జస్టిస్ రంజన్ గోగోయ్: సొంత కారు లేని సుప్రీంకోర్టు కొత్త చీఫ్ జస్టిస్

  • 3 అక్టోబర్ 2018
రంజన్ గోగోయ్ Image copyright Getty Images

భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రంజన్ గోగోయ్ బుధవారం నాడు బాధ్యతలు స్వీకరించారు. ఈశాన్య భారతం నుంచి సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ పదవికి ఎంపికైన తొలి వ్యక్తి రంజన్ గోగోయ్. ఆయన తండ్రి కేశవ్ చంద్ర గోగోయ్ గతంలో అసోమ్ ముఖ్యమంత్రిగా సేవలందించారు.

జస్టిస్ దీపక్ మిశ్రా భారత ప్రధాన న్యాయమూర్తిగా పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలోకి గోగోయ్ అడుగు పెట్టారు.

కొన్ని నెలల క్రితం మరో ముగ్గురు సీనియర్ జడ్జిలతో కలిసి పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి, భారత న్యాయ చరిత్రలోనే ఓ కొత్త సంచలనానికి గోగోయ్ తెరతీశారు. సుప్రీంకోర్టులో వ్యవస్థ పనితీరు సరిగ్గా లేదని, ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని అప్పుడు గోగోయ్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవి ఆయనకు దక్కకపోవచ్చనే అనుమానాలూ వచ్చాయి. స్వతంత్రంగా, రాజకీయ శక్తులకు తలొగ్గకుండా పని చేసే వ్యక్తులకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వకపోవచ్చని చాలామంది అభిప్రాయపడ్డారు.

కానీ, ఇప్పటికే ఉన్న వివాదాలకు తోడు... సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియామకంలో సంప్రదాయ విధానాన్ని కాదని మరో వివాదంలో చిక్కుకోకూడదనే ఉద్దేశంతోనే మోదీ ప్రభుత్వం ఎలాంటి రిస్క్ తీసుకొని ఉండకపోవచ్చు. ముఖ్యంగా ఎన్నికలు దగ్గర పడుతుండటంతో సుప్రీంకోర్టు సంప్రదాయ విధానంలో ప్రభుత్వం తలదూర్చకపోయి ఉండొచ్చని న్యాయనిపుణులు భావిస్తున్నారు.

గతంలో రాజకీయ నాయకులు న్యాయవవస్థను నియంత్రించేందుకు ప్రయత్నించినా కొన్నిసార్లు అది సాధ్యం కాలేదు. భారత్‌లో గోగోయ్‌లా స్వతంత్రంగా వ్యవహరించే జడ్జిలు చాలామంది ఉన్నారు. 1951లో సీనియర్ జడ్జి పతంజలి శాస్త్రి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవి చేపట్టడం నాటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూకు ఇష్టం లేదు. కానీ అతడిని కాదని జూనియర్ జడ్జికి ఆ పదవిని అప్పగిస్తే, మరో ఆరుగురు జడ్జిలు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారని నెహ్రూ సన్నిహితులు హెచ్చరించారు. దాంతో నెహ్రూ ఆ ఆలోచనను విరమించుకున్నారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక మంగళవారం జరిగిన జస్టిస్ దీపక్ మిశ్రా(కుడి) వీడ్కోలు సభలో జస్టిస్ రంజన్ గోగోయ్

1973లో ముగ్గురు సీనియర్ జడ్జిలను కాదని జస్టిస్ ఏఎన్ రే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవి చేపట్టారు. ఎమర్జెన్సీ సమయంలో న్యాయవవస్థను తన గుప్పిట్లో ఉంచుకునే ఉద్దేశంతో జస్టిస్ హెచ్ ఆర్ ఖన్నాను కాదని ఎం హెచ్ బేగ్‌కు ప్రధాన న్యాయమూర్తి పదవి దక్కేలా ఇందిరా గాంధీ పావులు కదిపారు.

ఇటీవల విడుదలైన ‘గువాహటి హై కోర్ట్, హిస్టరీ అండ్ హెరిటేజ్’ అనే పుస్తకంలో రంజన్ గోగోయ్‌కి సంబంధించిన ఓ ఆసక్తికర అంశం కనిపిస్తుంది. రంజన్ గోగోయ్ కూడా వారసత్వాన్ని కొనసాగిస్తూ రాజకీయాల్లో అడుగుపెడతారా అని అతడి తండ్రి కేశవ్ చంద్ర గోగోయ్‌ను ఎవరో అడిగారట. దానికి బదులిస్తూ... ‘రంజన్ ఒక అద్భుతమైన న్యాయవాది. అతడు రాజకీయాల్లోకి రాడు. కానీ, అతడికి ఏదో ఒక రోజు ప్రధాన న్యాయమూర్తిగా ఎదిగే సామర్థ్యం ఉంది’ అని కేశవ్ చంద్ర అన్నారట.

తమ ఆస్తుల్ని ప్రకటించిన 11మంది సుప్రీంకోర్టు జడ్జిల్లో రంజన్ గోగోయ్ ఒకరు. ఆ వివరాల ప్రకారం ఆయనకు సొంత కారు కూడా లేదు. తన తల్లి, సామాజిక కార్యకర్త శాంతి గోగోయ్ నుంచి ఆయనకు కొంత స్థిరాస్తి అందింది.

తన ఆస్తిలో మార్పులు జరిగినప్పుడల్లా గోగోయ్ వాటిని వెల్లడిస్తుంటారు. కానీ మిగతా జడ్జిల్లో చాలామంది ఆ పని చేయడం లేదు. పారదర్శకత కోసం న్యాయమూర్తులు తమ ఆస్తులను ప్రకటించాలని 1997లో తీర్మానించినప్పటికీ ఆ ప్రక్రియ సజావుగా కొనసాగట్లేదు.

కేసుల విషయంలో చిన్న చిన్న అంశాలకు కూడా గోగోయ్ చాలా ప్రాధాన్యమిస్తారని, కేసులను గంటల తరబడి అధ్యయనం చేస్తారని ఆయనతో కలిసి పనిచేసిన న్యాయవాదులు చెబుతారు. ‘గోగోయ్‌ను ఆ స్థానంలో చూడటం చాలా సంతోషంగా ఉంది. ఆ పదవికి ఆయన యోగ్యుడు. చిత్త శుద్ధి కలిగిన వ్యక్తి’ అని బాంబే హై కోర్టు మాజీ తాత్కాలిక చీఫ్ జస్టిస్ చంద్రశేఖర్ ధర్మాధికారి అన్నారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఇతర న్యాయమూర్తులతో కలిసి ప్రెస్ కాన్ఫరెన్సు నిర్వహించి గోగోయ్ సంచలనం సృష్టించారు

రంజన్ గోగోయ్ 2001లో గువాహటి హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. ఆ తరువాత పంజాబ్, హరియాణా హైకోర్టులకు బదిలీ అయ్యారు. 2011లో హరియాణా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2012లో సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి పొందారు.

అసోంలోని డిబ్రుగఢ్‌లో పెరిగిన గోగోయ్, దిల్లీ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ నుంచి డిగ్రీ చేశారు. తరువాత ‘ఫ్యాకల్టీ ఆఫ్ లా’లో న్యాయవిద్య అభ్యసించారు.

కొన్ని నెలల క్రితం జస్టిజ్ చలమేశ్వర్, జస్టిస్ మదన్ లోకుర్, జస్టిస్ కురియన్ జోసెఫ్ లాంటి న్యాయమూర్తులతో కలిసి నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో గోగోయ్ మాట్లాడుతూ సుప్రీంకోర్టుల కేసుల పరిశీలనా తీరు సరిగా లేదని వ్యాఖ్యానించారు. ఎంపిక చేసిన కొందరు న్యాయమూర్తులకే సున్నితమైన కేసులను చీఫ్ జస్టిస్ అప్పగిస్తున్నారని, ఏ కేసును ఎవరు విచారించాలో నిర్ణయించే అధికారం ఆయన చేతిలో ఉండటం వల్లే ఇలా వ్యవహరిస్తున్నారని గోగోయ్ పేర్కొన్నారు.

భారత న్యాయవ్యవస్థను ఆ ఆరోపణలు తీవ్రంగా కుదిపేశాయి. ఆ ఆరోపణల్లో భాగంగా సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం జడ్డి బీహెచ్ లోయా ఆకస్మిక మృతి కేసును కోర్టు విచారిస్తున్న తీరును కూడా ఆయన ఉదహరించారు.

చనిపోయే నాటికి... గుజరాత్ పోలీసుల నకిలీ ఎన్‌కౌంటర్‌లో సోహ్రబుద్దిన్ షేక్ మృతిచెందాడనే ఆరోపణలపై నమోదైన కేసును లోయా విచారిస్తున్నారు. సీనియర్ పోలీసు అధికారులతో పాటు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా పేరు కూడా ఆ కేసులో ఉంది. జస్టిస్ లోయా అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. తాను తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు లోయా తన కుటుంబ సభ్యులతో చెప్పేవారని తెలుస్తోంది.

జడ్జిల కొరత వల్ల లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని కూడా గోగోయ్ గుర్తు చేశారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక రంజన్ గోగోయ్

‘ప్రజాస్వామ్యంలో న్యాయవ్యవస్థ అత్యుత్తమమైంది. ప్రజలకు ఆ వ్యవస్థపై ఉన్న నమ్మకాన్ని పరరిక్షించుకోవాలి. వ్యవస్థాపరంగా అది కలుషితం కాకూడదు. నిత్యం స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలి’ అని గోగోయ్ దిల్లీలో ఇటీవల రామ్‌నాథ్ గోయెంకా స్మారక సభలో ప్రసంగిస్తూ తడుముకోకుండా చెప్పారు.

‘అణగారిన వర్గాలు స్వేచ్ఛగా సమాజంలో మనుగడ సాగించడమే ప్రజాస్వామ్యంలో అతిపెద్ద సవాలు’ అని ఆయన వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం దేశంలో న్యాయవ్యవస్థ ప్రాధాన్యం పెరిగిపోయింది. ఒక్కోసారి పాలకులు చేయాల్సిన పనులను కూడా కోర్టులు కల్పించుకొని ముందుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

ప్రజాస్వామ్యానికి కాపలాదారుగా ఉండాల్సిన మీడియా వార్తల... ముసుగులో చెల్లింపు వార్తలను అందించడం కనిపిస్తోంది. ప్రజాస్వామిక సంస్థలు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి పనిచేస్తున్న సమయంలో ప్రజాస్వామ్యాన్ని, పౌర హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత న్యాయవ్యవస్థదే.

జస్టిస్ గోగోయ్ దేశ ప్రధాన న్యాయమూర్తిగా ఏడాదిపైగా కొనసాగుతారు. 2019, నవంబర్ 18న ఆయన పదవీ విరమణ పొందే నాటికి తనదైన ముద్రవేస్తారని ఆయనతో పనిచేసిన వారు నమ్మకంగా చెబుతున్నారు. కానీ ప్రస్తుతం నెలకొన్న సవాళ్ల నేపథ్యంలో అదంత సులుభం కాకపోవచ్చు. బహుశా, రంజన్ గోగోయ్ కూడా ఇలాంటి సవాళ్ల కోసమే ఎదురు చూస్తున్నారేమో.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)