మొఘలుల పాలనలో నవరాత్రి వేడుకలు ఎలా జరిగేవి?

  • 16 అక్టోబర్ 2018
నవరాత్రి ప్రార్థనలు చేస్తున్న మహిళ Image copyright Getty Images

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా నవరాత్రి వేడుకలు జరుపుకుంటున్నారు. ఒకప్పుడు ఉత్తర భారతానికే పరిమితమైన దాండియా లాంటి కోలాటాలు ఇప్పుడు దేశమంతటా విస్తరిస్తున్నాయి.

కానీ, చాలా కాలంపాటు ముస్లిం పాలకుల చేతిలో ఉన్న దేశ రాజధానిలో ఈ నవరాత్రి వేడుకలు ఎలా జరిగేవన్నదీ ఆసక్తికరమే.

1398లో తైమూర్ దిల్లీపైన దండయాత్ర చేసినప్పుడు కూడా దేశంలో నవరాత్రి వేడుకలు జరుగుతున్నాయి. ఆ సమయంలో వేడుకులపై ఎంత ప్రభావం పడిందో తెలీదు కానీ, కచ్చితంగా వాటికి ఆటంకం కలిగి ఉంటుందనే చరిత్రకారులు భావిస్తున్నారు.

ఆ రోజుల్లో దిల్లీలోని కాల్కాజీ మందిర్, ఝండేవాలాలోని దేవాలయంలో నవరాత్రి ఉత్సవాలను ఘనంగా జరిపేవారు.

ఝండేవాలా దేవాలయాన్ని 12వ శతాబ్దంలో పృథ్వీ రాజ్ చౌహాన్ పాలనా కాలంలో నిర్మించారని చెబుతారు. అంటే... తైమూర్ దిల్లీలో అడుగుపెట్టడానికి 200 ఏళ్ల ముందు నుంచే అక్కడ ఉత్సవాలు జరిగేవి.

తైముర్ దండయాత్ర జరిగిన 341ఏళ్ల తరువాత, 1739లో నాదిర్ షా దిల్లీపై దండయాత్ర చేశాడు. అది కూడా నవరాత్రులకు కొద్ది రోజుల ముందే.

మొఘల్ చక్రవర్తి మొహమ్మద్ షా రంగీలా లౌకిక భావనలతో ఉండేవారు. ఆయన వసంత పంచమి, హోలీ, దీపావళి లాంటి వేడుకలను జరుపుకునేందుకు స్వేచ్ఛనిచ్చేవారు. నాదిర్ షా తరువాత 100ఏళ్లకు అధికారం చేపట్టిన బహదూర్ షా జాఫర్... నవరాత్రుల సమయంలో చాందినీ చౌక్‌లోని సేఠ్‌లు పంపే వంటకాలను ఇష్టంగా తినేవారు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionఏడో శతాబ్దంలోనే చైనాలో టపాసుల తయారీ మొదలైంది. 13వ శతాబ్దంలో అవి భారత దేశంలోకొచ్చాయి.

నవరాత్రులకు మొఘల్ పాలకులు ఇచ్చిన ప్రాధాన్యం గురించి చెప్పడానికి చాలా ఉదాహరణలు కనిపిస్తాయి. షా ఆలమ్ హయాంలోనే ప్రాచీన కాల్కాజీ దేవాలయాన్ని పునర్నిర్మించారు. అప్పట్లో నవరాత్రి ఉత్సవాలకు అదే అతిపెద్ద వేదిక.

షా ఆలమ్ అడుగుజాడల్లోనే తదుపరి పాలకుడు అక్బర్ షా కూడా నడుచుకున్నారు. అతడి తనయుడు జాఫర్ షా కూడా అదే దారి ఎంచుకున్నారు. అలా మొఘలుల కాలంలో సామరస్యంగానే వేడుకలు జరిగాయి. ఆ పైన బ్రిటిష్ పాలకులు అధికారం చేపట్టారు.

దేశ విభజన జరిగిన తరువాత, భారత్‌లో మరింత ఉత్సాహంతో నవరాత్రి వేడుకలను ఘనంగా జరుపుతున్నారు. గతంలో ప్రాచీన దేవాలయాల్లో ఈ వేడుకలను జరిపేవారు. కానీ, ఇప్పుడు ఎవరికి వారు తమ గృహసముదాయాల్లో, వీధుల్లో ఈ వేడుకలను జరుపుకుంటున్నారు. భక్తులతో పాటు దారిన వెళ్లే వారందరికీ ఆహారం అందించడం కూడా ఇప్పుడు సంప్రదాయంగా మారిపోయింది.

అలా పండుగ రోజుల్లో ప్రసాదం రూపంలో భోజనం పెట్టే దేవాలయాలకు చాలా గుర్తింపు ఉంది. దిల్లీలో నవరాత్రుల సమయంలో చత్తర్‌పుర్ మేళాను నిర్వహిస్తారు. ఆ సమయంలో పెట్టే సామూహిక భోజనాలకు విశేష ఆదరణ ఉంటుంది. ఆ చత్తర్‌పుర్ దేవాలయంలో బంగారంతో చేసిన దేవి విగ్రహం కూడా ఉంటుంది. కానీ, అదే దేవాలయానికి కొద్ది దూరంలోనే మరో గుడి కూడా ఉంది. అది సుల్తానుల పాలనకంటే ముందే నిర్మించిందిగా చెబుతారు. ఆ గుడిలో మాత్రం అంత వైభవం కనిపించదు.

దేశ రాజధానిలోని కాల్కాజి మందిరం దగ్గర నవరాత్రుల సమయంలో ఏర్పాటు చేసే ఉత్సవాలకు మొఘలుల కాలం నుంచే చాలా ఆదరణ ఉంది. ఒక్కోరోజు 60వేల మంది భక్తులు వచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయి. రికార్డు స్థాయిలో ఒక రోజు 12వేల మంది భక్తులు అక్కడ సామూహిక భోజనాలు చేశారు. ఈ భోజనాలు చేసేందుకే నవరాత్రుల సమయంలో ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తుంటారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)