లబ్‌డబ్బు: తక్కువ ఖర్చుతో... ప్రపంచాన్ని చుట్టేయండి. ఇలా...

 • 20 అక్టోబర్ 2018
ప్రపంచ పర్యాటకం Image copyright iStock

ఇప్పుడు చాలామంది భారతీయులు తమ సెలవుల్లో ప్రపంచ దేశాల్ని చుట్టేస్తున్నారు. దేశీయ ప్రయాణాలకన్నా ఇవే ఇప్పుడు ఎక్కువవుతున్నాయి. పండగల సీజన్, వింటర్ సీజన్, న్యూ ఇయర్... ఇవన్నీ ఇప్పుడు దగ్గరికొచ్చేశాయి కదా. సో.. చాలా మంది తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకునే పనిలో ఉన్నారేమో.

మొట్టమొదట మనం పర్యాటకానికి సంబంధించి చాలా పాపులర్ దేశాలేవో చూద్దాం. 'యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్' 2017లో రూపొందించిన ప్రపంచ పర్యాటక ర్యాంకింగ్స్ ప్రకారం జనాలను బాగా ఆకర్షించే దేశాల జాబితా ఇదీ...

 • ఫ్రాన్స్
 • స్పెయిన్
 • అమెరికా
 • చైనా
 • ఇటలీ
 • మెక్సికో
 • బ్రిటన్
 • టర్కీ
 • జర్మనీ
 • థాయ్‌లాండ్

ఈ మధ్య కాలంలో భారతీయ రూపాయి పతాక శీర్షికల్లో నిలిచింది. దానికి కారణం డాలర్‌తో పోలిస్తే అది క్రమంగా పతనమవుతూ ఉండటమే. అయితే మీ హాలిడేస్ ప్లాన్ చేసుకోవాలనుకుంటే... అదీ మీ జేబుపై ఎక్కువ భారం పడకుండా ప్లాన్ చేసుకోవాలనుకుంటే... కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. అందులో కొన్ని ఆప్షన్స్..

ఈ ఆప్షన్స్ ఉన్నది ఆసియా, ఆగ్నేయాసియా, యూరప్‌ దేశాల్లో... వీటిలో కొన్నింటికి వీసాల్ని ఆన్‌లైన్ ద్వారా పొందొచ్చు... మరి కొన్నింటికి వీసా ఆన్ అరైవల్ సదుపాయం కూడా ఉంది.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: తక్కువ డబ్బులతో ప్రపంచ పర్యటన

శ్రీలంక

రెండు దేశాల మధ్య చాలామంచి సాంస్కృతిక సంబంధాలున్నాయి. ఆకర్షణీయమైన సముద్రతీరాలు... అడవులు.. పర్వతాలు... టీ తోటలు ఇవన్నీ చూడాలంటే మీరు శ్రీలంకను ఎంపిక చేసుకోవచ్చు.

ఇక్కడ ఒక రూపాయికి 2.30 శ్రీలంక రూపాయలు లభిస్తాయి.

వియత్నాం

ఇక మరో అందమైన దేశం వియత్నాం. నోరూరించే వంటకాలకూ, చక్కని సంప్రదాయాలకూ, మనసును దోచే ప్రకృతి అందాలకూ ఈ దేశం పెట్టింది పేరు. ఇక్కడ కూడా భారతీయ కరెన్సీకి ఉండే హోదా పెద్దదే.... బ్యాక్‌ప్యాకర్స్‌కైతే వియత్నాం స్వర్గం లాంటిదంటే అతిశయోక్తి కాదు.

ఇక్కడ రూపాయి విలువ దాదాపు 317 వియత్నామీ డోంగ్లకు సమానం.

ఇండోనేసియా

ఇకపోతే ఇండోనేసియా... దాదాపు 13 వేల చిన్నా పెద్దా ద్వీపాల సముదాయమైన ఇండోనేసియా మిమ్మల్ని ఓ ఫాంటసీ ప్రపంచంలోకి లాక్కెళ్తుంది. ఇంకా ఇక్కడ మీకు ఎన్నో ప్రాచీన భారతీయ దేవతల మందిరాలు కూడా కనిపిస్తాయి.

భారతీయ రూపాయి విలువ 206.57 ఇండోనేసియన్ రూపాయలకు సమానం.

పరాగ్వే

మరో దేశం పరాగ్వే... గ్లోబల్ కన్సల్టింగ్ కంపెనీ మర్సర్ నిర్వహించిన ఓ సర్వే ప్రకారం ప్రపంచంలోనే అత్యంత చవక దేశం పరాగ్వే. ఇక్కడ హోటళ్లు, వంటకాలు, బీర్ అన్నీ చౌకగా లభిస్తాయి.

ఒక రూపాయికి పరాగ్వే కరెన్సీలో 80.14 గ్వారానీలు లభిస్తాయి.

కంబోడియా

పచ్చని ప్రకృతి దృశ్యాలకు పేరు గాంచింది కంబోడియా. ఇక్కడ ప్రాచీన నాగరికతల పరిమళాలను ఆస్వాదించొచ్చు. నమ్మకం కలగలేదంటే అంకోర్వాట్ ఆలయానికి వెళ్లి చూడండి... మీకే తెలుస్తుంది.

కంబోడియాలో ఒక రూపాయికి బదులుగా 55.44 రియాల్స్ లభిస్తాయి.

మంగోలియా

ఇక మంగోలియా విషయానికొద్దాం. పర్వతాలు, నదీలోయలతో పాటు ఎత్తయిన పీఠభూములకు ఈ దేశం ప్రసిద్ధి. మంగోలియాలో కూడా భారతీయ కరెన్సీ బలంగానే ఉంటుంది. సంచార జీవనం అంటే ఎలా ఉంటుందో తెలియాలంటే మీరు మంగోలియాకు వెళ్లాల్సిందే మరి.

ఇక్కడ మీకు ఒక రూపాయికి బదులుగా 33.71 మంగోలియన్ తుగ్రిక్లు ఇస్తారు.

హంగరీ

మధ్య యూరప్‌లోని దేశం హంగరీ. ఇక్కడ హోటల్‌లో స్టే చేయడానికి ఎన్నో ఆప్షన్స్ ఉంటాయి. తక్కువ ఖర్చుతో యూరప్‌లో పర్యటించాలనుకుంటే మీ ట్రావెల్ లిస్టులో తప్పక చేర్చాల్సిన దేశం ఇది.

హంగరీలో ఒక రూపాయికి బదులుగా అక్కడి కరెన్సీ విలువ ప్రకారం 3.80 ఫోరేటెలు లభిస్తాయి.

Image copyright iStock

ఐస్‌ల్యాండ్‌

ఐస్‌ల్యాండ్‌ పర్యటన ప్రతి ఒక్కరి కలగా ఉంటుందంటే ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు. మంచుతో పాటు ఇంకా ఇక్కడి చాలా అంశాలు మిమ్మల్ని ఆనందంలో ముంచెత్తుతాయి. పైగా మీ జేబుపై భారం కూడా ఎక్కువేమీ పడదు.

ఐస్‌ల్యాండ్లో మీకు ఒక రూపాయికి బదులుగా 1.58 క్రోనాలు లభిస్తాయి.

బెలారూస్

బెలారూస్ అందమైన సరస్సులకు, దట్టమైన అడవులకు, ఇంకా మరెన్నో ప్రకృతి దృశ్యాలకూ పెట్టింది పేరు. మీ సెలవులు చిరస్మరణీయంగా మిగిలిపోవాలనుకుంటే మీరు బెలారూస్ తప్పక వెళ్లాల్సిందే.

ఇక్కడి కరెన్సీలో 289 రూబుల్స్ ఒక భారతీయ రూపాయితో సమానం.

మీ సెలవుల్ని బాగా ప్లాన్ చేసుకోవడానికి ఈ సమాచారం సరిపోతుంది కదూ.

(నోట్ - భారతీయ రూపాయితో పోలిస్తే మిగతా దేశాల కరెన్సీ విలువలు 13 అక్టోబర్ 2018 నాటివి)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)