మహారాష్ట్ర: మనిషి రక్తం రుచిమరిగిన పెద్దపులిని పట్టుకునేందుకు చివరి అస్త్రంగా ఖరీదైన పెర్ఫ్యూమ్‌

  • 14 అక్టోబర్ 2018
పులి Image copyright Getty Images

మనిషి రక్తం రుచి మరిగిన పెద్దపులిని పట్టుకోవాలంటే ఏం కావాలి?

గుండె ధైర్యం గల వేటగాళ్లు, గురి తప్పని తుపాకులుంటే చాలా?.. అయినా పట్టుకోలేకపోయారే..

అందుకే.. మహారాష్ట్రలో మనుషులను తినేస్తున్న ఒక పెద్దపులిని పట్టుకోవడానికి అక్కడి అటవీ శాఖ కొత్త మార్గం ఎంచుకుంది.

మత్తెక్కించే పరిమళంతో దాని మెడలొంచాలని నిర్ణయించుకుంది. ప్రాణాలతో దాన్ని పట్టుకుని జూకి తరలించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.

మహారాష్ట్రలోని పాండర్‌కవాడా ప్రాంతంలో ఆరేళ్ల వయసున్న ఆడ పులి ఒకటి తిరుగుతోంది. ఇది ఇప్పటివరకు 13 మందిని చంపేసిందని స్థానికులు చెబుతున్నారు. రెండేళ్లుగా దీన్ని పట్టుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలించలేదు.

దీంతో అటవీ అధికారులు ఈసారి కొత్త ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. అందులో భాగంగా వారు ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన 'కాల్విన్ క్లెయిన్' బ్రాండ్‌కు చెందిన ఖరీదైన పరిమళాన్ని వాడుతున్నారు. ఇప్పటికే వారు ఈ సెంట్ సీసాలను భారీ మొత్తంలో తెప్పించారు.

''ఈ పరిమళాన్ని అడవిలో అక్కడక్కడా చెట్లపైనా, నేలపైనా కూడా చల్లుతాం. ఫలితం ఇస్తుందో లేదో చూస్తాం'' అని సునీల్ లిమాయే అనే అటవీ అధికారి తెలిపారు.

Image copyright Getty Images

ఈ సెంటే ఎందుకు వాడుతున్నారు?

పులిని పట్టుకోవడానికి వాడుతున్న ఈ కాల్విన్ క్లెయిన్ బ్రాండ్ 'యూ డి టాయిలెట్' రకం సెంట్ తయారీలో పునుగుపిల్లి (సివెట్) సువాసన గ్రంథుల నుంచి సేకరించిన పరిమళాన్ని వాడతారు.

న్యూయార్క్‌లోని బ్రాంక్స్ జూలో చిరుతపులులపై దీన్ని ప్రయోగించినప్పుడు అవి ఈ వాసనను ఎంతగానో ఇష్టపడినట్లు తేలింది.

అమెరికాకు చెందిన జీవశాస్త్రవేత్త మిగ్యూల్ ఓర్డెనానా ఓ సైంటిఫిక్ మ్యాగజీన్లో ఇదే విషయం రాశారు. చిరుతల ఫొటోలు తీసేటప్పుడు వాటిని కెమెరావైపు ఆకర్షించేందుకు ఈ సెంట్ వాడొచ్చన్నారు.

మూడేళ్ల కిందట కర్నాటకలో ఒక చిరుతను పట్టుకునేటప్పుడు కూడా బోనులు ఏర్పాటు చేసి దానికి సమీపంలో ఈ పరిమళాన్నే చల్లారు. అప్పుడు వారి ప్రయత్నం ఫలించింది కూడా.

Image copyright Pratik chorge/hindustantimes
చిత్రం శీర్షిక అడవిలోకి పశువులు మేపడానికి వెళ్లేవారు ఒంటికి ఇనుప రేకులు చుట్టుకుని వెళ్తున్నారు. పులి దాడి చేసినా గాయపడకుండా ఈ ప్రయత్నం.

ఇలా కనిపించి అలా మాయమైపోతోంది

నిజానికి టి-1 అనే పేరుతో పిలుస్తున్న ఈ ఆడపులిని పట్టుకునేందుకు అటవీ అధికారులు, షార్ప్ షూటర్లు రెండేళ్లుగా చేయని ప్రయత్నమంటూ లేదు. తొమ్మిది నెలల వయసున్న రెండు కూనలను వెంటేసుకుని తిరుగుతున్న ఈ పులి ఇలా కనిపించి అలా మాయమైపోతోందట.

సుమారు 150 కిలోమీటర్ల మేర విస్తరించిన అడవిలో తిరుగుతున్న దీనికోసం నిరంతరం వెతుకుతున్నా చిక్కడం లేదు. ఈ అటవీ ప్రాంతం మధ్యలో కొన్ని గ్రామాలు, పొలాలు ఉండడంతో అప్పుడప్పుడూ గ్రామస్థులపై దాడి చేసి చంపేస్తోంది.

ఇక్కడి అటవీ ప్రాంతంలోని 20 గ్రామాల్లో సుమారు 5 వేల జనాభా ఉంది. ఆగస్టులో ఇది ముగ్గురిని చంపేయడంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు.

పులి దాడుల నుంచి తప్పించుకోవడం కోసం అటవీ అధికారులు ప్రజలకు జాగ్రత్తలు చెప్పడం మినహా ఏమీ చేయలేకపోతున్నారు. పొలాల్లోకి వెళ్లేటప్పుడు, పశువులు మేపడానికి వెళ్లేటప్పుడు బృందాలుగా వెళ్లాలని.. చీకటి పడకుండానే గ్రామాలకు తిరిగొచ్చేయాలని చెబుతున్నారు.

మరోవైపు అటవీ అధికారులు దీన్ని చంపకుండా సజీవంగా పట్టుకోవాలంటూ జంతు హక్కుల ఉద్యమకారులు కోరుతున్నారు. ఇందుకోసం వారు సోషల్ మీడియా వేదికగా 'సేవ్ ది టైగ్రస్' పేరుతో ప్రచారం చేస్తున్నారు.

అటవీ అధికారులకు దాన్ని సజీవంగా పట్టుకునే నేర్పు లేదని, వారు దాన్ని చంపేసే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సెప్టెంబరులో పులి వేట నిలిపివేతకు ఆదేశాలివ్వాలని కోరుతూ జంతు హక్కుల కార్యకర్తలు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా సుప్రీం కోర్టు వారి అభ్యర్థనను తోసిపుచ్చింది.

''ఆ పులిని చంపడం మా ఉద్దేశం కాదు. కానీ, ఏం జరుగుతుందన్నది పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.. అది మాపై దాడిచేస్తే మేం షూట్ చేయాల్సి ఉంటుంది'' అని సీనియర్ అటవీ అధికారి ఏకే మిశ్రా చెప్పారు.

Image copyright kannagi khanna
చిత్రం శీర్షిక పులి వేటకు నేతృత్వం వహిస్తున్న అధికారిణి కేఎం అభర్ణ

అడవిని జల్లెడ పడుతున్నా ఆచూకీ లేదు..

రెండేళ్లుగా ఈ పులిని పట్టుకోవడానికి అటవీ అధికారులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. దీని జాడ పసిగట్టేందుకు.. ఏ ప్రాంతంలో తిరుగుతోందో తెలుసుకునేందుకు 100కిపైగా కెమెరాలు ఏర్పాటుచేశారు. ప్రతి రోజూ 36 మంది ఫారెస్ట్ గార్డులు ఈ కెమెరాల్లోని చిత్రాలను పరిశీలించేందుకు అడవిలోకి వెళ్తారు. ఈ కెమెరాలు 300 సార్లు ఆ ఆడపులి తన పిల్లలతో తిరుగుతున్న చిత్రాలను తీశాయి.

అంతేకాదు.. పులికి ఎరగా మేకలు, గుర్రాలను చెట్లకు కట్టి కూడా అధికారులు ప్రయత్నాలు చేశారు. అక్టోబరులో అది రెండు గుర్రాలను తినేసి వెళ్లిపోయింది కానీ దొరకలేదు.

ఫారెస్ట్ రేంజర్లు అడవిలో నాలుగు ప్రాంతాల్లో చెట్లపై మంచెలు ఏర్పాటుచేసుకుని టార్చిలు, వైర్‌లెస్ సెట్లు, వలలతో సిద్ధంగా ఉంటూ రాత్రీపగలు దీని జాడ కనిపెట్టేందుకు నిఘా పెట్టారు.

అంతేకాదు... పులుల సంరక్షక విభాగానికి చెందిన 50 మంది కమాండోలు.. ఏకే-47లతో పోలీసులు నిత్యం అడవంతా గాలిస్తున్నారు.

పది మంది ప్రైవేటు షార్ప్ షూటర్లను అధికారులు రప్పించడంతో వారూ పగలనకా రాత్రనకా ఆయుధాలతో అడవిని జల్లెడ పడుతున్నారు.

పులిని అడ్డగించడానికి ఏనుగులపై ఒక బృందం తిరుగుతోంది.

ఇవి చాలవన్నట్లు లేటెస్ట్ టెక్నాలజీనీ ఉపయోగిస్తున్నారు. ఒక పవర్ గ్లైడర్, డ్రోన్ కూడా నిత్యం అడవిని పరిశీలించేందుకు అక్కడి గగన తలంలో తక్కువ ఎత్తులో తిరుగుతున్నాయి.

ఇంకా.. పులి అడుగులను గుర్తించేందుకు, ఎక్కడైనా అది మూత్రం పోస్తే ఆ సహాయంతో జాడ కనిపెట్టేందుకు.. అది తన గోళ్లను పదును పెట్టుకునేందుకు ఎక్కడైనా చెట్ల బెరళ్లపై గాట్లు పెట్టిందా అన్నది గమనించేందుకు సిబ్బంది అణువణువూ గాలిస్తున్నారు.

బోనులు, వలలతో మరికొందరు సిబ్బంది అడవి పరిసరాల్లో తాత్కాలిక టెంట్లు వేసుకుని సిద్ధంగా ఉన్నారు.

పులి కనిపిస్తే మత్తిచ్చి పట్టుకునేందుకు ట్రాంక్విలైజర్ గన్‌లతో వెటర్నరీ డాక్లర్ల బృందం కూడా ఈ వేటలో పాలుపంచుకుంటోంది.

''ఆ ఆడపులి చాలా తెలివైనది.. దానికి రెండు కూనలు ఉండడంతో మరింత జాగ్రత్త పడుతోంది. చాలా తెలివిగా మా నుంచి తప్పించుకుంటోంది'' అని ఈ పులి వేటకు నేతృత్వం వహిస్తున్న సీనియర్ అటవీ అధికారి కేఎం అభర్ణ తెలిపారు. పైగా దట్టమైన అడవి కావడం, భౌగోళికంగానూ అంత అనుకూలంగా లేకపోవడంతో పట్టుకోవడం కష్టమవుతోందని ఆమె అన్నారు.

టేకు చెట్లు ఎక్కువగా ఉన్న ఆ అడవిలో కొండలు, గుట్టలు ఉండడంతో అది తప్పించుకోగలుగుతోంది.

మరోవైపు అక్కడ వేగంగా పెరిగే లక్షణమున్న పొదలు ఉండడంతో దూరం నుంచే జాడ తెలుసుకోవడం, అనుకున్న దారిలో సాగడం అసాధ్యంగా మారుతోంది.

వేసవిలో అడవి కొంత ఎండినా అప్పుడు 48 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతల కారణంగా బృందాలు తొందరగా అలసిపోతున్నాయని ఆమె అన్నారు.

Image copyright Pratik chorge/Hindustan Times
చిత్రం శీర్షిక అడవిలో వందకు పైగా కెమెరాలు ఏర్పాటు చేశారు

ఏనుగు చేసిన పనితో వేట ఆగిపోయింది

పులి వేటలో అనుకోని ఘటనలు ఎదురవుతున్నాయి. ఇటీవల అయిదు ఏనుగులపై షార్ప్ షూటర్ల బృందాన్ని వేటకు పురమాయించగా అందులో ఒక ఏనుగు కట్టుతప్పి సమీపంలోని ఊరిపై విరుచుకుపడింది. ఆ ఏనుగు దాడిలో ఒక వృద్ధురాలు మరణించింది. గ్రామస్థులు ఆగ్రహించడంతో ఏనుగులను అక్కడి నుంచి వెనక్కు పంపించాల్సి వచ్చింది.

అయినప్పటికీ తాము ఓపిగ్గా వేట కొనసాగించి దాన్ని పట్టుకుంటామని అధికారులు చెబుతున్నారు.

ఇక్కడి రైతులు అడవి జంతువుల బారి నుంచి తమ పంటలను రక్షించుకునేందుకు ఏర్పాటు చేసుకునే విద్యుత్ కంచెను దాటే ప్రయత్నంలో ఈ ఆడపులి తల్లి చనిపోయిందని స్థానికులు చెబుతున్నారు.

ప్రపంచంలోని పులుల్లో 60 శాతం భారత్‌లోనే ఉన్నాయి. దేశంలోని పులుల సంఖ్య సుమారు 2,200 ఉండగా మహారాష్ట్రలో 200 వరకు ఉన్నాయి. అయితే, వాటిలో 60 శాతం మాత్రమే అభయారణ్యాల్లో ఉన్నాయి.

మరోవైపు మనుషులను చంపేస్తున్నది ఈ టీ-1 పులేనా లేకుంటే వేరే పులా అన్న అనుమానాలూ ఉన్నాయి.

అయితే, ఈ అటవీ ప్రాంతంలో మాత్రం గత 20 నెలల్లో 10 మంది పులి బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఆగస్టులో ముగ్గురు చనిపోయారు.

మొత్తం ఇప్పటివరకు ఈ ప్రాంతంలో పులుల దాడులో చనిపోయిన 13 మందిలో ఏడుగురు మృతదేహాలపై గాయాలు, పులి లాలాజలం ఆధారంగా అందులో ఏడుగురిని చంపింది ఆడపులిగా గుర్తించారు. మరో రెండు శాంపిళ్లను పరీక్షించినా ఎటువంటి నిర్ధారణకు రాలేకపోయారు.

Image copyright kannagi khanna
చిత్రం శీర్షిక తన కళ్లెదుటే భర్త రాంజీ షెండ్రె‌ను పులి చంపేసిందని లతా షెండ్రె చెప్పారు.

మరోవైపు అడవిలో అనేక జంతువులు ఉన్నప్పటికీ, గ్రామస్థులు పశువులను మేత కోసం అడవిలోకి వదులుతున్నప్పటికీ ఇది మనుషులపై ఎందుకు దాడి చేస్తోందన్నదీ తెలుసుకోలేకపోతున్నారు.

ఈ ఏడాది జనవరిలో డెబ్భయ్యేళ్ల రాంజీ షెండ్రె, తన భార్యతో కలిసి రెండు పశువులను మేపుకొంటూ అడవిలోకి వెళ్లాడు. అక్కడ ఆయన కట్టెపుల్లలతో మంట వేస్తున్న సమయంలో హఠాత్తుగా పులి వచ్చి ఆయనపై దాడి చేసింది. భార్య లత చూస్తుండగానే అది ఆయన్ను పొదల్లోకి ఈడ్చుకుంటూపోయింది.

సహాయం కోసం ఆమె కేకలు వేయగా గ్రామస్థులు వచ్చారు. పక్కనున్న రోడ్డుపై వాహనాలను నిలిపి హారన్ల మోత మోగించి దాన్ని బెదిరించే ప్రయత్నం చేయడంతో అది షిండ్రె మృతదేహాన్ని 2 కిలోమీటర్ల దూరం ఈడ్చుకుపోయి వదిలేసింది.

కాగా పులి తన భర్తను చంపేసిందని, అతణ్ని తినలేదని షిండ్రె భార్య లత చెప్పారు. కానీ, అధికారులు మాత్రం ఇప్పటి వరకు పులిదాడిలో మరణించినవారిలో కొందరిని అది తిన్నట్లు చెబుతున్నారు.

Image copyright kannagi khanna
చిత్రం శీర్షిక 2016లో పులి దాడిలో చనిపోయిన సోనాబాయి ఘోసలే

ఆ రోజు దొరికినట్లే దొరికి తప్పించుకుంది

ఈ ఏడాది మే 21న పులి చిక్కినట్లే చిక్కి తప్పించుకుంది. ఆ రోజు సరాతీ క్యాంప్‌కు 18 కిలోమీటర్ల దూరంలో పులిని గుర్తించారు. ఒక నీల్గాయిని వేటాడి తింటోంది అప్పటికి. దాన్ని చుట్టుముట్టి దూరం నుంచే ట్రాంక్విలైజర్ షూట్ చేశారు. ఆ మత్తు ఇంజెక్షన్ దానికి గుచ్చుకుంది. కానీ, అది వెంటేనే పరుగులు తీస్తూ పారిపోయింది. పక్కనే ఉన్న వాగును ఈదుకుంటూ దాటుకుంటూ వెళ్లిపోయింది.

దానికి ఆ ట్రాంక్విలైజర్ మోతాదు చాలకపోయి ఉంటుందని అధికారులు అంచనాకు వచ్చారు.

పొలాల్లోంచి పరుగులు తీస్తూ భీకరంగా గాండ్రిస్తూ దట్టమైన అడవిలో అది మాయమైపోయిందని, మళ్లీ అంత సమీపంలో ఎన్నడూ దొరకలేదని అభర్ణ చెప్పారు.

ఇది కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం