రిజర్వేషన్లు పదేళ్ళు మాత్రమే ఉండాలని అంబేడ్కర్ నిజంగానే అన్నారా?

  • 6 అక్టోబర్ 2018
అంబేడ్కర్ Image copyright OTHER

‘రిజర్వేషన్ల అవసరం పదేళ్లు మాత్రమే ఉంటుందని రాజ్యాంగకర్త బీఆర్ అంబేడ్కర్ చెప్పారు. పదేళ్లలోనే సమాజంలో అభివృద్ధి చూడాలని, సామరస్యం నెలకొనాలని ఆయన కోరుకున్నారు. కానీ మనమేం చేశాం? ఆత్మపరిశీలన చేసుకోవడంలో మనం విఫలమయ్యాం. పార్లమెంటులో కూర్చునే ప్రజా ప్రతినిధులు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రతి పదేళ్లకు రిజర్వేషన్లను పొడిగిస్తూ వస్తున్నారు. దేశంలో ఏం జరుగుతోంది?’

ఆరెస్సెస్‌కు అనుబంధంగా ఉన్న ప్రజ్ఞా ప్రవాహ్ అనే సంస్థ నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ చేసిన వ్యాఖ్యలివి.

సుమిత్రా మహాజన్ ప్రసంగం అనంతరం రిజర్వేషన్లను సమర్దిస్తూ, వ్యతిరేకిస్తూ మరోసారి సోషల్ మీడియాలో ప్రముఖంగా పోస్టులు కనిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ప్రముఖ రచయిత, వక్త, ప్రొఫెసర్. హరి నార్కేతో బీబీసీ మాట్లాడింది. అంబేడ్కర్ నిజంగానే రిజర్వేషన్లు పదేళ్ల కాలానికే ఉండాలని కోరుకున్నారా అని తెలుసుకునే ప్రయత్నం చేసింది.

‘రిజర్వేషన్లు మూడు రకాలు. రాజకీయ రిజర్వేషన్ (రిజర్వ్‌డ్ నియోజకవర్గాలు), చదువులు, ఉద్యోగాల్లో రిజర్వేషన్. రాజ్యాంగంలోని ఆర్టికల్ 334 ప్రకారం రాజకీయ రిజర్వేషన్‌కు మాత్రమే పదేళ్ల పరిమితి ఉంది. చదువు, ఉద్యోగాల్లో రిజర్వేషన్‌ కోసం రాజ్యాంగం ఎలాంటి కాలపరిమితీ విధించలేదు’ అని నార్కే చెప్పారు.

Image copyright Getty Images

రాజకీయాల్లో కూడా రిజర్వేషన్లలో పదేళ్ల కాల పరిమితికి అంబేడ్కర్ విముఖత చూపారని, కానీ ప్రజా స్వామ్యానికి అత్యంత విలువిచ్చే ఆయన ఆ పరిమితికి అంగీకరించక తప్పలేదని నార్కే వివరించారు.

కానీ, రాజకీయ రిజర్వేషన్ పదేళ్లకు పైగా దాకా కొనసాగాలని 1949 ఆగస్టు 25న మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాజ్యాంగ సభ సభ్యుడు నాగప్ప డిమాండ్ చేశారు. లేకపోతే షెడ్యూల్డ్ కులాల వాళ్లు అగ్రవర్ణాల స్థాయికి చేరుకోలేరని ఆయన చెప్పారు.

నాగప్ప డిమాండుకు అంబేడ్కర్ సమాధానమిస్తూ... ‘వ్యక్తిగతంగా నేను కూడా రిజర్వేషన్లు ఎక్కువ కాలంపాటు కొనసాగాలనే అనుకున్నా. షెడ్యూల్డ్ కులాలకు రాజ్యాంగ సభ ఎక్కువ కాలంపాటు రిజర్వేషన్లు కల్పించాల్సింది. కానీ, రాజ్యాంగ సభ అలా చేయలేదు. పదేళ్ల వరకు మాత్రమే రిజర్వేషన్లు కల్పించాలని అది నిర్ణయించింది. కానీ, ఈ పదేళ్లలో షెడ్యూల్డ్ కులాలు ఆశించినంత పురోగతి కనబరచకపోతే ఇంకొంతకాలం రిజర్వేషన్లను పొడిగించేలా నేను నియమం పెట్టాను’ అని చెప్పారు.

Image copyright OTHER

రాజ్యాంగ రిజర్వేషన్ అంటే ఏంటి?

రాజ్యాంగ రిజర్వేషన్ పుట్టుక గురించి తెలుసుకోవాలంటే గతంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం, మహాత్మా గాంధీ-అంబేడ్కర్ మధ్య నెలకొన్న రాజకీయ వివాదం గురించి మాట్లాడాలని మరాఠీ దినపత్రిక ‘లోక్‌సత్తా’ అసోసియేట్ ఎడిటర్ మధు కాంబ్లీ చెప్పారు.

‘అణగారిన వర్గాల వారికి రాజకీయ హక్కులు లభించాలంటే వాళ్లకు ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేయాలని అంబేడ్కర్ డిమాండ్ చేశారు. కానీ గాంధీజీ అందుకు అంగీకరించకుండా ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. చివరికి, అంబేడ్కర్ రాజీ పడి రిజర్వ్‌డ్ నియోజకవర్గాలకు అంగీకరించారు. ఆ సమయంలో గాంధీ, అంబేడ్కర్‌ల మధ్య కుదిరిన ఒప్పందాన్నే పుణా ప్యాక్ట్ అంటారు’ అని కాంబ్లీ తెలిపారు.

‘ఇదే పద్ధతిని దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక రాజ్యంగం కూడా స్వీకరించింది. లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీల్లో కూడా జనాభా ప్రాతిపదికన షెడ్యూల్డ్ కులాల వారికి రిజర్వేషన్లు కల్పించాలనే నియమాన్ని తీసుకొచ్చింది. ఇదే రాజకీయ రిజర్వేషన్.

దీనికి మొదట పదేళ్ల కాలపరిమితి విధించారు. కానీ వెనకబడిన వర్గాల ఓట్ల కోసం ఎప్పటికప్పుడు అధికార పార్టీలు వీటిని పొడిగిస్తూ వచ్చాయి. కానీ రాజ్యసభలో, శాసన మండలిలో మాత్రం రిజర్వ్‌డ్ సీట్లు లేవు’ అని కాంబ్లీ వివరించారు.

Image copyright OTHER

‘తరువాత స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలు, ఓబీసీలకు కూడా రిజర్వేషన్లు కల్పించారు. దీనివల్ల రాజకీయాల్లో చాలా వర్గాలు క్రియాశీలంగా మారాయి. రిజర్వేషన్ల వల్ల కలిగిన సానుకూల ఫలితం ఇది. అంతమాత్రాన రిజర్వేషన్ల అసలు లక్ష్యాన్ని ఇవి సాధించినట్లు కాదు’ అని కాంబ్లీ అన్నారు.

‘చదువు, ఉద్యోగాల్లో వెనకబడిన వర్గాలను కూడా ఉన్నత స్థానాలకు తీసుకొచ్చేందుకు ఆయా రంగాల్లో రిజర్వేషన్లను ప్రవేశపెట్టారు. కానీ ఈ రోజుకీ అది సాధ్యం కాలేదు. కాబట్టి, ప్రభుత్వంలోని అని శాఖల్లో వాళ్లు ఉన్నత స్థానాలకు చేరుకునే వరకూ రిజర్వేషన్లను తొలగించాలనే ఆలోచన అవసరం లేదు’ అని పుణెకు చెందిన ఐఎల్ఎస్ లా కాలేజీ ప్రొఫెసర్ నితీష్ నవసాగరే అభిప్రాయపడ్డారు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: భారత్‌లో ప్రజాస్వామ్యం విజయవంతం కాదు - అంబేడ్కర్

రాజ్యాంగం అవకాశం కల్పిస్తున్నప్పటికీ రాజకీయ రిజర్వేషన్‌ను పొడిగించాలని దళిత సంఘాలు, ఉద్యమకారులు ఎప్పుడూ డిమాండ్ చేయలేదని అంబేడ్కరైట్ ఉద్యమంపైన చాలా కాలంగా అధ్యయనం చేస్తున్న సుహాస్ సోనావనే అన్నారు.

‘రిజర్వ్‌డ్ టికెట్ మీద గెలిచిన వ్యక్తి, అతడికి టికెట్ ఇచ్చిన పార్టీకి బద్ధుడై ఉంటాడు. సొంతంగా నిర్ణయాలు తీసుకోలేడు. అలాంటి వ్యక్తి వల్ల వెనకబడిన వర్గాలకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. అలాంటప్పుడు రాజకీయ రిజర్వేషన్ వల్ల ఒరిగేదేంటి?’ అని ప్రశ్నిస్తారు సుహాస్.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)