భారత్ బీచ్‌లను అణు ఇంధన కేంద్రాలుగా ఎందుకు మార్చాలనుకుంటోంది?

  • 21 అక్టోబర్ 2018
థోరియం నిక్షేపాలు రియాక్టర్ల నిర్మాణం Image copyright Getty Images

భారత దేశంలో బీచ్‌లు అనగానే మన మదిలో మెదిలేది... నీడనిచ్చే ఈత చెట్లు, కమ్మనైన సముద్రపు వంటలు, బ్యాగులు భుజాన వేసుకొని తిరిగే యాత్రికుల సమూహం. అయితే, వీటితో పాటు ఇక్కడ ఇసుక తిన్నెల్లో గుప్త నిధిని దాగి ఉంది. ఆ నిధి పేరు థోరియం.

ప్రపంచంలో అత్యధిక థోరియం నిక్షేపాలున్నది భారత సముద్ర తీరంలోనే.

దాదాపు 3 లక్షల నుంచి 8.50 లక్షల టన్నుల థోరియం నిల్వలను వాడుకునేందుకు భారత్ ఆసక్తిగా ఎదురు చూస్తోంది. అయితే, ఆ పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి.

గతేడాది డచ్ శాస్త్రవేత్తలు తొలిసారి ప్రయోగాత్మకంగా థోరియం ఆధారిత రియాక్టర్‌ను విజయవంతంగా నడిపారు. పాశ్చాత్య దేశాల్లో ఈ సాంకేతికతను బాగా ప్రోత్సహిస్తున్నారు. థోరియం రియాక్టర్‌ల అభివృద్ధికి 3.3 బిలియన్ డాలర్లను ఖర్చు చేయాలని గతేడాది చైనా తీర్మానించుకుంది.

కర్బన రహిత ఇంధన ఉత్పత్తికి థోరియం ఉపయోగపడుతుందని ప్రతిపాదకులు అంటున్నారు. అలాగే, దీని వల్ల ప్రమాదకర వ్యర్థాలు తక్కువ స్థాయిలో విడుదలవుతాయని, అణ్వాయుధాలుగా వాడుకునే అవకాశాన్ని నియంత్రించవచ్చని చెబుతున్నారు. అయితే, పునర్వినియోగ ఇంధనాల ఉత్పత్తి చాలా ఖర్చుతో కూడిన అభివృద్ధి ప్రక్రియ. అంతేకాదు థోరియం ఆధారిత అణురియాక్టర్లు ఎంతవరకు సురక్షితం, భవిష్యత్తులో వీటిని వాణిజ్య పరంగా ఉపయోగించవచ్చా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

థోరియంను భారత్ ఉపయోగించుకోవాలనుకోడానికి అనేక చారిత్రక, భౌతిక కారణాలు కనిపిస్తున్నాయి. దేశానికి సుస్థిరమైన ఇంధనాన్నిచ్చే వనరుగా థోరియం కనిపిస్తోంది. 2060లో దేశ జనాభా 170 కోట్లకు చేరే అవకాశం ఉంది. అప్పటి అవసరాలను తీర్చాలంటే దీర్ఘకాలంలో కర్బన రహిత ఇంధనం కోసం థోరియంపై ఆధారపడాల్సిందేనని దేశంలోని అణు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఇంధన కొరతను అధిగమించాలంటే అణు ఇంధన వ్యవస్థపై ఆధారపడాలని ఇండియా భావిస్తోంది. కర్నాటకలోని కైగాలో ఇప్పటికే నాలుగు హెవీ వాటర్ రియాక్టర్లను ఏర్పాటు చేసింది.

''ఇంధన కొరతను తీవ్రంగా ఎదుర్కొంటోన్న దేశం మాది'' అని.. 2012 వరకు భారత అణుశక్తి సంస్థకు కార్యదర్శిగా పనిచేసిన శ్రీకుమార్ బెనర్జీ తెలిపారు.

''దేశంలో ఐదో వంతు మంది అవసరాలను తీర్చాలన్నా, దీర్ఘకాల సుస్థిర అభివృద్ధికి పాటుపడాలన్నా సంప్రదాయ ఇంధన వనరులపై కూడా ఆధాపడాల్సిందే''నని ఆయన చెప్పారు.

పాశ్చాత్య దేశాల్లో అణుశక్తి అభివృద్ధి అంటే అణ్వాయుధాల తయారీ కూడా అందులో భాగమే. ప్రస్తుతం అన్ని వాణిజ్య అణురియాక్టర్లు యురేనియం ఆధారితమే. యురేనియం ఉపఉత్పత్తులతో అణ్వాయుధాలను తయారు చేయడం తేలికైన పని.

''1950లలో యురేనియం కాకుండా థోరియం ఆధారంగా పరిశోధనలు సాగిస్తే ఓ భిన్న శకంలో ఉండేవాళ్లం, అనేక అవకాశాలు మన ముందుండేవి'' అని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ న్యూక్లియర్ ఇంజినీర్ జియోఫ్ పార్క్స్ అన్నారు.

అనేక వ్యూహాత్మక సమీకరణలతో భారత పరిపాలన కొనసాగుతోంది. భారత అణుశాస్త్ర పితామహుడు హోమీ జహంగీర్ బాబా ఒప్పించడంతోనే భారత ప్రభుత్వం అణు కార్యక్రమాలకు ఆమోదం తెలిపింది. దీంతో దేశంలో ఉన్న కొద్దిపాటి యురేనియం నిల్వలను ఉపయోగించుకోడానికి మార్గం దొరికింది. అయితే, దేశంలో దీర్ఘకాలిక ఇంధన అవసరాలను తీర్చాలంటే సమృద్ధిగా లభించే థోరియంపై ఆధారపడాలని బాబా ఎప్పుడో చెప్పారు.

థోరియం సహజంగా విచ్ఛన్నం చెందలేదు. అందులోని పరమాణు కేంద్రాకాన్ని విచ్ఛిత్తి చెందించినప్పుడు శక్తి విడుదల చేస్తుంది. ఆ శక్తితో విద్యుత్‌ను ఉత్పత్తి చేయొచ్చు. మిగిలిన అవశేషాల నుంచి వచ్చే ఆల్ఫా రేడియేషన్ మోతాదు అతి సూక్ష్మంగా ఉంటుంది. మానవ శరీరంలోకి కూడా అది వెళ్లలేదు. అందువల్ల థోరియం ఎక్కువగా ఉన్న బీచ్‌లకి వెళ్లడానికి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక అణు శక్తి కార్యక్రమాలు భారత్‌లో వివాదాస్పదమవుతున్నాయి. అయితే ఇంధన అవసరాలు తీర్చాలంటే అణుకార్యక్రమాలను కొనసాగించాల్సిందేనని ప్రభుత్వం భావిస్తోంది.

థోరియం అణు ఇంధనంగా మారాలంటే అది ప్లుటోనియం తరహా విచ్ఛిత్తి చెందే మూలకాలతో కలవాల్సి ఉంటుంది. ప్లుటోనియం విచ్ఛిత్తి చెందినప్పుడు న్యూట్రాన్లను విడుదల చేస్తుంది. వాటిని థోరియం అణువులు గ్రహించి U233(విచ్ఛిత్తి ఐసోటోప్)గా మారుతాయి. ఒకే పరమాణు సంఖ్య, భిన్న ద్రవ్యరాశి సంఖ్యలను కలిగిన పరమాణువులను ఐసోటోపులు అంటారు.

''థోరియం తడి కలపలాంటిది. అది వెంటనే మండదు. కానీ, ఎండిన కలపతో దాన్ని కలిపి మండిస్తే చక్కగా వెలుగునిస్తుంది'' అని మాజీ డీఏఈ కార్యదర్శి రతన్ కుమార్ సిన్హా వివరించారు. విస్తారమైన థోరియం నిక్షేపాలను విచ్ఛిత్తి పరమాణువులుగా మార్చడమే భారత్ అణు కార్యక్రమంలో తొలి రెండు దశల ప్రధాన ఉద్దేశం అని తెలిపారు.

మొదటి దశలో సంప్రదాయ యురేనియం ఆధారిత రియాక్టర్లు ప్లుటోనియంను ఉపఉత్పత్తిగా విడుదల చేస్తాయి. రెండో దశ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్‌లో యురేనియం మరింత ఎక్కువ స్థాయిలో ప్లుటోనియంను విడుదల చేస్తాయి. ఇలా విడుదలైన ప్లుటోనియంతో మరిన్ని రియాక్టర్లను నిర్మిస్తారు. తర్వాత దశలో థోరియం విచ్ఛిత్తికి ఉపయోగపడే U233గా మార్చేందుకు వినియోగిస్తారు. చివరి దశలో థోరియం.. U233తో కలిసి నిరంతరాయంగా పనిచేసే థర్మల్ బ్రీడర్ రియాక్టర్‌గా మారుతుంది. దీనిలో ముడి థోరియంను ఇంధనంగా ఉపయోగిస్తారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక పునరుత్పాదక ఇంధన వనరులపైనా భారత్ దృష్టిసారిస్తోంది. ప్రపంచంలో పవన విద్యుత్ ఉత్పత్తిలో భారత్ ముందువరసులో ఉంది.

అణ్వాయుధాల తయారీకే భారత్ యురేనియంపై దృష్టి పెడుతోందని పాశ్చాత్య దేశాలు భావించాయి. అందుకే భారత్ అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంపై సంతకం చేయకుండా నిరాకరించిందని అనుకున్నాయి. దీంతో దశాబ్దాల పాటు అణు సాంకేతిక పరిజ్ఞానం భారత్‌కు అందకుండా పోయి ఒంటరిగా మిగిలింది.

''అణ్వస్త్ర పరిజ్ఞానం అందకుండా ఆంక్షలు ఉన్నప్పటికీ 2008లో భారత్- అమెరికాల మధ్య 'పౌర అణు ఒప్పందం' కుదరడం ఓ ముఖ్యమైన ముందడుగు. ఇది భారత్ అణు కార్యక్రమాన్ని వేగవంతం చేసింది'' అని సిన్హా వివరించారు.

1970వ దశకంలో భారత్ యురేనియం ఆధారిత ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్(పీహెచ్‌డబ్ల్యూఆర్)ను అభివృద్ధి చేసిన సమయంలోనే దేశంలో మొదలైన రెండో దశ అణు కార్యక్రమమే ఇంకా కొనసాగుతోంది.

ప్రయోగాత్మక బ్రీడర్ రియాక్టర్ 1985లో అందుబాటులోకి వచ్చింది. 40 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి దిశగా దీన్ని రూపొందించినప్పటికీ ఇప్పటి వరకు ఆ స్థాయిలో ఈ రియాక్టర్ ఉత్పత్తి చేయలేదు. 500 మెగావాట్లు లక్ష్యంగా నిర్మిస్తోన్న ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ (పీఎఫ్‌బీఆర్) ఈ ఏడాది చివరినాటికి అందుబాటులోకి రానుంది.

థోరియం ఆధారంగా పనిచేసే భారత తొలి అణు రియాక్టర్ అడ్వాన్స్‌డ్ హెవీ వాటర్ రియాక్టర్ (ఏహెచ్‌డబ్ల్యూఆర్) డిజైన్ పూర్తయింది. దీన్ని నిర్మించే దశ కొనసాగుతోంది. ''భారత మూడో దశ అణు కార్యక్రమానికి ఈ ప్రాజెక్టు బ్లూప్రింట్ కాదు'' అని ఈ డిజైన్‌కు నాయకత్వం వహించిన సిన్హా తెలిపారు.

భారత్ తన అణుసామర్థ్యంతో ఎంత ప్రయత్నించినా 2050 వరకు థోరియం నుంచి భారీ స్థాయిలో ఇంధనం ఉత్పత్తి చేయటం సాధ్యం కాదు. మిగిలిన దేశాలు ఆ స్థాయిలో కూడా ఉండవు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక యురేనియం రియాక్టర్ ఏర్పాటును నిరసిస్తూ తమిళనాడులో తీవ్రస్థాయిలో ఆందోళనలు జరిగాయి.

''70 ఏళ్ల నుంచి థోరియం గురించి మాట్లాడుకుంటున్నాం. భవిష్యత్తులో కూడా మాట్లాడుకుంటాం'' అని కెనడాలోని బ్రిటిష్ కొలంబియా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ ఎంవీ రమణ అన్నారు. భారత్ అణు విధానంపై ఈయన అనేక పుస్తకాలు రాశారు.

థోరియం గురించి ఉన్న ఒక ఉపయోగం తరచుగా వినిపిస్తూనే ఉంది. థోరియం ఆధారిత రియాక్టర్లు కరిగిపోయే ప్రమాదం చాలా తక్కువస్థాయిలో ఉంటుంది.

సంప్రదాయ అణు ఇంధన కార్యక్రమాలు ఆర్థికంగా అంత లాభసాటి కాదు. ఈ పరిస్థితుల్లో థోరియం ఆధారిత రియాక్టర్ల వైపు వెళ్లాల్సిందేనని రమణ చెప్పారు.

పెరుగుతున్న విద్యుత్ అవసరాల దృష్ట్యా పూర్తిస్థాయిలో థర్మల్ విద్యుత్‌పై ఆధారపడటం తగ్గించుకోవాలని భారత్ ప్రయత్నిస్తోందని, పునరుత్పాదక ఇంధన వనరులపై దృష్టిపెడుతోందని అటామిక్ ఎనర్జీ కమిషన్ చైర్మన్ అనిల్ కకోద్కర్ తెలిపారు.

2022 నాటికి 175 గిగావాట్ల పునరుత్పాదక ఇంధనాన్ని సృష్టించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే భారత్ పవన విద్యుత్‌లో ప్రపంచంలో నాలుగో స్థానంలో, సౌర విద్యుత్‌లో 5వ స్థానంలో ఉంది. అయితే, ఈ రెండింటితో భారత్ ఇంధన అవసరాలు తీరవు.

''ఈ తరుణంలో అణు విద్యుత్ ఉత్పత్తి ఒక్కటే మార్గం. అందునా థోరియం ఆధారిత రియాక్టర్ల ఏర్పాటు ఇండియాకు చాలా అవసరం'' అని కకోద్కర్ అభిప్రాయపడ్డారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక దేశంలోని మొత్తం థోరియం నిల్వల్లో 16 శాతం ఒక్క కేరళలోని అందమైన సముద్ర తీరాల్లోనే ఉన్నాయి.

ఒకే రంగం మీద ఇండియా తన శక్తినంతా కేంద్రీకరించాలనుకోవడం లేదు. అందుకే పవన, సౌర విద్యుత్ ఉత్పత్తిని కూడా కొనసాగిస్తోంది. ఇప్పటి వరకు దేశంలో 22 రియాక్టర్లు ఉన్నాయి. మరో 9 నిర్మాణంలో ఉన్నాయి. వీటికి తోడుగా మరో 12 రియాక్టర్ల నిర్మాణానికి భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అలాగే, అత్యాధునిక రియాక్టర్ల నిర్మాణానికి రష్యా, అమెరికా, ఫ్రాన్స్‌లతో ఒప్పందం చేసుకుంటోంది.

ఇంధన అవసరాలు పెరుగుతోన్న నేపథ్యంలో యురేనియం ఆధారిత సాంకేతిక వ్యవస్థను భారత్ కొనసాగిస్తోంది.

అయితే, పెరుగుతున్న అవసరాల దృష్ట్యా దేశంలో సమృద్ధిగా లభిస్తున్న, నమ్మదగిన థోరియం వైపు చూడాల్సిందే అని కకోద్కర్ తెలిపారు.

''కర్బన రహిత ఇంధన ప్రపంచంలోకి నిజంగా వెళ్లానకుంటే అణు రియాక్టర్లు లేకుండా అది సాధ్యం కాదు. థోరియంను ఉపయోగించుకోకపోతే అణుఇంధన ప్రక్రియ అభివృద్ధి చెందదు. అందుకే ఎవరో ఒకరు ముందుకొచ్చి థోరియం ఆధారిత అణుఇంధన ప్రక్రియకు నాయకత్వం వహించాలి'' అని కకోద్కర్ అన్నారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)