లబ్‌డబ్బు: పీపీఎఫ్‌ ఖాతాతో ప్రయోజనాలేంటి?

  • 13 అక్టోబర్ 2018
పీపీఎఫ్

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్).. నష్టభయం, పన్నుపోటు లేని ఓ పొదుపు మార్గం. దీనిలో పెట్టుబడి పెడితే కలిగే లాభాలు ఎన్నో ఉన్నాయి.

పీపీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేసే డబ్బు, దానిపై వచ్చే వడ్డీ, మెచ్యూరిటీ తర్వాత లభించే మొత్తం అంతా ట్యాక్స్ ఫ్రీనే. అంటే ఆదాయపన్ను ఉండదు. పీపీఎఫ్ గురించిన మరింత సమాచారాన్ని తెలుసుకుందాం ఈ వారం 'లబ్‌డబ్బు'లో.

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్... ఈ అకౌంట్ తెరవాలంటే రెండు మార్గాలున్నాయి. ఒకటి పోస్ట్ ఆఫీస్‌కు వెళ్లడం, మరొకటి బ్యాంకుకు వెళ్లడం. వెరిఫికేషన్ కోసం మీరు ఒకసారి బ్యాంకుకు వెళ్లాల్సి ఉంటుంది.

పీపీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేసిన డబ్బుకు లాక్-ఇన్ పీరియడ్ 15 ఏళ్లు. ఖాతా తెరిచిన తేదీకీ మెచ్యూరిటీ తేదీకీ ఎలాంటి సంబంధం ఉండదు. మొదటిసారి ఇన్వెస్ట్ చేసిన ఆర్థిక సంవత్సరంలోని చివరి తేదీనే లెక్కలోకి తీసుకుంటారు.

పీపీఎఫ్ అకౌంట్‌లో నెలవారీగా జమ చేసే మొత్తాన్ని ప్రతి నెలా 5వ తేదీ లోపు డిపాజిట్ చేస్తే మంచిదని నిపుణులు చెబుతారు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionలబ్‌డబ్బు: పీపీఎఫ్‌లో పెట్టుబడితో ప్రయోజనం ఏంటి?

పీపీఎఫ్ ఖాతాలో ఎంత జమచేయవచ్చు?

ప్రతి సంవత్సరం కనీసం 500 రూపాయలు, గరిష్ఠంగా లక్షన్నర రూపాయలు పీపీఎఫ్ ఖాతాలో జమ చేయవచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో మొత్తం డబ్బును ఒకేసారి లేదంటే ప్రతి నెలా కొంత చొప్పున కూడా జమ చేయొచ్చు. అయితే సంవత్సరంలో మొత్తంగా 12 సార్లు మాత్రమే జమ చేసేందుకు అవకాశం ఉంటుంది.

ఇక్కడ మీరు తెలుసుకోవలసిన మరి కొన్ని విషయాలు కూడా ఉన్నాయి. నిర్ణీత గడువుకన్నా ముందు ఖాతాను మూసెయ్యాలనుకుంటే దానికి కొన్ని షరతులు వర్తిస్తాయి. 15 ఏళ్లు నిండకుండానే మీ ఖాతాను మూసేయాలనుకుంటే మీ ఖాతా కనీసం ఐదేళ్ల పాటు కొనసాగి ఉండాలి.

పీపీఎఫ్ ఖాతా ఉన్నంత మాత్రాన కాసుల వర్షం కురుస్తుందని కాదు కాకపోతే మీ భవిష్యత్తుకు కొంతమేర ఆర్థిక భరోసా లభిస్తుంది.

Image copyright Getty Images

పీపీఎఫ్‌పై రుణం తీసుకోవచ్చా?

ఇందులోంచి డబ్బును పాక్షికంగా వెనక్కి తీసుకోవచ్చు. అయితే రుణంగా తీసుకునే డబ్బుపై వడ్డీ పీపీఎఫ్‌పై లభించే వడ్డీకన్నా 2 శాతం ఎక్కువగా ఉంటుంది. రుణంలో మూలధనం ఖాతాదారు ఖాతాలో జమవుతుంది. కాగా వడ్డీగా లభించేది ప్రభుత్వ రాబడిగా ఉంటుంది. అయితే, మీరు ఏడో సంవత్సరం నుంచి మాత్రమే ఇలా డబ్బును రుణంగా తీసుకోగలుగుతారు.

పీపీఎఫ్ ఖాతాను మరేదైనా రుణంతో కానీ, రుణచెల్లింపుతో గానీ జోడించడానికి వీల్లేదు. కోర్టు కూడా అలాంటి ఆదేశం ఇవ్వలేదు. ఒకవేళ మీరు ప్రతి ఏటా 500 రూపాయల కనీస మొత్తాన్ని జమ చేయక పోతే, మీ ఖాతాను మూసేస్తారు. మీ ఖాతాను మళ్లీ యాక్టివేట్ చేయించాలనుకుంటే కొంత జరిమానాతో పాటు ఏడాదికి 500 చొప్పున కనీస మొత్తాన్ని జమ చేయాలి.

మీ పీపీఎఫ్ ఖాతా 15 ఏళ్లు నిండిన తర్వాత దాన్ని ఐదు, పది, పదిహేనేళ్ల చొప్పున పొడిగించుకోవచ్చు. ఇలా ఎన్నేళ్ల పాటైనా పొడిగిస్తూ ఉండొచ్చు.

అయితే 15 ఏళ్ల తర్వాత మీ కాంట్రిబ్యూషన్ తప్పనిసరేమీ కాదు. అయితే మీ డబ్బుపై వడ్డీ లభిస్తూ ఉంటుంది. అలాగే, ఏడాదికి ఓసారి కొంత డబ్బు తీసుకునే సౌలభ్యం కూడా ఉంటుంది.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)