‘దేశంలో ఎక్కువగా తాగేది తెలుగువాళ్లే’

 • వేణుగోపాల్ బొల్లంపల్లి
 • బీబీసీ ప్రతినిధి
beer

ఫొటో సోర్స్, Getty Images

భారత్‌లో మద్యం వినియోగం గత 12 ఏళ్లలో రెట్టింపైంది. దీంతో అనారోగ్యంపాలై చనిపోయేవారి సంఖ్యా గణనీయంగా పెరిగింది. ఇక తెలుగు రాష్ర్టాలైతే మద్యం వినియోగంలో దేశంలోనే నంబర్ 1 అని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఒక్క న్యూయియర్ వేడుకల్లోనే ఏపీలో దాదాపు 100 కోట్ల విలువైన మద్యం తాగారని ఎక్సైజు శాఖ లెక్కలు చెబుతున్నాయి.

మద్యం ఎక్కువగా తాగడం వల్ల 2016లో ప్రపంచ వ్యాప్తంగా 30 లక్షల మంది చనిపోయారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల విడుదల చేసిన నివేదిక వెల్లడించింది.

ఆ నివేదిక ప్రకారం.. ప్రపంచంలో ప్రతి 20 మరణాల్లో ఒకటి మద్యపానం వల్ల సంభవిస్తోంది.

ఇలా అతి మద్యపానం వల్ల చనిపోయిన వారిలో మూడొంతుల మంది పురుషులే.

ఫొటో సోర్స్, Getty Images

ఈ అంశంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అదానోమ్ మాట్లాడుతూ.. '' అతి మద్యపానం వల్ల చాలా మంది ప్రజలు, కుటుంబాలు, సమాజాలు తీవ్రమైన పరిణామాలను ఎదుర్కొంటున్నాయని వివరించారు.

అతి మద్యపానం వల్ల హింస, గాయాలు, మానసిక సమస్యలు, కేన్సర్, స్ర్ట్రోక్‌ తదితర అనారోగ్యాలతో చనిపోతున్నారని ఆయన తెలిపారు.

ఈ దుష్పరిణామాలను నియంత్రించేందుకు, ఆరోగ్యవంతమైన సమాజాల అభివృద్ధికి వెంటనే చర్యలు చేపట్టాల్సిన సమయం ఆసన్నమైందని సూచించారు.

అతి మద్యపానం వల్ల చనిపోయేవారిలో 28 శాతం మంది దెబ్బలు తగలడం వల్ల చనిపోతున్నారు.

వీరు ఇతరులతో తగాదాలు, రోడ్డు ప్రమాదాలు, తమనుతాము గాయపరచుకోవడం వల్ల మరణిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఎలా చనిపోతున్నారు?

 • 28% గాయపడి
 • 21% జీర్ణ సంబంధిత అనారోగ్యం వల్ల
 • 19% హృద్రోగాల వల్ల
 • తక్కిన వారు కేన్సర్లు, ఇతర ఇన్ఫెక్షన్ల వల్ల

ఫొటో సోర్స్, Getty Images

4.6 కోట్ల మంది మహిళలు

ప్రపంచ వ్యాప్తంగా 4.6 కోట్ల మంది మహిళలు అతి మద్యపానం వల్ల సమస్యలు ఎదుర్కొంటున్నారు.

పురుషుల విషయానికి వస్తే ఈ సంఖ్య 23.7 కోట్లు.

అతి మద్యపానం సమస్యలు అధిక ఆదాయ దేశాల్లో ఎక్కువగా ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images

మద్యం తాగేవాళ్లు ఎంత మంది?

 • ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 230 కోట్ల మంది మద్యం తాగుతున్నట్లు అంచనా.
 • మద్యం తాగేవారు సగటున రోజుకు 33 గ్రాముల ఆల్కహాల్ తీసుకుంటున్నారు.
 • ఇది రెండు గ్లాసుల వైన్ (150 మిల్లీ లీటర్ల చొప్పున), ఓ బీర్‌కి సమానం.
 • 92 శాతం మంది 'స్పిరిట్స్' తాగుతున్నారు.
 • 45 శాతం మంది 'స్పిరిట్స్' రూపంలో మద్యం తాగుతుండగా బీర్ 34 శాతం వినియోగంతో రెండో స్థానంలో ఉంది. వైన్ వాటా 12 శాతం.

మరి భారత్‌లో..

 • 2005లో భారత్‌లో ఏడాదికి సగటున 2.4 లీటర్ల ఆల్కహాల్(ఒక బీరులో 33 గ్రాములు ఉంటుంది) తాగుతుండగా.. ఇది 2010కి 4.3 లీటర్లకు.. 2016కి 5.7 లీటర్లకు పెరిగింది.
 • ఇది 2025కి 7.9 లీటర్లకు చేరుతుందని అంచనా.
 • దేశంలో బీరు వినియోగం 8 శాతం మేర ఉండగా.. వైన్ 1 శాతం కంటే తక్కువగా ఉంది.
 • 92 శాతం మంది 'స్పిరిట్స్' తాగుతున్నారు.

తెలుగు రాష్ర్టాలే నంబర్ 1

దేశంలో మద్యం తాగేవారిని పరిగణనలోకి తీసుకుంటే తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ మద్యం తాగుతున్నారని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అకడమిక్ రిజిస్ర్టార్ డాక్టర్ జయరాం తెలిపారు.

‘‘దేశంలోని పట్టణాలలో మద్యం తాగే వ్యక్తి సగటున ఏడాదికి 4.2 లీటర్లు. గ్రామీణ ప్రాంతాల్లో 11 లీటర్లు ఆల్కహాల్ తాగుతున్నారు.’’ అని వివరించారు.

మద్యం వినియోగంలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ నంబర్ 1గా ఉండేదని చెప్పారు.

ఈ మేరకు ఆయన 2015 - 16 ఎక్సైజు శాఖ గణాంకాలను ఉదాహరించారు.

ఏపీలో మద్యం తాగే వ్యక్తి సగటున ఏడాదికి 34.5 లీటర్స్ ఆల్కహాల్ తాగుతున్నారని తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images

యుక్త వయసులోనే..

తెలుగు రాష్ర్టాల్లో బాలురు 15 ఏళ్ల వయసులోనే మద్యపానం మొదలుపెడుతున్నారని జయరాం చెప్పారు.

నాగార్జున ఆసుపత్రిలో గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ జగన్మోహన్‌రావు మాట్లాడుతూ.. చాలా చిన్న వయసులో మద్యపానం మొదలుపెట్టడం వల్ల.. 30-35 ఏళ్ల వయసులోనే చాలా మంది లివర్ సమస్యలకు గురవుతున్నారని ఈ మధ్య చాలా మంది ఈ సమస్యలతో వస్తున్నారని వివరించారు.

తెలుగు రాష్ర్టాల్లో ప్రాంక్రియాటైటిస్ బాధితులు కూడా పెరిగారని ఇవన్నీ అధిక మద్యపానం వల్ల వచ్చే దుష్పరిణామాలని వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)