ్య శ్రీ పథకం కింద కుటుంబంలోని ఒక వ్యక్తి ఏడాదిలో గరిష్ఠంగా రూ.150,000 వరకు వినియోగించుకోవచ్చు. మిగతా రూ.50 వేల వరకు ఇతర సభ్యులు వైద్యం చేయించుకోవచ్చు.

'ఆయుష్మాన్ భారత్‌'లో మాత్రం ఆ షరతులు లేవు. కుటుంబం మొత్తానికి రూ.5 లక్షలయినా, లేదంటే ఒకే వ్యక్తికి రూ.5 లక్షలయినా ఉపయోగించుకోవచ్చు.

లబ్ధిదారులు దేశంలో ఎక్కడైనా ఉచిత వైద్యసేవలు పొందే వెసులుబాటు ఉంటుంది. అన్ని రకాల చికిత్సలకు ప్రభుత్వం ముందస్తుగానే ప్రామాణిక ధరలు నిర్ణయించింది. అన్నిరకాల మాధ్యమిక, సూపర్‌స్పెషాలిటీ వైద్యం అందించే ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు ఈ పథకంలో అవకాశం కల్పిస్తారు.

ఈ పథకం కింద ఇప్పటి వరకు 15,686 ఆస్పత్రులు దరఖాస్తు చేసుకున్నాయి.

ఆస్పత్రుల్లో ఈ పథకం లబ్ధిదారులకు సహాయం చేసేందుకు ప్రభుత్వం ఆరోగ్య మిత్రలను ఏర్పాటు చేస్తుంది. అందుకోసం ఇప్పటి వరకు 20 రాష్ట్రాల్లో 3,936 మందికి శిక్షణ ఇచ్చారు.

ఆరోగ్యశ్రీ అర్హులకు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హెల్త్ కార్డులు పంపిణీ చేసింది. ఇప్పుడు ఆయుష్మాన్ లబ్ధిదారులకూ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్డులు ఇవ్వనుంది.

2018-19 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం కోసం రూ.10,000 కోట్లు కేటాయించినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మంత్రి జేపీ నడ్డా తెలిపారు.

ఈ పథకం వ్యయంలో కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వాలు 40 శాతం చొప్పున భరిస్తాయి.

రిజిస్ట్రేషన్ అక్కర్లేదు

ఈ పథకం కోసం కొత్తగా ఎలాంటి నమోదు ప్రక్రియ ఉండదని, లబ్ధిదారుల ఎంపిక మొత్తం 2011 జనాభా గణన ఆధారంగా ప్రభుత్వమే చేస్తుందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా తెలిపారు. రూ. 1324 చెల్లించి ఈ పథకం కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటూ కొందరు మోసాలకు పాల్పడుతున్నారని, అలాంటి వారిని ఎవరూ నమ్మవద్దని మంత్రి సూచించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు