#HisChoice: హిజ్రాను పెళ్లాడిన ఒక మగాడి కథ

  • 7 అక్టోబర్ 2018
హిజ్రాను పెళ్లాడిన పురుషుడి కథ

నా స్నేహితులు, కాలనీలో వాళ్లంతా నేను డబ్బు కోసమే నిషాతో ఉన్నానని అనుకుంటారు. తను సంపాదిస్తుంటే, నేను ఖర్చు పెడుతుంటానని చెప్పుకుంటుంటారు.

చాలా మంది హిజ్రాల దగ్గర బాగా డబ్బుంటుందని, వాళ్లు జల్సాలు చేస్తారని, వాళ్లకు అసలు కుటుంబ బాధ్యతలే ఉండవని అనుకుంటారు.

కానీ అది పొరపాటు, అందులో సగం మాత్రమే నిజం.

నేను, నిషా ఒక చిన్న గదిలో ఉంటాం. రాత్రి ఈ గదిలో సన్నటి వెలుతురు ఉన్నప్పుడు, గోడల కాషాయ రంగు నాకు చాలా నచ్చుతుంది.

మా దగ్గర ఒక డోలు, ఒక పరుపు.. గదిలో ఒక మూల దుర్గాదేవి విగ్రహాలు ఉన్నాయి. నిషా వాటికి పూజ చేస్తుంటుంది.

మా బంధాన్ని మా కుటుంబ సభ్యులే అర్థం చేసుకోనప్పుడు, దాని గురించి జనాలకు చెప్పడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని నిషా అంటూ ఉంటుంది.

నా వరకు నిషా ఒక హీరోయిన్ కంటే ఎక్కువే. పెద్ద పెద్ద కళ్లు, తెల్లగా అందంగా ఉంటుంది. నుదుటిపై పెద్ద బొట్టు పెట్టుకోవడం అంటే తనకు చాలా ఇష్టం.

మా ఇద్దరి కథ పన్నెండేళ్ల కిందట స్నేహంతో మొదలైంది.

ఇద్దరం ఒకే కాలనీలో ఉండేవాళ్లం

మొదట్లో నిషా పేరు ప్రవీణ్. మేమిద్దరం ఒకే కాలనీలో ఉండేవాళ్లం. నేను ప్రవీణ్‌ను మొదటిసారి కలిసినప్పుడు తను పదో తరగతిలో ఉన్నాడు.

నేను ఆరో తరగతి తర్వాత చదువు మానేశా. అమ్మానాన్న, అన్నయ్య స్కూలుకు వెళ్లమని చాలా చెప్పారు. కానీ ఆ రోజుల్లో మనం పెద్ద హీరోలా ఫోజు కొట్టేవాళ్లం.

సావాసాల వల్లే అలా అయ్యాను అని ఇప్పుడు తెలుస్తోంది. కానీ, నేను కలిసి తిరిగిన వాళ్ల ప్రభావం నాపై చాలానే ఉంది.

వాళ్లలో కొందరితో కలిసి నేను పెళ్లిళ్లు జరిగే ఇళ్లకు వెళ్లేవాడిని. అక్కడ 'ఘోడీ', 'టప్పే', 'బన్నే' ఇంకా చాలా రకాల పాటలు పాడేవాడిని.

అలా, 16 ఏళ్ల వయసులోనే నా ఖర్చులకు సరిపడా నేను సంపాదించుకోగలివాడిని. అప్పుడు, ప్రవీణ్ పన్నెండో క్లాసులో ఉన్నాడు.

కట్టేసి కొట్టారు

మేమిద్దరం మైనర్లం, లవ్-రిలేషన్‌లో ఉండేవాళ్లం. తను అబ్బాయా, లేక అమ్మాయా అనే విషయంలో నాకెప్పుడూ పెద్దగా తేడా అనిపించలేదు.

తను అందంగా, అమ్మాయిలా కనిపించడం గురించి నేను పట్టించుకోలేదు. ప్రవీణ్‌ను నేను మొదటిసారి కలిసినప్పుడు తను మిగతా అబ్బాయిలాగే ప్యాంట్, షర్టు వేసుకుని ఉన్నాడు.

ఒక అమ్మాయితో రిలేషన్‌ ఎలా ఉంటుందో, ప్రవీణ్ కంటే ముందు ఒక అమ్మాయితో రెండేళ్లు రిలేషన్‌లో ఉన్నప్పుడు నాకు తెలిసింది. ఆమె నాకంటే ఎనిమిదేళ్లు పెద్దది. తర్వాత తన పెళ్లైపోయింది.

కానీ ప్రవీణ్‌తో కలిసుంటే నాకెప్పుడూ బాగా అనిపించేది. ఇంట్లో నేను భర్త అయితే, తను భార్య. ఎందుకంటే ప్రవీణ్ ఫీలింగ్స్ మొదటి నుంచీ అమ్మాయిల్లాగే ఉండేవి.

ప్రవీణ్‌కు మేకప్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం. 12వ క్లాసులోనే తన చెవులు కుట్టించుకున్నాడు. వెంట్రుకలు పెంచుకోవడం మొదలు పెట్టాడు. అక్కడివరకూ ఏ సమస్యా రాలేదు.

కానీ ప్రవీణ్ వాళ్ల ఇంట్లో వాళ్లకు తమ కొడుకుకు గే అని, నాతోపాటు రిలేషన్‌లో ఉన్నట్లు తెలిసింది. అంతే, వాళ్లు అతడిని కట్టేసి కొట్టారు. అలా ఒక్కసారి కాదు, చాలాసార్లు జరిగింది.

ప్రవీణ్‌ను వాళ్లు ఇంటి బయటకు వెళ్లకుండా ఆపేశారు. మేడమీద ఉన్న ఒక గదిలో ఉండమని చెప్పారు. అక్కడ నీళ్లు, కరెంటు కూడా ఆపేశారు.

హిజ్రాను పెళ్లాడిన పురుషుడి కథ

హిజ్రాల బృందం

ప్రవీణ్ చదువుకోడానికి నేను ఒక టార్చిలైట్ ఇచ్చాను. ఆ సమయంలో మాకు ఎదురైన కష్టాలతో పోరాటం చేసినట్టు అనిపించేది. అందుకే మా బంధం మరింత బలంగా మారింది.

ప్రవీణ్ నాకంటే ఎక్కువ చదివినందుకు సంతోషంగా ఉంటుంది. బాగా చదువుకుంటే లోకం మనల్ని చూసే తీరు మారుతుందని మా అమ్మ చెప్పేది. కానీ ప్రవీణ్‌ విషయంలో ఈ లోకం మారలేదు.

'హిజ్రాలకు ఉద్యోగం ఇవ్వం' అని చాలా మంది ప్రవీణ్‌ను పనిలో పెట్టుకోలేదు.

ఆ కారణంతోనే హిజ్రాల బృందంలో కలిసిపోవాలని ప్రవీణ్‌ నిర్ణయించుకున్నాడు. మాకు వేరే దారి లేకుండాపోయింది.

హిజ్రాల గ్రూపులో జాయిన్ కావడం అంటే ఏంటో నాకు తెలుసు. పెళ్లిళ్లలో, శుభకార్యాల్లో పాటలు పాడి వాళ్లు డబ్బులు అడుగుతుంటారు.

అలా చేరాక ప్రవీణ్.. నిషా అయ్యాడు.

నిషా మొదటి సారి వీధుల్లో చప్పట్లు కొడుతూ కనిపించిన ఆ రోజు నాకు ఇప్పటికీ గుర్తుంది. అప్పుడు చాలా బాధపడ్డాను.

ఇంట్లో వాళ్లతోపాటు, జనం ఆమెను అలాగే స్వీకరించి ఉంటే, నిషాకు కాస్త అండగా నిలిచుంటే, తను ఈరోజు వేరే పని చేస్తూ ఉండేది. తప్పనిసరి పరిస్థితుల్లో ఈ వృత్తిలోకి వచ్చి ఉండదు.

అయితే, ఇప్పుడు నేను సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసే కాంట్రాక్ట్ తీసుకుంటూ ఉంటాను. మాకిద్దరికి బాగా పని దొరికితే, ఇల్లు గడిచిపోతుంది.


బీబీసీ అందిస్తున్న #HisChoice సిరీస్‌లో 10మంది భారతీయ పురుషుల నిజ జీవిత గాథలు ఉంటాయి.

ఆధునిక భారతీయ పురుషుల ఆలోచనలు, వాళ్లు ఎదుర్కొంటున్న సమస్యలు, వాళ్ల కోరికలు, ప్రాధాన్యాలు, ఆశలను ఈ కథనాలు ప్రతిబింబిస్తాయి.


'హిజ్రాల పెళ్లి'

నిషాకు అలా అయినందుకు నాకు మొదట్లో కాస్త కోపం వచ్చింది. కానీ ఆమె చేసే పని గురించి మాత్రం నేనెప్పుడూ సిగ్గు పడలేదు. ఎందుకంటే తన సంతోషమే నా సంతోషం.

ఆ హిజ్రా బృందం పెద్ద ప్రవీణ్ పేరును నిషా అని మార్చారు.

నేను అన్నిరకాలుగా తనకు అండగా నిలిచాను. నిషా అన్న, నాన్న చాలాసార్లు ఆమెను కొట్టారు.

నిషా ఇంట్లోవాళ్లు ఎంత దారుణంగా అయ్యాయంటే, వాళ్లమ్మ చనిపోయినప్పుడు ఆమెను గుండు చేయించుకోమన్నారు. కానీ నిషా చేసుకోనని చెప్పేసింది.

నిషా వాళ్లమ్మ చనిపోయిన కొన్నిరోజుల తర్వాత, మేం పెళ్లి చేసుకున్నాం. మా పెళ్లై ఇప్పటికి దాదాపు పదేళ్లు అయ్యింది.

ఒకసారి మేం రిజిస్ట్రార్ ఆఫీసుకు వెళ్లి క్లర్కుతో మా పెళ్లి రిజిస్టర్ చేయమని అడిగాం. ఆయన 'హిజ్రాల పెళ్లి రిజిస్టర్ చేయరు' అన్నారు.

నిషా సెక్స్ చేంజ్ ఆపరేషన్ చేయించుకుంటే, పెళ్లి రిజిస్టర్ చేయచ్చు అని కొందరు చెప్పారు. కానీ అవన్నీ మాకు అవసరం అనిపించలేదు.

దాంతో మా పెళ్లికి ఎలాంటి పత్రాలు, ప్రభుత్వ గుర్తింపు లేకుండాపోయాయి.

అమ్మాయిలాగా ప్రవర్తిస్తుంది

ఇలాంటి బంధంలో ఉన్నది మేం మాత్రమే కాదు. నిషా వాళ్ల బృందంలో సుమారు 25 మంది హిజ్రాలు వేరే పురుషులను పెళ్లి చేసుకున్నారు.

ఆ 25 మందిలో 10 మంది భర్తలకు వేరే మహిళలతో కూడా పెళ్లిళ్లు అయ్యాయి, వాళ్లకు కుటుంబం, పిల్లలు కూడా ఉన్నారు. కానీ వాళ్లు వారానికి రెండ్రోజులు తమ హిజ్రా భాగస్వామితో గడుపుతారు.

మా రిలేషన్‌లో నేను భర్తలా, నిషా నా భార్యలా ఉండాలని మొదటి నుంచే అనుకున్నాం. తను నా కోసం కర్వా చౌత్ వ్రతం కూడా చేస్తుంది. అలంకరించుకున్న తర్వాత 'నేనెలా ఉన్నాను' అని నన్ను అడుగుతుంది.

కానీ మా ఇంట్లో నేను భర్త కాబట్టి నా మాటే నెగ్గాలని అనుకోను.

ఆర్నెల్లకు ఒక సారి హిజ్రాల బృందమంతా పార్టీ చేసుకుంటారు. దానికి హిజ్రాలందరూ తమ భర్తలతో వస్తుంటారు.

నిషాకు, నాకు ఆ పార్టీలంటే చాలా ఇష్టం. ఆ పార్టీల్లో అందరూ ఉత్సాహంగా డాన్సులేస్తారు, బాగా తిని తాగుతారు.

ఆ పార్టీల్లో నిషా ఒక హిజ్రాలా కాకుండా, ఒక మహిళలా ఉండడం చూస్తే నాకు చాలా బాగుంటుంది.

కొన్ని సార్లు హిజ్రాలు అబ్బాయిలను ఏడిపిస్తారు. కానీ నిషా ఈ పార్టీల్లో ఉన్నా, వేరే ఎక్కడికెళ్లినా, నా ముందు చప్పట్లు కొట్టదు. ఎవరినీ తిట్టదు. హిజ్రాల్లా జనాలతో గట్టిగట్టిగా అరుస్తూ మాట్లాడదు.

నా ముందు అలా చేయడానికి తను సిగ్గు పడుతుందేమో. అప్పుడు ఆమె నాకు నచ్చుతుంది.

హిజ్రాను పెళ్లాడిన పురుషుడి కథ

తెగిన బంధాలు

అయినా, నిషాకు అబ్బాయిలకున్నట్లే చాలా బలం ఉంది. ఇంట్లో ఎప్పుడైనా తమాషాగా మేమిద్దరం పోట్లాడితే, తనను ఓడించడం చాలా కష్టం. చాలాసార్లు నన్నే ఎత్తి పడేసింది.

మొదట్లో నాకు చాలా మంది స్నేహితులు ఉండేవాళ్లు. కానీ ఇప్పుడు వారిలో చాలా మంది నాకు దూరంగా ఉంటారు. నేను హిజ్రాలతో స్నేహం చేస్తున్నానని అంటుంటారు.

వాళ్ల మనసు సెక్స్ వరకే పరిమితం అయిపోయింది. వాళ్లకు హిజ్రాల మనసు తెలీదు, నా ఆలోచనను కూడా అర్థం చేసుకోరు.

నిషా వాళ్ల బృందం పెద్ద నన్ను వాళ్ల అల్లుడుగా భావించి చాలా గౌరవం ఇస్తారు.

నిషా పెళ్లికి ముందే ఇల్లు వదిలేసింది. అది జరిగి పదేళ్లు పైనే అయ్యింది. అప్పటి నుంచి ఇప్పటివరకూ ఆమె ఎప్పుడూ తమవాళ్లతో మాట్లాడలేదు.

అన్న, తండ్రి ముఖం ఎప్పటికీ చూడకూడదని ఆమె అనుకుంటోంది. హిజ్రా అయితే తండ్రి ఆస్తిలో కూడా ఏ హక్కు ఉండదు. తండ్రి తర్వాత రెండు భాగాలూ నిషా వాళ్ల అన్నకే చెందుతాయి. అందుకే, ఎప్పటికీ ఆమెకు అక్కడ చోటు లభించదు.

మా ఇంట్లో కూడా ఎక్కువ మంది నాతో మాట్లాడకుండా తప్పించుకుంటూ ఉంటారు. మా బంధువుల్లో చాలా మంది 'నిషాను వదిలేస్తేనే మాట్లాడతాం' అంటారు. అందుకే నేను నా బంధువులనే వదిలేశాను.

పెళ్లి సంబంధాలు వచ్చాయి

అయితే, తర్వాత రెండేళ్లకు ఎవరైనా అమ్మాయిని పెళ్లి చేసుకోమని ఇంట్లో వాళ్లు నాపై ఒత్తిడి తీసుకొచ్చారు. నా మనసు మారుతుందేమో అనుకున్నారు.

వాళ్లు పెళ్లి చేసుకోమని మూడు సంబంధాలు కూడా తీసుకొచ్చారు. కానీ ఒక వేళ పెళ్లి చేసుకున్నా, నిషాను వదలను అని వాళ్లకు చెప్పేశా. వాళ్లు మళ్లీ నా దగ్గరకు రాకుండా ఉండాలనే అలా అన్నాను.

ఇంట్లోవాళ్లు నాకు పెళ్లి చేయాలనే ప్రస్తావన వస్తే చాలు, నేను తనను వదిలి వెళ్లిపోతానేమో అని నిషా భయపడుతుంది.

ఆ భయంతోనే ఫేస్ బుక్, వాట్సప్ కూడా వాడకుండా నన్ను అడ్డుకుంటుంది. వేరే అమ్మాయి వలలో పడతానేమోనని తన భయం. అప్పుడు నేను పెద్దగా నవ్వేస్తుంటా.

రెండు చివరి కోరికలు

మా అమ్మ చివరి రోజుల్లో ఒక మాట చెప్పేవారు. "బాబూ అలాంటి విషయాల్లో పడకు, యవ్వనంతోపాటే అన్నీ పోతాయి. ఇంటిని చూసుకునేది ఆడదే. నువ్వు అందరికంటే చిన్నవాడివి, నేను చనిపోయాక నిన్ను ఎవరూ అడగరు" అంది.

అమ్మ మాటలు ఇప్పుడు నిజమే అనిపిస్తోంది. అయితే అప్పుడు నేను ఆమెతో "అమ్మా అది మనసుకు తగిలింది, వదలడం లేదు..." అన్నాను

అమ్మ చనిపోయిన తర్వాత నాతో ఎవరూ నేరుగా మాట్లాడలేదు. అందరూ ఏదేదో చెప్పి నన్ను భయపెట్టేవారు. ముసలితనం వచ్చేకొద్దీ, బతుకు కష్టమైపోతుందనేవాళ్లు.

నేను నిషాను ప్రేమిస్తున్నా, మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నా. ఆమెతో నా జీవితాంతం ఉండాలనుకుంటున్నా. తను అబ్బాయా, అమ్మాయా, లేక హిజ్రానా అనేది నాకు అనవసరం. నిషా నా మనసుకు నచ్చింది. అంతే.

నాకు రెండే కోరికలు ఉన్నాయి. ఒకటి, మేం కాస్త సుఖంగా ఉండడానికి ఈ గది కంటే కాస్త పెద్ద ఇల్లు కొనుక్కోవాలి.

ఇక రెండోది, ఒక బిడ్డను దత్తత తీసుకుని తన పెళ్లి చేయాలి. నేను నా పెళ్లికి ఎలాంటి ఖర్చు చేయలేకపోయా. ఊరేగింపు లేదు, సందడి లేదు, ఎవరికీ విందు కూడా ఇవ్వలేకపోయాను.

అయితే, బిడ్డను దత్తత తీసుకునే ఆలోచనకు నిషా భయపడుతుంది. ఒక బిడ్డను మన జీవితంలోకి తీసుకురావడం అంత సులభం కాదని ఆమెకు అనిపిస్తోంది.

(ఇది ఒక పురుషుడి జీవిత కథ. అతడితో సంభాషించిన బీబీసీ ప్రతినిధి ప్రశాంత్ చాహల్ ఆ కథకు అక్షర రూపం ఇచ్చారు. ఆ వ్యక్తి పేరును గోప్యంగా ఉంచాం. ఈ సిరీస్ ప్రొడ్యూసర్: సుశీలా సింగ్)

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం