ప్రెస్‌రివ్యూ: మోదీపై చంద్రబాబుది దొంగ యుద్ధం - బృందాకరత్‌

  • 4 అక్టోబర్ 2018
Image copyright CPIM - Andhra Pradesh/Facebook

‘మోదీది జేబుదొంగల ప్రభుత్వం... మోదీపై చంద్రబాబుది దొంగ యుద్ధం. వీరిద్దరూ మహిళలు, గిరిజనులు, పేదలు, రైతుల హక్కులను కాలరాస్తున్నారు’ అంటూ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) ఉపాధ్యక్షురాలు బృందా కరత్‌ తీవ్రంగా విమర్శించారని ‘ప్రజాశక్తి’ దినపత్రిక ఒక కథనంలో చెప్పింది.

ఆ కథనం ప్రకారం.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విధానాలు ఒకటేనని.. వీరిద్దరినీ ఇంటికి సాగనంపకపోతే మహిళల భవిష్యత్‌ ప్రశ్నార్థకమవుతుందని ఆమె హెచ్చరించారు.

ఐద్వా 14వ రాష్ట్ర మహాసభల సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జరిగిన బహిరంగ సభలో బృందా కరత్ మాట్లాడారు. దిల్లీలో రైతులపై మోదీ ప్రభుత్వం విరుచుకుపడితే.. కాకినాడ సెజ్‌లో రైతులపై చంద్రబాబు ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించిందని విమర్శించారు.

గిరిజన హక్కులను కాలరాస్తున్నారని, పోలవరం ముంపు బాధితులకు పునరావాసం కల్పించకుండా ఇబ్బందులు పెడుతున్నారని చెప్పారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లు పార్లమెంట్‌లో చర్చకు వచ్చేలా మహిళలంతా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. మోదీ విధానాల వల్ల స్త్రీల ఆర్థిక స్వావలంబన, స్వాతంత్య్రం, స్వేచ్ఛ వెనుకబడ్డాయన్నారు.

పెట్రోల్‌ ధరల పెరుగుదల వల్ల ఒక్క ఏడాదిలోనే దేశంలో రూ. 2.35 లక్షల కోట్లు ప్రభుత్వ ఖజానాకు చేరిందని చెప్పారు. ఈ సొమ్మును పేదల కోసం కాకుండా, పెద్దల కోసం ఖర్చు చేస్తున్నారన్నారు. మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాల విషయంలో బిజెపి ఎంపీలు, ఎంఎల్‌ఎల తీరు బాధాకరంగా ఉందన్నారు. మోదీ, బాబుకు వ్యతిరేకంగా వామపక్షశక్తులతో కలిసి పోరాడాలన్నారు.

Image copyright Nara Chandrababu Naidu/Facebook

మోదీ అట్టర్ ఫ్లాప్ - చంద్రబాబు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యారని.. నోట్ల రద్దు, జీఎస్టీ, పెట్రో ధరల నియంత్రణ, రైతుల సమస్యల పరిష్కారం... ఇలా అన్నింటా ఘోరంగా విఫలమయ్యారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విమర్శించినట్లు ‘ఆంధ్రజ్యోతి’ ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. చంద్రబాబు బుధవారం జాతీయ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. మంత్రులతో కూడా ప్రస్తుత రాజకీయాలపై సమీక్షించారు. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ దారుణంగా పడిపోయిందని, పెట్రోల్‌ ధరలు సెంచరీకి చేరువయ్యాయని, సబ్సిడీలేని వంటగ్యాస్‌ ధరనూ విపరీతంగా పెంచారని మండిపడ్డారు.

‘‘భారీ నినాదాలు ఇవ్వటం తప్ప మోదీ చేసిందేమీ లేదు. కేంద్ర ప్రభుత్వం పాలనలో విజయవంతం కాలేదు. కానీ... రాజకీయ ప్రత్యర్థులపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌, ఇతర దర్యాప్తు సంస్థలను ప్రయోగించడంలో మాత్రం విజయం సాధించింది'' అని చంద్రబాబు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయిందన్నారు.

రాష్ట్ర రాజధాని అమరావతిని నిర్మిస్తే.. అది దేశంలోనే అద్బుత నగరం అవుతుందని.. ఆ ఘనత కూడా ఇద్దరికీ దక్కుతుందని మోదీకి చెప్పానని చంద్రబాబు తెలిపారు. ‘‘కానీ అమరావతికి ఆయన సాయం చేయలేదు. పైగా విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రంలోనూ ఇద్దరు, ముగ్గురిని అడ్డుపెట్టుకుని నాపై కుట్రలు పన్నుతున్నారు’’ అని ఆరోపించారు.

‘‘మోదీ మరోసారి గెలిస్తే తెలుగు ప్రజలకు తీరని అన్యాయం, అవమానమే! బీజేపీకి వ్యతిరేకంగా నిలిచే రాజకీయ శక్తులన్నింటినీ కలుపుకొని వచ్చే ఎన్నికల్లో మోదీని గద్దె దించాలి. లెఫ్ట్‌ అయినా, రైట్‌ అయినా, కాంగ్రెస్‌ అయినా, కమ్యూనిస్టులైనా మోదీకి వ్యతిరేకంగా నిలిచేవారిని కలుపుకొని వెళ్దాం’’ అని మంత్రులతో సమీక్షలో చంద్రబాబు పేర్కొన్నారు.

‘‘పవన్‌, జగన్‌ ఇద్దరినీ చేతిలో పెట్టుకొని బీజేపీ ఆడిస్తోంది. కేంద్రంలో బీజేపీ, ఇక్కడ ఆ పార్టీ చేతిలో ఉన్న వారు అధికారంలోకి వస్తే రాష్ట్రానికి నష్టం’’ అని ఆయన వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో టీడీపీ కీలక పాత్ర పోషిస్తుందని.. అయితే, ప్రధాని పదవి తీసుకోవడం మాత్రం కాదని చంద్రబాబు చెప్పినట్లు ఆంధ్రజ్యోతి కథనం తెలిపింది.

Image copyright KCR/Facebook

మళ్లీ ఆంధ్రోళ్లకు అధికారం అప్పగిస్తరా?: కేసీఆర్

‘‘చంద్రబాబుతో పొత్తా.. అడుక్కుంటే మేమే నాలుగు సీట్లు పడేస్తుంటిమి కదా. మళ్లీ ఆంధ్రోళ్లకు అధికారం ఇస్తరా? విజయవాడ, అమరావతికి గులాంగిరి చేస్తరా?’’ అని టీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కాంగ్రెస్‌ పార్టీపై విమర్శలు ఎక్కుపెట్టినట్లు ‘సాక్షి’ దినపత్రిక ఒక కథనంలో పేర్కొంది.

ఆ కథనం ప్రకారం.. నిజామాబాద్‌లో టీఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రచార సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. ‘‘వందల మంది చచ్చిపోయి తెలంగాణ సాధించిన గడ్డ ఇది. మూడు హెలికాప్టర్లు, రూ. 500 కోట్లిస్తే కాళ్లు మొక్కి దండం పెట్టి మళ్లా మా నెత్తిమీద తెచ్చి పెడతరట’’ అని కాంగ్రెస్ పార్టీని ఎద్దేవాచేశారు.

‘‘తెలంగాణలోని ఏడు మండలాలను గుంజుకున్న దుర్మార్గుడు చంద్రబాబు. సీలేరు పవర్‌ ప్రాజెక్టు తీసుకొని తెలంగాణకు కరెంట్‌ రాకుండా అడ్డుపడి రాక్షసానందం పొందిన రాక్షసుడు. గోదావరి, కృష్ణా నదులపై కడుతున్న ప్రాజెక్టులు ఆపాలని 36 లేఖలు రాశాడు. అలాంటి దుర్మార్గుడు చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటారా?’’ అని ప్రశ్నించారు.

‘‘మళ్లీ ఆంధ్రోళ్లకు అధికారం అప్పగిస్తరా.. నవ్వేటోడి ముందు జారిపడతరా.. విజయవాడ, అమరావతికి తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడతరా? తెలంగాణ ప్రజలే నిర్ణయించాలి’’ అని కేసీఆర్ పేర్కొన్నట్లు ‘సాక్షి’ కథనం చెప్పింది.

Image copyright Getty Images

26 నుంచి మహా ఉద్యోగమేళా.. 35 వేల మందికి అవకాశం

అక్టోబర్ 26వ తేదీ నుంచి హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ట్రేడ్ హైదరాబాద్ డాట్ కామ్ ఆధ్వర్యంలో మహా ఉద్యోగమేళా నిర్వహించనున్నట్టు తెలంగాణ ఐటీ, పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్ చెప్పారని 'నమస్తే తెలంగాణ' ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. బుధవారం సచివాలయంలో మహా ఉద్యోగమేళా పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. 26 నుంచి మూడు రోజుల పాటు జరిగే ఈ ఉద్యోగమేళాలో 11 దేశాలకు చెందిన 365 మల్టీనేషనల్ కంపెనీలు పాల్గొంటాయని తెలిపారు.

ఇంజినీరింగ్, మెడికల్, సివిల్, ఏరోనాటిక్స్, మెకానికల్, హెల్త్‌కేర్, ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ, రిటైల్‌వంటి కంపెనీల్లో ఉద్యోగాలకు ఏ విద్యార్హత ఉన్న వారైనా అర్హులేనన్నారు.

దాదాపు 35 వేల మంది ఉద్యోగాలు పొందే అవకాశం ఉందని, గిన్నిస్ బుక్‌ఆఫ్ వరల్డ్ రికార్డు కోసం ఈ మేళాను నిర్వహిస్తామని జయేశ్‌రంజన్ వెల్లడించారు. నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

బంగారం Image copyright Getty Images

బంగారం భగభగ... 10 గ్రాముల ధర రూ. 32,000 పైకి

బంగారం ధర భగ్గుమందని.. దిల్లీ బులియన్‌ విపణిలో మేలిమి బంగారం (999 స్వచ్ఛత) 10 గ్రాముల ధర బుధవారం ఒక్కరోజే రూ. 555 పెరిగి, రూ.32,030కి చేరిందని ‘ఈనాడు’ దినపత్రిక ఒక కథనంలో తెలిపింది. వెండి కూడా కిలో రూ. 39,000 దాటిందని చెప్పింది.

ఆ కథనం ప్రకారం.. హైదరాబాద్‌లో పసిడి రూ. 32,085, వెండి రూ. 39,560గా నమోదవుతోంది. డాలర్‌ విలువ రూ. 73.34 కు చేరడం వల్లే ధర ఇంతలా పెరిగింది.

అంతర్జాతీయంగా డాలర్లలో పసిడి ధర కిలోకు 55 డాలర్లే పెరిగినా.. రూపాయల్లోకి వచ్చే సరికి భారీ మార్పుంది. సెప్టెంబరు 3న డాలర్‌ విలువ రూ. 71.13 కాగా, బుధవారం రూ. 73.34.

అంటే నెల వ్యవధిలో డాలర్‌ విలువ రూ. 2.21 పెరిగింది. ప్రస్తుత ధర 38,644 డాలర్లు కనుక, ఇంతకు దేశీయంగా పడుతున్న అదనపు భారం రూ. 85,020 అవుతుంది. దీనికి 13 శాతం పన్ను మొత్తం రూ.11,050 అవుతుంది. ఇది కూడా జతచేస్తే, కిలోకు రూ.96,000కు పైగా భారం పడుతోంది.

మేలిమి బంగారం అంటే 999 స్వచ్ఛత కాగా, ఆభరణాలకు 91.6 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం వినియోగిస్తారు. హైదరాబాద్‌లో మేలిమి బంగారం ధర గ్రాము రూ. 3,212 కాగా ఆభరణాల బంగారం విలువ రూ. 2,980 గా చెబుతున్నారు.

అంటే సెవర (8 గ్రాములు) రూ.23,840, తులం (10 గ్రాములు) రూ.29,800 పడుతోంది. అంతర్జాతీయ విపణికి అనుగుణంగా బంగారం ధర ఎప్పటికప్పుడు మారుతోందని.. వినియోగదారులు ఈ విషయాన్ని గ్రహించాల్సి ఉంటుందని ‘ఈనాడు’ కథనం సూచించింది.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)