శబరిమల నుంచి ట్రిపుల్ తలాక్ వరకూ... మహిళలే మహిళలకు వ్యతిరేకం ఎందుకు?

  • 16 అక్టోబర్ 2018
శబరిమల వ్యతిరేకత Image copyright Getty Images

కేరళలోని శబరిమల ఆలయంలో తలుపులు తెరిచే సమయం దగ్గరపడే కొద్దీ మహిళల ఆలయ ప్రవేశంపై వ్యతిరేకత తీవ్రమవుతోంది.

కొన్ని హిందూ సంస్థలు, రాజకీయ పార్టీల నేతృత్వంలో ఆందోళనకారులు తిరువనంతపురంలోని సచివాలయం వరకూ చేరుకున్నారు.

'శబరిమలను కాపాడండి' అనే ప్రచారంలో భాగంగా కేరళతోపాటు అహ్మదాబాద్, దిల్లీలో కూడా ప్రదర్శనలు జరిగాయి. ఈ కేసును మళ్లీ విచారించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.

ఆందోళనకారులు మొదట రాష్ట్ర ప్రభుత్వం కూడా పిటిషన్ వేయాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు మహిళలను ఆలయం లోపలికి రాకుండా అడ్డుకుంటామని అంటున్నారు.

శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశం గురించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత ఇది వేడెక్కింది. 12 ఏళ్లు వాదనలు నడిచిన తర్వాత 2018 సెప్టెంబర్ 28న సుప్రీంకోర్టు 4-1 మెజార్టీతో మహిళలు ఆలయంలో ప్రవేశించవచ్చని తీర్పు ఇచ్చింది.

Image copyright Getty Images

భక్తులందరికీ ఆరాధించే హక్కు ఉంటుందని స్పష్టం చేసింది. వారిని అడ్డుకోవడం మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించినట్లే అని తెలిపింది. ఏళ్ల నుంచీ ఉన్న పురుషాధిక్య నియమాలు ఇక మారాల్సి ఉంటుందని సూచించింది.

తీర్పు సమయంలో నలుగురు జడ్జిల్లో ఒకరైన జస్టిస్ ఇందూ మల్హోత్రా ఆలయ ప్రవేశానికి అనుకూలంగా లేరు. కోర్టు మతపరమైన విశ్వాసాలలో జోక్యం చేసుకోకూడదని ఆమె భావించారు. ఈ తీర్పు ప్రభావం మిగతా ధార్మిక క్షేత్రాలపై కూడా పడవచ్చన్నారు.

ఇప్పుడు ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చారు. వీరిలో మహిళలే భారీగా ఉన్నారు. వారి చేతుల్లో జెండాలు, అయ్యప్ప ఫొటోలు ఉన్నాయి. మహిళలకు అనుకూలంగా వచ్చిన ఈ తీర్పును స్వయంగా మహిళలే వ్యతిరేకిస్తున్నారు.

తీర్పును వ్యతిరేకిస్తూ ఇంతకు ముందు కూడా 4 వేల మందికి పైగా మహిళలు ర్యాలీ చేశారు. ఎన్నో ఏళ్ల నుంచి వస్తున్న పురాతన సంప్రదాయాన్ని ఉల్లంఘించకూడదని భావించారు. అది అయ్యప్పను అవమానించడమే అవుతుందని అన్నారు.

ఇలా జరగడం ఇదే మొదటి సారి కాదు, మహిళల హక్కుల ప్రస్తావన ఎప్పుడు వచ్చినా, మహిళలే వాటికి వ్యతిరేకంగా నిలుస్తున్నారు.

మొదట్లో కూడా మహిళలు తమ హక్కుల కోసం ఉద్యమం చేసినపుడు మహిళలే వాటిని వ్యతిరేకించారు. శని సింగనాపూర్ గర్భగుడిలో మహిళల ప్రవేశం కోసం పోరాడినా, ట్రిపుల్ తలాక్ చట్టవిరుద్ధం అని చెప్పినా అదే జరిగింది.

అప్పుడు కూడా చాలా ప్రాంతాల్లో మహిళలు వ్యతిరేక ప్రదర్శనలు చేశారు. అలా చేయడం మత విశ్వాసాలతో ఆటలాడ్డం లాంటిదే అన్నారు.

Image copyright Getty Images

ఈ వ్యతిరేకత ఎందుకు?

సమాన హక్కులకు సంబంధించిన అంశాల్లో ఇది మహిళలను విభజించినట్టు అవుతోంది. కానీ తమ హక్కుల గురించి చివరికి మహిళలే ఎందుకు ఎదురెదురుగా నిలుస్తున్నారు. వారు చేసే ఉద్యమాలపై దీని ప్రభావం ఎలా ఉంటుంది.

దీనిపై సామాజిక కార్యకర్త కమలా భసీన్ "మహిళలకు వ్యతిరేకంగా మహిళలే ఉన్నట్టు కచ్చితంగా కనిపిస్తున్నారు. కానీ అలా జరగడం లేదు. నిజానికి మహిళలు కూడా పురుషాధిక్య ఆలోచనలకు ప్రభావితం అవుతారు. మేం చిన్నతనం నుంచీ అదే నేర్చుకున్నాం. మేమేం చంద్రుడిపై పుట్టలేదు. ఈ దేశంలో పుట్టాం. మహిళలు శుచిగా ఉండరని, అపవిత్రులు అని ఇక్కడ కొంతమంది చెప్పారు. అందుకే మందిరాలు-మసీదుల్లోకి వెళ్లకూడదన్నారు. మహిళలు కూడా అదే నమ్ముతూ పెరిగారు" అని అన్నారు.

"ఇదే ఇళ్లల్లో కూడా కనిపిస్తుంది. ఇక్కడ అత్తాకోడళ్లు మహిళల హక్కులకు సంబంధించిన వాటిపైనే గొడవపడుతారు. ఆడపిల్ల అయితే గర్భంలో చంపేయడానికి తల్లి, అత్త ఇద్దరూ ఒప్పుకుంటారు. అదే తర్వాత పెద్ద స్థాయిలో కూడా కొనసాగుతుంది. వారికి తమ హక్కుల గురించి తెలీదు. పెద్ద పెద్ద పండితులు, మౌల్వీలకు సమాధానం ఇచ్చే దైర్యం కూడా వారిలో ఉండదు.

ఒక మహిళ మరో మహిళకు శత్రువు కాదు

మహిళకు మహిళే శత్రువు అని చాలా మందిలో ఒక భావన ఉంది. ఇంట్లో అత్తా కోడళ్ల గొడవలు నిజ జీవితం నుంచి టీవీలో వరకూ కనిపిస్తుంటాయి.

మహిళలు పరస్పరం శత్రువుల్లా చూసుకోవడాన్ని సీనియర్ జర్నలిస్ట్ మృణాల్ పాండే వ్యతిరేకిస్తున్నారు.

"మహిళకు మహిళే శత్రువు అనేది చాలా పురాతన భావన. నిజం ఏంటంటే పురుషుల మధ్య కూడా అభిప్రాయ బేధాలు ఉంటాయి. కానీ మహిళల మధ్య గొడవలనే పెద్దగా చూపిస్తారు. అత్తాకోడళ్ల గొడవైతే ఏంటి? తండ్రీకొడుకుల మధ్య గొడవ జరగదా? ప్రజాస్వామ్యంలో అందరికీ తమ గొంతు వినిపించే హక్కు ఉంటుంది" అంటారు.

Image copyright Getty Images

మిగతా మహిళల వెనుక ఎవరున్నారు?

బీబీసీ లేడీస్ కోచ్ గ్రూప్‌లో మేం ఈ అంశాన్ని ప్రస్తావించినపుడు చాలా మంది మహిళలు దీనిపై తమ అభిప్రాయాలు పోస్ట్ చేశారు.

"ఇలాంటి మహిళలు నిజానికి పావులుగా అవుతారు. పురుషాధిక్య సమాజం వారిని మహిళల హక్కులకు వ్యతిరేకంగా ఉపయోగిస్తుంది. ఇందులో ఆ మహిళలది ఏ తప్పూ ఉండదు. ఎందుకంటే వారికి సామాజిక కట్టుబాట్లు, ఇతరులపై ఆధారపడడం, అవగాహన లేమి ఉంటుంది. రకరకాల భయాల వల్ల వాళ్లకు నిర్ణయం తీసుకునే హక్కు ఉండదు" అని ప్రీతి ఖర్వార్ పోస్ట్ చేశారు.

Image copyright AFP

అంధ విశ్వాసాలకు భయం

ఇటు, శని సింగనాపూర్ ఆలయ ప్రవేశం కోసం ఉద్యమం చేసిన 'భూమాతా బ్రిగేడ్' చీఫ్ తృప్తి దేశాయ్ ఇందులో మరో కోణం గురించి చెబుతారు. ఒక వ్యూహం ప్రకారం మహిళలను వారికి వ్యతిరేకంగానే ఉపయోగిస్తున్నారని ఆమె అంటున్నారు.

శబరిమల ఆలయ ప్రవేశ వ్యతిరేక ప్రదర్శనల్లో హిందూ సంస్థలు, రాజకీయ పార్టీలు ఆందోళనకారులకు నేతృత్వం వహిస్తున్నాయి. మహిళల చేతుల్లో మనం వారి జెండాలను చూడచ్చు.

మీడియా రిపోర్ట్స్ ప్రకారం నటుడు, బీజేపీ మద్దతుదారుడు అయిన కొల్లమ్ తులసి ఆలయంలో ప్రవేశించే మహిళలను ముక్కలుగా నరికేస్తామని బెదిరించారు. ఆయనకు వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది.

"సుప్రీంకోర్టు మహిళలకు సమానత్వ హక్కులు కల్పించడానికి మందుకు వచ్చింది, అందుకే మత రక్షకులుగా చెప్పుకునే వారు కొంతమంది మహిళలను మతం పేరుతో రెచ్చగొడుతున్నారు. మహిళలు ఆలయంలో ప్రవేశించడానికి వెళ్లినపుడో, లేదా మా హక్కుల కోసం పోరాటం చేస్తున్నప్పుడో ఆ మహిళలనే మా ముందుకు తీసుకొస్తారు. ఎప్పుడూ ముందుకు రాని వారిని, మహిళలను వ్యతిరేకించడానికి మాత్రం ముందుకు తీసుకొస్తారు" అని తృప్తి దేశాయ్ అన్నారు.

"అంధ విశ్వాసాల పేరుతో వారిని భయపెడుతున్నారు. అంటే మతానికి వ్యతిరేకంగా జరిగే ఆందోళనలకు మహిళలు మద్దతు ఇస్తే 'అనర్థం జరుగుతుంది. గ్రామంలో కరువు వస్తుంది' అంటారు. వీటికి భయపడిపోయిన మహిళలు స్వయంగా మమ్మల్ని వ్యతిరేకించడానికి ముందుకు వస్తున్నారు.

అక్టోబర్ 17న శబరిమల ఆలయం తలుపులు తెరిచిన తర్వాత మహిళా బృందంతో కలిసి ఆలయంలో ప్రవేశిస్తానని తృప్తి దేశాయ్ బీబీసీకి చెప్పారు. అయితే అది ఎప్పుడనేది ఆమె ఇంకా నిర్ణయించలేదు.

Image copyright SABARIMALA.KERALA.GOV.IN

ఉద్యమాన్ని బలహీనం చేసే ప్రయత్నం

కానీ, అలా చేయడం వెనుక అసలు కారణం ఏదై ఉంటుంది? మహిళా హక్కుల కోసం జరిగే ఉద్యమాన్ని వారే వ్యతిరేకిస్తే దానివల్ల ఎలాంటి ప్రభావం పడుతుంది?

మహిళలే దీనిని వ్యతిరేకిస్తే ఉద్యమం బలహీనం అవుతుంది. అందుకే సుప్రీంకోర్టు మహిళలకు అనుకూలంగా ఇచ్చిన ఈ తీర్పును వారినే ఉపయోగించి కొందరు ప్రతికూలంగా మార్చాలనే ఉద్దేశంతో ఉన్నారు.

సంప్రదాయబద్ధమైన ఆలోచనల వల్లే మహిళలు రక్షణ లాంటి అంశాల్లో కూడా ఏకం కాలేకపోతున్నారని కమలా భసీన్ అన్నారు. "చిన్న బట్టలు ఎందుకు వేసుకుంటారు? సమయానికి ఇంటికి ఎందుకు రావడం లేదు? అని స్వయంగా వాళ్లే ప్రశ్నిస్తుంటారు" అని చెప్పారు.

మహిళలంతా ఒక్కటి కాలేకపోవడానికి ఇది కూడా ఒక పెద్ద కారణమని ఆమె భావిస్తున్నారు.

Image copyright SABARIMALA.KERALA.GOV.IN

కులమతాలుగా విడిపోయిన మహిళలు

"మహిళలు ఎప్పుడూ ఒక్కటి కాలేకపోయారు. ఒక మహిళ కంటే ముందే ఆమె కులమతాలు, పేదాధనికగా విభజనకు గురవుతుంది. ఆమెపై ఇతర అంశాల ఇమేజ్ పడుతుంది. మేం కుటుంబాలుగా విడిపోయాం. ఒక మహిళకు వేరే మహిళ కంటే తన కుటుంబంపైనే ఎక్కువ నమ్మకం ఉంటుంది. అది చాలా బలమైనది" అంటారు కమలా భసీన్.

"అంటే మహిళకు ఏదైనా ప్రమాదం, సమస్య ఎదురైతే కుటుంబమే ముందుకు వస్తుంది. బయటి మహిళలు ఎవరూ రారు. ఆమెకు సాయం అందించడానికి ప్రభుత్వ సంస్థలు కూడా అంత బలంగా ఉండవు. అందుకే వాళ్లు చాలా విషయాల్లో కుటుంబాలను వ్యతిరేకించలేరు" అన్నారు.

కానీ మహిళలను ఒక్కతాటిపైకి ఎలా తీసుకురాగలం?. సమాధానంగా "దానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. మహిళావాదం పూర్తిగా వ్యాపించినపుడు మేం ఒకరికొకరు సాయం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది" అన్నారు కమలా భసీన్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)