శబరిమలలోలాగా ఇక్కడ రుతుస్రావం ‘అపవిత్రం’ కాదు, పీరియడ్స్ సమయంలోనూ పూజలు చేయొచ్చు

  • 4 జనవరి 2019
ఆదిపరాశక్తి ఆలయం Image copyright omsakthiamma.org

శబరిమల అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయసుల మహిళలూ ప్రవేశించి పూజలు చేసుకోవచ్చంటూ ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దాంతో అనేక ఏళ్లుగా ఆ ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్ల వయసు మహిళలు వెళ్లకూడదంటూ ఉన్న నిషేధం తొలగిపోయింది.

న్యాయస్థానం తీర్పుతో తొలిసారిగా మహిళల కోసం ఆలయ తలుపులు తెరుచుకున్నాయి.

ఇటీవల శబరిమల ఆలయంలోకి ఇద్దరు మహిళలు వెళ్లారు కూడా.

అయితే, తమిళనాడులోని ప్రముఖ ఆది పరాశక్తి ఆలయం మాత్రం ఎన్నో దశాబ్దాలుగా పీరియడ్స్ సమయంలోనూ మహిళలు గర్భగుడిలోకి వెళ్లి పూజలు చేసుకునే అవకాశం కల్పిస్తోంది.

ఈ ఆలయం రుతుస్రావాన్ని అపవిత్రంగా పరిగణించదు, దాన్ని మహిళలందరిలో జరిగే ఓ సహజమైన ప్రక్రియగానే చూస్తుంది.

దేశంలోని ఎన్నో ఆలయాల కంటే భిన్నంగా, ఇక్కడ పూజారులు ఉండరు. ఎప్పుడైనా మహిళలు వెళ్లి స్వయంగా పూజా కార్యక్రమాలు చేసుకోవచ్చు.

"ఈ ఆలయానికి పురుషులు, మహిళలు ఎవరైనా... ఎప్పుడైనా వచ్చి అభిషేకాలు చేసుకోవచ్చు. కుల, మతాల పట్టింపులు కూడా ఏమీ లేవు. ఇక్కడ అందరూ సమానమే" అని ఆలయ పౌర సంబంధాల వ్యవహారాలు చూస్తున్న స్వచ్ఛంద కార్యకర్త రవిచంద్రన్ తెలిపారు.

Image copyright omsakthiamma.org

ఆలయ నిర్వాహకుల కథనం ప్రకారం... కొన్ని దశాబ్దాల క్రితం తమిళనాడులోని మేల్ మరువత్తూర్ గ్రామానికి చెందిన బంగారు అడిగళర్ అనే ఉపాధ్యాయుడు ఓ వేప చెట్టు నుంచి 'పాలు' కారుతున్నట్లు గుర్తించారు.

అయితే, కొన్నాళ్లకు బలమైన గాలులకు ఆ వేప వృక్షం కూలిపోయి, అక్కడ ఓ లింగం వెలసింది. ఆ తర్వాత బంగారు అడిగళర్ తనను తాను ఒక 'శక్తి'గా పిలుచుకోవడం ప్రారంభించారు.

ఆ చెట్టు ఉన్న చోటే ఆది పరాశక్తి ఆలయం నిర్మించారు. అందులో ఆది పరాశక్తి విగ్రహం, లింగం (స్వయంభు లింగం) ఉన్నాయి.

అనంతరం, అక్కడే ఆయన కొలుపు (భవిష్యవాణి) చెప్పడం కూడా ప్రారంభించారు.

అలా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులను ఆకర్శించారు.

కొన్నేళ్లలోనే ఈ ఆలయం భారీగా విస్తరించింది. ట్రస్టు ఏర్పాటు చేసి పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. గ్రామంలో ఓ వైద్య కళాశాలతో పాటు పలు విద్యా సంస్థలు నెలకొల్పారు.

దాంతో ఇదొక ప్రముఖ యాత్రాస్థలంగా మారిపోయింది.

’ఆది పరాశక్తి వార ప్రార్థన’ పేరుతో తమిళనాడుతో పాటు పొరుగు రాష్ట్రాలోనూ వేలాది సంఘాలు ఏర్పడ్డాయి. ఈ సంఘాలకు మహిళలే ఎక్కువగా నేతృత్వం వహిస్తారు.

"1966లో బంగారు అడిగళర్ ఈ లింగాన్ని ప్రతిష్టించారు. ఇప్పుడు దాదాపు 5,000 భక్తుల సంఘాలు ఉన్నాయి, వాటిలో కొన్ని విదేశాల్లోనూ ఉన్నాయి" అని రవిచంద్రన్ చెప్పారు.

తాను 30 ఏళ్లుగా ఈ ఆలయానికి వస్తున్నట్లు చెబుతున్న రిటైర్డ్ ప్రొఫెసర్‌ మీనా కుమారి కనగరజ్ ఈ ఆలయంలో మహిళల పట్ల లింగ వివక్ష ఏమాత్రం లేదన్నారు.

తొలిసారి ఈ ఆలయాన్ని దర్శించుకున్నప్పటి తన అనుభవాలను ఆమె గుర్తుచేసుకున్నారు. "మాటల్లో వర్ణించలేని గొప్ప అనుభూతి అది. ఇక్కడ మహిళలకు ఎలాంటి షరతులు, అడ్డంకులు లేవు. పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. నన్ను గర్భగుడిలోకి అనుమతించారు. నేనే పూజలు చేసుకునే వీలు కల్పించారు. రుతుస్రావాన్ని అపవిత్రంగా చూడకూడదని ఆలయ నిర్మాత బంగారు అడగళర్ బోధించారు. ఈ ఆలయాన్ని భక్తులు తమ పుట్టినిల్లుగా భావించాలని ఆయన చెప్పారు. నాకు అలాగే అనిపించింది. ఇక్కడ సమానత్వం గురించి పలు సూక్తులు, సందేశాలు కనిపిస్తాయి" అని ఆమె వివరించారు.

చిత్రం శీర్షిక ఆలయం నిర్మించిన బంగారు అడిగళర్

ఇక్కడ లింగ సమానత్వమే కాదు, కుల మత వివక్ష కూడా లేదని ఆమె చెబుతున్నారు.

"మేం ఏర్పాటు చేసుకున్న భక్త సంఘాలలో ఎవరైనా చేరొచ్చు. కులం, మతం, ఆడ, మగ, పేద, ధనిక అన్న భేదాలు లేవు. మా సంఘంలో ప్రొఫెసర్లు, పారిశుద్ధ్య కార్మికులు, బట్టలు ఉతికేవారు, ఇలా అందరూ ఉన్నారు. ఎవరైనా ఆలయంలోకి వెళ్లి పూజలు చేస్తారు. కులాన్ని ఎవరూ పట్టించుకోరు. ప్రతి ఒక్కరినీ ఒక "శక్తి" గానే పరిగణిస్తారు. ఇక్కడ రుతుస్రావాన్ని అపవిత్రంగా ఏమాత్రం చూడరు" అని మీనా కుమారి తెలిపారు.

తమిళనాడుకు చెందిన ప్రముఖ రచయిత మురుగవేళ్ బీబీసీతో మాట్లాడుతూ... "ఆదివాసీ సముదాయాల్లో రుతుస్రావాన్ని పునరుత్పత్తి సామర్థ్యానికి ప్రతీకగా చూసేవారు. మహిళలు ఆరోగ్యంగా, పునరుత్పత్తి సామర్థ్యం కలిగి ఉండటం తమ వంశాన్ని వృద్ధి చేసుకోడానికి కీలకమని వాళ్లు భావిస్తారు. పీరియడ్స్ సమయంలో విడుదలయ్యే నెత్తురుకు.. కుంకుమను ఒక చిహ్నంగా చెబుతారు. ఈ ఆలయాన్ని నిర్మించిన బంగారు అడిగళర్ ఆ ఆదివాసీల సంస్కృతిని అర్థం చేసుకుని ఉంటారు. కానీ, మొదట్లో ఆయన కూడా కొన్ని విమర్శలు ఎదుర్కొన్నారు" అని వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

ముఖ్యమైన కథనాలు

గోదావరిలోంచి బయటపడ్డ రాయల్‌ వశిష్ట బోటు.. మృతదేహాల కోసం కొనసాగుతున్న గాలింపు

ఇన్ఫోసిస్: సీఈఓ, సీఎఫ్ఓ‌లపై వచ్చిన ఆరోపణలపై విచారణను ప్రారంభించిన ఐటీ సంస్థ

#100Women: ప్రపంచ మతాన్ని పిల్లలే నడిపిస్తారు - గినా జుర్లో

ఆల్కహాల్‌తో చేతులు కడుక్కునే నిరంకుశ నియంత.. నికొలస్ చాచెస్కూ

చెడ్డ విధానాలను ప్రొఫెషనల్‌గానే విమర్శిస్తా.. నాకు రాజకీయాలేవీ లేవు - అభిజిత్ బెనర్జీ

భారత క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర - దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ క్లీన్ స్వీప్

ప్యాంటు విప్పి, కాలిపర్స్ తీసి స్కానర్‌లో పెట్టాలి.. వికలాంగ ఉద్యమకారులకు విమానాశ్రయంలో అవమానం

కడప జిల్లాలోని కొన్ని గ్రామాల్లో భూమి కుంగుతోంది.. కారణమేంటి?