#HisChoice: వీర్యదాతగా మారిన ఓ కుర్రాడి కథ

  • 13 అక్టోబర్ 2018
డోనర్

విక్కీడోనర్ సినిమాలో ఆ గదిలో అడల్ట్ ఫొటోలు ఉన్నట్టు చూపించారుగానీ, వాస్తవానికి అక్కడ ఒక వాష్ రూమ్ ఉంది. దానికి తలుపు, లోపల కమోడ్, కుళాయి, వాష్ బేసిన్ ఉన్నాయి.

నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తోంది. మా ఇంట్లో నాలుగ్గోడల మధ్య ఊహల్లో తేలిపోతూ చేయడం కంటే, ఒక వాష్‌రూమ్‌లో చేయడం కష్టంగా అనిపించింది.

వాష్‌రూమ్‌లో ఒక ప్లాస్టిక్ కంటైనర్ మీద నా పేరు రాసుంది. నేను హస్తప్రయోగం చేసిన తర్వాత దాన్ని వాష్‌రూమ్‌లోనే వదిలేశాను. దానికి బదులుగా నాకు 400 రూపాయలిచ్చారు.

నా వయసు 22 ఏళ్లు. నేను ఇంజనీరింగ్ చదువుతున్నాను.

నా వయసులో ఉన్న ఎవరికైనా ఒక గర్ల్‌ఫ్రెండ్ కావాలనే కోరిక ఉంటుంది. ఎవరి మీదైనా లైంగిక ఆకర్షణ కలగడం కూడా మామూలే. అంత మాత్రాన మనం వేరే ఎవరితో అయినా శారీరక సంబంధాలు పెట్టుకోవాలనేం కాదు.

నేను ఒక చిన్న పట్టణం నుంచి వస్తుంటాను. అక్కడ పెళ్లికి ముందు ఆడామగా కలవడం అంత సులభం కాదు. అలాంటప్పుడు అబ్బాయిలకు హస్తప్రయోగం తప్ప వేరే దారి లేదనిపిస్తుంది.

మొదటి రోజు స్పెర్మ్ సెంటర్ వాష్‌రూమ్ నాకు ఇబ్బందిగా అనిపించింది.

స్పెర్మ్ డొనేషన్ గురించి నేను పేపర్లో చదివాను. అంతకు ముందు రక్తదానం గురించి విన్నా, కానీ స్పెర్మ్ డొనేషన్ గురించి చూడడం బహుశా అదే మొదటిసారి. చాలా ఆసక్తిగా అనిపించడంతో అక్కడ రాసిందంతా చదివాను.

అది చదివాక మన దేశంలో లక్షల మంది దంపతులకు స్పెర్మ్ నాణ్యంగా లేక పిల్లలు పుట్టడం లేదని, అందుకే స్పెర్మ్ డొనేషన్ పరిధి పెరుగుతోందని తెలిసింది.

దిల్లీలో నేను ఉంటున్న ప్రాంతంలో మా ఇంటికి దగ్గరే ఒక స్మెర్ప్ డొనేషన్ సెంటర్ ఉందని తెలిసింది. మనసులో అక్కడికెళ్లి ఒకసారి చూస్తేపోలా... అనిపించింది.

నేను తెల్లగా ఉంటా, నా ఒడ్డూపొడుగు బాగానే ఉంటుంది. బాస్కెట్ బాల్ కూడా ఆడుతుంటాను.

నేను స్పెర్మ్ కలెక్షన్ సెంటర్‌కు వెళ్లి స్మెర్మ్ ఇవ్వాలనుకుంటున్నట్లు చెప్పాను. దాంతో అక్కడ కూచున్న డాక్టర్ నన్ను చూసి నవ్వాడు. ఆయన నా పర్సనాలిటీ చూసి సంతోషపడ్డట్టు అనిపించింది. డాక్టర్ స్పందన చూసి నేనేం ఉబ్బిపోలేదు.

కానీ, అక్కడ విషయం నా లుక్ మాత్రమే కాదు.

నేను నా స్పెర్మ్ అమ్ముతున్నా. దానికోసం పైకి ఎంత బలంగా కనిపిస్తున్నానో, లోపల కూడా నేను అంతే ఆరోగ్యంగా ఉన్నానని నిరూపించుకోవాలి.

డాక్టర్ "నీకు కొన్ని పరీక్షలు చేయాల్సుంటుంది" అని నాతో అన్నారు.

నా బ్లడ్ శాంపిల్ తీసుకున్నారు. దాని ద్వారా హెచ్ఐవీ, డయాబెటీస్, ఇంకా చాలా రకాల వ్యాధులున్నాయేమో టెస్ట్ చేశారు.

నేను దేనికైనా రెడీ అనుకున్నా, పరీక్షలు చేసిన మూడోరోజు ఉదయం నన్ను పిలిపించారు. నాతో ఒక ఫాం నింపించారు. దాన్లో గోప్యత షరతులు ఉన్నాయి. తర్వాత నాకు ఒక చిన్న ప్లాస్టిక్ కంటైనర్ ఇచ్చారు. వాష్‌రూమ్‌కు ఎటెళ్లాలో చూపించారు.

ఇక అసలుపని మొదలైంది. నేను నా పేరు రాసిన ప్లాస్టిక్ కంటైనర్‌ వాష్‌రూమ్‌లో వదలడం, డబ్బులు తీసుకుని బయటపడడం.

నా స్పెర్మ్ డొనేట్ చేయడం వల్ల ఎవరో ఒకరు తల్లి అవుతారు అనుకున్నప్పుడు నాకు ప్రశాంతత లభించేది.

స్పెర్మ్ డొనేట్ చేయడానికి మూడు రోజుల గ్యాప్ ఉండాలని కూడా నాకు చెప్పారు. అంటే, ఒకసారి ఇచ్చిన తర్వాత మళ్లీ స్పెర్మ్ ఇవ్వాలంటే కనీసం 72 గంటలు ఆగాలి.


బీబీసీ అందిస్తున్న #HisChoice సిరీస్‌లో 10మంది భారతీయ పురుషుల నిజ జీవిత గాథలు ఉంటాయి.

ఆధునిక భారతీయ పురుషుల ఆలోచనలు, వాళ్లు ఎదుర్కొంటున్న సమస్యలు, వాళ్ల కోరికలు, ప్రాధాన్యాలు, ఆశలను ఈ కథనాలు ప్రతిబింబిస్తాయి.


కానీ, ఎక్కువ సమయం ఉండిపోతే స్పెర్మ్ డెడ్ అయిపోతుంది.

కొన్ని నెలల తర్వాత నా మనసులో నేను చేసే ఈ పనికి తగినట్టే డబ్బు ఇస్తున్నారా అనే ఆలోచన వచ్చింది.

'విక్కీ డోనర్' సినిమాలో హీరో ఇదే పని చేసి ధనవంతుడు అయిపోతాడు. నేను ఒకసారి ఇస్తే 400 రూపాయలే ఇస్తున్నారు.

అంటే వారానికి రెండు సార్లు స్పెర్మ్ డొనేట్ చేస్తే 800 రూపాయలు, నెలకు 3200 వస్తాయి. నన్ను నేనే మోసం చేసుకుంటున్నానా? అనిపించింది.

నేను స్పెర్మ్ సెంటర్‌కు వెళ్లి ఆ సినిమాలో విషయం చెప్పాను. డబ్బులు తక్కువ ఇస్తున్నారని సీరియస్ అయ్యాను.

కానీ, స్పెర్మ్ అమ్మడానికి ఎంత మంది క్యూలో ఉన్నారో ఆ మెయిల్స్ అన్నీ వాళ్లు కంప్యూటర్లో చూపించగానే, ఎర్రగా, బుర్రగా ఉన్నానని ఎగిరిపడుతున్న నాకు ఫ్యూజులు ఎగిరిపోయాయి.

అయినా, నాకు నేను హీరో ఆయుష్మాన్ ఖురానాలా ఫీలైపోయాను.

బహుశా అంత తక్కువ డబ్బులు తీసుకోవడం వల్లే మాలాంటి వాళ్లను సెల్లర్ బదులు డోనర్ అంటుంటారు.

డబ్బులు తక్కువే అయినా నా జీవితంపై మాత్రం అది సానుకూల ప్రభావం చూపించింది. స్పెర్మ్‌ను అలా ఊరికే వృథా చేయడం ఎందుకు అనిపిస్తోంది.

రెండోది ఇంట్లో ముందులా ప్రతిరోజూ హస్తప్రయోగం చేయాల్సిన అవసరం లేకుండా పోయింది.

నేను ఎలాంటి తప్పుడు పని చేయడం లేదని కూడా నాకు తెలుసు. కానీ దాని గురించి నేను అందరికీ చెప్పుకోలేను. అలాగని, నేను వేరేవాళ్లను చూసి భయపడుతున్నానని కాదు. మన సమాజంలో ఈ విషయం గురించి అర్థం చేసుకునేంత పరిపక్వత ఉందని నాకు అనిపించడం లేదు. జనాలకు ఇది తెలిస్తే వాళ్లు నా గురించి ఏమేం ఆలోచిస్తారో?

నేను ఈ విషయం గురించి మా ఇంట్లో ఎవరికీ చెప్పలేను. మా అమ్మనాన్నకు తెలిస్తే షాక్ అవుతారు. స్నేహితుల దగ్గర మాత్రం అది దాచి పెట్టలేదు. మా మధ్య ఇప్పుడు ఈ విషయం మాట్లాడుకోవడం మామూలే.

నాకైతే భార్యలు ఎక్కువగా పొసెసివ్‌గా ఉంటారేమో అనిపిస్తుంది. తమ భర్తలు వెళ్లి వేరే ఎవరికో స్పెర్మ్ ఇవ్వడం వాళ్లు జీర్ణించుకోలేరు. నేను కూడా పెళ్లయ్యాక నా భార్యకు ఈ విషయం చెప్పకూడదనే అనుకుంటున్నా.

అయినా, స్పెర్మ్ కొనేవాళ్లు పెళ్లికాని అబ్బాయిలకే ప్రాధాన్యం ఇస్తారు. 25 ఏళ్ల వయసు వరకూ దానికి తగినవారని అనుకుంటారు.

స్పెర్మ్ డోనర్ అనే నా గుర్తింపు జీవితాంతం నాతో ఉండదని నాకు తెలుసు. ఎందుకంటే బతికినంత కాలం స్పెర్మ్ ఉండదు.

ఈ గుర్తింపు మా అమ్మకు తలవంపులు తీసుకురావచ్చని నాకు తెలుసు. కొంతమంది అమ్మాయిలు నన్ను పెళ్లి చేసుకోలేమని కూడా చెప్పచ్చు. కానీ మా అమ్మకు, నా కాబోయే భార్యకు నా వయసులో అబ్బాయిలు హస్తప్రయోగం కూడా చేస్తారని తెలిసుండదా?

స్పెర్మ్ డొనేషన్ సిగ్గుపడాల్సిన విషయమే అయితే హస్తప్రయోగం చేస్తున్నందుకు కూడా సిగ్గుపడాలి. కానీ, నాకు మాత్రం, ఈ రెండిట్లో దేనికీ తలదించుకోవాల్సిన అవసరమే లేదని అనిపిస్తోంది.

(ఒక స్పెర్మ్ డోనర్‌తో మాట్లాడి, అతడి అంతరంగాన్ని అక్షరబద్ధం చేశాం. ఆ వ్యక్తి పేరును గోప్యంగా ఉంచాం. ప్రొడ్యూసర్: సుశీలా సింగ్)

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)