జైపూర్‌లో జికా వైరస్... బాధితురాలికి పుట్టిన బిడ్డ పరిస్థితి ఏమిటి?

  • 12 అక్టోబర్ 2018
బిడ్డను ప్రసవించిన జికా వైరస్‌ సోకిన మహిళ
చిత్రం శీర్షిక బిడ్డను ప్రసవించిన జికా వైరస్‌ సోకిన మహిళ

జికా వైరస్‌తో బాధపడుతున్న మహిళ సోమవారం జైపూర్‌లోని ప్రభుత్వ ఆసుప్రతిలో బిడ్డకు జన్మనిచ్చారు. ఈ వ్యాధి బారిన పడిన మహిళ బిడ్డను కనడం భారత్‌లో ఇదే తొలిసారి.

ఆ మహిళ ప్రసవానికి ముందు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. డాక్టర్ అంజులా చౌదరిపైనే ఆశలన్నీ పెట్టుకున్నారు.

మరోవైపు, ఆసుపత్రి సిబ్బంది ఆమెకు పుట్టబోయే బిడ్డ గురించి ఆసక్తిగా ఎదురు చూశారు.

సోమవారం అర్ధరాత్రి ఆమెకు డాక్టర్లు శస్త్రచికిత్స చేశారు. పుట్టిన బిడ్డ ఆరోగ్యంగా ఉందని ప్రకటించడంతో ఆ తల్లిదండ్రుల్లో ఆందోళన మాయమైంది. స్థానిక ఆరోగ్యసిబ్బంది కూడా ఊపిరి పీల్చుకున్నారు.

డాక్టర్ అంజులా చౌదరీ బీబీసీతో మాట్లాడుతూ, ''మూడో నెల గర్భంతో ఉన్న మహిళకు జికా వైరస్ సోకితే ఆమెకు పుట్టబోయే బిడ్డకు కూడా ఆ వ్యాధి సోకుతుంది. ఈ కేసులో డెలివరీ సమయం దగ్గర్లో ఉండగా ఆమెకు జికా సోకినట్లు నిర్ధరణ అయింది'' అని చెప్పారు.

బృందాల ఏర్పాటు

బాధితురాలి కుటుంబం బిహార్ ‌నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడింది. బిడ్డకు జికా వైరస్ సోకలేదనే ఆనందంతో పాటు ముగ్గురు ఆడ పిల్లల తర్వాత మగ బిడ్డ పుట్టాడన్న సంతోషం కూడా వారిలో కనిపించింది.

జికా వైరస్‌తో వణకిపోతున్న జైపూర్‌లో ఈ చిన్నారి జననం పెద్ద వార్తగా మారింది.

జికాతో బాధపడుతున్న 29 మందిలో ముగ్గురు గర్భిణులు ఉన్నట్లు గుర్తించిన అధికారులు వారి పరిస్థితిని రోజూ పర్యవేక్షిస్తున్నారు.

ఈ వ్యాధి ప్రబలడానికి ప్రధాన కారణం దోమలు. లైంగిక సంపర్కం వల్ల కూడా ఈ వ్యాధి రావొచ్చు.

గర్భిణులకు జికా వైరస్ సోకితే వారికి పుట్టబోయే బిడ్డలకు కూడా ఆ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. ఈ వ్యాధితో పుట్టే పిల్లల్లో తల చిన్నగా ఉంటుంది. మానసిక ఎదుగుదల ఆగిపోతుంది. ఈ వ్యాధికి మందులు అందుబాటులో లేవు.

కేంద్ర ఆరోగ్యశాఖ పంపిన బృందం సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం జైపూర్‌లో జికా వైరస్ వ్యాప్తిని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తోంది.

ఇప్పటికే 200 బృందాలను రాజస్తాన్‌కు పంపామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి కాళీ చరణ్ సరఫ్ తెలిపారు. అక్కడ జికా వైరస్‌పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు, వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు ఈ బృందాలు పనిచేస్తాయని చెప్పారు.

మహిళలపై ప్రత్యేక దృష్టి

జికా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు భారీ స్థాయిలో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కేంద్రం, రాజస్తాన్ ప్రభుత్వం ప్రకటించాయి.

''జికా వైరస్ వ్యాపించకుండా యుద్ధప్రతిపాదికన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు ఆరోగ్య శాఖ మంత్రి సరఫ్ తెలిపారు.

బుధవారం జికాకు సంబంధించి ఎలాంటి కేసులూ నమోదుకాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే, రక్త నమూనాలను సేకరిస్తున్నారు. ఫలితాల తర్వాత బాధితుల సంఖ్య 29 మంది కంటే ఎక్కువే ఉండొచ్చని భావిస్తున్నారు.

'ఎక్కడైతే దోమలు ఎక్కువగా ఉంటాయో అక్కడ జికా వైరస్ వ్యాప్తిస్తోంది' అని రాసిఉన్న కరపత్రాలను ప్రభుత్వం ప్రతి ఇంటికీ పంపిణీ చేస్తోంది. మహిళలే లక్ష్యంగా ప్రభుత్వం ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

ఇప్పటి వరకు పరిస్థితి ఎలా ఉంది?

జైపూర్‌లోని శాస్త్రి నగర్‌లో జికా వైరస్‌ బాగా వ్యాపించింది. ఇప్పటి వరకు ఈ నగరంలో వెలుగుచూసిన 29 కేసుల్లో 26 ఇక్కడివే.

ఈ కాలనీకి సంబంధించి మూడు కిలోమీటర్ల పరిధిలో ఆరోగ్యకార్యకర్తలు జికా వైరస్ గురించి ప్రజలకు ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పిస్తున్నారు.

వ్యాధి ప్రబలిన కాలనీలో ప్రత్యేక పర్యవేక్షణ బృందాలను ఏర్పాటు చేశారు. అక్కడి ప్రజల రక్త నమూనాలను ఆరోగ్య కార్యకర్తలు ప్రతిరోజూ పరిశీలిస్తున్నారు. ఇక్కడ చాలా మందిలో జికా వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయి.

ఈ ప్రచారం ప్రజల్లో ప్రభావం చూపుతుందా?

అధికారులు తమ ఇంటికి వచ్చి జికా వైరస్ గురించి వివరిస్తున్నారని, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారని శాస్త్రినగర్‌లోని చాలా మంది మహిళలు తెలిపారు.

అయితే, కాలనీవాసులు మాత్రం రోడ్లపై ఉన్న చెత్తచెదారం, బహిరంగ మురుగు కాల్వల గురించి వేలెత్తిచూపుతున్నారు. వీటిని అధికారులు శుభ్రం చేయడం లేదని వారు అంటున్నారు.

ఈ కాలనీలో జనసాంద్రత ఎక్కువగా ఉంది. చాలా మంది అపరిశుభ్ర వాతావరణంలోనే నివసిస్తున్నారు.

ఈ వైరస్ ఎలా వ్యాపించింది?

ఒక స్థానికుడు అక్కడ కనిపిస్తున్న చెత్త కుప్పను చూపిస్తూ, 'అక్కడ ప్రభుత్వ పాఠశాల ఉంది. దుర్వాసన వస్తుండటంతో పిల్లలు స్కూల్‌కు వెళ్లడం లేదు' అని చెప్పారు.

పాలన యంత్రాంగం జికా వైరస్ మీదే పోరాడుతోంది. స్థానికులు మాత్రం కాలనీ పరిసరాలను అధికారులు శుభ్రం చేయకపోవడంపై ఆందోళన చెందుతున్నారు.

ఇతర ప్రాంతాల నుంచే ఈ వైరస్ జైపూర్‌కు వ్యాపించిందని కేంద్ర మంత్రి సరాఫ్ అంటున్నారు. ప్రస్తుతానికి ఎక్కడి నుంచి వచ్చిందో గుర్తించలేదని తెలిపారు.

అప్రమత్తమైన బిహార్, ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వాలు

గత ఏడాది అహ్మదాబాద్‌లో మూడు జికా కేసులు నమోదయ్యాయి. వెంటనే అప్రమత్తమైన గుజరాత్ ప్రభుత్వం వ్యాధి ప్రబలకుండా విజయవంతంగా అడ్డుకుంది.

ఇప్పటి వరకు 30 దేశాల్లో జికా వైరస్‌ను గుర్తించారు. మూడేళ్ల కిందట బ్రెజిల్‌లో ఈ వ్యాధి ప్రబలడంతో వందల మంది చనిపోయారు.

బిహార్‌ నుంచి ఇక్కడికి వచ్చిన వ్యక్తి ఒకరు జికా బారిన పడ్డారు. దీంతో, ఆయన తిరిగి స్వగ్రామానికి వెళ్లారు.

ఉత్తర్ ప్రదేశ్, బిహార్‌ల నుంచి వచ్చిన వేలాది మంది వలసకూలీలు ఇక్కడ పనిచేస్తున్నారు. అందుకే, ఈ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా అప్రమత్తమయ్యాయి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు