నన్ రేప్ ‌కేసు: కేరళలో చర్చిలపై విశ్వాసం తగ్గుతోందా?

  • 22 సెప్టెంబర్ 2018
నన్‌ల ధర్నా Image copyright Getty Images

కేరళకు చెందిన ఓ నన్‌పై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బిషప్ ఫ్రాంకో ములక్కల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు కేరళకు చెందిన సీనియర్ పోలీసు అధికారి ఒకరు బీబీసీకి తెలిపారు.

మూడు రోజుల్లో దాదాపు 23గంటల పాటు సాగిన విచారణ అనంతరం అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఆ బిషప్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ కేరళలో కొందరు నన్‌లు రెండు వారాలుగా ధర్నా చేస్తున్నారు. ఇటీవల ఆ ధర్నా జరుగుతున్న ప్రాంతానికి గీత అనే మహిళ, తన భర్త షాజన్ వర్ఘీస్‌తో కలిసి వెళ్లారు.

గీత చిన్న కుమార్తె ప్రస్తుతం నన్‌గా మారేందుకు శిక్షణ తీసుకుంటున్నారు.

‘ఓ తల్లిగా, నా కూతురి భవిష్యత్తు ఎలా ఉండబోతోందోనని నాకు చాలా భయంగా ఉంది. నిజానికి చర్చి అత్యంత సురక్షిత ప్రదేశంగా ఉండాలి. కానీ, ప్రస్తుతం పరిస్థితి అలా కనిపించడం లేదు’ అని గీత బీబీసీతో మాట్లాడుతూ చెప్పారు.

‘నేను జీసస్‌ను విశ్వసిస్తా. ఆయన్ను నిజంగా నమ్మితే ఏ విషయం గురించీ భయపడకూడదు. కానీ ఓ తల్లిగా నా కూతురి గురించి భయపడకుండా ఉండలేకపోతున్నా. ఇక్కడ ధర్నా చేస్తున్న నన్‌ల భవిష్యత్తు ఏమవుతుందోనని కూడా భయంగా ఉంది’ అని ఆమె అన్నారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక షాజన్ వర్ఘీస్, గీత

‘ఆ నన్‌ల కథ వినగానే నా భార్య ఏడవడం మొదలుపెట్టింది. మా చిన్నమ్మాయి కూడా నన్‌గా మారేందుకు సన్నద్ధమవుతోంది. కానీ ఇప్పుడు ఆ విషయంలో నా భార్య చాలా భయపడుతోంది’ అని గీత భర్త షాజన్ చెప్పారు.

జలంధర్ డైసిస్‌కు చెందిన బిషప్ ఫ్రాంకో ములక్కల్ ఓ నన్‌పై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆ బిషప్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ కొచ్చీలో ఐదుగురు నన్స్ రెండు వారాలుగా ధర్నా చేస్తూ దేశంలో ఓ కొత్త చరిత్రకు నాంది పలికారు.

గతంలో నన్‌లు, క్రైస్తవ మతాధికారులు కలిసి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా, ఇతర అంశాలపైన నిరసనలు తెలిపారు. కానీ, చర్చిల్లో కార్యకలాపాలకు వ్యతిరేకంగా వాళ్లెన్నడూ నిరసనలు తెలపలేదు.

‘గతంలో ఎప్పుడూ చర్చిల విషయంలో ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదు. బిషప్‌పైన నన్ ఫిర్యాదు చేసినప్పుడు సరైన చర్య తీసుకోనందుకే ప్రస్తుతం చర్చికి ఈ పరిస్థితి వచ్చింది’ అని కేరళకు చెందిన సీనియర్ పాత్రికేయుడు బీఆర్‌పీ భాస్కర్ అభిప్రాయపడ్డారు.

అత్యాచారానికి గురైనట్లు ఫిర్యాదు చేసిన నన్ సోదరి ఆల్ఫీ కూడా ధర్నాలో పాల్గొంటున్నారు. ‘మేం కార్డినల్‌తో పాటు ఇతర బిషప్‌లకూ ఫిర్యాదు చేశాం. మా సమూహానికి చెందిన ‘మదర్ జనరల్‌’కు కూడా ఫిర్యాదు చేశాం. కానీ ఆయనపై చర్య తీసుకునే అధికారం, స్థాయీ మనకు లేదని ఆమె సర్ది చెప్పారు.

Image copyright Godong

చర్చి మమ్మల్ని తిరస్కరించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాము. లోపలే ఉండిపోతే మమ్మల్ని ఎవరూ పట్టించుకోరు. అందుకే బయటికొచ్చి ప్రజల మద్దతు కూడగడితే చర్చి అధికారులు, ప్రభుత్వంపైన ఒత్తిడి పెరుగుతుందని భావించి ఈ పని చేస్తున్నాం’ అని సిస్టర్ ఆల్ఫీ తెలిపారు.

మరోపక్క గీతా వర్ఘీస్‌లో కంగారు తగ్గలేదు. నన్‌గా శిక్షణ పొందుతున్న వాళ్ల చిన్న కూతురి చదువు పూర్తయ్యేంత వరకు... అంటే 2019 వరకు ఆమె తల్లిదండ్రులను కలవడానికి వీల్లేదు.

‘మా చుట్టుపక్కల చాలామందికి కొన్ని భయాలున్నాయి. వాళ్లంతా నన్‌లకు న్యాయం జరగాలని కోరుకుంటున్నారు. కానీ, చర్చి అధికారులకు భయపడి వాళ్లు బహిరంగంగా మద్దతు తెలపలేకపోతున్నారు’ అని గీత భర్త షాజన్ వర్ఘీస్ చెప్పారు.

కేరళలో చర్చిలు చాలా ఏళ్లుగా వార్తల్లో నలుగుతున్నాయి. మతాధికారులు మహిళలను వేధించినట్టు, అత్యాచారం చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఇద్దరు మైనర్లు గర్భవతులైన ఉదంతం కూడా సంచలనం సృష్టించింది.

కొన్ని నెలల క్రితం నలుగురు క్రైస్తవ బోధకులు ఓ కేసులో బెయిల్ కోసం హైకోర్టులతో పాటు సుప్రీం కోర్టు చుట్టూ తిరిగారు. టీనేజీలో ఓ మత బోధకుడి చేతిలో అత్యాచారానికి గురైనట్లు ఓ మహిళ చర్చిలో కన్ఫెషన్ చేశారు. దాంతో ఈ నలుగురు క్రైస్తవ బోధకులు ఆమెను లైంగికంగా వేధించినట్లు ఆ మహిళ ఆరోపించారు.

Image copyright Getty Images

ఒక్కొక్కటిగా బయటపడుతున్న ఇలాంటి ఉదంతాల కారణంగా జీసస్‌కు ప్రతినిధులుగా భక్తులు విశ్వసించే ఈ బోధకులపైన వారికి నమ్మకం సన్నగిల్లుతోందేమోననే అనుమానం కలుగుతోంది.

‘క్రైస్తవ బోధకులపైన ఆరోపణలు పెరుగుతున్న మాట వాస్తవమే. తప్పు చేసిన బోధకులకు చర్చిలు మద్దతిస్తే వాటి ప్రతిష్ఠ మరింత మసకబారే ప్రమాదముంది’ అని హైదరాబాద్ యూనివర్సిటీకి చెందిన హిస్టరీ ప్రొఫెసర్ డాక్టర్. వి.జె.వర్ఘీస్ అన్నారు.

తాజా నన్ కేసు విషయంలో... బిషప్‌ను సమర్దిస్తూ, ధర్నా చేస్తున్న నన్‌లను విమర్శిస్తూ ‘మిషనరీస్ ఆఫ్ జీసస్’ ఒక ప్రకటనను విడుదల చేసింది. దాంతో పాటు అత్యాచారం జరిగినట్లు ఆరోపించిన నన్ ఫొటోను కూడా జతచేసింది.

కానీ ఈ కేసు విషయంలో విచారణ కోసం పోలీసు స్టేషన్‌కు వచ్చిన బిషప్, తన కారు అద్దాలను పూర్తిగా నల్లటి సన్‌ షేడ్స్‌తో కప్పేశారు.

‘అత్యాచారానికి గురైనట్లు చెబుతున్న నన్ ఫొటోను చర్చి విడుదల చేస్తుంది కానీ ఆరోపణలు ఎదుర్కొంటున్న బిషప్ మాత్రం కనపించకుండా జాగ్రత్త పడటం ఎంత వింతో కదా?’... అని ఈ కేసును రిపోర్ట్ చేస్తున్న ఓ టీవీ విలేఖరి అన్నారు.

Image copyright Getty Images

జనాల్లో కనిపిస్తున్న ఈ అసహనం ఒక్క రోజులో పుట్టింది కాదని ‘సేవ్ అవర్ సిస్టర్స్’ కమిటీ ప్రతినిధి ఫాదర్. అగస్టీన్ పాటోలీ చెప్పారు. ‘నేను కేవలం మత బోధకుడిని అని మాత్రమే నాకు గౌరవం ఇవ్వరు. బలహీన వర్గాల వైపు ఉంటానని, క్రీస్తు బోధించిన విలువలను పాటిస్తూ పారదర్శకంగా వ్యవహరిస్తాననే వాళ్లు నన్ను గౌరవిస్తారు’ అని ఆయన పేర్కొన్నారు.

ఇలాంటి ఘటనల వల్ల చర్చి ప్రతిష్ఠ మసకబారుతుందని తాను అనుకోవట్లేదని, ప్రజలు చర్చిలకు వెళ్లడం కొనసాగిస్తారని సినీ దర్శకుడు, విద్యావేత్త డాక్టర్ ఆశా జోసెఫ్ అన్నారు.

ఇదే అంశంపై మలయాళం రచయిత పాల్ జచారియా స్పందిస్తూ, ‘నేను ఐదు దశబ్దాలుగా ఇలాంటి ఆరోపణలు వింటున్నా. నన్‌లు ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారని, పోలీసుల దాకా ఎందుకు వెళ్లారని ఒకసారి అంతా ఆలోచించుకోవాలి’ అని చెప్పారు.

‘చర్చి కూడా దాదాపు ఓ కార్పొరేట్ సంస్థ లాంటిదే. అది ఒక బ్రాండ్. కేరళలో చర్చిలకు చాలా భూములు, స్కూళ్లూ ఉన్నాయి. షాపింగ్ మాల్స్‌తో నిండిన భవనాలు కూడా ఉన్నాయి’ అని పేరుని గోప్యంగా ఉంచాలని కోరిన ఓ మత బోధకుడు పేర్కొన్నారు.

కేరళలో సగటు క్రిస్టియన్ల జీవితంలోని అనేక దశలు చర్చిలతోనే ముడిపడి ఉంటాయని, ఒక్క సంఘటన వల్ల వాటి ప్రతిష్ఠ తగ్గుతుందని తాను అనుకోవట్లేదని పాల్ జచారియా అన్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

కరోనా క్వారంటైన్: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు సాంకేతికతను ఎలా వాడుతున్నాయి?

కరోనావైరస్: రుచి, వాసన సామర్థ్యాలు తగ్గడం ఇన్ఫెక్షన్‌ సోకడానికి సూచన కావొచ్చు - పరిశోధకులు

కరోనా వైరస్: 24 గంటల్లో 525 కొత్త కేసులు.. భారత్‌లో 3,072కి పెరిగిన పాజిటివ్ కేసులు

హ్యాండ్ శానిటైజర్లకు ఎందుకింత కొరత?

కరోనావైరస్ సంక్షోభం: సమానత్వ, న్యాయ మూలాలపై సరికొత్త సమాజాన్ని నిర్మించేందుకు ఇది సదవకాశమా

తెలంగాణ లాక్‌డౌన్: గర్భిణీ స్త్రీలు, రోగులు పడుతున్న ఇబ్బందులు ఇవీ..

వివిధ దేశాల్లో కరోనా లాక్‌డౌన్ నిబంధనలు: ‘ఆడవాళ్లు బయటకు వచ్చే రోజు మగవాళ్లు రాకూడదు.. భార్యలు భర్తల్ని విసిగించొద్దు’

కరోనావైరస్: 'లాక్‌డౌన్‌లో హింసించే భర్తతో చిక్కుకుపోయాను'

కరోనావైరస్: అమెరికా చేసిన తప్పులేంటి... ఒప్పులేంటి?