ఆయుష్మాన్ భారత్: మోదీ కేర్‌తో వైద్య ఖర్చుల భారం నుంచి పేదలకు ఉపశమనం దొరికినట్లేనా?

  • 24 సెప్టెంబర్ 2018
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: ఆయుష్మాన్ భారత్‌‌ - ఈ చిన్నారి ఇప్పుడో సెలబ్రిటీ

కరిష్మా అనే పాప ఈ ఏడాది ఆగస్టు 15న హరియాణాలోని ‘కల్పనాచావ్లా ప్రభుత్వ మెడికల్ కాలేజీ’(కేసీజీఎంసీ)లో జన్మించింది.

ఆ పాప తల్లి పుష్ప భారతదేశంలో కొత్తగా అమలు చేసిన జాతీయ ఆరోగ్య బీమా పథకంలో తొలి లబ్ధిదారు.

హరియాణా రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ పథకం పైలెట్ ప్రాజెక్టులో రిజిస్టర్ చేసుకున్న అనేకమందిలో పుష్ప కూడా ఒకరు. ఒక్క రూపాయి ఖర్చు లేకుండానే ఈ పథకం కింద తనకు ఆస్పత్రిలో కాన్పు చేశారని పుష్ప చెప్పారు.

"నా మొదటి బిడ్డ ఒక ప్రైవేటు ఆస్పత్రిలో పుట్టాడు. అప్పుడు మాకు సుమారు రూ. లక్షన్నర ఖర్చయింది. అక్కడ మందులకు, డాక్టర్‌కు చూపించుకోవడానికి అన్నిటికీ డబ్బు పెట్టాల్సి వచ్చింది. కానీ ఈసారి బిడ్డ పుట్టడానికి ముందే నేను ఈ బీమా పథకం కోసం ఒక ఫారం నింపాను. దాని వల్ల మాకు ఈసారి ఆస్పత్రిలో ఒక్క పైసా కూడా ఇవ్వాల్సిన అవసరం రాలేదు" అంటూ పుష్ప బీబీసీతో చెప్పారు.

మెరుగైన చికిత్స లభిస్తుంది

ఏ ప్రభుత్వ ఆస్పత్రిలో అయినా కాన్పు ఉచితంగానే చేస్తున్నారు. కానీ రోగికి మందులు, రవాణా, చికిత్స కోసం డబ్బు చెల్లించాల్సి వస్తోంది.

మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాజా పథకం ప్రకారం పుష్పకు ఒక్క పైసా కూడా ఖర్చు చేయాల్సిన అవసరం రాలేదు. ఆస్పత్రికి రాష్ట్ర మెడికేర్ ఫండ్ నుంచి 9,000 రూపాయలు అందుతాయి.

హరియాణాలోని కల్పనా చావ్లా ప్రభుత్వ వైద్య కళాశాల డైరెక్టర్ డాక్టర్. సురేంద్ర కశ్యప్ మాట్లాడుతూ... "మేం ఒక మెడికల్ కేస్ ఆన్‌లైన్లో అప్‌లోడ్ చేయగానే, డబ్బులు మా ఖాతాలో పడిపోతాయి. ఆయుష్మాన్ భారత్‌కు చెందిన ఒక బృందం ఎప్పుడూ మమ్మల్ని సంప్రదిస్తూ ఉంటుంది. ఇది ప్రభుత్వ వార్షిక నిధుల కేటాయింపు కంటే భిన్నంగా ఉంటుంది. ఒక సర్జరీ చేయడానికి మాకయ్యే ఖర్చు తిరిగి లభిస్తున్నప్పుడు, దీంతో మేం రోగులకు మెరుగైన వైద్యం అందించగలుగుతాం" అన్నారు.

40 శాతం జనాభాకు బీమా

ఇప్పుడు 1995 విషయానికి వద్దాం. అప్పట్లో సుప్రీంకోర్టు ఒక చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. పరిశ్రమల్లో పనిచేసే కార్మికుల ఆరోగ్యం గురించి న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. ఆరోగ్యం, వైద్య సంరక్షణ అనేది ప్రతి భారతీయుడి హక్కు అని తెలిపింది.

కోర్టు ఆ తీర్పు ఇచ్చిన 23 ఏళ్ల తర్వాత ఇప్పుడు, భారత్ కనీసం మూడు పూటలా తిండికి నోచుకోని వారికి కూడా నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ఈ ప్రతిష్టాత్మక హెల్త్ కేర్ పథకాన్ని ప్రారంభించింది.

ఇటీవల రూపొందించిన 'ఆయుష్మాన్ భారత్ మిషన్' కింద 'ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన' ప్రారంభించారు. ఈ పథకాన్ని 'మోదీ కేర్' అని కూడా అభివర్ణిస్తున్నారు. దీని కింద దేశంలోని 40 శాతం జనాభాకు ఆరోగ్య బీమా లభిస్తుంది.

అసలేంటీ పథకం?

ఈ పథకం కింద దేశంలోని 10 కోట్ల 74 లక్షల కుటుంబాలకు ఏటా 5 లక్షల రూపాయల ఆరోగ్య బీమా సదుపాయం కల్పిస్తారు.

లబ్ధిదారులను 2011 నాటి సామాజిక, ఆర్థిక, కుల జనగణన(ఎస్ఈసీసీ) ఆధారంగా గుర్తించారు.

లబ్ధిదారుల పూర్తి వివరాలను ఆన్‌లైన్లో పొందుపరిచారు. ఆ వివరాలు ప్యానల్‌లో ఉన్న సుమారు 8 వేల ఆస్పత్రులకు అందుబాటులో ఉంచారు.

ఈ పథకంలో భాగంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో 'ఆయుష్మాన్ కేంద్రాలు' తెరుస్తారు. ఆర్థికంగా బలహీన వర్గాల గుర్తింపు కేంద్రాలతోపాటు రోగులు ఈ కేంద్రాలకు కూడా వెళ్లవచ్చు. అక్కడ లబ్ధిదారుల పేరు ఎస్ఈసీసీ డేటాలో ఉందా, లేదా అనేది అధికారులు పరిశీలిస్తారు.

లబ్ధిదారుల పేరు ఆ లిస్టులో ఉంటే, వారికి ఒక గోల్డెన్ ఆయుష్మాన్ కార్డ్ అందిస్తారు. లబ్ధిదారులు ఈ పథకం కింద నగదు రహిత వైద్య సేవల కోసం తమ కుటుంబ సభ్యుల పేర్లు కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు.

ఈ పథకం కింద శస్త్రశికిత్స, కేన్సర్, ఎముకల ఇంప్లాంటేషన్ లాంటి సుమారు 1350 చికిత్సలకు బీమా లభిస్తుంది. అయిటే, ఆస్పత్రుల్లో అడ్మిట్ అవసరంలేని సాధారణ జ్వరం, ఫ్లూ లాంటి వ్యాధుల ఖర్చులు ఇందులోకి రావు.

బీమా పథకంలో చెల్లింపులు ఎవరివి?

ఫండ్ కోసం కొన్ని రాష్ట్రాలు ఒక ఒక లాభరహిత ట్రస్ట్ ఏర్పాటు చేశాయి. అవి తమ బడ్జెట్ నుంచి హెల్త్ కేర్ ఫండ్ అందిస్తున్నాయి.

ఖర్చులో కేంద్ర ప్రభుత్వం సుమారు 60 శాతం సహకారం అందిస్తుంది. మిగతా 40 శాతం రాష్ట్రాలు భరిస్తాయి. ఆస్పత్రుల్లో లబ్ధిదారులకు చికిత్స జరిగినపుడు, వైద్య ఖర్చులు నేరుగా ఆ ఆస్పత్రి ఖాతాలోకి బదిలీ చేస్తారు.

మరో మోడల్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు బీమా అందించడానికి ప్రైవేటు బీమా సంస్థలతో భాగస్వామ్యం చేసుకోవచ్చు. కొన్ని రాష్ట్రాలు మిశ్రమ మోడల్ కూడా అమలు చేస్తున్నాయి. అక్కడ ప్రైవేటు బీమా కంపెనీలు చిన్న చెల్లింపులను కవర్ చేస్తాయి. మిగతా వాటికి ప్రభుత్వ ట్రస్ట్ నిధులు అందిస్తుంది.

Image copyright BHASKER SOLANKI/BBC

ఈ ఆస్పత్రులు సరిపోతాయా?

ప్రభుత్వం ఈ పథకంలో పేదల కోసం ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో 2.65 లక్షల పడకలు అవసరమని చెబుతోంది.

కేసీజీఎంసీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ జగదీశ్ దురేజా మాట్లాడుతూ.. "తర్వాత చికిత్స కోసం వచ్చే రోగుల సంఖ్య కనీసం 20 శాతం పెరుగుతుంది. మాకు కచ్చితంగా మరింత మంది డాక్టర్లు, నర్సుల అవసరం ఉంటుంది. ఆస్పత్రుల్లో పడకల సంఖ్య కూడా పరిమితంగా ఉంటే, వచ్చే వాళ్లందర్నీ మేం ఎలా అడ్మిట్ చేసుకోవాలి" అన్నారు.

జూన్‌లో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశంలో 11,082 మంది రోగులకు సగటున ఒక అలోపతి డాక్టర్ ఉన్నారు. అంతే కాదు... 1,844 మంది రోగులకు సగటున ఒక బెడ్, 55,591 మంది రోగులకు సగటున ఒక ప్రభుత్వ ఆస్పత్రి అందుబాటులో ఉంది.

ఎక్కువ మంది వైద్య సిబ్బంది పేదలకు అందుబాటులో లేని ఖరీదైన ఆస్పత్రులకు మారిపోయారు.

ఇప్పుడు మోదీకేర్ కింద కేవలం నాలుగు వేల ఆస్పత్రులను మాత్రమే జోడించారు. చాలావరకు ప్రైవేటు ఆస్పత్రులు ప్రభుత్వం నిర్ణయించిన సర్జరీ ధరలతో సంతృప్తిగా లేవు. అవి స్వయంగా మోదీకేర్ నుంచి దూరంగా ఉంటున్నాయి.

ముంబయిలో ఐ అండ్ ఐ ఆస్పత్రి వ్యవస్థాపకులు డాక్టర్ ధవల్ హరియా ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ... "ప్రైవేటు వ్యవస్థలో శస్త్రచికిత్స మాత్రమే కాదు, మెషిన్లు, మెయింటనెన్స్, హెచ్ఆర్ మేనేజ్‌మెంట్, భవనం అద్దెలాంటి చాలా ఖర్చులు భరించాల్సి ఉంటుంది. ఇవన్నీ కలిపితే ప్రభుత్వం మా ముందు ఉంచిన ప్యాకేజ్‌తో దీన్ని ఎక్కువ కాలం చేయడం సాధ్యం కాదు" అన్నారు.

అటు ప్రభుత్వం మాత్రం ప్రైవేటు ఆస్పత్రులు ఈ పథకంలో చేరడానికి మెడికల్ ప్యాకేజీ ధరల్లో మార్పులకు తలుపులు తెరిచే ఉంచామని చెబుతోంది.

ఆయుష్మాన్ భారత్ సీఈఓ ఇందూ భూషణ్ "50 కోట్ల మంది అంటే, అమెరికా, కెనెడా, మెక్సికో కలిపితే, అంత జనాభా. అలాంటప్పుడు కచ్చితంగా ఇది ఒక ప్రతిష్టాత్మక పథకం. ఇది గతంలోని అన్నిటికంటే మించినది. ప్రైవేటు ఆస్పత్రుల దగ్గర చాలాసార్లు వారి సామర్థ్యం మించి ఖాళీ స్పేస్ మిగిలిపోతుంది. రోగులు భారీ సంఖ్యలో వచ్చే అవకాశం ఉండడంతో వారు మార్జిన్లో ఉన్న వారిని కవర్ చేయడం గురించి ఆలోచించాలి. మా ప్యాకేజ్ వాటిని కవర్ చేస్తుంది. ధరల గురించి కొన్ని ఫిర్యాదులు వస్తున్నాయి. మేం వాటి గురించి ఆలోచిస్తున్నాం. మా దగ్గర కొత్త డేటా వచ్చినపుడు, మేం ధరలను మరోసారి పరిశీలిస్తాం. అన్నారు.

Image copyright Getty Images

మిగతా దేశాల్లో ఎలా ఉంది?

బ్రిటన్ ప్రజలు నేషనల్ హెల్త్ సర్వీస్‌లో భాగంగా ఉంటారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వారికి ఉచిత వైద్యం అందిస్తారు. కానీ మోదీకేర్‌ పథకం దేశంలో ఆరోగ్య చికిత్సలకు అయ్యే ఖర్చులు భరించలేని వారికోసం ఉద్దేశించినది.

అమెరికాలో ఒబామా కేర్ విషయానికి వస్తే దాని కింద అమెరికాలోని ప్రత్యేక పౌరుల బీమా ఉంది. దాని తర్వాత ప్రభుత్వం పౌరుల తరఫున చెల్లించే ప్రీమియంకు సబ్సిడీ ఇస్తుంది. అయితే ట్రంప్ పాలనలో ఆ పథకం ప్రీమియం ధర, బీమా కవర్‌కు ఎలాంటి పరిమితులు లేకపోవడంతో వివాదాలు చుట్టుముట్టాయి.

కానీ భారత్ ప్రధాన మంత్రి జన ఔషధి యోజన అందరికీ తప్పనిసరి కాదు. అర్హులైన లబ్ధిదారులకు కూడా కవర్ పరిమితి గరిష్ఠంగా 5 లక్షల రూపాయలుగా నిర్ణయించారు.

బీజేపీయేతర రాష్ట్రాలు ఇప్పుడు కూడా ఈ పథకంలో కలవలేదు. ప్రభుత్వం వాటిని ఒప్పించే ప్రయత్నాలు చేస్తోంది.

Image copyright AFP

ఈ పథకంలో మోసం, దుర్వినియోగం లాంటివి అడ్డుకోవడం కూడా ఒక పెద్ద సమస్యగా అవుతుంది.

దీనికోసం ప్రభుత్వం చాలా వరకూ డిజిటల్ టెక్నాలజీ, లబ్ధిదారులు, వారి బిల్లులు పరిశీలించే క్షేత్రస్థాయి సిబ్బందిపైనే ఆధారపడుతోంది.

ఆయుష్మాన్ భారత్ సీఈఓ ఇందు భూషణ్ "మా దగ్గర బలమైన ఐటీ బ్యాకప్ ఉంది. దాని సాయంతో మేం గుర్తింపు, తనిఖీలు చేస్తాం. అనర్హులు ఈ పథకాన్ని దుర్వినియోగం చేయలేరు" అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)