బిగ్ బాస్-2: ‘‘ఈక్వల్ గేమ్ ఎలా అవుతుంది’’ - బాబు గోగినేని అభిప్రాయం

  • 30 సెప్టెంబర్ 2018
బాబూ గోగినేని Image copyright BabuGogineniHumanist/fb

బిగ్ బాస్‌ ఇంటి ముఖద్వారం దాకా కళ్ళకు గంతలు కట్టి మరీ తీసుకువస్తారు. ఎడం కాలు పెట్టి వెళ్లినా, కుడి కాలు పెట్టి వెళ్లినా, కళ్ళు తెరవగానే ఆ ఇల్లు మామూలు ఇల్లు కాదని ఇట్టే తెలిసి పోతుంది.

హౌస్ చాలా పెద్దది. రంగుల డిజైన్‌, వినూత్న రూపం, అద్దాల గోడలు, ఎయిర్ కండిషనింగ్‌, ఇంటి సభ్యులు అందరూ సమావేశమవ్వడానికి పెద్ద లివింగ్ రూమ్, మంచి వంట ఏరియా, 16 మంది సభ్యులూ పడుకోవడానికి పెద్ద హాల్, చిన్న ఈత కొలను, దాని పక్కనే ఒక జైలు!

అంతమందికీ రెండు టాయిలెట్లు మాత్రమే ఉన్నప్పటికీ, ఇంత పెద్ద లక్సరీ హౌస్ సెట్ కేవలం మా తెలుగు సీజన్ కోసమే కట్టారా, మా సీజన్ అయిపోగానే దీన్ని కూల్చివేస్తారా-ఆశ్చర్యం వేసింది. ఇంటి నిండా వివిధ వాణిజ్య ప్రకటనలు ఉన్నాయి లెండి, ఇలాంటి షో చేయాలంటే వాణిజ్యపరమైన ఉద్దేశాలు ముఖ్యం కదా!

అవునూ, మనం ఆ ఇంటిలోకి సిలబస్‌తో కదా వెళ్ళింది! దాని అవసరం అసలు ఉందా? తప్పకుండా ఉందని నాకు కొన్ని రోజుల్లోనే తెలిసిపోయింది. ఆ ఇంటి సభ్యుల్లో నలుగురు ఆడవారు తమ కులాలు ఏమిటో చెప్పి మరీ ఒక జట్టుగా వ్యవహరించడం ప్రస్ఫుటంగా కనిపించేసింది, నాలుగు రోజులు తిరగక ముందే!

నామినేషన్ లిస్టులో ఉండకూడదని దీక్ష చేసి, ఉపవాసాలున్న ఇద్దరు ఆడవారు ఉన్నారు ఆ ఇంటిలో. కానీ పాపం వారిద్దరూ బయటకు వచ్చేశారు.

భూమి బల్లపరుపుగా ఉందని ఎందుకు ఒప్పుకోకూడదని అడిగిన ఒక నటుడు కూడా ఉన్నారు. రాత్రి, పగలు ఎలా ఏర్పడతాయి అని అడిగిన ఒక నటి కూడా ఉన్నారు.

బిగ్ బాస్-2: ‘‘ఆట బుకీస్ చేతిలోకి వెళ్లిపోయింది...’’- బాబు గోగినేని

వీరందరూ తమ తమ రంగాల్లో నిష్ణాతులైన వారే! నాకు వినోదానికి సంబంధించిన పాటలు ఎలా రావో, వారికి జీవితానికి సంబంధించిన స్కూల్ సైన్సు పాఠాలు రావు.

అదో మూఢనమ్మకాల నిలయం

నిజానికి, బిగ్ బాస్ ఇల్లే మూఢ నమ్మకాల నిలయం.

ఇంట్లో ప్రతి మూల వేలాడుతున్న ప్లాస్టిక్ పిరమిడ్లు, అర్థం కాని భాషలో షో నిర్వాహకులు ENDOMOLSHINE మంచి జరగాలని సీలింగ్ మీద ఇంగ్లిష్ లిపిలో అతికించిన విదేశీ మంత్రాలు.. ఇదంతా గమనించిన నేను ఒక రోజు ఇంటి సభ్యులను మూఢనమ్మకాల టూర్ మీద తీసుకెళ్ళాను. ప్రోమోలో ఈ విషయం చూపించి షోలో చూపించే ధైర్యం చేయలేదు నిర్వాహకులు. అలాగే నేను బయటకు వచ్చేశాక ఒక జ్యోతిష్యురాలిని కూడా కొంత సమయం కోసం ఇంటిలోకి తీసుకువచ్చారట.

మా సిలబస్‌కు సంబంధించి నాకు బాగా గుర్తున్న విషయాలేమిటంటే... మమ్మల్ని ఒక ఫిల్మ్ తీయమని టాస్క్ ఇచ్చారు. ప్రారంభించే ముందు గుమ్మడికాయ కొట్టాలని ఇంటి సభ్యులు ఆలోచిస్తుండగా, "ఆపండి! ఏమిటీ పనులు!" అని నేను గదిమితే, ఆపారు.

నేను గిరీశం పాత్ర నిర్వహించాను ఒక టాస్క్‌లో. యుక్త వయస్కురాలైన పూజను ఒక ముసలి వ్యక్తి లొంగదీసుకోకుండా ఆపటం నా ప్రయత్నం ఆ ఆటలో. మానవ సంబంధాలు బాధ్యతాయుతంగా ఉండాలన్నది సందేశం. ఇంట్లో ప్రేమాయణం జరిగినప్పుడు కూడా నేను చెప్పింది అదే, ఇద్దరు ఇంటి సభ్యులకు.

చిత్రం శీర్షిక బాబు గోగినేని

ఇంకొకసారి ఇంటి సభ్యులు చెప్పులు విడిచి వచ్చి బోనాల పూజ జరుపుకోవాలని ఆదేశం వస్తే, "ఈ ఇంట్లో మతపరమైన క్రతువులు ఎలా చేస్తారు? ఇప్పుడు మేకను కూడా కోస్తారా ఏమిటి" అని అడిగా. ఎందుకంటే ఇంటిలో అప్పటికే కొందరి ఓవర్ యాక్టింగ్ ఆరంభమయ్యింది. "గుడి ఇక్కడ, ఈశాన్యం అదిగో, సుచీశుభ్రం ముఖ్యం, పూలను ముట్టుకునే ముందు స్నానం చేసి రండి'' అని మొదలు పెట్టారు ఇంటి సభ్యులు ఇద్దరు. మహిమాన్విత తిలకం ఉన్నది నా దగ్గర, మీకు కావాలా- ఇది నూతన్ నాయుడు గారి ఆఫర్. నేను సున్నితంగా తిరస్కరించాను. నేను ఆ కార్యక్రమానికి ఎవరికీ అడ్డం రాకపోయినప్పటికీ, నాకు సంబంధం లేదని ఎడంగా ఉన్నాను. ఇంతలోనే, "పూజలు ఏమీ చేయవద్దు, మతపర క్రతువులు చేయవద్దు, సంబరాలు మాత్రమే జరుపుకోండి" అని లిఖిత ఆదేశం వచ్చింది బిగ్ బాస్ నుంచి.

నేను బయటకు వచ్చేసిన వారం తర్వాత బొమ్మల పెళ్ళిళ్ళు చేయించారు ఇంటి సభ్యులతో. నేనయితే, మత రహితంగా, మానవ విలువలతో, అన్ని మతాల వారికి నచ్చేటట్లు పెళ్లి క్రతువును ఎలా నిర్వహించవచ్చో చూపించి ఉండేవాడిని!

ఇకపోతే, "We are Star Dust" అని రాసి ఉన్న టీ షర్ట్ వేసుకున్న రోజు నేను ౩౦ నిమిషాల లెక్చర్ ఇచ్చాను విశ్వంపై. కానీ, తాను పెట్టిన నియమాలను ఇంటి సభ్యులు పాటించడంలేదనీ, బాబు బిగ్ బాస్ టాస్క్ ఆపి లెక్చర్ ఇచ్చాడని అలిగి, ఇంటి సభ్యులకు ఆ వారం లగ్జరీ బడ్జెట్ ప్రత్యేక ఆహారం ఇవ్వబోవడం లేదని బిగ్ బాస్ ప్రకటన చేశారు. మాకు కోపాలు రావాలని ఆయన ఉద్దేశం.

"ఏమీ ఫరవాలేదు, మేము తెలుసుకున్న వివరాలతోనే మా కడుపు నిండిపోయింది" అన్నది ఆ ఇంటిలో నాకు అందరికన్నా నచ్చిన తేజస్వి. "నువ్వు నా తండ్రివై ఉంటే ఎంత బాగుండేది" అన్న తనకు.. "ఈ రోజు మా బాబు అరుణ్‌కు అక్క దొరికింది, తేజూ!" అని చెప్పాను. "అదేమోగానీ, నన్ను మాత్రం మీరు 'అక్క' అనే పిలవాలి, బాబు బ్రో!" అని ఆప్యాయంగా అడిగింది, అందరికంటే చిన్న పిల్ల దీప్తి సునయన! నా వరకు, ఇలా ఉన్నవి అక్కడ మానవ సంబంధాలు.

Image copyright Babu Gogineni

డార్విన్, కార్ల్ మార్క్స్, ఎంఎన్ రాయ్, భగత్ సింగ్‌ల గురించి, రాశులు, జ్యోతిషం గురించి చెప్పాను నేను. జీవ పరిణామం, మతం, వీటి గురించి ఆధునిక అవగాహన ఏమిటనే అంశాలపై వారితో వాస్తవాలు పంచుకున్నాను. రాకెట్లు ఎలా ఎగురుతాయి, వాతావరణం అంటే ఏమిటి- ఇలాంటివి కూడా. ఆఖరికి ఇల్లు ఊడ్చేటప్పుడు స్టాటిక్ ఎలక్ట్రిసిటీతో కష్టం లేకుండా దుమ్మును ఎలా తీయవచ్చో అక్కడి మిత్రులకు చూపించాను. నన్ను కోరి కోరి చెప్పించుకున్నారు ఇంటి సభ్యులు. కన్ను కొట్టడం నేర్చుకుంటే ఖగోళ శాస్త్రం ఎలా సులభంగా అర్థం అవుతుందో అని ఒక తమాషా క్లాసు తీసుకున్నాను. ఆ రోజు ఖగోళశాస్త్రం సంగతేమిటో కాని, తనీష్ మాత్రం నందినికి కన్ను కొట్టడం ఆపలేదు! చాలా నవ్వుకున్నాం.

ఇవన్నీ చూపించారో లేదో నాకు తెలియదు.

అలాగే పిశాచాలు, దయ్యాల విషయమంటే అమిత్‌కు భయం. నేను పాల్గొన్న 'సెల్ఫీ విత్ ఘోస్ట్' ఉద్యమం గురించి వారికి వివరించాను. ఇవి హాట్ స్టార్‌లో లభ్యమవుతున్నాయని మిత్రులు చెప్పారు.

మనం వేరే వారి మాటలు విని ఎలా ప్రభావితమవుతామోనన్న విషయాలు ప్రాక్టికల్‌గా నిరూపించడానికి కొన్ని ప్రయోగాలు చేసి చూపించాను. ముట్టుకోకుండా ఒకరి చేతిలోని లోలకం (pendulum) ఎలా వేగంగా కదిలేటట్లు చేయవచ్చో గణేష్‌తో చేసి చూపించాను. దీప్తి సునయనను హిప్నోటైజ్ చేసాను. అంతే! అప్పటిదాకా మౌనంగా ఉన్నా, పెద్దగా సైరన్ మోగించి, "ఇక్కడ మైండ్ గేమ్స్ ఆడడానికి వీల్లేదు" అని గాభరా పడుతూ సందేశం పంపించాడు మాతో అనునిత్యం మైండ్ గేమ్స్ ఆడుతున్న బిగ్ బాస్.

బిగ్గర్ బాస్

నా టీ షర్ట్ చూసి, "BIGGER BOSS అంటే ఏమిటి?" అని అడిగారు చాలా మంది. ముఖ్యంగా నాతో ఎక్కువ చర్చలు చేసిన కిరీటి.

నా సమాధానం ఏమిటంటే- ''మన జీవితానికి మనమే కర్త, కర్మ, క్రియగా ఉండాలి. ఉన్నదొక్క జీవితమే కాబట్టి మనం కోరుకునే సంతోషాన్ని, మనం ఇవ్వగలిగే ఆనందాన్ని అంతా ఇక్కడే అనుభవించాలి. కానీ మన జీవితంలో, మన సమాజంలో మన ఉద్దేశాన్ని, మన గమ్యాన్ని నిర్దేశించే, అడ్డుకునే శక్తులు ఎన్నో ఉంటాయి. వాటిని హేతుబద్ధంగా అర్థం చేసుకుని, వాటి నియంత్రణలో మనం ఉండకుండా, అవసరమైతే వాటిని ఎదిరించి, మన జీవితాన్ని మనమే శాసించుకోగలగాలి, మన జీవితానికి మనమే బాధ్యత వహించుకోవాలి. ఎవరు ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా మనం మనలాగే ఉండాలి. మానవవాద సారాంశం అదే.

ఇక్కడ బిగ్ బాస్ కోరిక, ఆదేశం మేరకు మనం కొన్ని ఆటలు ఆడుతున్నాం. నవ్వమంటే నవ్వుతున్నాం. ఏడవమంటే కొంతమంది ఏడ్చేస్తున్నారు. బిగ్ బాస్ అనే ఒక అదృశ్య శక్తి మనతో ఆటలాడుతోంది కదా! మనం మన విలువలను, స్వాతంత్ర్యాన్ని కోల్పోయి ఎలా ఆడమంటే అలా ఆడితే ఎలా? మనం ఆట బొమ్మలం కాదు కదా? విచక్షణ ఉపయోగించాలి కదా? సహకరించుకోవడమే మానవ నైజం అయినప్పుడు మనకు వైరం పెడితే ఎందుకు లొంగాలి? దీనితోపాటు, 'నేను నీకన్నా ఎత్తులో ఉన్నాను, నాకే ఎక్కువ బలం ఉంది, బిగ్ బాస్' అని చెప్పడానికే నేను ఈ టీషర్ట్ వేసుకున్నా'' అని చెప్పాను.

ఈ క్రమంలోనే, అపరిచుతులను జైల్లో వేయమన్నప్పుడు కుదరదు, ఒప్పుకోను, అని అభ్యంతరం చెప్పాను. ఆ సందర్భంలో, ఆదేశాలు, నిర్ణయాలు హేతుబద్ధంగా ఉండాలని కోరాను. అహేతుకత కారణంగా జరిగే అన్యాయాల గురించి మాట్లాడాను. ఇంకోసారి, 'సేవకులు-యజమానులు' అనే ఆటలో "సేవకులంటే బానిసలు కాదు, తెలుసుకోండి, వారికి కూడా హక్కులు ఉంటాయి, ఉద్యోగం చేసేవారందరికీ విశ్రాంతి, వినోదం ఉండాలి, వారికి తర్ఫీదు పొందే అవకాశం ఇవ్వాలి'' అని, అలా చేసి కూడా చూపించాను".

''ఇంగ్లిష్ ఎక్కువ మాట్లాడుతున్నావు, జైలులో పెడతాము'' అంటే, ''అదేమి న్యాయం, అయినా, ముందు జైలు మాన్యువల్ ఏది'' అని అడిగాను!

అఫ్ కోర్స్, అది పూల్ సైడ్ వ్యూ, అటాచ్డ్ టాయిలెట్ కూడా ఉన్న తమాషా జైలు అనుకోండి!

ఒక ఆటలో పోటీదారులకు నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా దెబ్బలు తగులుతుంటే- "బిగ్ బాస్, కిందకు రా, నీ సంగతి తేల్చుకోవాలి" అని గదిమాను. నాకు క్షమాపణ చెప్పారు.

మమ్మల్నిసినిమా తీయమంటే, ముందు స్పాట్ బాయ్ వేషం, తర్వాత ప్రొడ్యూసర్ వేషం వేసిన నేను, హీరోల ప్రత్యేక కోరికలకు తావివ్వకుండా, హీరోయిన్ల గారాబాలకు లొంగకుండా సినిమా డైరెక్టర్‌కు వారి కంటే ఎక్కువ పారితోషికం, కథానాయకుడు, కథానాయకిలకు సమాన పారితోషికం, కిందిస్థాయి కార్మికులకు లాభాల్లో వాటా ఏర్పాటు చేసి, ఇలా కూడా సినిమా తీయొచ్చు అని చూపించాను.

తొండి నియమాలతో బిగ్ బాస్ చెరకు రసం టాస్క్ ఒకటి ఇస్తే, ఆ ఆటలో ఎవరి ఆస్తినైనా ఎవరైనా దొంగిలించవచ్చు అని, సంచాలకురాలికి లంచం కూడా ఇవ్వవచ్చునని నియమం పెట్టినప్పుడు, నేను తలచుకుంటే బిగ్ బాస్ కన్నా నేనే ఎక్కువ తొండి చేయగలనని కెమెరాకు కన్ను కొట్టి మరీ చూపించాను. నేను చెరకు రసంలో నీళ్ళు కలపడం 12 మందిలో ఎవరూ గమనించలేకపోయారు. వాళ్లు ఒక చెరకు రసం బండి చక్రం తిప్పుతుంటే, నేను ఇంకో చక్రం తిప్పాను! ఇంకో ఆటలో నన్ను తాళ్ళతో కట్టివేస్తే, నాకు విడిపించుకోవడం ఎలా వచ్చో చేసి చూపించాను. ఎవరికీ తెలియదు, కెమెరాలకు తప్ప! నాకూ అల్లరి వచ్చండీ!

ప్రేమికులూ, వారి స్వేచ్ఛను నియంత్రించే వారిగా ఇంటి సభ్యులను విభజించినప్పుడు, మేము నియంత్రించేవారిగా నియమితమైనప్పుడు, మనము ఎప్పుడూ ప్రేమికుల వైపే ఉండాలనే ఆట ఆడుతూనే, ఆ స్ఫూర్తిని కొనసాగిస్తూనే, నా జట్టును ఒప్పించి, చివరకు ప్రేమికులనే గెలిచేటట్టు చేశాం.

''మంచి వాళ్ళు-చెడ్డ వాళ్ళు'' అనే టాస్క్‌లో, అది మన వ్యక్తిత్వానికే ఒక పరీక్ష అని గుర్తుచేసి, మా జట్టు సభ్యులను అప్రమత్తం చేశాను. ఒకరు చెప్తే మనం చెడ్డగా మారడం ఏమిటి, ఆట నియమాలకు లోబడి మారినా, మారిన వారు ఎంత చెడ్డగా ఉండాలి అనేది ఆలోచించుకోవచ్చు, అది వారి నిర్ణయమే కదా అని చెప్పి గేమ్‌ను ముందుకు తీసుకెళ్లాను. IT IS A TEST OF CHARACTER అని!

ఇంకో విషయం కూడా అందరి దృష్టికి తీసుకొచ్చాను. బయట ప్రపంచంలో మాదిరే బిగ్ బాస్ హౌస్‌లో కూడా మంచివారికి శక్తులు లేవు, చెడ్డవారికే శక్తులు, అధికారాలు ఉన్నాయి. అయినా చెడ్డవారికి ప్రతిఘటన ఇస్తూనే ఉన్నాం. ఇవ్వాలి. మేము కేవలం ఆట ఆడలేదు. ఒక సందేశాన్ని ఇచ్చాం.

''ఆడవారు - మగవారు'' ఆటలో ఒక అన్యాయమైన పోటీ జరుగుతున్నప్పుడు, ఆస్తి దోపిడీ జరిగినప్పుడు, ఆడవారి హక్కుల విషయం మాట్లాడి, చివరకు ఆడవారికి జరిగిన అన్యాయాన్ని సరిచేశాం మా జట్టు సభ్యులందరం. అక్కడే, ప్రలోభాలకు, బెదిరింపులకు భయపడి, తమ ఆస్తి దొంగతనం జరగడం తమ మంచికేనని చెప్పేశారు గీతా మాధురి, ఆడవారి హక్కులపై టీవీ షో చేసిన దీప్తి నల్లమోతు.

ఆటలో ఆడవారితో తొక్కిసలాట జరిగే అవకాశమున్న ఆటల్లో నేను పాల్గొనలేదు. నన్ను తోసి ముందుకు వెళ్లిన ఆడవారిని నేను వెనక్కు గుంజే అవకాశం ఉన్నా గుంజలేదు. ఎందుకంటే నిజ జీవితంలో కూడా నేను అలా చేయను. కానీ భారతీయ సంప్రదాయం, సంస్కృతి అని మాట్లాడినవారిలో ఆ జంకు లేకుండా పోయింది, ఎందుకో!

Image copyright Babu Gogineni
చిత్రం శీర్షిక కమల్ హాసన్‌కు టీషర్టు బహూకరణ

బిగ్ బాస్ లోకంలో మనకు నైతికపరమైన సవాళ్లు, గందరగోళాలు చాలా ఉంటాయి. ఆట నియమాలు మన అనుభవంలో ఉన్న నియమాలు కావు. ఒక పక్క ఆకలి వేస్తుంటుంది. నిద్ర సరిపోయి ఉండదు. జ్ఞాపక శక్తి ఏ మాత్రం ఉండదు. అన్నీ, మిత్రుల వివరాలతో సహా, మాయమైపోతుంటాయి!

ఈ పరిస్థితుల్లో, నేను ఆ ఇంట్లో ఉన్నంత కాలంలో కనీసం ఒక 80 శాతం కాలం BIGGER BOSS ఎవరో చూపించాననే అనుకుంటున్నాను. మిగతా వారు కూడా ఈ విషయం గ్రహించారు: 'బిగ్గర్ బాస్ సేన' ఏర్పాటైంది బిగ్ బాస్ ఇంట్లో, ఇంటి సభ్యులతో. రోల్ రైడా, అమిత్ తివారీ అందులో కీలక సభ్యులు. మిగతా వారు కూడా చేయి కలిపారు.

సినీ నటి మంచు లక్ష్మిగారు ఇంటికి వచ్చినప్పుడు, ''నేను మీకు ఫ్యాన్ అండీ'' అంటూ పలకరించారు. సినీ నటుడు కమల్ హాసన్ గారు ఇంట్లోకి వచ్చినప్పుడు, మిగతా ఇంటి సభ్యులు సినిమా వారు అయినా కూడా, పరిచయం లేని నన్ను పేరుతో పలకరించి, ప్రత్యేకంగా నాతోనే చర్చ చేసి, నేను REASON NOT RELIGION అని రాసి ఉన్న టీ షర్ట్ ఆయనకు బహుమానంగా ఇస్తే, ''ఇది పదిలంగా దాచుకుంటాను'' అని చెప్పారు.

Image copyright Babu Gogineni

కొత్త వేషాలు!

''బాబు గారూ, మీరు స్టైలిష్‌గా తయారుకావాలని మా కోరిక'' అన్నది తేజస్వి. ''మీ ఇష్టం'' అన్నాను నేను. అంతే! తనీష్ నాకు ఒక హెయిర్ కట్ ఇచ్చారు, సామ్రాట్ స్టైలింగ్ చేశారు, కొన్ని చిన్న సినిమాల్లో, సీరియళ్లలో నటించిన కౌశల్ తన డ్రెస్ వేసుకోమని ఇచ్చారు.

వీరందరి సహకారంతో, మొత్తానికి నాకు 'సాల్ట్ అండ్ పెప్పర్ లుక్' వచ్చింది. ఇది నాకు బాగా ఉందన్నది సభ అభిప్రాయం.

''లుక్ భలే ఉంది'' అని నాని గారు మెచ్చుకున్నారు కూడా. అందరికంటే ముఖ్యం, నా భార్య సహనకు కూడా నచ్చింది. ఇంకొకసారి రోల్ రైడా నా జుట్టుకు రంగు కూడా వేశాడు.

నాతో డాన్స్ కూడా వేయించారు నాని గారు. తేజస్వి, ఇద్దరు దీప్తిలు నాతో డాన్స్ చేయించారు. సామ్రాట్ కూడా. నా 'పిడకల స్టెప్' చాలా పాపులర్ అయ్యింది అట - కానీ నాకు మాత్రం డాన్స్ అంటే పీడకలనే! 40 ఏళ్లుగా నేను తినని కొత్తిమీర తిన్నాను ఈ గేమ్ షోలో, గణేష్ కోసం!

చాలా బాగుండింది ఆ ఇంట్లో 63 రోజుల అనుభవం. జీవితకాలంలో బహుశా చాలా కొద్ది మందికే వచ్చే అవకాశం నాకు ఇచ్చారు నిర్వాహకులు.

Image copyright maatv/Facebook

బయటకు ఎందుకు వచ్చేశానంటే!

బిగ్ బాస్ ఇంట్లో ప్రక్రియ ఏంటంటే, ప్రతి వారం ఇంటి సభ్యులు కొంత మందిని నెగటివ్ వోట్ ద్వారా నామినేట్ చేస్తే, ప్రేక్షకులు పాజిటివ్ వోట్‌తో ఎవరిని ఉంచాలనేది నిర్ణయిస్తారు. తక్కువ వోట్లు పడ్డవారు ఎలిమినేట్ అవుతారు.

అప్పటికే ఎలిమినేట్ అయిన నూతన్ నాయుడు, శ్యామల అనే ఇద్దరిని వారితో టీవీలో కాంపెయినింగ్ చేయించి మళ్లీ ఇంట్లోకి తీసుకురావడం, వారు బయట నుంచి చూసిన విషయాలను కొంత మంది ఇంటి సభ్యులకు మాత్రమే చెవిలో చెప్పడం మొదలుపెట్టడం, ఈ కొత్త సమాచారం ఆధారంగా దీప్తి నల్లమోతు, గీతా మాధురి తమ ప్రవర్తనను మార్చుకోవడం, నాస్తికత్వం లొల్లి ఇంటిలోకి తీసుకొచ్చినందుకు నానీతో చీవాట్లు తిన్న కౌశల్ ను వారు అన్ని విషయాల్లో సమర్థించడం, ఈ విషయాలన్నింటిలో నాని ప్రవర్తన చూశాక, వారి మీద, ఈ ఆట మీద నాకు పూర్తి విరక్తి కలిగింది. ఇలాంటి ఆట నాకు అక్కర్లేదని ఇంటిలోనే ప్రకటించేశాను.

మమ్మల్ని ఎవరికీ చెప్పకుండా గోప్యంగా ఇంట్లోకి తీసుకొచ్చి, ఈ ఇద్దరిని ఓడిపోయినా ఆర్భాటంగా కాంపెయినింగ్ కూడా చేయనిచ్చి తీసుకొస్తే- ఇది అందరినీ సమానంగా చూసే (ఈక్వల్) గేమ్ ఎలా అవుతుంది?

కొంత మందిలో మారిన ప్రవర్తనకు మూలాలు బయట ఉన్నాయని, బయట నుంచి వచ్చిన సమాచారంలో ఉందని నేను గ్రహించాను. బయట ఏమి జరుగుతోందో వారు దురుద్దేశపూర్వకంగా కొంత మందితో చెప్పడం నేను విన్నాను. అసలు గేమ్ ఉద్దేశమే బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా ఆడాలని కదా? చాల్లే తమాషా అని ఆటల నుండి నిష్క్రమించడం మొదలుపెట్టాను. ఎలిమినేట్ అయ్యి, బయటకు వచ్చాను.

నేను ఆటల్లో ఎన్నిసార్లు అల్లరి చేశానో! కానీ తెలిసి తప్పు ఎప్పుడూ చేయలేదు. అల్లరికి, తప్పులకు తేడా ఉంది. చాలా సంతోషంగానే, ఒత్తిడి లేకుండానే ఉన్నాను ఇంట్లో. ఇతరులు కూడా సంతోషంగా ఉండటానికి చేయాల్సింది చేసేవాడిని. అందరూ పోటీదారులే. కానీ మానసికంగా బలహీనపడుతున్న వారిపైనా మనం కోరుకునేది విజయం?

దీప్తి సునయన ప్రవర్తనపై ఎన్నో అనుమానాలు కలిగేట్లు చేసి, ఆమె పరువుకు భంగం కలిగించిన ‘ఆర్మీ సేనాని’ని సునయన ఎప్పటికి క్షమిస్తుందో చూడాలి. నాకు మాత్రం ఇంటి వాతావరణం కలుషితమైనది అనిపించింది.

బయటకు వచ్చాక, నా నిర్ణయానికి దారితీసిన అనుమానాలన్నీ నిజమేనని తెలిసిపోయింది. 90 కెమెరాలకు దొరకనిది, ఆలోచించే ఒక మెదడుకు మాత్రం లభించిందా? నాకైతే ఇది ఆశ్చర్యం.

నిర్వాహకులేమీ తక్కువ తినలేదు

బయట సైబర్ సైన్యాలను మోహరించుకొని వెళ్లారు కొంత మంది ఆటగాళ్లు! వారి సైన్యం పని ఏమిటంటే వేరే ఆటగాళ్లపై నేరపూరిత ఉద్దేశాలతో దారుణంగా దాడి చేయడం, మిగతా ఆటగాళ్లను సమర్థించేవారిని నేరపూరితoగా బెదిరించడం. దీప్తి సునయన, తేజస్వి లాంటి ఆడవారిని దుర్మార్గంగా దూషించడం... ఎవరినీ వదల్లేదు ఈ మూకలు. మిగతా వారు కూడా ప్రొఫెషనల్ మార్కెటింగ్ ఏర్పాట్లు చేసుకొని వెళ్లారని తెలుస్తోంది. ఒక సైబర్ సైన్యం దాడి తట్టుకోలేక, పోలీస్ ఫిర్యాదులో బయటపడ్డది ఆ ప్రొఫెషనల్ మార్కెటింగ్ సంస్థ- తను ఇంకో పోటీదారుకు ప్రచారం చేస్తున్నట్లు.

ఒక టీవీ ఛానల్ అధినేత తనకు డబ్బు ఇవ్వచూపిన ఇంకొక ఆటగాడి పేరు నాకు చెప్పారు.

ఇవన్నీ కట్టడి చేసే బాధ్యత నిర్వాహకులదే కదా? ఇలా చేయించిన ఆటగాళ్లను బయటకు పంపించాల్సిన బాధ్యత నిర్వాహకులది కాదా?

ఎవరు గెలుస్తారు?

ఇంట్లో సభ్యులను ఒత్తిడికి లోను చేస్తే వారి ప్రవర్తనను కెమెరాల్లో బంధిస్తే అది ఒక వినోద కార్యక్రమం అవుతుందని అందరూ అనుకున్నారు. మరి 90 కెమెరాలను, సోషల్ మీడియాను అందుబాటులో ఉంచి ప్రోగ్రాం హోస్ట్‌ను, నిర్వాహకులను ఒత్తిడికి, బెదిరింపులకు, దూషణకు గురిచేస్తే వారి ప్రవర్తన ఎలా ఉంటుంది? వినోదం కాదు, విషాదం వస్తుంది.

నాకు తెలిసి నాని గారిని ఒత్తిడికి లోను చేయకపోతే ఆయన ఆట ఇంకో విధంగా, గొప్పగా ఉండేది. నిర్వాహకులేమో బిత్తరపోయి చూస్తున్నారు. అసలు వీరిని కూడా ఇంటిలో బంధించి ఉంచితే ఆట బాగా ఆడేవారేమో! చాలా ఆసక్తికరంగా ఉండాల్సిన ఆటను, అందరూ కలిసి ఎలా దిగజారిపోయే అవకాశం ఇచ్చారో!

3,500 డాలర్లకు కొన్ని పదుల వేల జీమెయిల్ ఖాతాలను కొనుక్కోవచ్చనీ, ఆ ఫీజు కడితే ఆ మార్కెటింగ్ సంస్థ వారే ఆ ఈమెయిల్ ఖాతాల నుంచి వోట్లు వేసి పెడతారనీ బయటకు వచ్చిన తాజా సమాచారం. అంటే, క్రికెట్ భాషలో చెప్పాలంటే ''ఆట బుకీస్ చేతిలోకి వెళ్లిపోయింది''. ఇది రియాలిటీ షోగా ఉండాల్సింది; సైబర్ వార్‌గా మారిపోయింది.

ఈ ఆటలో ఆటగాళ్లు బిగ్ బాస్, ఇంటి సభ్యులు, ఆటను వీక్షిస్తూ వోట్లు వేస్తున్నవారు. వీరిలో కొంత మంది ఆటగాళ్లే ఈ ఆటను ఓడించారు. మరి ఈ పరిస్థితిలో ఎవరు గెలిచినట్లు? ఆట నియమాలను, ఆట స్ఫూర్తిని గౌరవించినవారే గెలిచినట్లు. మిగతావారు అందరూ ఓడినట్లే! అద్దంలో ముఖం చూసుకోండి!

ఒక్క విషయం: సోషల్ మీడియాను వాడుకొని ప్రజలను ఒక ఉన్మాదంలోకి చాలా సులభంగా ఎలా నెట్టవచ్చో మనం ఈ ఉదంతంలో చూశాం. ఒక ప్రజాస్వామ్యానికి ఈ రకమైన ప్రక్రియ ఎంత ప్రమాదకరం, ఎన్నికలప్పుడు ఇలాంటి ప్రచారాన్ని ఎలా దుర్వినియోగపరచవచ్చు అనే విషయాలను అధికార సంస్థలన్నీ నిశితంగా పరిశీలించాలి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)