తిత్లీ తుపాను: విపత్తులను తట్టుకోవడం ఒడిశా ఎలా నేర్చుకుంది?

  • 13 అక్టోబర్ 2018
తుపాను Image copyright NDMA

1999 నాటి ఆ రోజును గుర్తు చేస్తే ఒడిశా ప్రజలు చిగురుటాకులా వణికిపోతారు. గంటకు 260 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులకు ఊళ్లకు ఊళ్లే తుడిచిపెట్టుకుపోయిన విషాదాన్ని తలచుకుని దుఃఖిస్తారు.

పదివేల మందికి పైగా ప్రాణాలను తీసుకెళ్లిన ఆ తుపాను ఒడిశాను స్మశానంగా మార్చింది. లక్షలాది మందిని నిలువ నీడ లేకుండా చేసింది. అయితే, ఆ విషాదం నుంచి అక్కడి ప్రభుత్వం ఎంతో నేర్చుకుంది. విపత్తులొస్తే ఎలా ఎదుర్కోవాలో తమను చూసి నేర్చుకోవాలన్నంతగా వ్యవస్థలను రూపొందించుకుంది.

బంగాళాఖాతం తీరంలో ఉండే ఒడిశాకు నిత్యం తుపానుల గండమే. కానీ, 1999లో సంభవించిన ఆ మహా విలయాన్ని మాత్రం అక్కడి ప్రజలు ఎప్పటికీ మరచిపోలేరు. ఒక్క జగత్‌సింగ్ పుర్ జిల్లాలోనే 8వేల మందికి పైగా చనిపోయారంటేనే ఆ తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.

ఆ తుపాను నుంచి ఒడిశా చాలా పాఠాలు నేర్చుకుంది. గత 20 ఏళ్లలో తుపాన్లను ఎదుర్కోవడానికి పక్కాగా సన్నద్ధమైంది.

2013లో వచ్చిన ఫైలిన్ తుపానును ఒడిశా ఎదుర్కొన్న తీరే అందుకు ఉదాహరణ. ఆ సమయంలో గంటకు 260కి.మీ. బలమైన గాలులు గోపాల్‌పూర్ తీరాన్ని తాకాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కమ్యూనికేషన్ వ్యవస్థ స్తంభించింది. ఇళ్ల కిటికీల అద్దాలన్నీ టపటపా పగిలిపోయాయి.

అంత బలమైన తుపానును కూడా ఒడిశా పకడ్బందీగా ఎదుర్కొంది. చాలా ఆస్తి, ప్రాణ నష్టాన్ని నివారించింది. ప్రస్తుతం ‘తిత్లీ’ కూడా ఆంధ్ర ప్రదేశ్‌తో పాటు ఒడిశాపైనా ప్రభావం చూపిస్తోంది.

Image copyright IMD

ఫైలిన్‌తో పోలిస్తే తిత్లీ తీవ్రత తక్కువే అయినా, అధికారులు ముందుగానే లక్షలాది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు పంపించారు. తిత్లీ రాక గురించి తమకు ముందే తెలుసని, అందుకే తుపాను తీరానికి చేరడానికి ముందే ప్రజలను అక్కడి నుంచి తరలించామని ఒడిశా విపత్తు నిర్వహణ శాఖ శాస్త్రవేత్త శోభన్ దస్తిదార్ చెప్పారు.

గత 20ఏళ్లలో ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడానికి ఒడిశా అనేక చర్యలను చేపట్టింది. దానికోసం ప్రపంచ బ్యాంకు సహాయాన్ని సైతం తీసుకుంది. ఈ క్రమంలో ఖరగ్‌పూర్ ఐఐటీ సహకారంతో దాదాపు 900 తుపాను సహాయక శిబిరాలను నిర్మించింది.

‘1999 పెను తుఫాను తరువాత మేం పాఠం నేర్చుకున్నాం. ఆ పైన ఎలాంటి విపత్తు ఎదురైనా సమర్థంగా ఎదుర్కోవాలని అప్పుడే నిర్ణయించుకున్నాం. వీలైనంత తక్కువగా ఆస్తి, ప్రాణ నష్టం ఉండాలని భావించాం’ అని ఆ రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ ప్రత్యేక కమిషనర్ బిష్ణుపాద సేథి అన్నారు.

Image copyright SUDARSHAN PATTNAIK

1999 తరువా ఒడిశా ఏమేం చర్యలు తీసుకుంది?

  • ఐఐటీ-ఖరగ్‌పూర్ సహాయంతో 879 తుపాను, వరద సహాయక శిబిరాలను నిర్మించారు.
  • లక్షమందికి పైగా బాధితులకు ఆవాసం కల్పించేందుకు 17వేలకు పైగా ప్రత్యేక కేంద్రాలను నిర్మించారు.
  • తీర ప్రాంతాల్లో 122 సైరన్ టవర్లతో పాటు, తుపాను హెచ్చరికలకు సంబంధించిన పకడ్బందీ వ్యవస్థను ఏర్పాటు చేశారు.
  • 17 జిల్లాల్లో ‘లొకేషన్ బేస్డ్ అలారం వ్యవస్థ’ను ఏర్పాటు చేశారు. వీటి సాయంతో ప్రజలకు తుపాను ప్రభావానికి సంబంధించిన సమాచారంతో పాటు రక్షణ చర్యలకు సంబంధించిన వివరాలను అందిస్తారు.
  • బలమైన గాలులను తట్టుకునేలా తీరప్రాంతంలో ఇళ్ల గోడలు, పైకప్పులను పటిష్ఠ పరిచారు.
  • మత్స్యకారుల కోసం ప్రత్యక వార్నింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు.
  • సామాజిక మాధ్యమాల సాయంతో ఎప్పటికప్పుడు వాతావరణంపై హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

‘తిత్లీ’ తుపానుకు సంబంధించిన హెచ్చరిక రావడానికి చాలా రోజుల ముందే 20 ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను ఆంధ్రా, ఒడిశా తీరాల్లో మోహరించారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందాలతో పాటు అగ్నిమాపక సిబ్బందిని కూడా ముందుగానే అప్రమత్తం చేశారు.

‘ఒడిశా ఎప్పట్నుంచో విపత్తులకు గురవుతూ వస్తోంది. అందుకే చాలా భారీ స్థాయిలో సహాయక ఏర్పాట్లను చేశాం. బంగాళాఖాతానికి దగ్గరగా ఉండటంతో ఈ సమస్య ఎప్పుడూ ఉంటుంది’ అని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ ప్రత్యేక కమిషనర్ సేథి చెప్పారు.

‘తుపాను తరువాత వరదల ప్రమాదం కూడా ఉంటుంది. దానికి కూడా మేం సన్నద్ధంగా ఉన్నాం. తీర ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాల భవనాలను చాలా దృఢంగా నిర్మించాం. అవసరమైతే వాటిని సురక్షిత శిబిరాలుగా వాడుకోవచ్చని ముందే నిర్ణయించాం’ అని ఆయన అన్నారు.

తుపాను ప్రభావం త్వరగానే తగ్గుతుందని భావిస్తున్నారు. కానీ, వర్షాల కారణంగా ఇప్పటికే అక్కడ వరదలాంటి పరిస్థితి కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం