#HisChoice: పాపకు తల్లిగా మారిన ఒక తండ్రి కథ

  • 14 అక్టోబర్ 2018
పాపకు తల్లైన తండ్రి కథ

అర్థరాత్రి దాటింది, తను బాత్రూంలోకి వెళ్లి గడియ పెట్టుకుంది. ఎంత పిలిచినా తీయడం లేదు.

ఆ టైంలో నా కూతురు నిద్రపోతోంది. గట్టిగా గొడవ చేసి తనను లేపడం నాకిష్టం లేదు.

నాకు చాలా భయమేస్తోంది. మాటిమాటికీ తలుపు గట్టిగా నెడుతున్నా, కానీ తను తీయడం లేదు. నేనేమైనా తప్పు చేశానా అనిపించింది.

ఈ గొడవంతా కాసేపటి ముందు మొదలైంది.

నా భార్య ఫోన్ ఆగకుండా మోగుతూనే ఉంది. కానీ, దాన్ని తీయడం లేదు. నేనెళ్లి ఆ ఫోన్ తీసుకోగానే, ఆమె దాన్ని నా చేతిలోంచి లాక్కుంది బాత్రూంలోకి వెళ్లి లోపల గడి పెట్టుకుంది.

అప్పటి నుంచి తలుపు తీయమని చెబుతూనే ఉన్నా.

భయంతో తలుపు గట్టిగా గుద్ది, నేను లోపలికి వెళ్లాను. ఆమె చేతుల్లో ఫోన్ లాక్కుని చూశాను.

దానిలో కనిపించింది చూసి షాకయ్యా, తను ఒక నంబరుకు మెసేజ్ పంపించింది. అదే నంబర్ నుంచి ఆమెకు కొన్ని మిస్డ్ కాల్స్ కూడా ఉన్నాయి.

నా భార్య పంపిన మెసేజ్‌లో "నా ఫోన్ తీయద్దు. అది ఇప్పుడు మా అన్న దగ్గరుంది" అని ఉంది.

ఆ మెసేజ్ చదవగానే నాకు కోపం వచ్చింది. కానీ, తనను ఒక్క మాట కూడా అనలేదు. ఎందుకంటే మళ్లీ బాత్రూంలోకి వెళ్లి గడియ పెట్టుకుంటుందేమో, ఏదైనా చేసుకుంటుందేమో అని భయపడ్డా.

తర్వాత రోజు ఉదయం నా ఫ్రెండ్స్ వచ్చారు. వాళ్లకు విషయం చెప్పాను. వాళ్లిద్దరూ నా భార్యకు కూడా బాగా తెలుసు. ఎందుకంటే వాళ్లు అప్పుడప్పుడూ మా గొడవలు తీర్చడానికి ఇంటికి వస్తుంటారు.

నన్ను, నా కూతుర్ని ఇద్దర్నీ వదిలి వెళ్లింది

నా ఫ్రెండ్స్ ఇద్దరూ నా భార్యకు నచ్చజెప్పారు. నాతోనే కలిసి ఉండమని చెప్పారు. మా పాప గురించి ఆలోచించమన్నారు. ఆమె విడిపోతే మా చిన్న కుటుంబం ఛిన్నాభిన్నం అవుతుందన్నారు.

కానీ తను ఈసారి తుది నిర్ణయం తీసుకున్నట్టే అనిపించింది. "ఇక తనతో జీవించడం నా వల్ల కాదు" అని స్పష్టంగా చెప్పింది.

తర్వాత రోజు తను ఇంటి నుంచి వెళ్లిపోయింది. కానీ మా పాపను తీసుకెళ్లలేదు. నన్ను, పాపను ఇద్దర్నీ విడిచిపెట్టి వెళ్లిపోయింది.

నేను లోలోపలే కుంగిపోయాను. చాలా ఒంటరిగా అనిపించింది. కానీ నా మూడేళ్ల కూతురు నాతోనే ఉంది కదా అని ఎక్కడో ఒక మూల కాస్త సంతోషం.

మా ఇద్దరిదీ లవ్ మ్యారేజ్. పెళ్లి చేసుకోవడం కోసం మేమిద్దరం మా కుటుంబాలతో చాలా గొడవ పడ్డాం.

మా పాపకు మూడు నెలలు ఉన్నప్పుడు కూడా తను ఒకసారి ఇంటి నుంచి వెళ్లిపోయింది. కూతుర్ని కూడా తీసుకెళ్లిపోయింది. అప్పుడు కూడా నా ఫ్రెండ్స్ వెళ్లి సర్దిచెప్పడంతో మళ్లీ తిరిగొచ్చింది.

కానీ ఈసారి మాత్రం తను నన్ను, నా కూతురిని ఇద్దరినీ వదిలిపెట్టి వెళ్లిపోయింది. తిరిగొస్తుందేమో అని ఎదురుచూసిన నాకు కొన్ని రోజుల తర్వాత 'విడాకుల పేపర్లు' అందాయి.

కోర్టులో వాదనలు జరుగుతున్నప్పుడు పాపను తన తండ్రి అంటే నేనే బాగా చూసుకోగలనని ఆమె స్పష్టంగా చెప్పింది.

నా కూతురు ఇక నా ఇంట్లోనే ఉంటుదిలే అని నేను, మా అమ్మానాన్న సంతోషించాం.

ఒంటరిగా బిడ్డ బాధ్యతలు

మేం విడిపోయిన మొదట్లో అప్పుడప్పుడూ మేం మళ్లీ కలుసుకున్నట్టు, ముగ్గురం ఒకటిగా ఉంటున్నట్టు నాకు కలలు వచ్చేవి.

తను ఏదో ఒకరోజు తిరిగొచ్చి నా పాపను తీసుకెళ్లిపోతుందేమో అని అప్పుడప్పుడు భయంగా కూడా ఉండేది.

కలిసున్నప్పుడు పాప బాధ్యతలు మేం ఇద్దరం పంచుకునేవాళ్లం. కానీ ఇప్పుడు మొత్తం బాధ్యతలు నేనొక్కడ్నే చూసుకోవాల్సి వస్తోంది.

అయితే, మా అమ్మనాన్నలు కూడా నాకు సాయం చేస్తుంటారు. కానీ నేను మాత్రం నా కూతురికి ఎప్పటికీ తల్లి లేని లోటు తెలీకూడదనే అనుకున్నాను.


బీబీసీ అందిస్తున్న #HisChoice సిరీస్‌లో 10మంది భారతీయ పురుషుల నిజ జీవిత గాథలు ఉంటాయి.

ఆధునిక భారతీయ పురుషుల ఆలోచనలు, వాళ్లు ఎదుర్కొంటున్న సమస్యలు, వాళ్ల కోరికలు, ప్రాధాన్యాలు, ఆశలను ఈ కథనాలు ప్రతిబింబిస్తాయి.


పాపకు చిన్నప్పటి నుంచి చారిత్రక ప్రాంతాలకు వెళ్లడం అంటే ఇష్టం. అందుకే నేను తనను రకరకాల ప్రదేశాలకు తీసుకెళ్తుంటాను.

ఆ సమయంలో ఎవరైనా "మీ అమ్మ ఎక్కడ?" అని అడిగితే తను మౌనంగా ఉండిపోయేది.

నన్ను ఎవరైనా ఏదైనా అన్నా, తను నన్ను వెనకేసుకొచ్చేది. అప్పుడు నాకు ఆశ్చర్యంగా అనిపించేది, నాలో ధైర్యం మరింత పెరిగేది.

కానీ తను నన్నెప్పుడూ వాళ్లమ్మ గురించి మాత్రం అడగలేదు. అయితే, అమ్మ అనే మాట వినగానే మౌనంగా ఉందంటే నేనే అర్థం చేసుకునేవాడ్ని. వాళ్లమ్మ మాతోపాటే ఉండుంటే తను మరింత ఓపెన్‌గా మనసులోని విషయాలు పంచుకునేదేమో అని నాకు అనిపిస్తుంటుంది.

కొన్నేళ్ల ముందు నాకు ఘోరమైన యాక్సిడెంట్ అయ్యింది. చాలా తీవ్రంగా గాయపడ్డాను. అప్పుడు ఆస్పత్రిలో, ఆ తర్వాత ఇంట్లో ఉన్నప్పుడు నా కూతురే నాకు తోడుగా నిలిచింది.

నా మందులు కూడా తనే ఇచ్చేది, ఎప్పుడూ నా పక్కనే ఉండేది.

అంతే కాదు, మా అమ్మ ఆరోగ్యం గురించి కూడా తనే జాగ్రత్తలు తీసుకునేది. అమ్మకు డయాబెటిస్ ఉంది. దాంతో ఆమెకు డాక్టర్ చెప్పిన ప్రకారం ఇన్సులిన్ డోస్ కూడా ఇచ్చేది.

రెండో పెళ్లి చేసుకోలేదు

నాకు చాలా మంది రెండో పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చారు. కానీ నా భార్యను, విడాకులు తీసుకున్న విషయాన్ని మర్చిపోవడం చాలా కష్టమైంది. ఎంతైనా, మాది లవ్ మ్యారేజ్ కదా.

ఇప్పుడు నా కూతురికి 13 ఏళ్లు. మా అమ్మానాన్న తనను నాతోపాటు బయటికి ఎక్కడికీ ఎక్కువగా తీసుకెళ్లద్దు అంటారు. ఎక్కడైనా బయట తిరుగుతున్నప్పుడు పీరియడ్స్ వస్తే నేను తనను చూసుకోలేనేమోనని వాళ్ల భయం.

కానీ నేను అన్నిటికీ సిద్ధంగా ఉన్నా. తనకు పీరియడ్స్ మొదలైనప్పుడు నేను పాపకు వాటి గురించి అర్థమయ్యేలా వివరిస్తాను. అమ్మాయిలకు ప్రతి నెలా కొన్ని రోజుల పాటు ఇలా జరుగుతుందని చెబుతాను.

మా అమ్మాయి కల్పనా చావ్లాలా వ్యోమగామి కావాలని కోరుకుంటోంది. తన బాగా చదువుతుంది కూడా. నేను రెండో పెళ్లి చేసుకోకపోవడం వెనుక ఇంకో కారణం కూడా ఉంది. ఇంకో పెళ్లి చేసుకుంటే నా కూతురితో నేను ఇప్పుడు ఉన్నంత సమయం గడపలేనేమో అనిపిస్తుంది.

అయితే, నేను రెండో పెళ్లి చేసుకోవాలని అనుకుంటే, నా కూతురు నన్ను ఏమాత్రం ఆపదని, పెళ్లికి ఎలాంటి అడ్డంకులూ కలిగించదని కూడా నాకు తెలుసు.

నిజం చెప్పాలంటే, రెండో పెళ్లి గురించి నా మనసులో ఒక భయం కూడా ఉంది. నాకు, నా కూతురికి మధ్య వేరే మహిళ వస్తే, మా మధ్య మనస్పర్థలేమన్నా వస్తాయేమో? అనిపిస్తుంది.

వేరే మహిళ నా కూతురిని మామూలుగా ఏదైనా అన్నా.. అది నాకు నచ్చకపోవచ్చు. దాంతో నా రెండో పెళ్లి కూడా ప్రమాదంలో పడచ్చు. మరోసారి అలాంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా లేను.

నేను రెండో పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అదే.

నాకు జీవితంలో ఇప్పుడు ఒకే ఒక లక్ష్యం ఉంది. ప్రాణానికి ప్రాణం అయిన నా కూతురి సంతోషం.

( ఈ కథకు ఒక పురుషుడి జీవితం ఆధారం. దాన్ని బీబీసీ ప్రతినిధి ఎ.డి.బాలసుబ్రమణ్యం అక్షరబద్ధం చేశారు. ఆ వ్యక్తి పేరును గోప్యంగా ఉంచాం. ఈ సిరీస్ ప్రొడ్యూసర్ సుశీలా సింగ్, ఇలస్ట్రేషన్స్: పునీత్ బర్నాలా)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)