రఫేల్ ఒప్పందం: HAL ఉద్యోగులు వేల సంఖ్యలో రోడ్డున పడతారా?

  • 13 అక్టోబర్ 2018
రఫేల్ డీల్ అంబానీ సంస్థ Image copyright DASSAULT RAFALE

హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఎఎల్)లో పనిచేస్తున్న సుమారు 3 వేల మంది కార్మికులు తమ ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదంలో పడ్డారు. దీనికి కారణం రఫేల్ కాంట్రాక్టును రిలయన్స్ కంపెనీకి అప్పగించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయమే.

ఉద్యోగాలు కోల్పోయే వారి సంఖ్య గురించి రకరకాల లెక్కలు చెబుతున్నారు. కంపెనీలో ప్రస్తుతం పనిచేస్తున్నవారు ఒక అంకె చెబితే, ఒకప్పుడు ట్రేడ్ యూనియన్ నేతలుగా ఉన్న వారు మరో గణాంకాలు చెబుతున్నారు.

ఆనంద్ పద్మనాభ హెచ్ఏఎల్ కంపెనీలోనే పనిచేస్తున్నారు. ఆయన గతంలో వర్కర్స్ యూనియన్ సెక్రటరీగా కూడా ఉన్నారు.

"కంపెనీ మూతపడదు. అలా జరిగితే, భారత వైమానిక దళం వెన్ను విరిగినట్లే అవుతుంది. ఆ కాంట్రాక్ట్ కంపెనీకి లభించి ఉంటే, దీని భవిష్యత్తు మరింత మెరుగ్గా ఉండేది" అని ఆయన బీబీసీతో అన్నారు.

ప్రస్తుతం కంపెనీలో పనిచేస్తున్న వారు, సంస్థ జారీ చేసిన సర్క్యులర్‌ గురించి భయపడుతున్నారు. గుర్తింపు బయట పెట్టకూడదనే షరతుతో మాట్లాడారు.

ఉద్యోగులు ఎవరైనా కంపెనీ గురించి బహిరంగంగా మాట్లాడితే వాళ్లపై ఉద్యోగుల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కింద చర్యలు తీసుకుంటామని కంపెనీ సర్కులర్ జారీ చేసింది..

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కంపెనీ ఉద్యోగులతో మాట్లాడాలనుకున్న సమయానికి 48 గంటల ముందు ఈ సర్కులర్ జారీ అయ్యింది.

Image copyright Getty Images

హెచ్ఏఎల్ ఉద్యోగుల వాదనేంటి?

"విమానాల నిర్మాణంలో ఏమాత్రం అనుభవం లేని ఒక ప్రైవేటు కంపెనీకి రఫేల్ కాంట్రాక్ట్ ఇవ్వడమంటే, దశాబ్దాల నుంచీ అభివృద్ధి చెందుతూ వస్తున్న స్వదేశీ నైపుణ్యాన్ని నాశనం చేయడమే అవుతుంది. దానివల్ల కంపెనీ వ్యాపారం, సామర్థ్యంపై ప్రభావం పడుతుంది" అని మరో ట్రేడ్ యూనియన్ మాజీ నేత మీనాక్షి సుందరం అన్నారు

పేరు వెల్లడించవద్దని కోరిన ఒక ఉద్యోగి "ఈ రంగంలో ఉన్న ప్రతిభకు గ్రహణం పడుతుంది" అన్నారు.

హెచ్ఏఎల్ మాజీ, ప్రస్తుత ఉద్యోగుల వాదనలు, కొంతవరకూ సెప్టంబరులో రిటైరైన కంపెనీ మాజీ ఛైర్మన్ టి.సువర్ణ రాజు చెప్పినట్టే ఉన్నాయి.

మూడు వారాల ముందు 'హిందుస్తాన్ టైమ్స్‌'కు మాత్రమే ఇచ్చిన ఇంటర్వ్యూలో "ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌ నాలుగో తరానికి చెందిన 25 టన్నుల సుఖోయ్-30 యుద్ధ విమానాన్ని మేం పూర్తిగా ముడి పదార్థాల నుంచి తయారు చేయగలిగినప్పుడు, ఇంకా ఏం చెప్పుకోవాలి? మేం కచ్చితంగా వాటిని చేయగలం" అన్నారు.

టి.సువర్ణ రాజుతో మాట్లాడేందుకు బీబీసీ చాలా ప్రయత్నించింది. కానీ, వార్తాపత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత ఆయన ఎవరితోనూ మాట్లాడడం లేదు. బీబీసీ ఇంటర్వ్యూకు కూడా నిరాకరించారు.

Image copyright DASSAULT RAFALE

హెచ్ఏఎల్ సామర్థ్యంపై ప్రశ్నలు

రఫేల్ ఒప్పందంపై బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం కాంగ్రెస్, ఇతర పార్టీల నుంచి చాలా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. యూపీఏ పాలనలో హెచ్ఏఎల్ కంపెనీ 108 విమానాలు తయారు చేయాల్సి ఉంది. మిగతా 18 విమానాలను నేరుగా డసో ఏవియేషన్ డెలివరీ చేయాల్సి ఉంది.

రాజు ఈ ఇంటర్వ్యూలో ఇంకో మాట కూడా చెప్పారు. "డసో, హెచ్ఏఎల్ పరస్పర అంగీకారంపై సంతకాలు చేశాయి. దానిని ప్రభుత్వానికి కూడా ఇచ్చాయి. ఆ ఫైళ్లు బయటపెట్టాలని మీరు ప్రభుత్వాన్ని ఎందుకు అడగడం లేదు? ఆ ఫైళ్లు మీకు అన్నీ చెబుతాయి. నేను విమానం తయారు చేస్తే, వాటికి నేను గ్యారంటీ ఇస్తాను" అన్నారు.

మరో కార్యకర్త పేరు బయట పెట్టకూడదనే షరతుతో, "ఈ మొత్తం అంశం వివాదాస్పదం అయిపోయింది. దీనిపై చాలా ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఇది రాజకీయం అయిపోయిందని మీరు అనుకోవచ్చు. కానీ మన రక్షణ మంత్రి (నిర్మలా సీతారామన్) స్వయంగా హెచ్ఏఎల్‌కు రఫేల్ తయారు చేసే సామర్థ్యం లేదని అనడం సరికాదు" అన్నారు.

"రఫేల్ విమానం తయారీలో హెచ్ఏఎల్ సామర్థ్యంపై ప్రశ్నలు లేవనెత్తడాన్ని ఇక్కడ పనిచేసే ఏ ఉద్యోగి భరించలేడు" అని ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్(ఎఐటీయూసీ) ఎగ్జిక్యూటివ్ అధ్యక్షుడు హెచ్.మహాదేవన్ అన్నారు.

ఈ వివాదంలో హెచ్ఏఎల్ తయారు చేసిన తేజస్ యుద్ధ విమానాల డెలివరీ ఆలస్యం కావడంపై కూడా ప్రశ్నలు తలెత్తాయి. రిటైర్ అయిన భారత వైమానిక దళ అధికారి ఒకరు అవి ఆలస్యం కావడాన్ని విమర్శించారు. "పాతబడిన యుద్ధ విమానాల వల్ల వచ్చే సమస్యలతో భారత వైమానిక దళం నానా తంటాలూ పడుతోంది" అన్నారు.

Image copyright DASSAULT RAFALE

హెచ్ఏఎల్ కంటే మెరుగైన సామర్థ్యం ఎవరికీ లేదు

కానీ, యుద్ధ విమానాల తయారీ అంశంలో హెచ్ఏఎల్ మాజీ అధ్యక్షుడు డాక్టర్ సీజీ కృష్ణదాస్ నాయర్ అభిప్రాయం మాత్రం మరోలా ఉంది.

"హెచ్ఏఎల్‌లా యుద్ధ విమానాలు తయారు చేసే సామర్థ్యం దేశంలో వేరే ఏ సంస్థకూ లేదు. హెచ్ఏఎల్ ఇప్పుడు మరింత ముందుకు వెళ్లాలంటే, అది పబ్లిక్-ప్రైవేటు మోడల్ కావాలి" అని ఆయన బీబీసీతో అన్నారు.

"హెచ్ఏఎల్, లేదా వేరే ఏ పబ్లిక్ సెక్టార్ కంపెనీ అయినా సరే. అది ప్రైవేటు కంపెనీతో ఎలా పనిచేస్తుందో, మధ్య, చిన్న సెక్టార్లతో కూడా అలాగే కలిసి పనిచేయాల్సి ఉంటుంది. ఎప్పుడైనా ఏదైనా పెద్ద ఆర్డర్ వస్తే, హెచ్ఏఎల్ అలాంటి సహకారమే తీసుకుంటోంది. ప్రైవేటు సెక్టార్లతో కూడా దానిని పంచుకుంది" అన్నారు.

Image copyright DASSAULT RAFALE

రఫేల్ విమానాలను వేరే ఎవరూ చేయలేరని చెప్పడం మూర్ఖత్వం అవుతుందని డాక్టర్ నాయర్ అన్నారు.

డాక్టర్ నాయర్ మాటలను సింపుల్‌గా చెప్పాలంటే, రిలయన్స్ దగ్గర రఫేల్ విమానాలు తయారు చేసే సామర్థ్యం లేకపోతే, అది హెచ్ఏఎల్‌తో వాటి తయారీ ఒప్పందం చేసుకోవచ్చు

దానితోపాటు మిరాజ్ 2000 విమానాలకు చేస్తున్నట్టు అది విమానాల మెయింటెనెన్స్ కూడా చూసుకోవచ్చు. వాటిని కూడా రఫేల్ తయారు చేస్తున్న డసో ఏవియేషన్ సంస్థే తయారు చేస్తోంది.

ప్రపంచంలో అమెరికా, రష్యా, ఫ్రాన్స్, చైనా తర్వాత భారత్ యుద్ధ విమానాలు తయారు చేయగలిగిన అయిదో దేశంగా నిలిచింది. ఈ సామర్థ్యం.,, భారతృదేశ తొలి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ స్థాపించిన హెచ్ఏఎల్ సంస్థ దగ్గర మాత్రమే ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం