తిత్లీ తుపాను: ‘శ్రీకాకుళం జిల్లాను 20 ఏళ్లు వెనక్కు నెట్టింది’ : BBC Ground Report

  • 23 అక్టోబర్ 2018
తిత్లీ తుపాను బాధితురాలు

"నేను, మా అమ్మ తిత్లీ తుపాను వల్ల జరిగిన నష్టాన్ని చూసేందుకు 19వ తారీఖున మా తోటకు వెళ్లాము. అక్కడకు వెళ్ళగానే, అమ్మ ఏడుస్తూ కుప్పకూలిపోయింది. అమ్మను ఇంటికి పంపేసి, రెండు గంటల తరువాత నేనూ వెళ్లాను.. అప్పటికే మా అమ్మ దూలానికి ఏలాడుతోంది! నేను ఆలస్యం చేశాను" అని ఏడుస్తూ ఉండిపోయాడు వెంకటేష్.

55 సంవత్సరాల నారాయణమ్మ తన రెండు గదుల ఇంట్లో ఉరి వేసుకొని చనిపోయింది. ఆమె పెద్ద కొడుకు వెంకటేష్ ముంబైలోని ఒక ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నారు.

"తుపాను వచ్చిన తరువాత అమ్మ ఫోన్ చేసింది. నాకు డబ్బు ఏర్పాటు అయ్యి, సెలవు దొరికేసరికి కాస్త సమయం పట్టింది. తుపాను వచ్చిన వారం రోజులకు ఇంటికి వచ్చాను. తుపాను తరువాత తోటకి వెళ్లలేకపోయానని అమ్మ ఫోన్లో చెప్పింది."

నారాయణమ్మకు ఉన్న 2.5 ఎకరాల కొబ్బరి, జీడీ మామిడి తోటలే జీవనాధారం అని ఆమె మేనల్లుడు చెప్పారు.

"మా మామయ్యకి బ్రెయిన్ ట్యూమర్ ఉండేది. 2011లో ఆయన కాలం చేశారు. కానీ ఆయన వైద్య ఖర్చుల కోసం తోటపై అప్పు చేశారు. అది ఇంకా తీర్చలేదు. ఇద్దరు కొడుకులు వేరే ఊళ్ళో పని చేస్తున్నారు. ఆ సంపాదన వారి పోషణకు సరిపోతుంది. ఈ తోటపై వచ్చే ఆదాయం.. చేసిన అప్పులు తీర్చడానికి, మా అత్త ఖర్చులకు సరిపోయేది. ఇప్పుడు ప్రపంచం తలకిందులు అయ్యిపోయింది" అని తెలిపారు మేనల్లుడు సైనా కేశవ రావు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: ఇది తిత్లీ తుపాను రాసిన విషాదం గీతం

నారాయణమ్మలాగ శ్రీకాకుళం జిల్లాలోని వేల మంది రైతులు, తమ జీవనాధారమైన కొబ్బరి, జీడీ మామిడి, వరి పంటలు నాశనం కావటంతో విషాదంలో మునిగిపోయారు.

అక్టోబర్ 11న ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళంతోపాటు ఒడిశా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తిత్లీ తుపాను విధ్వంసం సృష్టించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అంచనాల ప్రకారం 14,000 హెక్టార్లలో కొబ్బరి తోట, 1800 హెక్టార్లలో జీడి మామిడి, 2 లక్షల హెక్టార్లలో వరి పంట తుపాను ధాటికి దెబ్బతింది.

శ్రీకాకుళం జిల్లాలోని 1,114 ఊళ్లు తిత్లీ తుపానులో చిక్కుకున్నాయి. దాదాపు 600 ఊళ్లలో విద్యుత్ సరఫరా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఒడిశాలో 7,000 గ్రామాలు తుపాను ప్రభావానికి లోనైనట్లు అధికారులు తెలిపారు.

‘బీబీసీ న్యూస్ తెలుగు’ బృందం శ్రీకాకుళం లోని తుపాను ప్రభావిత సోంపేట, కవిటి, వజ్రపుకొత్తూరు, పలాస మండలాలకు వెళ్లి అక్కడి ప్రజలతో మాట్లాడింది. ఈ గ్రామాలకు వెళ్లే దారిలోనే మాకు తుపాను తాలూకు బీభత్సం కనిపించింది. తోటల్లో చెట్లు పడిపోయాయి. విద్యుత్ స్తంభాలు వరి పొలాల్లో పడిపోయి, కరెంటు తీగలు చెట్ల కొమ్మలకు చుట్టుకొన్నాయి.

సోంపేట మండలం గొల్లగండి గ్రామంలో మా కారు కనిపించగానే, ప్రభుత్వ అధికారులు వచ్చారు అనుకొని గ్రామస్థులు మా వద్దకు వచ్చారు.

"ఇప్పటిదాక మేము బతికున్నామా లేదా అని అడిగేందుకు ఎవరూ రాలేదు. మా పొలం పత్రాలు పట్టుకొని ఎదురు చూస్తున్నాము" అని అలసటగా చెప్పింది తులసమ్మ.

అక్కడే ఉన్న మరి కొందరు మహిళలు వరి పంట నష్టాలను చెప్పేందుకు వచ్చారు. తుపాను వచ్చిన రాత్రిని గుర్తు చేసుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు.

"చాలా పెద్ద శబ్దం చేస్తూ గాలులు పెద్దగా వీస్తూ ఉండినాయి. నేను భయంతో లోపలే ఉండిపోయాను. బయట చెట్లు పడిపోతున్న శబ్దం, బకెట్లు ఎగిరి పడుతున్న శబ్దం వినిపిస్తూ ఉండింది. ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నాను. కరెంటు కూడా లేదు" అని 70 సంవత్సరాల ధనమ్మ తెలిపారు.

తన నలభై సెంట్ల పొలంలో ఒక్క చెట్టు కూడా మిగలలేదని, చీర కొంగుతో కన్నీళ్లు తుడుచుకుంటూ.. "ఆ కొబ్బరి చెట్లే వచ్చే రెండు తరాలకు జీవనాధారం" అన్నారు.

ఇంతలో అటుగా వెళ్తున్న కొబ్బరి రైతు వెంకట రావు, కళ్లల్లో ఉబుకుతున్న కన్నీళ్లను తుడుచుకుంటూనే తన చేతిలోని కొబ్బరి బోండాన్ని కొట్టి అక్కడ ఉన్న మహిళలకు ఇచ్చారు.

"ఇదే నా తోటలోని ఆఖరు కొబ్బరి బొండాం. మరో 15 ఏళ్ల వరకూ నా పొలంలో కొబ్బరి బోండాలు ఉండవు!" అన్నారు.

వెంకట రావుకు 2 ఎకరాల కొబ్బరి, 1.5 ఎకరాల జీడిమామిడి, 50 సెంట్లలో వరి ఉంది. కొబ్బరి మీద రెండు నెలలకు ఒకసారి రూ.50,000, జీడిమామిడి తోటపై సంవత్సరానికి రూ.75,000, అలాగే వరి పంటలో 15 బ్యాగుల దిగుబడి వచ్చేది.

"కొబ్బరి చెట్లకు 12-15 ఎళ్లు వచ్చే వరకు వాటికి తగినంత నీరు, సరైన పోషణ అందిస్తాం. ఎకరాకు 100-150 మొక్కలు నాటుతాం. పంట చేతికి రావడానికి 12 - 15 సంవత్సరాలు పడుతుంది. రెండు నెలలకు ఒకసారి దింపులు (బోండాల కోత) తీస్తారు. ప్రతి ఎకరానికి దాదాపు 400 కాయలు వస్తాయి. నా తోటలో నాకంటే పెద్ద వయసున్న చెట్లు ఉన్నాయి. నా వయసు ఇప్పుడు 42సంవత్సరాలు. ఇప్పుడు మీరే చెప్పండి.. మొత్తం తోట నాశనం అయిపోతే నేను ఎలా బతికేది? నా పిల్లలను చదివించుకుందాం అనుకున్నాను. నేను కన్న కలలు అన్నీ ఒక్కసారిగా చెదిరి పోయాయి" అని వెంకట రావు తల పట్టుకున్నారు.

మేం పర్యటించిన ఇతర గ్రామాల్లో కూడా తుపాను విధ్వంసం ఇలానే ఉంది. కవిటి మండలం మాణిక్యపురంలో 80 శాతం మంది గిరిజనులే.. వారంతా రోజువారీ కూలి, చేపలు పట్టడంపై ఆధారపడ్డవారు.

1950కి ముందు ఈ గ్రామం ఒడిశాలోని గంజాం జిల్లాలో ఉండేది. దీంతో ఈ ఊరి వాళ్లు తెలుగు, ఒరియా రెండు భాషలూ మాట్లాడతారు. ఈ గ్రామంలో సొంత భూమి ఉన్న రైతులు చాలా తక్కువనీ, వారికి కూడా చాలా చాలా తక్కువ విస్తీర్ణంలో భూములున్నాయని చెప్పారు ఈ గ్రామ మాజీ సర్పంచ్ దేవరాజు.

"మాలో చాలా మంది వ్యవసాయ కూలీలు. మేం వేరే వాళ్ల పొలాల్లో పనులకు వెళ్తాం. కానీ ఇప్పుడా రైతులే కష్టాల్లో ఉన్నారు. మరోవైపు ప్రభుత్వం వచ్చే మూడేళ్ల పాటు ఉపాధి హామీ పథకం కింద సహాయం అందిస్తామని ప్రకటించింది. కానీ ఆ డబ్బు మా అకౌంట్లోకు వస్తాదన్న నమ్మకం లేదు" అన్నారు దేవరాజు.

"మా దగ్గర చాలా చిన్న రైతులున్నారు. ముందు మేం పొలాలు బాగు చేసుకొని అంట్లు నాటాలి. ఇప్పుడు ప్రభుత్వం డబ్బు రైతు ఖాతాలో వేస్తుందా? కూలీ ఖాతాలో వేస్తుందా?’’ అంటూ ప్రశ్నించారు పక్కనే ఉన్న మరో రైతు.

తీరంలో ఉన్న ఇడువాని పాలెం అనే మరో మత్స్యకార గ్రామం తుపానులో దారుణంగా దెబ్బతింది. కిడ్నీ బాధిత గ్రామాల్లో ఇదొకటి.

"మేం సముద్రంలో వేటకు వెళ్లకూడదని చెప్పారు. కానీ తుపాను ఇంత తీవ్రంగా ఉంటుందనుకోలేదు. మా ఇళ్ల కప్పులు ఎగిరిపోయాయి. మేం కట్టుబట్టలతో మిగిలాం" అని చెప్పారు వామాక్షి.

ఊరి మధ్యలో గ్రామస్తులంతా కూర్చుని భోజనాలు వండుతున్నారు. 42 ఏళ్ల కళమ్మ ఈ గ్రామంలో చాటింపు వేసే మహిళ. కిడ్నీ సమస్యతో బాధపడే ఆమె అత్తగారు చనిపోయారు.

"ఆమె ముసలది. ఈ బాధను భరించలేకపోయింది. దానికి తోడు తుపానుకు చాలా భయపడింది. తుపాను వస్తుందని డప్పు తీసుకుని గ్రామం అంతా చాటింపు వేశా. ఇళ్ళల్లోనే ఉండాలని చెప్పాను. కానీ గాలి ఇంటి కప్పులనే లేపేసింది’’ అని కళమ్మ అన్నారు.

వలసలే పరిష్కారమా?

1996, 1999, 2014 సంవత్సరాల్లో ఉత్తరాంధ్ర తుపాన్లను చూసింది. ఆంధ్ర రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడ్డ ఏడు జిల్లాల్లో శ్రీకాకుళం ఒకటి. ఈ తుపానులు చేసిన విధ్వంసాలకు ఈ ప్రాంతానికి చెందిన చాలా మంది వలస కూలీలుగా మారిపోయారని పర్యావరణ పరిరక్షణ సమితి సభ్యులు డిల్లీ రావు అన్నారు.

"పర్యావారణం ఈ ప్రాంత అభివృద్ధిపై ప్రభావం చూపింది. దీంతో ఇక్కడ సామాజిక నిర్మాణంలో చాలా మార్పులొచ్చాయి. చాలా గ్రామాల్లో ఆడవారు కొబ్బరి, జీడిమామిడి తోటలపై ఆధారపడి బతికే పరిస్థితి ఉంది. మగవాళ్లంతా సూరత్, ముంబై, విజయవాడ, హైదరాబాద్‌ నగరాలకు వలస పోయారు. దీంతో ఇక్కడ చాలా వరకూ రైతులంతా ఒంటరి మహిళలే.." అంటూ స్థానిక పరిస్థితిని వివరించారు స్వయంగా రైతు అయిన డిల్లీ రావు.

ఈ ప్రాంతంలోని మాగాణి భూముల్లో థర్మల్ విద్యుత్ కేంద్రం పెట్టాలన్న నాగార్జున కన్‌స్ట్రక్షన్ కంపెనీకి వ్యతిరేకంగా పోరాడిన 30 గ్రామాల రైతులే, ఇప్పుడు ఈ తుపానులో దెబ్బతిన్నారు. 2008లో వీరి నిరసనలు పోలీసు కాల్పులకు దారి తీశాయి.

"పర్యావరణాన్ని దెబ్బతీస్తుందనే కారణంతోనే ఆ ప్లాంటుకు వ్యతిరేకంగా ఆందోళనలు జరిగాయి. స్థానిక మత్స్యకారులకు ఈ భూములే జీవనాధారం. అంతేకాదు మంచినీటి కోసం స్థానికులు ఈ భూములపైనే ఆధారపడతారు" అని డిల్లీ రావు అన్నారు.

తుపాన్లు, ఇతర ప్రకృతి విపత్తులకు భూతాపం (గ్లోబల్ వార్మింగ్) కూడా ఒక ముఖ్య కారణం అంటున్నారు పర్యావరణవేత్తలు. గ్రీన్ హౌజ్ వాయువుల, ఏరోసోల్స్‌లో ఉండే అసమానతల వల్ల ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయన్నారు డా.కె.బాబు రావు అనే పర్యావరణవేత్త.

ఆ శక్తి నీటిలో నిల్వ ఉంటుంది. వేడెక్కిన నీళ్లు ఎక్కువ శక్తివంతంగా ఉంటాయి. హైడ్రోలాజికల్ సైకిల్‌లో ఇది తీవ్ర వర్షపాతానికి దారి తీస్తుంది. ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ వాతావరణ మార్పులపై ఇచ్చిన నివేదిక కూడా ఇదే విషయాన్ని చెబుతోంది" అన్నారాయన.

తిత్లీ తుపాను ఈ జిల్లాను అభివృద్ధి పరంగా 20 ఏళ్లు వెనక్కు నెట్టిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.

"కొబ్బరి పంట చేతికందడానికి పదిహేనేళ్లు పడుతుంది. మేం ఇప్పటి వరకూ దాని మీద వచ్చే ఆదాయంతోనే బతికేస్తున్నాం. మేం లోన్లు కూడా తీసుకున్నాం. మేం ఇప్పుడు ఏం తినాలి? వచ్చే 15 ఏళ్లు పెట్టుబడి ఎలా పెట్టాలి? మేం చావనైనా చావాలి లేదా వేరే ఊర్లకు వలసలైనా పోవాలి. కానీ ఈ వయసులో ఎక్కడికి వెళ్తాం’’ అని ప్రశ్నించారు 56 ఏళ్ల బాపనమ్మ.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

LIVE: ‘దిల్లీ హింసపై మాట్లాడను.. భారత్‌లో ప్రజలకు మత స్వేచ్ఛ ఉండాలని మోదీ కోరుకుంటున్నారు’ - డోనల్డ్ ట్రంప్

కరోనావైరస్ - ‘మహమ్మారిగా మారకముందే ఎదుర్కోండి’ - ప్రపంచ దేశాలకు డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక

దిల్లీ హింస: సీఏఏ వ్యతిరేక హింసాత్మక ఘర్షణల్లో 10కి చేరిన మృతుల సంఖ్య

BBC Indian Sportswoman of the Year 2019: విజేత ఎవరో మార్చి 8న ప్రకటిస్తాం

దిల్లీ హింస: ముస్లింలు అధికంగా ఉండే ఈ ప్రాంతంలో హింసకు కారకులెవరు.. ప్రత్యక్ష సాక్షులు ఏం చెబుతున్నారు

డయానా నుంచి ట్రంప్ వరకు: తాజ్‌‌మహల్‌ను సందర్శించిన విదేశీ ప్రముఖుల ఫొటోలు

దిల్లీ హింస: సీఏఏ అనుకూల, వ్యతిరేక నిరసనలతో రాత్రంతా భయం గుప్పిట్లో...

హార్వే వైన్‌స్టీన్‌: అత్యాచార కేసులో దోషిగా తేల్చిన న్యూయార్క్ కోర్టు