తెలంగాణ ఎన్నికలు: టీఆర్ఎస్‌కే ఓటు వేస్తామని మసీదులో ప్రతిజ్ఞలు

  • 8 అక్టోబర్ 2018
ఈటల రాజేందర్‌కి ఓటు వేస్తామని తీర్మానిస్తున్న గ్రామస్తులు Image copyright UGC/FACEBOOK

"మా కుటుంబమంతా ఈ సారి ఎన్నికల్లో కారు గుర్తుకే ఓటు వేసి మహేందర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని ఈ మసీదులో అల్లా సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం." ఇది తెలంగాణ రాష్ట్రంలోని తాండూరు పట్టణంలో ఉన్న ఓ మసీదులో మంత్రి పి.మహేందర్ రెడ్డి సమక్షంలో జరిగిన ఓ ప్రతిజ్ఞ.

రాష్ట్రంలో ఎన్నికలు సమీపించిన వేళ అంటే ఎన్నికల ప్రకటన విడుదల కావడానికి ముందు వివిధ ప్రార్థనా స్థలాల్లో ఇలాంటి 'ఓటు ప్రతిజ్ఞ'లు బాగా కనిపించాయి.

సిద్ధిపేట నియోజకవర్గంలోని ఇబ్రహీంపూర్ గ్రామస్తులు కూడా ఇలానే స్థానిక ఎమ్మెల్యే, మంత్రి హరీశ్ రావుకు ఓటు వేస్తామంటూ ఏకగ్రీవ తీర్మానం చేశారు.

"మా నుంచి ఒక్క ఓటు కూడా వేరే వాళ్లకు పడకూడదని నిర్ణయించుకున్నాం. అందరూ హరీశ్ రావుకే ఓటు వేయాలి. ఇది మా నిర్ణయం" అని ఇబ్రహీంపూర్‌వాసి ఎల్లారెడ్డి బీబీసీకి తెలిపారు.

2014లో సిద్ధిపేట నుంచే హరీశ్‌రావు పోటీ చేసి గెలిచారు. ఈసారి కూడా అక్కడి నుంచే పోటీ చేస్తున్నారు.

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో పోటీచేస్తున్న ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌కి అనుకూలంగా కమలాపూర్‌లోని వివిధ కుల సంఘాలు, రాములపల్లి గ్రామస్తులు ఏకగ్రీవ తీర్మానాలు చేశారు.

Image copyright UGC/FACEBOOK
చిత్రం శీర్షిక మసీదులో మంత్రి మహేందర్ రెడ్డి సమక్షంలో ఓటు ప్రతిజ్ఞ

సోషల్ మీడియాలో ఈ తీర్మానాల వీడియోలు, ఫొటోలు మంత్రులను ట్యాగ్ చేస్తూ బాగా ప్రచారం అవుతున్నాయి.

సెప్టెంబరు 6న ముఖ్యమంత్రి కేసీఆర్ శాసన సభను రద్దు చేయడంతో రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తున్నాయి.

ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల జాబితాను కేసీఆర్ ప్రకటించారు. అభ్యర్థులంతా నియోజకవర్గాల్లోనే ఉండి ఎన్నికల ప్రచారం చేసుకోవాలని ఆదేశించారు.

Image copyright UGC/FACEBOOK

'ఈ అంశాన్ని పరిశీలిస్తాం- కేంద్ర ఎన్నికల సంఘం'

రాష్ట్రంలో సెప్టెంబరు 27 నుంచి ఎన్నికల ప్రవర్తనా నియమావళిలోని పార్ట్ 7 అమల్లోకి వచ్చింది. అక్టోబర్ 6న ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆ రోజు నుంచి పూర్తి స్థాయిలో ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చింది.

ఓటింగ్‌పై ప్రార్థనా మందిరాల్లో ప్రతిజ్ఞలు చేయడం గురించి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్ కుమార్‌ని బీబీసీ సంప్రదించగా, తమకు వీటిపై ఫిర్యాదులు అందలేదని, ఏవైనా ఫిర్యాదులు వస్తే కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించి స్పష్టత తీసుకుంటామమని చెప్పారు.

"ఎన్నికల తేదీలు ప్రకటించాక, కోడ్ అమల్లోకి వచ్చాక ఇలా చేయడం ఉల్లంఘన అవుతుంది. ఏదైనా స్పష్టమైన ఫిర్యాదు అందితే మేం ఎన్నికల సంఘం నుంచి స్పష్టత తీసుకుని, చర్యలు తీసుకుంటాం" అని రజత్ కుమార్ బీబీసీకి తెలిపారు.

అయితే, ఈ ప్రతిజ్ఞలు ఎన్నికల నియమావళి పూర్తిస్థాయిలో అమలులోకి రాకముందు జరిగాయి. అంటే అప్పుడు ప్రవర్తనా నియమావళిలోని పార్ట్ 7 మాత్రమే అమలులో ఉంది. ఆ ప్రవర్తనా నియమావళి ప్రకారమైనా ఇవి సక్రమమేనా?

ఇదే అంశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లగా.. " ఈ విషయాన్ని పరిశీలించి తగు చర్యలు తీసుకుంటాం" అని ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి ఓం ప్రకాశ్ రావత్ అన్నారు.

Image copyright UGC/FACEBOOK

'నైతికంగా సరికాదు.. చట్టపరంగా తప్పని నిరూపించలేం'

ప్రార్థనా మందిరాల్లో ఓట్లపై ఏకగ్రీవ తీర్మానాలు, ప్రతిజ్ఞలు చేయడం కొత్తేమీ కాదని 'ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థ' కార్యదర్శి పద్మనాభ రెడ్డి అన్నారు.

"ఇది దాదాపు ప్రతి ఎన్నికల్లోనూ జరుగుతోంది. నైతికంగా ఇది సరైనది కాకపోవచ్చు. కానీ సాంకేతికంగా, చట్టపరంగా ఇది తప్పు అని నిరూపించలేం. ఎవరికి ఓటు వేయాలో మతపెద్దలు మార్గదర్శనం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి." అని ఆయన బీబీసీకి వివరించారు.

రాజకీయ పార్టీల అవసరాల కోసం సమాజం కులాలు, మతాల వారీగా చీలిపోయి ఉందన్నారాయన.

"ప్రార్థనా స్థలాల్లో ప్రతిజ్ఞలు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ని ఉల్లంఘించడమే. కానీ, దీనిపై ఎవరూ ఎప్పుడూ ఫిర్యాదు చేయరు. ఇలాంటివి, ఇంకా ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకోని వారిని ప్రభావితం చేస్తాయి. అయితే ఓటర్లు తెలివైనవారు. వాళ్లు అన్ని అర్థం చేసుకోగలరు." అని పద్మనాభ రెడ్డి చెప్పారు.

ప్రజల స్పందన అలా ఉంది: మంత్రి

ఈ అంశం గురించి బీబీసీతో మంత్రి పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడారు.

''అక్కడ తాండూరులో ర్యాలీ జరిగింది. ఆ తరువాత నన్ను మసీదులోకి తీసుకెళ్లారు. అక్కడకు వెళ్లేంత వరకూ అక్కడ ఏం కార్యక్రమం జరగబోతోందని నాకు తెలియదు. నేను 1994 నుంచీ ఎమ్మెల్యేగా ఉన్నాను. ఇలా ఎప్పుడూ జరగలేదు. ముఖ్యమంత్రి చేస్తోన్న కార్యక్రమాలను చూసి జనాలు స్పందిస్తున్నారు. అంతకుమించి నాకు తెలియదు'' అని ఆయన అన్నారు.

ఓట్లకు సంబంధించి ఏకగ్రీవ తీర్మానాలు, ప్రతిజ్ఞల చేసిన నియోజకవర్గ ఓటర్లతో బీబీసీ మాట్లాడింది.

సోషల్ మీడియో మొత్తం ఎన్నికల ప్రచారాలు, ఏకగ్రీవ తీర్మానాల ఫొటోలు, వీడియోలతో నిండిపోయిందని కమలాపూర్ గ్రామస్తుడు, తొలిసారి ఓటు వేయబోతున్న యువకుడొకరు బీబీసీకి చెప్పారు.

"మా నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నది స్పష్టంగా వివరిస్తే నాలాంటి వారికి ఉపయోగపడుతుంది. ఇలాంటి ప్రతిజ్ఞల జిమ్మిక్కులు నాలాంటివారిని ఒత్తిడిలో పెడతాయి. కానీ, నేను ఎవరికి ఓటు వేయాలనేది పోలింగ్ బూత్‌లోకి వెళ్లే వరకూ ఆలోచిస్తా." అని అన్నారు పేరు చెప్పడానికి ఇష్టపడని ఆ యువ ఓటరు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)