ఎవరీ పృథ్వీ షా? సచిన్ ఈ కుర్రాడి గురించి ఏమన్నాడు?

  • 4 అక్టోబర్ 2018
పృథ్వీ షా Image copyright Kai Schwoerer-IDI/Getty Images
చిత్రం శీర్షిక పృథ్వీ షా

చిన్నపిల్లాడిగా మైదానంలో అడుగుపెట్టిన పృథ్వీ షా చిచ్చరపిడుగుగా చెలరేగిపోయాడు. సెంచరీతో రికార్డులు సృష్టించాడు.

ఇంతకీ ఎవరీ పృథ్వీ షా.. తన బ్యాటింగ్‌తో 'టెస్ట్ ఒపెనింగ్' సమస్యను తీర్చేయనున్నాడా.. తన స్ట్రోక్ ప్లేతో కోహ్లీ వారసుడిగా స్థిరపడుతాడా?

ఒక్క మ్యాచ్‌లో చేసిన పరుగులతో ఈ నిర్ణయానికి రాలేకపోవచ్చు. కానీ, షా బ్యాటింగ్ చూస్తే మాత్రం ఇదే అతనికి తొలి టెస్ట్ మ్యాచ్ అంటే నమ్మలేం.

Image copyright Kai Schwoerer-IDI/Getty Images

'షా'న్ దార్ చిన్నోడు..

పృథ్వీ షా పుట్టింది ముంబయి శివార్లలోని విరార్‌లో.. నాలుగేళ్ల వయసులోనే తల్లిని కోల్పోయాడు.

కొడుకును క్రికెటర్ చేసేందుకు 8 ఏళ్ల వయసులో షాను అతని తండ్రి బాంద్రాలోని రిజ్వీ స్కూల్లో చేర్పించారు.

ముంబయి క్రికెట్‌ అసోసియేషన్‌ 2013లో నిర్వహించిన హారిస్‌ షీల్డ్‌ టోర్నీలో రిజ్వి స్ప్రింగ్‌ఫీల్డ్‌ స్కూల్ తరఫున బరిలోకి దిగిన షా.. సెయింట్‌ ఫ్రాన్సిస్‌ డియాస్సి ‌స్కూల్‌తో జరిగిన మ్యాచ్‌లో పరుగుల వరద పారించాడు.

330 బంతుల్లో 85 ఫోర్లు, 5 సిక్స్‌లతో 500 పరుగులు చేసి రికార్డ్ సృష్టించాడు. దీంతో అతని పేరు వెలుగులోకి వచ్చింది.

'తొలి' రికార్డులు

రంజీ ట్రోఫీలో ఆడిన మొదటి మ్యాచ్‌లోనే సెంచరీ చేసిన తొలి క్రికెటర్‌గా షా రికార్డు సృష్టించాడు.

దులీప్ ట్రోఫీలో కూడా మొదటి మ్యాచ్‌లో సెంచరీ చేసి సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు.

ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 15 మ్యాచ్‌ల్లో 57.44 సగటుతో 1,436 పరుగులు చేశాడు. వీటిలో ఏడు సెంచరీలు ఉన్నాయి.

ఇంగ్లండ్‌లో భారత్ 'ఎ' జట్టు తరఫున ఆడిన పృథ్వీ షా 60.3 సగటుతో 603 పరుగులు చేశాడు.

2018 ఐపీఎల్ వేలంలో దిల్లీ డేర్ డెవిల్స్ పృథ్వీ షాను రూ.1.2 కోట్లకు సొంతం చేసుకుంది.

ఐపీఎల్‌లో షా స్ట్రయిక్ రేట్ 150 పై చిలుకు ఉండటం విశేషం.

అండర్ 19 వరల్డ్ కప్ 2018లో కెప్టెన్‌గానూ షా సత్తా చాటాడు. 6 మ్యాచ్‌లలో 261 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

టెస్టు ఆరంగేట్రంలోనే ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన మూడో క్రికెటర్‌గానూ షా రికార్ట్ సృష్టించాడు.

గతంలో శిఖర్‌ ధావన్‌ 85 బంతుల్లో ఆసీస్‌పై సెంచరీ చేయగా, డ్వేన్‌ స్మిత్‌ 93 బంతుల్లో సెంచరీ సాధించిన ఆటగాడిగా నిలిచాడు.

Image copyright Ashley Allen/Getty Images

పిన్న వయసు రికార్డులు

విజయ్ మోహ్ర (17 ఏళ్ల 265 రోజులు) తర్వాత అత్యంత పిన్న వయసులో భారత్ తరఫున అంతర్జాతీయ టెస్ట్ జట్టులో ఒపెనర్‌గా బరిలో దిగిన రెండో వ్యక్తి పృథ్వీ షా (18 ఏళ్ల 329 రోజులు)

సచిన్ తర్వాత భారత జట్టుకు ఎంపికైన అత్యంత పిన్నవయసు బ్యాట్స్‌మెన్‌ పృథ్వీనే.

అరంగేట్రం మ్యాచ్‌లో సెంచరీ సాధించిన నాల్గో పిన్నవయస‍్కుడిగా షా నిలిచాడు.

సచిన్‌కు దక్కనిది షాకు దక్కింది

పృథ్వీ షా కంటే ముందు రంజీ, దులీప్‌ ట్రోఫీల ఆరంగేట్రం మ్యాచ్‌లలో సెంచరీ చేసిన రికార్డ్ సచిన్‌కు ఉంది.

అయితే, ఆడిన తొలి అంతర్జాతీయ టెస్టులోనే షా సెంచరీ చేస్తే.. సచిన్ మాత్రం సెంచరీ కోసం 13 మ్యాచ్‌లు ఆడాల్సి వచ్చింది.

రంజీ, దులీప్‌ ట్రోఫీలతో పాటు తొలి టెస్టులో సెంచరీ చేసిన ఘనతను షా అందుకున్నాడు.

Image copyright Hagen Hopkins/Getty Images

సచిన్ ఏమన్నాడంటే..

పృథ్వీ షా ఆటతీరును సచిన్ టెండూల్కర్ పలుమార్లు ప్రశంసించారు.

షాను తొలిసారి కలిసిన విషయాన్ని ఆయన ఒక ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు.

''పదేళ్ల కిందట నా స్నేహితుడు ఈ అబ్బాయిని చూడండి అని పృథ్వీ గురించి చెప్పాడు. అతని ఆటతీరును విశ్లేషించాలని కోరాడు. దీంతో షాతో కొంతసేపు గడిపాను. కొన్ని సలహాలిచ్చాను. ఏదో ఒక రోజు అతను జాతీయ జట్టుకు ఆడుతాడు అని నా స్నేహితుడికి చెప్పాను.'' అని పృథ్వీ గురించి సచిన్ చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)