గర్భిణులు కుంకుమ పువ్వు కలిపిన పాలు తాగితే.. పిల్లలు ఎర్రగా పుడతారా?

  • 2 అక్టోబర్ 2018
నమ్మకాలు.. నిజాలు Image copyright Getty Images

‘హమ్మయ్య’.. పెద్దగా నిట్టూర్చి పక్కకు ఒత్తిగిల్లింది అమూల్య. గండం గడిచి పిండం బయట పడటం అంటే ఇదేనేమో! ఒక రోజంతా నెప్పులు పడింది తను. ఏమైనా సరే నార్మల్ డెలివరీ కావాలనుకుంది. అనుకున్నట్టుగానే నార్మల్ డెలివరీనే అయింది.

అబ్బ ఏం నెప్పులూ? నెప్పులంటే ఇవా? కడుపులోనూ, నడుంలోనూ వేయి సుత్తులతో మోదుతున్నట్టు అనిపించిందామెకు. ఇంకో కాన్పు వద్దు బాబోయ్ అనుకుంది.

బిడ్డ బయటకు రాగానే డాక్టరమ్మా, నర్సులు అబ్బాయి పుట్టాడని అరిచి చెప్పారు"థాంక్యూ డాక్టర్ "అంది తను.

అబ్బాయి ఎలా వున్నాడో తనపోలికో, ఆయన పోలికో, సరిపడా బరువున్నాడో లేడో, ఉమ్మ నీళ్లేమయినా తాగాడంటారేమో?. అంటూ ఆమెలో ఆందోళన.

ఈ మధ్య తన స్నేహితురాలి పిల్లను కాన్పు అవంగానే బరువు తక్కువగా వుందనీ, ఉమ్మ నీళ్లు తాగిందనీ పిల్లల డాక్టర్ దగ్గర బాక్సులో పెట్టి ఆరు రోజులక్కానీ చేతికివ్వలేదు, అరవైవేలు చేతి చమురు వదిలింది.. ఇలా పలు ఆలోచనలలో మునిగిన అమూల్య దగ్గరికి పసిబిడ్డని స్నానం చేయించి తీసుకు వచ్చి పడుకోబెట్టింది ఆయా.

బిడ్డ నెత్తురు ముద్దలా వున్నాడు.

ఈలోగా బిడ్డను చూడటానికి వచ్చిన అత్తగారూ, ఆడపడుచులూ "ఇదేంటి పిల్లాడు నలుపయ్యేట్టున్నాడు?" అని చప్పరించేశారు.

Image copyright Getty Images

అత్తగారు అమూల్య తల్లి వైపు తిరిగి "అయిదవ నెలలోనే తీసుకెళ్లి పోయారుగా పుట్టింటికి.. విశ్రాంతి కావాలని, పాలల్లో కుంకుమ పువ్వు వేసి ఇచ్చారా లేదా? పిల్లాడు నల్లగా పుట్టటం ఏంటి?’’ అని నిలదీసి అడుగుతోంది.

"అయ్యో వదిన గారూ, మీ అన్నయ్య గారికి తెలిసిన వారెవరో కశ్మీరు నుంచి తెప్పించి ఇస్తే ప్రతిరోజూ పాలల్లో వేసి ఇస్తూనే వున్నామండీ" అంది అమూల్య తల్లి.

"ఏమోనమ్మా.. మా అమ్మాయికి అయిదవ నెలనుండీ కుంకుమ పువ్వు పాలల్లో వేసి ఇచ్చాను. పండంటి తెల్లటి పిల్ల పుట్టింది. మీరు ఇచ్చారో లేదో? ఇస్తే పిల్లాడు ఇలా నల్లగా ఎందుకుంటాడు?" అని దీర్ఘాలు తీసిందావిడ.

Image copyright Getty Images

"అసలు వాళ్లు చెప్పేవన్నీ అబద్ధాలేనే అమ్మా, పెళ్లిలో ఆడబడుచు కట్నం ఇస్తామన్నంత ఇవ్వకుండా ఎగ్గొట్టారు, అలక పానుపులో ఇస్తామన్న కారుకు ఇంతవరకూ అతీ, గతీ లేదు" అంటూ ఒక ఆకు ఎక్కువ చదివింది ఆడబడుచు.

దానిపైన మాటామాటా పెరిగింది, చూస్తూ చూస్తూ వుండగానే ఆ తగవు చిలికి చిలికి గాలివానయ్యి, క్షణాల్లో ఆ హాస్పిటల్ రూము రణరంగంగా మారిపోయింది.

ఈ లోగా డాక్టర్ని పిలిచారెవరో, ఆవిడ కంగారుగా పరిగెత్తుకొచ్చింది.

ఇరు పక్షాల వారి వాదనలు విన్న డాక్టరమ్మ ఇలా అంది.

"చూడండీ.. పుట్టే పిల్లల ఒంటి రంగుకీ ,కుంకుమ పువ్వుకీ సంబంధం లేదు. మనిషి ఒంటి రంగుని నిర్ణయించేది వారి తల్లిదండ్రుల నుండీ సంక్రమించే జీన్స్ , ఇంకా కొంతవరకూ సూర్యరశ్మి.

Image copyright Getty Images

చర్మం రంగు ఎలా ఏర్పడుతుంది?

తల్లిదండ్రుల ఒంటిరంగును బట్టి, వారి జీన్స్ లో నిక్షిప్తమయిన సమాచారం సహాయంతో శరీరంలో వున్న "మెలనో సైట్స్ "నుండీ ఉత్పత్తి అయ్యే "మెలనిన్ "పరిమాణాన్ని బట్టి ఒంటి రంగు నిర్ణయమవుతుంది.

మెలనిన్ శాతం ఎక్కువగా ఉండే మనుషులు నల్లగా వుంటారు. అది తక్కువగా వుండే మనుషులు తెల్లగా వుంటారు.

ఇంకా కొంతవరకూ సూర్యరశ్మి కూడా ఒంటి రంగు మీద ప్రభావం చూపుతుందనుకున్నాం కదా!

అదెలాగంటే... సూర్యరశ్మి ఎక్కువగా సోకే శరీరభాగాలు మెలనిన్‌ని ఎక్కువగా ఉత్పత్తి చేసి నల్లగా తయారవుతాయి. ఇది ఒక రక్షణ చర్య.

అంటే సూర్యరశ్మిలోని అతినీల లోహిత కిరణాల నుండి శరీరాన్ని కాపాడటానికి చర్మం ఎక్కువగా మెలనిన్‌ని ఉత్పత్తి చేస్తుందన్నమాట.

ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. భూమధ్య రేఖకి దగ్గరగా వుండే ప్రదేశాలలో నివసించే ఉష్ణ దేశాల వారు నల్లగా ఉంటారు. భూమధ్య రేఖకి దూరంగా వున్న శీతల దేశాల వారు తెల్లగా వుంటారు. ఇదంతా మెలనిన్ మాయే.

మీకింకో విషయం తెలుసా మన మానవ జాతికి ఆద్యుడూ, ఆదిపురుషుడూ ఆఫ్రికాలో జన్మించాడు. అతని దేహం కారు నలుపు.

తర్వాత్తర్వాత జరిగిన పరిణామక్రమంలో, జీవజాతులు వలస పోవడం మొదలయ్యి, వారి జీన్స్ లో మ్యుటేషన్స్ జరిగి, వారి చర్మం రంగు నికార్సయిన నలుపు నుండీ విరిగిపోయి తెలుపు రంగులోకి మారిపోయింది. అంతేకానీ కుంకుమ పువ్వు ప్రభావంతో మారలేదు.

Image copyright Getty Images

వాస్తవానికి ఏరంగుదీ ఆధిపత్యం కాదు.. అలాగని ఏ రంగుకూ న్యూనతా లేదు.

రంగు భేదంతో మనుషుల మధ్య వివక్ష చూపడం అమానుషం.

చర్మం రంగేదయినా దాని కింద పారే నెత్తురు రంగొకటే. గాయపడినా, బాధపడినా స్పందిచే హృదయమొక్కటే.

అయినా మీ కోడలు బిడ్డను కనేటప్పుడు ఎంత బాధ భరించి, నెప్పులు పడి బిడ్డను కన్నదో ఒక స్త్రీ అయిన మీరు కూడా మరిచి పోతే ఎలా?

ఏ కాన్పులో ఎప్పుడు ఏ సమస్యలొస్తాయో చెప్పలేం కదా! ఒకే స్త్రీలో ఒక కాన్పు ఉన్నట్టు ఇంకో కాన్పు ఉండదు.

డాక్టర్ మాటలతో ఉలిక్కి పడ్డ అమూల్య బిడ్డను గట్టిగా గుండెకు హత్తుకుంది.

ఇవి కూడా చదవండి: