బాబ్రీ మసీదు విధ్వంసానికి ఒక రోజు ముందు ఏం జరిగింది?
16వ శతాబ్దంలో నిర్మించిన బాబ్రీ మసీదును 1992 డిసెంబర్ 6న అతివాద హిందూ గుంపులు ధ్వంసం చేశాయి. సరిగ్గా పాతికేళ్ల క్రితం అయోధ్యలో జరిగిన ఈ ఘటన తర్వాత చెలరేగిన అల్లర్లలో సుమారు 2 వేల మంది మరణించారు.
ఆ విధ్వంసం జరగడానికి ఒక రోజు ముందు ఫొటోగ్రాఫర్ ప్రవీణ్ జైన్, హిందూ కార్యకర్తలు విధ్వంసానికి ''డ్రెస్ రిహార్సల్''గా చెప్పుకునే కార్యక్రమానికి హాజరయ్యారు. నాటి చిత్రాలను బీబీసీతో పంచుకున్న ఆయన, ఆ రోజు జరిగిన ఘటనల క్రమాన్ని వివరించారు. అవి ఆయన మాటల్లోనే..
పొగమంచుతో నిండిన డిసెంబర్ 4, 1992 సాయంత్రం నేను అయోధ్యకు చేరుకున్నాను.
అప్పుడు నేను 'ద పయనీర్' వార్తాపత్రిక తరపున బాబ్రీ మసీదు వద్దకు చేరుకున్న కరసేవకులు, హిందూ రాడికల్ నేతల ఫొటోలను తీసే అసైన్‌మెంట్‌పై ఉన్నాను.
హిందూ జాతీయవాదాన్ని ప్రేరేపించేందుకు ఉద్దేశించిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్)కు చెందిన వేలాది మంది కార్యకర్తలు అప్పటికే అక్కడికి చేరుకుని ఉన్నారు. ప్రస్తుతం దేశాన్ని పాలిస్తున్న బీజేపీతో పాటు ఇతర హిందూ సంస్థలకు ఆరెస్సెస్ సైద్ధాంతిక మార్గదర్శిలాంటిది.
హిందువుల దేవుడైన శ్రీరాముని జన్మస్థానంగా భావించే ఆ ప్రదేశంలో ఆలయాన్ని నిర్మించాలనేది వాళ్ల ఆలోచన. అయితే మసీదును ముట్టుకోమని, కేవలం శిలాన్యాస్‌కు పరిమితమవుతామని వాళ్లు హామీ ఇచ్చి ఉన్నారు.
నాతో పరిచయమున్న ఒక బీజేపీ ఎంపీ, డిసెంబర్ 5 ఉదయం బాబ్రీ మసీదు విధ్వంసానికి రిహార్సల్ జరగబోతున్నట్లు తెలిపారు.
''మీడియా వాళ్లెవరూ అక్కడికి రాకుండా చూడాలని నాకు మా పైవాళ్ల నుంచి ఆదేశం అందింది. కానీ నువ్వు నా స్నేహితుడివి కావడం వల్ల ఈ సమాచారం చెబుతున్నా'' అన్నారు.
- గోధ్రా కేసు: మరణ శిక్ష పడిన దోషులందరికీ శిక్ష తగ్గింపు
- BBC EXCLUSIVE : కేసీఆర్‌తో కోదండరామ్‌కు ఎక్కడ చెడింది?
- BBC EXCLUSIVE: పదిహేను రోజుల్లో కోదండరామ్ కొత్త పార్టీ

అతని సూచన మేరకు నేను కూడా ఒక హిందూ కార్యకర్తలా కాషాయ అంగవస్త్రాన్ని కప్పుకుని, తలకు పట్టీ ధరించి, నా జాకెట్ మీద వాళ్లిచ్చిన ప్రత్యేక బ్యాడ్జీని ధరించాను. నన్ను మసీదుకు కొంత దూరంలో ఫుట్ బాల్ గ్రౌండ్ పరిమాణంలో ఉన్న ప్రదేశానికి తీసుకెళ్లారు. అప్పటికే తలకు కాషాయ పట్టీలు, అంగవస్త్రాలు కప్పుకున్న వేలాది మంది హిందూ కార్యకర్తలు అక్కడ సమావేశమై ఉన్నారు. కొంతమంది ఆ ప్రాంతం చుట్టూ పహారా కాస్తున్నారు.
''ఇలా అయితేనే నువ్వు రిహార్సల్‌కు సంబంధించిన ఫొటోలు తీసుకోగలవు. నాకు దగ్గరగా ఉండు. వాళ్లతో కలిసిపోయి, నువ్వు కూడా వాళ్ల లాగే నినాదాలు చేస్తూ ఉండు. అప్పుడే నువ్వు సురక్షితంగా ఉంటావు'' అని నా మిత్రుడు చెప్పాడు.
ఇంతలో ఓ బలిష్టమైన వ్యక్తి నా ఎదురుగా ప్రత్యక్షమయ్యాడు. నా కెమెరా వైపు చూపి, దాన్ని దూరంగా పెట్టేయమన్నాడు. నేను అతనికి నా బ్యాడ్జీ చూపి, మిగతా వాళ్లలాగే నినాదాలు చేయడం ప్రారంభించాను. దాంతో అతను సంతృప్తి చెంది, నన్ను కొంత దూరంగా ఉన్న ఓ గుంపు దగ్గరికి తీసుకెళ్లాడు.
ముసుగు ధరించిన నేత
నేను నా కెమెరాతో కళ్లెదుట కనిపిస్తున్న విభ్రాంతికరమైన దృశ్యాలను ఫొటో తీయడం ప్రారంభించాను.
పలుగులు, ఇనుపరాడ్లు, పారలు పట్టుకున్న అనేక మంది తమ ఎదురుగా ఉన్న పెద్ద మట్టిదిబ్బను కిందికి లాగడానికి ప్రయత్నిస్తున్నారు.
అక్కడ అంతా ఒక ప్రణాళిక ప్రకారం పద్ధతిగా జరుగుతోంది. వాళ్లు కేవలం వాలంటీర్లు కాదు, ఒక బిల్డింగ్‌ను కూలదోయడం ఎలాగో తెలిసిన ప్రొఫెషనల్స్.

బాబ్రీ విధ్వంసంపై ప్రభుత్వం నియమించిన లిబర్హాన్ కమిషన్ ఈ విధంగా పేర్కొంది: ''వివాదాస్పద కట్టడాన్ని ధ్వంసం చేయడానికి ముందే రిహార్సల్ జరిగినట్లు కమిషన్ ముందు వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. కొన్ని ఫొటోలను కూడా కమిషన్ ముందు ఆన్ రికార్డు పెట్టడం జరిగింది. అయితే సరైన సాక్ష్యాలు లేకుండా మసీదు విధ్వంసం కోసం కరసేవకులకు శిక్షణ ఇచ్చారన్న నిర్ధారణకు రావడం మంచిది కాదు''.
నేను తీసిన ఫొటోలలో ఒక వ్యక్తి ముఖానికి కర్చీఫ్ కట్టుకుని, మట్టి దిబ్బను కూల్చడానికి ప్రయత్నిస్తున్న వాళ్లకు ఆదేశాలు ఇస్తున్నాడు.
బహుశా అతను ఏదైనా మితవాద పార్టీకి చెందిన నేత కావచ్చు. అందువల్లే తానెవరైందీ కనిపించకుండా తన మొహాన్ని కర్చీఫ్ చాటున దాచుకుని ఉండొచ్చు.
ఆ తర్వాత వాలంటీర్ల కేకలు, నినాదాల మధ్య మట్టిదిబ్బను విజయవంతంగా కూలదోసారు.
నేను నా కెమెరాను నా జాకెట్ లో దాచుకుని, ఈ మొత్తం కార్యక్రమానికి ప్రత్యక్షసాక్షిగా నిలిచానన్న ఉత్సాహం, ఆ ఫొటోలను భవిష్యత్ తరాలకు అందిస్తున్నాన్న ఆనందంతో, మిగతా వాళ్లతో పాటు నినాదాలు చేస్తూ అక్కడి నుంచి బయటపడ్డాను.

ఆ మరుసటి రోజు నేను ఇతర జర్నలిస్టులతో కలిసి మసీదు ఎదురుగా ఉండే ఓ బిల్డింగ్ నాలుగో అంతస్తుపై ఏర్పాటు చేసిన వేదికపై కూర్చున్నాను. మా ఎదురుగా బీజేపీ, వీహెచ్‌పీ నేతల ఆధ్వర్యంలో కనీసం 1,50,000 మంది వాలంటీర్లతో ర్యాలీ జరుగుతోంది.
ఆ ప్రదేశానికి కాపలాగా ఉన్న పోలీసులు కూడా నినాదాలు చేస్తున్నారు. మిట్టమధ్యాహ్నం గడిచిన కొద్ది సేపటికి, అక్కడున్న గుంపులో ఉద్రేకం హెచ్చింది. ఆ గుంపు పోలీసులపైకి, మసీదును కాపలా కాస్తున్న వారిపైకి దూసుకెళ్లింది.
కొంతమంది నాలుగో అంతస్తు పైకెక్కి జర్నలిస్టులపై దాడి చేసారు. కెమెరాలను విరగ్గొట్టి, మసీదు కూల్చివేతకు ఎలాంటి సాక్ష్యాలు లేకుండా చేయడానికి ప్రయత్నించారు.
కొన్ని గంటల వ్యవధిలో అక్కడ మసీదు నేలకూలింది.
నేను వీలైనంత వేగంగా అక్కడి నుంచి బయటపడి నా హోటల్ వైపు పరుగుతీశాను.

అప్పటికే అల్లర్లు ప్రారంభమయ్యాయి. నేను పోలీసుల కోసం చుట్టూ చూశాను. కానీ అప్పటికే దుకాణాలు, ఇళ్ల తలుపులు మూతపడడం ప్రారంభమైంది.
మసీదును కూలదోసిన ఆ రోజు, ఒక హిందువుగా నేను చాలా సిగ్గుపడ్డాను.
లిబర్హాన్ కమిషన్ ముందు నేను కూడా సాక్ష్యం ఇచ్చాను. మసీదు కూల్చివేతకు సంబంధించి ఇప్పటికీ స్పెషల్ కోర్టు ఎదురుగా ఒక సాక్షిగా హాజరవుతుంటాను.
మసీదు కూల్చివేసి 25 ఏళ్లు గడిచిపోయాయి. కానీ దానికి కారణమైన వారెవ్వరికీ ఇప్పటివరకు శిక్ష పడలేదు.
ప్రవీణ్ జైన్ ఇప్పుడు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ అసోసియేట్ ఫొటో ఎడిటర్‌గా ఉన్నారు. ఇదంతా ఆయన అనసూయ బసుకు చెప్పారు.
మా ఇతర కథనాలు:
- క్విజ్: డాక్టర్ అంబేడ్కర్ గురించి మీకెంత తెలుసు?
- 1984, 2002 మారణకాండలు: న్యాయం కోసం ఎదురుచూపులు
- తిరుమలలో తన మతం గురించి సోనియాగాంధీ ఏం చెప్పారు?
- 2002 అల్లర్ల తర్వాత గుజరాత్ ముస్లింలలో మార్పొచ్చిందా?
- మోదీ లేదా రాహుల్... విదేశాల్లో ఎవరు పాపులర్?
- గుజరాత్ ఎన్నికలు: కాంగ్రెస్ పార్టీ ముందున్న ఐదు సవాళ్లు
- 'మాయావతి 2006లోనే ఎందుకు బౌద్ధం స్వీకరించలేదు?'
- ఆరెస్సెస్‌కు, అమ్మాయిలకు మధ్య ఈ ఘర్షణ ఎందుకొచ్చింది?
- ‘గాంధీ హరిజనులకు శత్రువు’
- బోయింగ్ 777 పిన్న పైలెట్.. బెజవాడ అమ్మాయే
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)