మహాత్మా గాంధీకి నోబెల్ శాంతి పురస్కారం ఎందుకు రాలేదు?

  • ఆరిఫ్ వకార్
  • బీబీసీ ప్రతినిధి
మహాత్మా గాంధీ

ఫొటో సోర్స్, Getty Images

1901లో పురస్కారాన్ని నెలకొల్పినప్పటి నుంచి 2018 వరకు శాంతి కోసం చేసిన కృషికి 99 సార్లు నోబెల్ పురస్కారాలు ప్రకటించారు. ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి సందర్భంగా ఏటా డిసెంబరు 10న నోబెల్ పురస్కారాలను ప్రదానం చేస్తారు.

నోబెల్ శాంతి పురస్కారంతో గౌరవించడం రెడ్ క్రాస్ స్థాపకులు జీన్ హెన్రీ డ్యూనెంట్ నుంచి ప్రారంభమైంది. కానీ 19 సార్లు ఈ పురస్కారాన్ని ప్రకటించలేదు. ఇక 27 సార్లు ఈ పురస్కారాన్ని వ్యక్తుల కంటే సంస్థలకు ఇవ్వడమే సబబని భావించారు.

ఏటా ఈ పురస్కారం ప్రకటనకు ముందు, తర్వాత, భారత్‌లో దీనిపై ఎప్పుడూ ఒక చర్చ జరగడం మామూలే. ఆధునిక యుగంలో అందరికంటే గొప్ప శాంతి దూత అయిన మహాత్మా గాంధీకి ఈ పురస్కారం ఎందుకు దక్కలేదా అని చాలా మంది అనుకుంటారు.

నోబెల్ కమిటీ దీని గురించి ఎప్పుడూ పెదవి విప్పలేదు. దాంతో సాధారణంగా అందరిలో ఒకే ఆలోచన వచ్చేది. గాంధీజీకి ఈ పురస్కారం ఇచ్చి ఆంగ్లేయ పాలకుల నుంచి ఇబ్బందులు ఎదుర్కోకూడదని నోబెల్ కమిటీ భావించిందని అందరూ అనుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

నాలుగు సార్లు నామినేట్ అయిన గాంధీ

నోబెల్ శాంతి పురస్కారానికి గాంధీ నాలుగు సార్లు నామినేట్ అయ్యారు. ఆయనను వరసగా 1937, 1939లో నామినేట్ చేశారు. 1947లో కూడా ఆయన నామినేట్ అయ్యారు. చివరగా 1948లో గాంధీని నామినేట్ చేశారు. కానీ తర్వాత నాలుగు రోజులకే ఆయన హత్యకు గురయ్యారు.

మొదటిసారి ఒక నార్వే ఎంపీ గాంధీ పేరును సూచించారు. పురస్కారం ఇచ్చే సమయంలో కమిటీ ఆయన్ను పట్టించుకోలేదు.

ఆ సమయంలోని దస్తావేజుల నుంచి లభించిన వివరాల ప్రకారం, నోబెల్ కమిటీలోని జాకబ్ వార్మూలర్ అనే సలహాదారు గాంధీకి నోబెల్ పురస్కారం ఇవ్వడం గురించి తన అభిప్రాయం రాశారు.

"గాంధీ ఎప్పుడూ తన అహింసా విధానం కొనసాగించారు. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా తను చేస్తున్న అహింసా ఉద్యమం ఎప్పుడో ఒకప్పుడు హింసాత్మకంగా మారొచ్చని తెలిసినా ఆయన దానిని వీడలేదు" (ఆ తర్వాత ఏర్పడిన పరిస్థితులు ఆయన సందేహం నిరాధారం కాదనే విషయం నిరూపించాయి) అని రాశారు.

ఫొటో సోర్స్, Getty Images

గాంధీమార్గంలోనే నడిచాం

"గాంధీ జాతీయవాదం భారత్‌లోని పరిస్థితులకే పరిమితం కాలేదు, దక్షిణాఫ్రికాలో ఆయన చేసిన ఉద్యమం కూడా భారతీయుల ప్రయోజనాలకే పరిమితం చేశారు" అని జాకబ్ వార్మూలర్ రాశారు. "ఆయన భారతీయుల కంటే దుర్భర జీవితం అనుభవించిన నల్లవారి కోసం ఏమీ చేయలేదు" అన్నారు.

మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా లాంటి వారు నోబెల్ శాంతి పురస్కారం అందుకున్న సమయంలో, "మేం గాంధీ మార్గంలో నడిచామని, ఆయన అహింసా ఉద్యమం నుంచే స్ఫూర్తి పొందాం" అని చెప్పినపుడు ఈ వాదన హాస్యాస్పదంగా అనిపించవచ్చు.

1947లో నోబెల్ శాంతి పురస్కారం కోసం కేవలం ఆరుగురినే నామినేట్ చేశారు. వారిలో గాంధీ పేరు కూడా ఉంది.

భారతదేశ విభజన తర్వాత గాంధీ చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యల వల్లే ఆయనకు శాంతి పురస్కారం దూరమైందని వార్తాపత్రికల్లో రాశారు. ఆ ఏడాది నోబెల్ పురస్కారం మానవ హక్కుల ఉద్యమం ‘క్వేకర్‌’కు లభించింది.

ఫొటో సోర్స్, Getty Images

కమిటీ ముందు చిక్కులు

1948లో క్వేకర్ స్వయంగా నోబెల్ శాంతి పురస్కారం కోసం గాంధీ పేరును సూచించింది.

నామినేషన్‌ చివరి తేదీకి రెండు రోజుల ముందు గాంధీ హత్య జరిగింది. ఆ సమయానికే నోబెల్ కమిటీకి గాంధీ తరఫున ఐదు సిఫార్సులు అందాయి.

అప్పుడు మరో సమస్య ఎదురైంది. ఆ సమయంలో మరణానంతరం ఎవరికీ నోబెల్ పురస్కారం ఇచ్చేవారు కాదు. ఇప్పుడు మాత్రం ఇలాంటి ప్రత్యేక పరిస్థితుల్లో నోబెల్ పురస్కారం మరణానంతరం కూడా ఇవ్వవచ్చు.

అప్పుడు కమిటీకి మరో ప్రశ్న కూడా ఎదురవుతుంది. శాంతి పురస్కారం నగదు ఎవరికి చెల్లించాలి. ఎందుకంటే గాంధీకి అప్పుడు ఎలాంటి ట్రస్టుగానీ, సంఘం గానీ లేదు. ఆయనకంటూ ఎలాంటి ఆస్తులు కూడా లేవు. దీనికి సంబంధించి ఆయన ఎలాంటి వీలునామా కూడా రాయలేదు.

ఈ అంశంలో పరిష్కరించలేనంతగా ఎలాంటి న్యాయపరమైన చిక్కులూ లేవు. కానీ ఎలాంటి గందరగోళంలో పడడం నోబెల్ కమిటీకి ఇష్టం లేకుండాపోయింది. అలాంటి పరిస్థితుల్లోనే 1948 నోబెల్ శాంతి పురస్కారం ఎవరికీ అందకుండా పోయింది.

ఫొటో సోర్స్, Getty Images

చేజారిన అవకాశం

కమిటీ తన స్పందనలో రాసిన విషయాలను బట్టి గాంధీ హఠాత్తుగా మరణించకుండా ఉంటే ఆ ఏడాది నోబెల్ శాంతి పురస్కారం ఆయనకే లభించేదనే విషయం స్పష్టమవుతోంది.

"జీవించి ఉన్న ఏ అభ్యర్థినీ శాంతి పురస్కారానికి తగిన వారుగా భావించలేదు" అని కమిటీ చెప్పింది. అందుకే ఆ ఏడాది నోబెల్ బహుమతిని ఎవరికీ ఇవ్వడం లేదని తెలిపింది.

ఈ ప్రకటనలో 'జీవించి ఉన్న' అనే మాట చాలా ముఖ్యమైనది. దానిని బట్టి, మరణానంతరం ఎవరికైనా పురస్కారం ఇచ్చే అవకాశం ఉండుంటే, అది కచ్చితంగా గాంధీకి తప్ప వేరే వారికి దక్కేది కాదనేది స్పష్టమవుతోంది.

గాంధీ లాంటి మహాత్ముడు కూడా నోబెల్ పురస్కారం రావాలని కోరుకున్నారా? అనే విషయం కూడా ఇప్పుడు ఆలోచించాల్సి వస్తోంది.

ఈ ప్రశ్నకు ఒకే ఒక్క సమాధానం ఉంది. గాంధీ గౌరవం, గొప్పతనం నోబెల్ పురస్కారం కంటే ఎంతో ఉన్నతమైనవి. నోబెల్ కమిటీ ఆయనకు శాంతి పురస్కారం ప్రకటించి ఉంటే, దానివల్ల ఆ సంస్థ గౌరవం కచ్చితంగా పెరిగేది. కానీ, నోబెల్ కమిటీయే ఆ అరుదైన అవకాశాన్ని కోల్పోయింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)