శబరిమల: కవిత, రెహానా ఆలయంలోకి ఎందుకు వెళ్లలేకపోయారు? ఆ రోజు ఏం జరిగింది?

మహిళలు

కవిత, రెహానా.. వీరిద్దరూ పోలీసు భద్రత మధ్య అక్టోబరులో శబరిమల అయ్యప్ప ఆలయానికి 100 మీటర్ల దూరం వరకూ వెళ్లారు. కానీ ఆలయంలోకి వెళ్లలేకపోయారు.

ఆలయం వద్ద ఆందోళనకారులు దాదాపు 100 మంది పిల్లలను అడ్డుపెట్టి తీవ్రంగా ప్రతిఘటించడంతో.. మేం ఆలయంలోకి వెళ్లకుండా వెనక్కు వచ్చేశామని కవిత బీబీసీ తెలుగుతో చెప్పారు.

పోలీసులున్నా లెక్కచేయకుండా ఆందోళనకారులు ఆలయంలోకి వస్తే చంపేస్తామని బెదిరించారని వివరించారు.

వీరిద్దరూ ఆ రోజు సాయంత్రం శబరిమల నుంచి కోచికి తిరుగు ప్రయాణమవుతూ బీబీసీ తెలుగు ప్రతినిధి బొల్లంపల్లి వేణుగోపాల్‌తో ఫోన్లో మాట్లాడారు.

ఆలయం వద్దకు వెళ్లడానికి ప్రయత్నించిన తమకు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయో కవిత వివరించారు.. ఆ వివరాలు ఆమె మాటల్లోనే..

శబరిమల ఆలయ ద్వారాలు తెరుస్తారని తెలిసి... మూడు రోజుల కిందట నేను అక్కడకు మా టీంతో కలిసి బయల్దేరాను. మొదట నిలక్కల్ వెళ్లాను. అది శబరిమల ఆలయానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

అక్కడి నుంచే మాకు అడ్డంకులు ఎదురయ్యాయి.

కొందరు ఆందోళనకారులు మమ్మల్ని అక్కడే ఆపేశారు. ముందుకు వెళ్తే దాడి చేస్తామని చెప్పారు. దీంతో మేం తొలి రోజు అక్కడే ఆగిపోయాం.

చివరకు రిపోర్టింగ్‌కు కూడా అనుమతివ్వలేదు. కొందరైతే... నువ్వు ఇక్కడెందుకున్నావు? వెంటనే వెళ్లిపో, లేకుంటే పరిస్థితులు దారుణంగా ఉంటాయి. కొడతాం.. చంపుతాం.. అని బెదిరించారు.

చివరకు మేం మా గదికి వెళ్లిపోయాం.

ఫొటో సోర్స్, UGC

తర్వాత రోజు పోలీసుల భద్రతతో వెళ్దామనుకున్నాం. ఉదయాన్నే పోలీసులను సంప్రదిస్తే.. వాళ్లు భద్రత కల్పిస్తామని చెప్పారు.

దీంతో రెండో రోజు కొంత మంది పోలీసుల భద్రత మధ్య మేం బయల్దేరాం. వాళ్లు మమ్నల్ని 17 కిలోమీటర్ల దూరం ముందుకు తీసుకెళ్లారు.

అక్కడితో వారి పరిధి ముగిసిపోయింది.

తర్వాత వేరే పోలీసులు వచ్చి తీసుకెళ్తారు.. వారి సాయంతో వెళ్లండని చెప్పారు.

కాని వారు రాలేదు. చివరకు పోలీసులు మమ్మల్ని నట్టనడి అడవుల్లో వదిలేసి వెళ్లిపోయేందుకు సిద్ధమయ్యారు.

మేం వెంటనే ఇక్కడ మాకు భద్రత లేదు. మీరే వేరే పోలీసులకు అప్పగించండి అని అడిగాం. దీంతో ఆ పోలీసులు మమ్మల్ని వెంటనే వెనక్కు తీసుకొచ్చారు.

మేం మళ్లీ పోలీసులకు ఫోన్ చేసి భద్రత పెంచాలని కోరాం. కాని వారు మమ్మల్ని ముందుకు తీసుకెళ్లలేదు.

అక్కడి సీఐ నంబరు ఇచ్చారు. సీఐకి కాల్ చేస్తే.. మేం మీకు భద్రత కల్పించలేం.. అని చెప్పి ఫోన్ కట్ చేశారు.

చివరకు మేం ప్రైవేటు వాహనాలు.. ఇతర మీడియా వాహనాల్లో నిలక్కల్ వరకు వెళ్లాం.

అక్కడి నుంచి మరో వాహనంలో పంపకు వెళ్లాం. అక్కడి నుంచి ఇక అయిదు కిలోమీటర్లు కాలి నడకన వెళ్లాలి.

ఫొటో క్యాప్షన్,

కవిత

ముందుగా మేం ఒక కిలోమీటరు వెళ్లాం. అక్కడ గణేశ్ ఆలయం ఉంది. ఆలోపే మాపై కొందరు ఆందోళనకారులు రాళ్లతో దాడి చేశారు. దీంతో కొంచెం భయమేసింది.

గణేశ్ ఆలయం నుంచి నాలుగు కిలోమీటర్లు ముందుకు వెళ్లాలి కనుక.. మేం మళ్లీ పోలీసుల భద్రత కోరాం.

కానీ పోలీసులు ముందుకు రాలేదు. దీంతో నేను అక్కడ నిరసన వ్యక్తం చేశాను. చివరకు ఐజీ అక్కడకు వచ్చారు.

''ఇప్పుడు చాలా చీకటి అయింది. పొదల మధ్య నుంచి రాళ్లు విసురుతున్నారు. రాత్రి ముందుకు వెళ్లడం ప్రమాదకరం. పొద్దున భద్రత ఇస్తాం'' అని చెప్పారు.

అక్కడే మహిళా కంట్రోల్ రూం ఉంటే నిన్నరాత్రి అందులో పడుకున్నాను.

ఐజీ ముందు రోజు చెప్పినట్లు ఈ రోజు నాకు భద్రత కల్పించారు.

నాతో పాటు కోచికి చెందిన రెహనా అనే మహిళ కూడా కలిశారు. దీంతో ఇవ్వాళ ఉదయం దాదాపు 100 మంది పోలీసుల భద్రతతో రెహనాతో కలిసి బయల్దేరాం.

2 కిలోమీటర్లు నడుచుకుంటూ ముందుకెళ్లాం.

పోలీసులున్నా లెక్క చేయకుండా ఆందోళనకారులు.. మాపై రాళ్లు విసిరారు. దీంతో నేను హెల్మెట్ పెట్టుకుని ముందుకు నడిచాను.

ఎవరో బలంగా రాయి విసరడంతో హెల్మెట్ ఉన్నా. చెవి దగ్గర చిన్న గాయమైంది.

పోలీసులు కాసేపు విశ్రాంతి తీసుకోమని కోరగా.. లేదు ముందుకు వెళ్దామని చెప్పి మరో రెండు కిలోమీటర్లు ముందుకు నడిచాం.

చివరకు ఆలయం సమీపించింది. 100 మీటర్ల దూరంలో ఆలయం ఉంది. అయితే అక్కడ మాకు తీవ్ర ప్రతిఘటన ఎదురైంది.

ఆందోళనకారులు.. దాదాపు 100 మంది చిన్న పిల్లలను గేటు ముందు కూర్చోబెట్టి.. 'వాళ్లను దాటి వచ్చారంటే మిమ్మల్ని చంపేస్తాం' అని బెదిరించారు.

ఫొటో సోర్స్, PTI

పోలీసులను కూడా లెక్క చేయకుండా.. ''ఆ లేడీస్ లోపలకు వస్తే చంపేస్తాం.'' అని గట్టిగా అరిచారు.

మీరు లోపలకు వెళ్లాలంటే మేం దారికి అడ్డంగా ఉన్న పిల్లలను బలవంతంగా పక్కకు లాగాల్సి ఉంటుంది. దాని వల్ల వాళ్లు గాయపడే అవకాశముందని పోలీసులు మాకు చెప్పారు.

మేం వెంటనే మీరు ఆందోళనకారులతో మాట్లాడి, పిల్లలను తప్పించమని కోరగా.. వారు వినే పరిస్థితుల్లో లేరు. మేం లాఠీ చార్జ్‌కి సిద్ధమవుతున్నామని పోలీసులు చెప్పారు.

చివరకు మేం లోపలుకు వెళ్తే.. పూజారులు కూడా పూజ చేయబోమంటున్నారని, ఆలయాన్ని మూసేస్తామంటున్నారని పోలీసులు చెప్పారు.

దీంతో నేను, రెహనా ఆ పిల్లలను దృష్టిలో పెట్టుకుని.. సామాజిక బాధ్యతతో వెనక్కు తిరిగాం.

ఆలయానికి 100 మీటర్ల దూరం వరకు వెళ్లగలగడమే మా విజయం.

సోషల్ మీడియాలోనూ మాపై ట్రోలింగ్ మొదలైంది. దీంతో నేను నా ఫేస్‌బుక్ ఖాతాను కూడా డీ యాక్టివేట్ చేయాల్సి వచ్చింది.

‘బలప్రదర్శన మాకు ఇష్టం లేదు’

ఆలయంలోకి అన్ని వయసుల వారినీ అనుమతిస్తాం కానీ కొంతమంది సామాజిక కార్యకర్తలు అక్కడ బలప్రదర్శన చేయడం తమకు ఇష్టం లేదని కేరళ మంత్రి కడకంపల్లి సురేంద్రన్ తెలిపారు.

మరోవైపు కొచ్చిలో రెహనా ఫాతిమా ఇంటిపై దాడి చేసిన గుర్తు తెలియని దుండగులు ఇంటిలో విధ్వంసం సృష్టించారు.

నల్గొండకు చెందిన కవిత మోజో టీవీ ప్రతినిధి కాగా రెహానా కోచికి చెందిన బీఎస్ఎన్‌ఎల్ ఉద్యోగి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)