హిట్ మ్యాన్ రోహిత్ శర్మ లాంగ్ ఇన్నింగ్స్ రహస్యమేంటి?

  • 17 జూన్ 2019
రోహిత్ శర్మ Image copyright Getty Images

ఒకప్పుడు సునీల్ గవాస్కర్.. ఆయన తర్వాత సచిన్ తెందూల్కర్.. విరాట్ కోహ్లీ.. అలాగే టీమిండియాకు దొరికిన మరో స్టార్ రోహిత్.

గవాస్కర్ కాలంలో గుండప్ప విశ్వనాథ్ ఫ్లిక్ షాట్‌లకు పెట్టింది పేరు. విధ్వంసకర బ్యాట్స్‌మెన్‌గా సెహ్వాగ్ పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు వన్డేల్లో రోహిత్ కూడా లాంగ్ ఇన్నింగ్స్‌లో సత్తా చాటుతున్నాడు.

అంతర్జాతీయ వన్డేలలో అత్యధిక వ్యక్తిగత స్కోరు (264) చేసిన రికార్డు రోహిత్ శర్మ పేరిటే ఉంది. 2014 నవంబర్ 13వ తేదీన కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ ఈ రికార్డు నమోదు చేశాడు.

అంతకు ముందు 2013 నవంబర్ 2న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ 209 పరుగులు చేశాడు.

తర్వాత 2017 డిసెంబర్ 13వ తేదీన శ్రీలంకతో మోహాలీలో జరిగిన మ్యాచ్‌లో కూడా రోహిత్ శర్మ 208 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

వన్డేల్లో టాప్ 10 అత్యధిక వ్యక్తిగత స్కోర్లు.. సాధించిన బ్యాట్స్‌మెన్

అత్యధిక వ్యక్తిగత స్కోరు బ్యాట్స్‌మన్ (దేశం) ప్రత్యర్థి తేదీ స్టేడియం
264 రోహిత్ శర్మ (భారత్) శ్రీలంక 13 నవంబర్ 2014 కోల్‌కతా
237 నాటౌట్ మార్టిన్ గుప్తిల్ (న్యూజీలాండ్) వెస్టిండీస్ 21 మార్చి 2015 వెల్లింగ్టన్
219 వీరేంద్ర సెహ్వాగ్ (భారత్) వెస్టిండీస్ 8 డిసెంబర్ 2011 ఇండోర్
215 క్రిస్ గేల్ (వెస్టిండీస్) జింబాబ్వే 24 ఫిబ్రవరి 2015 కాన్‌బెర్రా
210 నాటౌట్ ఫఖర్ జమాన్ (పాకిస్తాన్) జింబాబ్వే 20 జూలై 2018 బులవాయో
209 రోహిత్ శర్మ (భారత్) ఆస్ట్రేలియా 2 నవంబర్ 2013 బెంగళూరు
208 నాటౌట్ రోహిత్ శర్మ (భారత్) శ్రీలంక 13 డిసెంబర్ 2017 మొహాలీ
200 నాటౌట్ సచిన్ తెందూల్కర్ (భారత్) దక్షిణాఫ్రికా 24 ఫిబ్రవరి 2010 గ్వాలియర్
194 నాటౌట్ చార్లెస్ కోవెంట్రీ (జింబాబ్వే) బంగ్లాదేశ్ 16 ఆగస్టు 2009 బులవాయో
194 సయీద్ అన్వర్ (పాకిస్తాన్) భారత్ 21 మే 1997 చెన్నై
Image copyright Getty Images
చిత్రం శీర్షిక సునీల్ గవాస్కర్

రోహిత్ కాకుండా వన్డేల్లో ద్విశతకాలు సాధించిన భారత ఆటగాళ్లు సచిన్ తెందుల్కర్, వీరేంద్ర సెహ్వాగ్.

అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో తొలి డబుల్ సెంచరీ నమోదైంది మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్ పేరిటే. 2010 ఫిబ్రవరి 24న దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో సచిన్ సరిగ్గా 200 పరుగులు చేశాడు.

ఆ తర్వాత 2011లో వెస్టిండీస్‌తో జరిగిన పోరులో వీరేంద్ర సెహ్వాగ్ 219 పరుగుల చేసి ఔరా! అనిపించాడు.

Image copyright NOAH SEELAM/AFP/Getty Images

'నాకంత పవర్ లేదు'

ఇంత లాంగ్ ఇన్నింగ్స్‌ ఎలా ఆడగలుగుతున్నారు? ఈ క్రికెటర్ల ఆట వెనుక ఉన్న రహస్యం ఏమిటి? అన్నది చాలా మంది మెదళ్లను తొలిచే ప్రశ్న.

మొహాలీ వేదికగా మూడో ద్విశతకం సాధించిన సందర్భంగా రోహిత్ ఇలా సమాధానం చెప్పాడు.

"ప్రారంభంలో పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. అందువల్ల నిలదొక్కుకునేందుకు కొంత సమయం తీసుకోవాలనుకున్నా. నేను ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్, మహేంద్ర సింగ్ ధోనీ లాంటి వాడినేమీ కాదు. నాకు అంత పవర్ లేదు."

Image copyright Getty Images

"ఫీల్డ్‌లో పరిస్థితులకు అనుగుణంగా వ్యూహం అనుసరించేందుకు కొంచెం బుర్ర ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఆట కోసం నా శక్తి మేరకు ప్రయత్నిస్తుంటాను" అని రోహిత్ చెప్పుకొచ్చాడు.

ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ 140 పరుగులు చేశాడు. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటికే రెండు శతకాలు, ఒక అర్ధ శతకం సాధించాడు.

Image copyright Getty Images

ఇటీవల రోహిత్ మాట్లాడుతూ.. ఫోర్లు, సిక్సులు అలా బాదడం సులువైన పనేమీ కాదని అన్నాడు.

"సిక్సులు కొట్టడం అంత సులువేమీ కాదు. ఎంతో ప్రాక్టీస్, హార్డ్ వర్క్ చేస్తేనే అది సాధ్యమవుతుంది. క్రికెట్‌లో ఏదీ సులువు కాదు. టీవీలో చూస్తుంటే అది సులువుగానే కనిపించొచ్చు!"

Image copyright AFP

వంద దాటితే ఆగడు!

రోహిత్ తన పన్నెండేళ్ల కెరీర్‌లో 24 శతకాలు సాధించాడు. అందులో మూడింటిని 200 మార్కును దాటించాడు.

ఇటీవల డబుల్ సెంచరీలే కాకుండా, గతంలో 171, 152, 150, 147, 140.. పరుగులు కూడా చేశాడు. దీన్ని బట్టి చూస్తే 100 పరుగుల మార్కును చేరుకున్న తర్వాత, రోహిత్ అంత సులువుగా క్రీజు నుంచి బయటకొచ్చే రకం కాదని అర్థం చేసుకోవచ్చు.

పరుగుల వేగంలో సచిన్, కోహ్లీ, ధోనీల బాటలోనే రోహిత్ వెళ్తున్నాడని చెప్పుకోవచ్చు.

ఏ బంతిని షాట్ కొట్టాలి? ఏ వైపున బౌండరీ దాటించాలి? అని ఆలోచించడంలో రోహిత్ దిట్ట. అసాధ్యమనుకునే షాట్‌తోనూ సులువుగా సిక్స్‌లు ఖాతాలో వేసుకుంటాడు.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు

ఈ కథనం గురించి మరింత సమాచారం